బ్లాక్ దందా! | Rs 10, Rs 20 a shortage of stamp papers | Sakshi
Sakshi News home page

బ్లాక్ దందా!

Published Wed, Feb 12 2014 2:42 AM | Last Updated on Thu, Sep 27 2018 4:27 PM

Rs 10, Rs 20 a shortage of stamp papers

సాక్షి, కొత్తగూడెం: భూ క్రయ విక్రయాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు స్టాంప్ పేపర్లు తప్పనిసరి. ఎక్కువగా ఉపయోగించే రూ.10, రూ.20 విలువైన బాండ ్ల కొరత జిల్లాలో తీవ్రంగా ఉంది. అందుబాటులో ఉన్నచోట కూడా బ్లాక్‌లో రూ.50 వరకు విక్రయిస్తుండటంతో కొనుగోలుదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికితోడు స్టాంప్ వెండర్‌ల మాయాజాలంతో బాండ్ల కొరత ఏర్పడుతోంది.

 జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, ఇల్లందు, వైరా, మధిర, కల్లూరు పరిధిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటిలో ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం కార్యాలయాల పరిధిలో ఎక్కువగా స్టాంప్ పేపర్ల వినియోగం ఉంటుంది. భూ విక్రయాలు, విద్యార్థులకు ఆదాయ, కుల, లోకల్ ఏరియా ధ్రువీకరణ పత్రాలు, ఇతర అఫిడవిట్‌ల కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.

అయితే ఈ కార్యాలయాలకు వినియోగదారులు ఎప్పుడు వెళ్లినా స్టాంప్ పేపర్ల కొరత ఉందని సిబ్బంది సమాధానం చెబుతుండటం తో నిరాశతో వెనుదిరుగుతున్నారు. రూ.10, రూ.20, రూ.50, రూ.100 బాండ్ పేపర్ల కోసం ప్రతి మూడునెలలకు ఒకసారి రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు హైదరాబాద్‌లోని కమిషనరేట్‌కు ఇండెంట్ పెడతారు. అయితే ప్రతిసారి రూ.50, రూ.100 బాండ్ పేపర్లను ఇండెంట్ ప్రకారం పంపుతుండగా, రూ.10, రూ.20 పేపర్లలో మాత్రం కోత పెడుతున్నారు. దీంతో ఈ బాండ్ పేపర్లు దొరకక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎక్కువ విలువ చేసే బాండ్‌లు కొనుగోలు చేయలేక..
  తక్కువ ధర పేపర్లు ఎప్పుడొస్తాయో తెలియక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు మాత్రం ఈ పేపర్ల కొరత లేదని చెపుతుండటం గమనార్హం. తక్కువ ధర పేపర్ల కోసం నిత్యం ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ.. విసిగి వేసారిన వారు తప్పని పరిస్థితుల్లో ఎక్కువ విలువ చేసే బాండ్ పేపర్లనే కొనుగోలు చేస్తుండడంతో వారి జేబులు ఖాళీ అవుతున్నాయి.

 స్టాంప్ వెండర్ల మాయాజాలం...
 బాండ్ పేపర్ల అమ్మకాలను పెంచి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేందుకు జిల్లా వ్యాప్తం గా 118 మంది స్టాంప్ వెండర్లను నియమించారు. ఈ స్టాంప్‌ల విక్రయం ద్వారా ప్రభుత్వం వారికి 5 శాతం కమీషన్ ఇస్తుంది. జిల్లాకు వచ్చిన వాటిలో 80శాతం పేపర్లను స్టాంప్ వెం డర్లకే ఇచ్చి మిగిలినవి మాత్రమే కార్యాలయా ల్లో విక్రయిస్తుండడంతో కొరత ఏర్పడుతోంది.

 ఇదే అదనుగా స్టాంప్ వెండర్లు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో రూ.10, రూ.20 బాండ్ పేపర్లను రూ.30 నుంచి 50వరకు విక్రయిస్తున్నా రు. చండ్రుగొండ, ఏన్కూరు, జూలూరుపాడు, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మం, మణుగూరు, ఇల్లందు తదితర ప్రాంతాల్లోని స్టాంప్ వెండర్లు ఈ వ్యవహారానికి తెరలేపారనే ఆరోపణలున్నాయి. ఎక్కువ కమీషన్ వస్తుం దనే ఉద్దేశ్యంతో తక్కువ ధర ఉన్న స్టాంప్ పేపర్ల కొరత సృష్టించి ఎక్కువ విలువైన పేపర్లను విక్రయిస్తున్నారని సమాచారం.
 రూ.లక్షల్లో ‘బ్లాక్’ ఆదాయం..
 ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.3 లక్షల విలువైన స్టాంప్ పేపర్లు విక్రయిస్తున్నారు. అంటే సెలవురోజులు మినహాయిస్తే స్టాంప్ వెండర్‌లు, కార్యాలయాల్లో కలిపి నెలకు సగటున రూ.75 లక్షల వరకు పేపర్ల విక్రయం ఉంటుంది. ఇందులో తక్కువ విలువ చేసే రూ.10, రూ.20 స్టాంప్ పేపర్లను నెలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు స్టాంప్ వెండర్లు విక్రయిస్తారు. ఈ పేపర్లను అసలు ధరకంటే రెండుమూడు రెట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తూ రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అక్రమ ఆదాయం అర్జిస్తున్నారు. స్టాంప్ వెండర్‌లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా.. పర్యవేక్షించాల్సిన సబ్ రిజిస్ట్రార్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 మా దృష్టికి రాలేదు.. : రామలింగం,  జిల్లా రిజిస్ట్రార్, ఖమ్మం
 జిల్లాలో స్టాంప్ పేపర్లు కొరత, బ్లాక్‌లో విక్రయిస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. ఎక్కడా కొరత మాత్రం లేదు. ఎప్పటికప్పుడు ఏయే స్టాంప్ పేపర్లు కావాలో కమిషనరేట్‌కు ఇండెంట్ పంపించి తెప్పిస్తున్నాము. ఎక్కడైనా కొరత ఉన్నా.. బ్లాక్‌లో విక్రయించినా వినియోగదారులు మా దృష్టికి తీసుకురావాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement