ముఖ్యమంత్రి రేవంత్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా
సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం విషయంలో
రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ దెబ్బతీస్తోందని ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన ప్రభుత్వం సాగిస్తున్న దుష్ప్రచారాన్ని చూసి అబద్ధాల ప్రచార సృష్టికర్త జోసెఫ్ గోబెల్స్ కూడా సమాధిలో సిగ్గుతో తలదించుకుంటున్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఎద్దేవా చేశారు. సింగరేణి బొగ్గు బ్లాక్‌ల వేలం విషయంలో రేవంత్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. తెలంగాణలోని బొగ్గు గనుల అమ్మకాన్ని కేసీఆర్ వ్యతిరేకించినందునే గత ప్రభుత్వం ఎన్నడూ వేలంలో పాల్గొనలేదన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బకొడుతోందని ఆరోపించారు. గతంలో నియంతృత్వ పోకడలతో తెలంగాణ బొగ్గు గనులను కేంద్రం వేలం వేసినా బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించడం వల్లే ఆ గనుల నుంచి తట్టెడు బొగ్గు కూడా ఎత్తలేకపోయిందని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్ పేర్కొన్న రెండు కంపెనీలు 2021లో మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గనులు దక్కించుకున్న విషయాన్ని రేవంత్ మర్చిపోరాదన్నారు.
కాంగ్రెస్, బీజేపీ తోడుదొంగలు
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను క్రూరంగా అణచి వేసి వేల మందిని చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని కేటీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ ప్రయోజనాల ను కాంగ్రెస్, బీజేపీ కలసికట్టుగా తాకట్టు పెడు తున్న తీరును తెలంగాణ పౌరులు గమనిస్తున్నా రన్నారు. ప్రజల హక్కులు, ఆస్తులు, వనరులను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
ఇప్పటికే నదీజలాల వాటాను వదులుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. సింగరేణిని ప్రైవేటుపరం చేయాలన్న బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. గనుల వేలంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదన్నారు. తెలంగాణకు సీఎం రేవంత్, కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ద్రోహానికి సరైన సమయంలో ప్రజలు గుణపాఠం చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.
పెట్టుబడుల్లో తెలంగాణ అగ్రస్థానం
గత ఆర్థిక సంవత్సరం 2023–24లో దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా తగ్గినా బీఆర్‌ఎస్ సాగించిన పాలన వల్లే తెలంగాణ మాత్రం 100 శాతానికి మించి ఎఫ్‌డీఐలను సాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. 2022–23తో పోలిస్తే 2023–24లో గుజరాత్ 55 శాతం, తమిళనాడు 12 శాతం ఎక్కువ పెట్టుబడులను సాధించగా తెలంగాణ ఏకంగా 130 శాతం వృద్ధి సాధించిందన్నారు. అమెజాన్ వెబ్ సేవల కోసం రూ. 36,300 కోట్లు, మైక్రోసాప్ట్ రూ.16 వేల కోట్ల పెట్టుబడులతో రావడంతో ఇది సాధ్యమైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment