గనుల వేలం ఆపకుంటే యుద్ధమే | Center should withdraw Singareni privatization immediately | Sakshi
Sakshi News home page

గనుల వేలం ఆపకుంటే యుద్ధమే

Published Sun, Apr 9 2023 2:39 AM | Last Updated on Sun, Apr 9 2023 10:27 AM

Center should withdraw Singareni privatization immediately - Sakshi

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి, పెద్దపల్లి/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/భూపాలపల్లి అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) ఆధ్వర్యంలో శనివారం బొగ్గు గనుల ప్రాంతాల్లో మహాధర్నాలు నిర్వహించారు. భూపాలపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల, గోదావరిఖని, రామగుండం, మందమర్రి, నస్పూర్, ఇల్లందులో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరసన తెలిపారు.

బొగ్గు గనుల వేలాన్ని కేంద్రం వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో బీజేపీ హటావో.. సింగరేణి బచావో పేరిట నిర్వహించిన ఈ ధర్నాల్లో మంత్రులు, బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంపై ప్రధాని సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని నేతలు దుయ్యబట్టారు. 

కొత్తగూడెంలో... 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన మహాధర్నాలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కేంద్రంపై విరుచుకుపడ్డారు. సింగరేణి బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే కేంద్రంపై జంగ్‌ సైరన్‌ మోగిస్తామని హెచ్చరించారు.

సింగరేణిని కాపాడుకునేందుకు సీఎం కేసీఅర్, మంత్రి కేటీఆర్‌ నాయకత్వాన మరో ప్రజా ఉద్యమం నిర్మిస్తామన్నారు. సత్తుపల్లి బ్లాక్‌ 3, శ్రావణపల్లి, పెనగడప బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని ఉపసంహరించుకోవడమే కాకుండా ఇప్పటికే వేలం వేసిన బ్లాక్‌లను సింగరేణికి కేటాయించాలన్నారు. ఈ ధర్నాలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

భూపాలపల్లిలో... 
సింగరేణి బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణను రద్దు చేసే వరకు పోరాటాలు నిర్వహిస్తూ కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ స్పష్టం చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాక్‌లను కూడా కార్పొరేట్‌ శక్తులకు అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అరూరి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

నస్పూర్‌లో... 
అదానీకి కట్టబెట్టేందుకే లాభాల్లో ఉన్న సింగరేణి బొగ్గు బ్లాక్‌లను వేలం వేసేందుకు చూస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌ పట్టణం సీసీసీ కార్నర్‌ వద్ద జరిగిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో పది శాతంగా ఉన్న సింగరేణి లాభాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరింత పెరిగాయన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఎన్‌.దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు, ఆత్రం సక్కు, జెడ్పీ చైర్‌పర్సన్‌లు రాథోడ్‌ జనార్దన్, నల్లాల భాగ్యలక్ష్మి , కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీలు పురాణం సతీష్, నారదాసు లక్ష్మణ్‌రావు, సీపీఐ రాష్ట్ర నాయకులు కలవేణ శంకర్, టీబీజీకేఎస్‌ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

గోదావరిఖనిలో... 
సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ గతేడాది రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారం¿ోత్సవం సందర్భంగా చెప్పిన ప్రధాని మోదీ ఆ మాట తప్పారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ ‘ప్రధాని మోదీ.. నీకు అదానీ కా వాలో.. సింగరేణి కార్మికులు కావాలో తేల్చుకో..’అంటూ డిమాండ్‌ చేశారు.

సింగరేణిని ప్రైవేటీకరిస్తే అందులో పనిచేసే 45 లక్షల మంది కార్మికులు ఏం కావాలని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు టన్నుకు రూ. 4,500కు లభిస్తుంటే ప్రధాని తన దోస్త్‌ అయిన అదానీకి ఇండోనేసియాలో ఉన్న బొగ్గు కంపెనీ నుంచి టన్నుకు రూ. 24,500 చొ ప్పున ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే చందర్, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, టీజీకేఎస్‌ నాయకులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement