సాక్షి, హైదరాబాద్/ పెద్దపల్లి: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భూగర్భ గనులకు లే ఆఫ్ ప్రకటిస్తూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెండో షిఫ్టు నుంచి మూసేయాలని బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ వ్యాప్తంగా 27 భూగర్భ గనులు, 18 ఓసీపీలు కొనసాగుతు న్నాయి. ఇందులో పూర్తిస్థాయి యాంత్రీకరణతో సాగుతున్న ఐదు భూగర్భ గనులు, 18 ఓసీపీల్లో యథావిధిగా ఉత్పత్తి చేయనున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు పూనుకున్నాయి. మార్చి 22న కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ విధించింది. అనంతరం ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. భౌతిక దూరం పాటించడంతోనే వైరస్ వ్యాప్తిని అరికట్టడం సాధ్యం కావడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నాయి.
ఇదే సమయంలో సింగరేణి భూగర్భ బొగ్గు గనుల్లో కార్మికులు యథావిధిగా విధులు నిర్వహించడం పట్ల పలు కార్మిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకేచోట పెద్ద మొత్తంలో పని స్థలాల్లో గుమిగూడాల్సి వస్తుండటంతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో ఇద్దరు సింగరేణి కార్మికులు ఉన్నట్లు ప్రచారం జరగడం.. వారు విధులకు హాజరైనట్లు తెలియడంతో మరింత గంద రగోళం నెలకొంది. ఈ క్రమంలో పూర్తి స్థాయి యాంత్రీకరణ గనులు, ఓసీపీలను మినహాయించి భూగర్భ గనుల్లో పనులు నిలిపివేయాలని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ మైన్స్ సేఫ్టీ ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం లే ఆఫ్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
22 భూగర్భ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
సింగరేణి యాజమాన్యం నిర్ణయంతో సంస్థ వ్యాప్తంగా ఉన్న 22 భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ గనుల్లో 26,692 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అత్యవసర సిబ్బంది మినహా మిగతా కార్మికులందరికీ 1947 లేబర్ యాక్ట్ ప్రకారం సగం వేతనం చెల్లించనున్నారు. కాగా, సింగరేణి లే ఆఫ్ ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయి యాంత్రీకరణ ఉన్న ఐదు గనులతో పాటు 18 ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి యథావిధిగా కొనసాగనుంది. యాంత్రీకరణ ఉన్న ఐదు భూగర్భ గనులు అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు, వీకే–7, శాంతిఖని, జీడీకే–11, కొండాపూర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. కాగా, సింగరేణి వ్యాప్తంగా ప్రతి రోజు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుండగా, 22 గనుల్లో లే ఆఫ్ మూలంగా ప్రతిరోజు 15 నుంచి 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది.
అందుబాటులో మాస్కులు.. శానిటైజర్లు: పర్సనల్ మేనేజర్
పనిచేసే గనులు, కార్యాలయాల వద్ద శాని టై జర్లు, మాస్కులను అందుబాటులో ఉంచిన ట్టు సంస్థ పర్సనల్ మేనేజర్ ఎ.ఆనందరావు ఓ ప్రకటనలో తెలిపారు. గనులు, కార్యాల యాల ఆవరణలో శానిటైజర్లను స్ప్రే చేస్తున్నా మని, అత్యవసర ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. సింగరేణి కాలనీల్లో రసాయనాల పిచికారి చేస్తున్నామన్నారు. లే ఆఫ్‌లో ఉన్న ఉద్యోగులు ఆరోగ్య నియమాలను పాటిస్తూ, ఇంటివద్దనే ఉండాలని ఆయన కోరారు.
మంచి నిర్ణయం
కరోనా వైరస్ మూలంగా గనులకు లే ఆఫ్ ప్రకటించడం మంచి నిర్ణయం. వందల మంది ఒకే గనిలో పని చేయాల్సి వచ్చింది. లే ఆఫ్ మూలంగా కార్మికులంతా ఇళ్లలో ఉండే అవకాశం ఉంటుంది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఇదే మంచి సమయం.
– పసుపులేటి హరిప్రసాద్, జనరల్ మజ్దూర్
పూర్తి వేతనం ఇవ్వాలి
లే ఆఫ్ నిర్ణయం మూలంగా కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుంది. అండర్ గ్రౌండ్ మైన్‌లో ఒకే చోట ఎక్కువ మంది పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. లే ఆఫ్ కాకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పూర్తి వేతనం ఇవ్వాలి.
– శ్రీనివాస్‌రెడ్డి, సపోర్ట్‌మెన్
Comments
Please login to add a commentAdd a comment