మందాకిని బొగ్గు గనిని ఏపీజెన్‌కోకు కేటాయిస్తే ఏటా 7.5 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు లభ్యమవుతుంది. ఈ బొగ్గుతో రోజూ 1700 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ఈ బొగ్గు క్షేత్రం నుంచి మొత్తం 287.886 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు లభిస్తుందని వెల్లడైంది.
సాక్షి, అమరావతి: ఒడిశా రాష్ట్రంలోని కొత్త బొగ్గు క్షేత్రం మందాకినిని ఏపీజెన్‌కోకు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం పేర్కొంది. 5,010 మెగావాట్ల సామర్థ్యం గల ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్‌ల నుంచి బొగ్గు సరఫరా ఒప్పందాలున్నాయని, ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ నుంచే ఎక్కువగా సరఫరా అయ్యేదని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత సింగరేణి కోల్ కాలరీస్‌ను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారని, కనీసం బొగ్గు నిల్వల్లో వాటాను కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వలేదని, దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బొగ్గు మీదే ఎక్కువగా ఆధారపడుతున్నామని లేఖలో స్పష్టం చేశారు. దీనివల్ల రాష్ట్ర విద్యుత్ రంగానికి భరోసా లేకుండా పోయిందని, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాకు ఈ పరిస్థితి తీవ్ర అవరోధంగా మారిందని వివరించారు.
లేఖలో ముఖ్యాంశాలు ఇలా..
– పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలో ఐబి వ్యాలీ, తాల్చేరు క్షేత్రాల్లో భారీగా బొగ్గు నిల్వలున్నాయి. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌ఘడ్, తెలంగాణాలు బొగ్గు సంపద ఉన్న రాష్ట్రాలు.
– వాణిజ్య అవసరాల కోసం మధ్యప్రదేశ్‌లో ఒకటి, చత్తీస్‌ఘడ్‌లో ఒక గనిని ఏపీఎండీసీకి కేటాయించారు. ప్రతి గని నుంచి 5 ఎంఎంటీఏలు తీసుకోవచ్చు.. అయితే ఈ గనుల నుంచి బొగ్గు వెలికితీతకు నిర్వహణ వ్యయం చాలా అధికంగా ఉంది.
– బొగ్గు గనుల చట్టం – 2015 ప్రకారం ట్రాంచీ –6ను ఏపీజెన్‌కో వినియోగం కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని బొగ్గు మంత్రిత్వ శాఖకు ఏపీజెన్‌కో దరఖాస్తు చేసుకుంది.
– మార్చి 2020 నాటికి ఏపీ జెన్‌కో తన థర్మల్ కేంద్రాల ద్వారా మరో 1600 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పాదనకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఏటా 7.5 ఎంఎంటీఏ బొగ్గు నిల్వలు అవసరం.
– ప్రస్తుతం ఎదుర్కొంటున్న బొగ్గు కొరతను నివారించడానికి, బొగ్గు ఒప్పందాల ప్రకారం మరింత బొగ్గును సరఫరా చేయాల్సి ఉంది. ఈ కారణంగా మందాకిని బొగ్గు క్షేత్రాన్ని వెంటనే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
– కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన విధంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో ఏడాదికి కనీసం 50 ఎంఎంటీఏ బొగ్గును ఏపీఎండీసీ, ఏపీ జెన్‌కోకు కేటాయించండి.
Comments
Please login to add a commentAdd a comment