సాక్షిప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/హైదరాబాద్: సింగరేణి ఉద్యోగులకు లాభాల పంట పండింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో అర్జించిన రూ.2222 కోట్ల లాభాల్లో ఏకంగా 32 శాతం..అంటే రూ.711 కోట్లు సంస్థ ఉద్యోగులకు బోనస్‌గా చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది లాభాల వాటాలో 30 శాతం బోనస్‌గా చెల్లించగా, ఈసారి రెండు శాతం పెంచారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సీఎం ముఖ్యకార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావు మంగళవారం రాష్ట్ర ఇంధనశాఖకు లేఖ రాశారు. దీంతో సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.60లక్షల నుంచి రూ1.70లక్షల వరకు లాభాల్లో వాటాగా చెల్లించే అవకాశముందని సంస్థ వర్గాలు అంచనా వేశాయి.
ఏటా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం వచ్చే దసరా పండుగకు ముందే బోనస్ చెల్లిస్తారు. 11వ వేతన సవరణ సంఘం బకాయిల కింద ఈ నెలలో సింగరేణి సంస్థ ఉద్యోగులకు రూ.1450 కోట్లు చెల్లించిన విషయం తెలిసిందే. దీపావళి బోనస్ చెల్లింపులపై సైతం త్వరలో సంస్థ యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకోనుంది. సింగరేణి సంస్థ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో లాభాల బోనస్ చెల్లించనుండడం ఇదే తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి సింగరేణి లాభాల్లో వాటాను కార్మికులకు బోనస్‌గా ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. 1998లో తొలిసారిగా లాభాల్లో పది శాతాన్ని కార్మికులకు అందించారు.
ఎన్నికల ఎఫెక్ట్
రాష్ట్రంలో ఆరు జిల్లాల పరిధిలో సింగరేణి విస్తరించి ఉంది. 42 వేల మంది కార్మికులు/ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారు. హైకోర్టు తీర్పును అనుసరించి వచ్చే నెలలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేప థ్యంలోనే ఎరియర్స్, బోనస్ చెల్లింపులు చకచకా సాగుతున్నాయనే భావన కార్మిక వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment