కేటీపీఎస్‌లోని ఓఅండ్‌ఎం ప్లాంట్
సాక్షి, కొత్తగూడెం: కేటీపీఎస్ కర్మాగారంలో ఇంజనీర్ స్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇతర ప్రభుత్వ శాఖలతో పోలిస్తే భారీగా జీతభత్యాలు అందుకుంటున్నా అక్రమ ఆదాయానికి కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కేటీపీఎస్ గతంలో అనేక స్క్రాప్, ఆయిల్ చోరీలు జరిగినా సరైన చర్యలు తీసుకోకపోవడంతో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక ఏడీఈ స్థాయి అధికారే ఇనుమును అక్రమంగా స్టోర్స్ నుంచి తరలించి, సస్పెన్షన్‌కు గురవడం చర్చనీయాంశంగా మారింది. యాష్ పాండ్‌లో పైపులైన్లకు సపోర్టింగ్ కోసం వినియోగించే స్టెయిన్ లెస్ స్టీల్ ప్లేట్లను(రూ. 3.50 లక్షల విలువ) అక్రమంగా తరలిస్తూ పట్టుబడడం, ఇందుకు బాధ్యుడైన ఓఅండ్‌ఎం ప్లాంట్‌లోని ‘బి ’స్టేషన్‌లో యాష్ పాండ్, వాటర్ ట్రీట్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న ఏడీఈ బి.ఎర్నా సస్పెన్షన్‌కు గురికావడం తెలిసిందే. ఈ వ్యవహారంలో డీఈ స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఎందరి పాత్ర ఉందనే విషయంపై విచారణ సాగుతోంది.
ఇనుప ప్లేట్లను గతంలోనూ అనేక మార్లు బయటకు తరలించి అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. స్టోర్స్‌లో ఇప్పటి వరకు ఇలా 40 ప్లేట్లు మాయమైనట్లు సమాచారం. సుమారు రూ.30 నుంచి రూ.40లక్షల వరకు పక్కదోవ పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ విశేషమేమిటంటే తాజాగా బయటకు తరలిస్తూ పట్టుబడిన ప్లేట్లు కొత్తవి. కొత్త ఇనుప పరికరాల విషయంలోనే ఇంతలా అక్రమాలకు పాల్పడుతుండడంతో పాత ఇనుము విషయం లో గతంలో ఎన్ని అక్రమాలు జరిగాయోననే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం పట్టుబడిన ఒక్కో ప్లేట్ విలువ సుమారు రూ.1.80లక్షలు. ఈ నేపథ్యంలో పాత ఇనుము రూ. వందల కోట్లలో ఉంటుంది. దీన్ని గుట్టుగా బయటకు అక్రమ మార్గంలో తరలించేందుకు మూసివేతకు సిద్ధంగా ఉన్న ఓ అండ్ ఎం ప్లాంట్‌లో పోస్టింగ్‌ల కోసం పలువురు ఇంజినీర్లు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
చర్యలు అంతంతే..
కేటీపీఎస్‌లో అక్రమాలపై గతంలో అనేకసార్లు విజిలెన్స్ తనిఖీలు, విచారణలు చేసినా చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. గతంలో అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ విచారణ లో తేలితే థర్మల్ ప్లాంట్‌ల నుంచి హైడల్ విద్యుత్ ప్లాంట్లకు సైతం బదిలీ చేసిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం అలా చేస్తుండకపోతుండడంతో ఇష్టారాజ్యంగా కొందరు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గతం లో కేటీపీఎస్ ఓ అండ్ ఎం, 5, 6 దశల ప్లాంట్లలో అనేక సార్లు స్క్రాప్, ఫ్యూయల్ ఆయిల్ చోరీ చేస్తు పట్టుబడిన కేసుల్లో ఎవరిపైనా తగిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఆర్టిజన్ కార్మికుల నియామకాల్లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. సంస్థకు సంబంధం లేని వ్యక్తులు ఉద్యోగాలు పొందారు. కేటీపీఎస్ 5వ దశ కర్మాగారంలో నాణ్యత లేకుండా రోడ్డు నిర్మించడంతో మూడు నెలలకే దెబ్బతింది. కేటీపీఎస్ ఓఅండ్‌ఎం కర్మాగారం నుంచి టెండర్లు పిలవకుండా కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారనే ఆరోపణలు వెల్లు వెత్తాయి. యాష్‌ను ఉచితంగా అందించాల్సి ఉండగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు విమర్శ లు వచ్చాయి.
7వ దశ నిర్మాణంలోనూ భారీ ఎత్తున నిర్మాణ సామగ్రి బయటకు తరలిపోయినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనల్లో విజిలెన్స్ తనిఖీలు చేసి కూడా సరైన చర్య లు తీసుకున్న దాఖలాలు లేవు. కాగా తాజాగా ఇనుము పక్కదోవ పట్టిన విషయంపై టీఎస్ జెన్ కో విజిలెన్స్ ఎస్‌పీ వినోద్ కుమార్ విచారణకు పూనుకున్నారు. శుక్రవారం కర్మాగారాన్ని సందర్శించి సీఈ జె.సమ్మయ్య ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అక్రమాలపై ఏడీఈ ఎర్నాను సైతం విచారించారు. స్టోర్స్‌ను పరిశీలించారు. ఏడీఈ ఎర్నా, మరో నలుగురు ఆర్టిజన్ కార్మికులతో కలసి ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఈ విషయమై సీఈ జె.సమ్మయ్యను వివరణ కోరగా.. విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. విజిలెన్స్ ఎస్‌పీ వినోద్ కుమార్‌ను వివరణ కోరగా.. విచారణలో ఉన్న కేసుల వివరాలు బయటకు వెల్లడించలేమన్నారు. సంబంధిత ఉన్నత స్థాయి అధికారుల నుంచి వివరాలు తెలుసుకోవాలన్నారు.
ప్రజా ధనం దుర్వినియోగం
కొందరు స్వప్రయోజనాల కారణంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. విజిలెన్స్ నివేదికలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. కార్మికులకు న్యాయం చేయాలి.
–ఎస్‌కె.సాబీర్‌పాషా, సీపీఐ జిల్లా కార్యదర్శి
చర్యలు తీసుకోవాలి
కేటీపీఎస్ అవకతవకలపై విజిలెన్స్ తనిఖీల్లో పారదర్శకత ఉండాలి. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. గతంలోను అనేక సంఘటనలు ఉన్నాయి. వాటిపై విచారణ చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి.
–బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment