KTPS
-
పాల్వంచ KTPS కూలింగ్ టవర్ల కూల్చివేత
-
కేటీపీఎస్ బూడిదతో నరకం అనుభవిస్తున్న ప్రజలు
-
కేటీపీఎస్ కోల్ ప్లాంట్‌లో ప్రమాదం
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ కోల్ ప్లాంట్‌లో బ్రేకర్లు అమరుస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగి ముగ్గురికి గాయాలయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కేటీపీఎస్‌లోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడో దశ కోల్ ప్లాంట్‌లో ఎంటీసీ కంట్రోల్ బోర్డ్ వద్ద ఏఈ విజయ్ ఆధ్వర్యాన ఆర్టిజన్లు మల్లికార్జున్, వరదరాజు బ్రేకర్లు అమరుస్తున్నారు. అయితే బ్రేకర్ల కండక్టర్ సరిగా అతుక్కోకుండానే విద్యుత్ ఆన్ చేయడంతో మంటలు చెలరేగాయి. మంటలు బయటకు ఎగిసిపడటం(బాయిలర్ ఫ్లాష్ ఓవర్)తో ఏఈతోపాటు మరో ఇద్దరు కార్మికులకు ముఖం, ఛాతీ, చేతులు కాలి పోయాయి. అప్రమత్తమైన తోటి సిబ్బంది వెంటనే కేటీపీఎస్ ఆస్పత్రికి తీసు కెళ్లగా...ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఈ పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...బ్రేకర్ అమరుస్తుండగా కనెక్టర్ల నుంచి మంటలు రావడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపడతామన్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎంపీ నామా నాగేశ్వరరావు జెన్కో డైరెక్టర్లతో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేయాలని ఆదేశించారు. -
కార్మికులను ఆర్టిజన్స్‌గా నియమించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్‌కో సీఎండీ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే కేటీపీఎస్ 6వ దశ నిర్మాణ కార్మికులను ఆర్టిజన్స్‌గా నియమించుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ సమయంలో 6వ దశలో పాలుపంచుకున్న కార్మికులను ఆర్టిజన్స్‌గా తీసుకుంటామని సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు రాత పూర్వకంగా హామీ ఇచ్చారని, 7వ దశ నిర్మాణం సందర్భంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారని గుర్తు చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి గురువారం లేఖ రాశారు. కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం క్షమించరాని విషయమని తెలిపారు. ఇదంతా జరిగి ఐదేళ్లు అవుతున్నప్పటికీ కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. కేటీపీఎస్ 6వ దశ నిర్మాణ సమయంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నా.. వాటిని లెక్క చేయకుండా పని చేసిన కార్మికుల కష్టాన్ని విస్మరించడం దారుణం కాదా? అని నిలదీశారు. కార్మికులను ఆర్టిజన్స్‌గా నియమించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
కేటీపీఎస్‌లో హైడ్రోజన్ లీక్
సాక్షి, పాల్వంచ: కేటీపీఎస్ 5వ దశ కర్మాగారం 9వ యూనిట్‌లోని టర్బో జనరేటర్లో సోమవారం హైడ్రోజన్ గ్యాస్ లీకైంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. హైడ్రోజన్‌కు గాల్లో కలిసి బాంబులా పేలే సామర్థ్యం ఉండటంతో ఉద్యోగులు, కార్మికులు పని ప్రదేశం నుంచి పరుగులు పెట్టారు. అయితే కొందరు ఉద్యోగులు అప్రమత్తమై ప్రమాదాన్ని నివారించారు. 250 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన 9వ యూనిట్లో రూ. 100 కోట్లతో రెన్నోవేషన్ అండ్ మోడర్నైజేషన్(ఆర్‌అండ్‌ఎం) పనులు చేపట్టారు. గత జూన్ మొదటి వారంలో పనులు ప్రారంభంకాగా, ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. సోమవారం ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చేందుకు సింక్రనైజేషన్ చేస్తున్నారు. స్టీమ్ జనరేట్ అయ్యేటప్పుడు ఏర్పడే ఉష్ణోగ్రతను తగ్గించేందుకు జనరేటర్‌కు హైడ్రోజన్ (హెచ్2) పంపిస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్ పైపులైన్ దగ్గర హైడ్రోజన్ లీక్ కావడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. పని ప్రదేశం నుంచి వందలాది మంది దూరంగా పరుగులు తీశారు. అయితే కొందరు ఇంజనీర్లు, ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించి ఫైర్ ఇంజన్లను అందుబాటులోకి తెప్పించారు. ధైర్యసాహసాలతో హైడ్రోజన్ లీకైన చోట నుంచి కార్బన్‌డై ఆక్సైడ్‌ను పంపి ప్రమాదాన్ని అరికట్టారు. ఆ సమయంలో అక్కడ ఉన్నవారంతా ఊపిరి బిగపట్టి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తించారు. లీకేజీ ఉన్న ప్రదేశంలో సీల్ వేయడంతో ప్రమాదం తొలగిపోయింది. ఈ క్రమంలో కర్మాగారంలోని అన్ని ఫైర్ ఇంజన్లను, ఇతర ఫైర్ సేఫ్టీ పరికరాలను తెప్పించుకున్నారు. హైడ్రోజన్ ఎక్కువ మోతాదులో గాలిలో కలిస్తే బాంబులా పేలి కర్మాగారం ధ్వంసమయ్యే పరిస్థితి ఉండేదని, ఆస్తి నష్టంతో పాటు, ప్రాణ నష్టం భారీగా ఉండేదని అధికారులు చెబుతున్నారు. ఒక రోజు ఆలస్యంగా సింక్రనైజేషన్.. ఓ వైపు కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో జెన్కో యాజమాన్యం ఆదేశాల మేరకు 9వ యూనిట్లో ఆధునీకరణ పనులు చేపట్టారు. బీహెచ్ఈఎల్ కంపెనీ పనులు నిర్వహిస్తోంది. పనులకు వందలాది మంది టెక్నీషియన్లు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. కరోనా వైరస్ ఉధృతిలోనూ ఉద్యోగులు విధులు నిర్వహించారు. ఈ క్రమంలో 50 రోజుల్లోపు పూర్తి కావాలి్సన పనులకు 60 రోజులు పట్టింది. చివరి క్షణంలో హైడ్రోజన్ గ్యాస్ లీక్ కలవరానికి గురిచేసింది. దీంతో సోమవారం సింక్రనైజేషన్ చే యాల్సి ఉండగా మంగళవారానికి వాయిదా వేశారు. సకా లంలో స్పందించి ప్రమాదాన్ని అరికట్టడంతో జెన్కో ఉన్నతాధికారులు సైతం ఇక్కడి ఉద్యోగులను అభినందించారు. ముప్పు తప్పింది హైడ్రోజన్ లీకేజీని సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి నష్టం లేకుండా బయటపడగలిగాం. పనిచేసిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. కోవిడ్ సమయంలోనూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో కలిసి పనిచేశాం. కరోనా వల్లే పనుల్లో కొంత జాప్యం జరిగింది. మంగళవారం సాయంత్రానికి విద్యుదుత్పత్తిని అందుబాటులోకి తెస్తాం. –కె.రవీంద్ర కుమార్, సీఈ -
ఇక రెండు రోజులే..
