5బీ భవిష్యత్ ప్రశ్నార్థకం | gas in Underground mines | Sakshi
Sakshi News home page

5బీ భవిష్యత్ ప్రశ్నార్థకం

Published Thu, Jul 21 2016 12:27 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

gas in Underground mines

కొత్తగూడెం : ఒకసారి రూఫ్ ఫాల్.. మరోసారి భారీ యంత్రాలతో ఇబ్బందులు.. ఇంకోసారి వెంటిలేషన్ సమస్య.. వీటికితోడు విషవాయువులు.. భూగర్భగనుల్లో బొగ్గు వెలికితీసే కార్మికులు అనునిత్యం ప్రమాదాలతో సహవాసం చేస్తున్నారు. ప్రస్తుతం కొత్తగూడెంలోని 5బీ షాఫ్ట్ గనిలో వెలువడిన గ్యాస్(కార్బన్‌మోనాక్సైడ్) కార్మికులను కలవరానికి గురిచేస్తోంది. నివారణ చర్యలు చేపడుతున్నా అదుపులోకి రాకపోవడంతో గని భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. 
 
360 మీటర్ల లోతులో బొగ్గు ఉత్పత్తి 
5బీ షాఫ్ట్ గనిని 1952లో ప్రారంభించారు. ఇప్పటి వరకు 8.71 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీయగా ఇంకా 24 లక్షల టన్నులు ఉంది. మరో పదేళ్లపాటు తీయవచ్చు. ప్రస్తుతం 360 మీటర్ల లోతులో 10-17 డీప్, 86 నుంచి 91 లెవెల్ వద్ద బాటమ్ సీమ్‌లో ఉత్పత్తి జరుగుతోంది. సుమారు 1,050 మంది కార్మికులు పనిచేస్తుండగా అధునాతన యంత్రాలు, నూతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. 
 
మిథేన్ గ్యాస్ అంటే..?
గనిలో ముఖ్యంగా కింగ్ సీమ్, టాప్ సీమ్, బాటమ్ సీమ్‌లు ఉంటాయి. వీటిలోని బొగ్గు నాణ్యతను బట్టి వెలికితీస్తారు. ఒక్కో సీమ్‌ను కొన్ని బ్లాక్‌లుగా విభజించి యంత్రాల సహాయంతో బొగ్గు తీస్తారు. ఆయా బ్లాక్‌లలో బొగ్గు వెలికితీత పూర్తయిన తర్వాత అటువైపు ఎవరూ వెళ్లకుండా బ్లాక్‌లకు అడ్డుగా గోడలు కట్టి మూసివేస్తారు. అలా మూసివేసిన బ్లాక్‌లలో గాలి ఉండిపోయి కొన్ని రోజులకు మిథేన్ గ్యాస్‌గా మారుతుంది. దీనికి మండే స్వభావం ఉంటుంది. బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సమయాల్లోనూ మిథేన్ గ్యాస్ వెలువడుతుంది. అక్కడ అడ్డు గోడ కట్టి బొగ్గు ఉత్పత్తి నిలిపివేస్తారు. ప్రస్తుతం కొత్తగూడెం 5బీ షాఫ్ట్ గనిలో మూసివేసిన బ్లాక్ నుంచి మిథేన్ గ్యాస్ లీక్ అయినట్లు తెలుస్తోంది.
 
అత్యధికంగా ఫైర్ సీల్స్ 
మిథేన్ గ్యాస్‌కు ముఖ్యంగా మండే స్వభావం ఉండటం వల్ల ఫైర్ సీల్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ లీక్ అవుతున్న ప్రదేశానికి నీరు, సీఓటూ(కార్బన్ డై ఆక్సైడ్)ను పంపించడం ద్వారా గ్యాస్ లీకేజీని నివారించవచ్చు. గ్యాస్ సాంద్రత తగ్గిన తరువాత తిరిగి అడ్డుగోడ కట్టి సీల్ చేయాల్సి ఉంటుంది. మూసివేసిన ఫైర్ సీల్స్‌ను ఎప్పటికప్పుడు రక్షణ విభాగం అధికారులు పరిశీలించాలి. విషవాయువు సాంద్రత పెరిగితే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. అయితే 5బీ గనిలో సేఫ్టీ, వెంటిలేషన్ విభాగాల వైఫల్యం కారణంగా మిథేన్ గ్యాస్ గనిలో విస్తరించిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 420 వరకు ఫైర్ సీల్స్ ఉండటం గమనార్హం. ఇవి చాలా ఎక్కువే.
 
 
 కార్మికుల్లో ఆందోళన
గనిలో మొత్తం 1,050 మందికి పైగా కార్మికులు పలు షిఫ్టులలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మిథేన్ గ్యాస్ వెలువగడటంతో 12 రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో అత్యవసర విధులు నిర్వహించే కార్మికులు మినహా సుమారు 700 మందిని డిప్యుటేషన్‌పై ఏరియా పరిధిలోని ఇతర గనులకు పంపించారు. మరో పదేళ్లపాటు బొగ్గు ఉత్పత్తి చేసే వీలున్న ఈ గనిలో మిథేన్ గ్యాస్ వెలువడటం, దాని నియంత్రణ ఇబ్బందిగా మారడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం మరో 10 రోజుల్లో పూర్తి అదుపులోకి తీసుకువస్తామని చెబుతున్నారు. 
 
ఇలా మొదలైంది..
ఈ నెల 8న.. శుక్రవారం సుమారు 200 మంది కార్మికులు సెకెండ్ షిఫ్టు డ్యూటీకి వెళ్లారు. రాత్రి విధులు ముగిం చుకుని గని ఉపరితలానికి రావడానికి బయలు దేరారు. ఇంతలో మిథేన్ గ్యాస్ వాసన రావడంతో సమాచారం అందించగా రక్షణ అధికారులు ఆ ప్రదేశానికి చేరుకుని దాని సాంద్రతను పరిశీలించారు. కేవలం 20శాతం మాత్ర మే ఉండడంతో పెద్ద ప్రమాదమేమీ లేదని నిర్లక్ష్యం చేసినట్లు కార్మికులు చెబుతున్నారు. వారం రోజుల వ్యవధిలో మిథేన్ గ్యాస్ సాంద్రత 120 శాతానికి చేరుకోగా హడావుడిగా గని అధికారులు బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. మిథేన్ గ్యాస్ సాంద్రతను తగ్గించేందుకు గనిలోకి సీఓ-2 పంపిణీ చర్యలు కొనసాగుతున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement