సాక్షి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి. నామినేషన్లు ప్రారంభమైన తొలి రెండురోజులు ఈ ప్రక్రియ మందకొడిగా సాగింది. మూడోరోజు బుధవారం అభ్యర్థులు ఉత్సాహంతో నామినేషన్లు వేశారు. ఇల్లెందు, కొత్తగూడెం, మధిర, సత్తుపలి నగర పంచాయతీలకు మొత్తం 118 నామినేషన్లు దాఖలయ్యాయి. కానీ మధిరలో తొలిరోజు నామినేషన్ల స్వీకరణ నుంచి ఇప్పటి వరకు ఒకటే నామినేషన్ దాఖలవడం గమనార్హం.
ఈనెల 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనా రెండు రోజులు మాత్రం నామినేషన్లు అంతగా దాఖలు కాలేదు. బుధవారం మంచిరోజు కావడంతో అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులకు 40 నామినేషన్లు, ఇల్లెందులో 53, సత్తుపల్లిలో 24 నామిషన్లు దాఖలు కాగా మధిరలో మాత్రం ఒకే ఒక నామినేషన్ వేశారు. మధిర నగరపంచాయతీ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. పదో వార్డుకు స్వతంత్ర అభ్యర్థిగా తిమ్మినేని రామారావు నామినేషన్ దాఖలు చేశారు. రెండు రోజులుగా ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
నామినేషన్ల స్వీకరణ నుంచి ఇప్పటి వరకు పార్టీల పరంగా ఒక్క అభ్యర్థి కూడా మధిర నగర పంచాయతీలోని వార్డులకు నామినేషన్ వేయలేదు. స్థానికంగా పొత్తులు ఇంకా ఖరారు కాకపోవడంతో బరిలో నిలవాలనుకుంటున్న అభ్యర్థులు హైరానాపడుతున్నారు. వార్డు సభ్యుడిగా తమకు అవకాశం కల్పించాలని ఆశావాహులు తమ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్తగూడెం, సత్తుపల్లిలో ఎస్సీ, ఎస్జీ జనరల్, మహిళలకు రిజర్వు అయిన వార్డుల్లో అసలు అభ్యర్థులు దొరకక పార్టీల నేతలు వెదుకులాట ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు కూడా లేకపోవడంతో ఏమి చేయాలో నేతలకు పాలుపోవడం లేదు.
రిజర్వు అయ్యి పార్టీ పరంగా కార్యకర్తలు లేనిచోట...అసలు పార్టీల్లో తిరగని విద్యావంతులపై నేతలు కన్నేశారు. తుది గడువు నాటికి వారిని ఒప్పించి నామినేషన్ వేయించడానికి కసరత్తు చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ తుది గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల విషయంలో పలు పార్టీలది ఇదే పరిస్థితి. ఇప్పటికే ఖరారైన వారు చివరిరోజు 14న సందడితో నామినేషన్లు వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మూడోరోజు జోరు
Published Thu, Mar 13 2014 3:00 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM
Advertisement