సాక్షి, పాల్వంచ: సుమారు ఐదున్నర దశాబ్దాల పాటు విద్యుత్ కాంతులు విరజిమ్మిన కేటీపీఎస్ ఓఅండ్ఎం(ఆపరేషన్స్ అండ్ మెయింటినెన్స్) చరిత్ర తుది అంకానికి చేరుకుంది. పర్యావరణ ఆదేశాల మేరకు ఈ నెల 31తో తన ప్రస్థానానికి ముగింపు పలకబోతోంది. దీంతో 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని రాష్ట్రం కోల్పోనుంది. పాల్వంచలోని కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారాన్ని 1966 – 1978 మధ్య కాలంలో ఏ,బీ,సీ స్టేషన్ల వారీగా 8 యూనిట్లను నిర్మించారు. వీటి ద్వారా 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రాష్ట్రానికి వెలుగులు అందించింది. ఇంజనీర్లు, కార్మికులు కలిపి 2,500 మంది ఇప్పటివరకు పనిచేశారు. కిన్నెరసాని జలాశయం ఆధారంగా సమీపంలోని కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల సింగరేణి బొగ్గు సరఫరా చేసుకుని ఐదున్నర దశాబ్దాల పాటు ఏకధాటిగా ఉత్పత్తి అందించింది. జపాన్ టెక్నాలజీతో 1,2,3,4 యూనిట్లలో 240 మెగావాట్లు, 5, 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 7,8 యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల ఉత్పత్తిని అందించింది. అయితే కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ యూనిట్లను మూసివేయాలని సెంట్రల్ ఎలక్రి్టసిటీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, దాని స్థానంలో సూపర్ క్రిటికట్ టెక్నాలజీతో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా మరో ప్లాంట్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. దీంతో ఓఅండ్ఎం కర్మాగారాన్ని 2019 డిసెంబర్ 31న మూసి వేయాల్సి ఉండగా.. 7వ దశలో వార్షిక మరమ్మతుల నేపథ్యంలో గత నవంబర్ 28వ తేదిన ఉత్పత్తిని నిలిపివేశారు. మరమ్మతు చేయడానికి నాలుగు నెలల కాలం తీసుకున్నారు. దీంతో డిసెంబర్ 31న మూసివేయాల్సిన ఓఅండ్ఎం కర్మాగారాన్ని మార్చి 31 వరకు పొడిగించారు. మార్చి 31తో మూసేస్తాం కాలం చెల్లిన 720 మెగావాట్ల కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారాన్ని మార్చి 31న మూసివేయాలని జెన్కో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఐదున్నర దశాబ్దాల పాటు తన ప్రస్థానాన్ని సాగించి ఉమ్మడి రాష్ట్రంలో వెలుగులు అందించింది. జ పాన్ టెక్నాలజీతో నిర్మించిన ఈ కర్మాగారం ఇంతకాలం విజయవంతంగా ఉత్పత్తి అందించడం గొప్ప విషయం. కేటీపీఎస్‌తోనే పాల్వంచకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రత్యేకత ఉందనడంలో సందేహం లేదు. మూసివేత నిర్ణయం బాధాకరమైనప్పటికీ తప్పని పరిస్థితుల్లో విరామం ప్రకటిస్తున్నాం. - జె.సమ్మయ్య, సీఈ -
బూడిదతో బెంబేలెత్తుతున్న ప్రజలు
సాక్షి, పాల్వంచ: కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) నుంచి వెలువడే వృథా బూడిద నిల్వలు ఉండే..యాష్‌పాండ్ చుట్టు పక్కల ప్రాంతాల వారు బెంబేలెత్తుతున్నారు. ఈ బూడిద కాలుష్యంతో యాష్‌పాండ్‌కు సమీపంలో పునుకుల, పుల్లాయిగూడెం, సూరారం గ్రామాల ప్రజలు నిత్యం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బూడిద గాలిలోకి లేవకుండా కేటీపీఎస్ యాజమాన్యం ఎలక్ట్రోస్టాటిక్ ప్రెస్పిటెటర్ (ఈఎస్పీ)లను ఉపయోగిస్తున్నా..పనితీరు సక్రమంగా లేకపోవడంతో కాలుష్యం వెదజల్లుతోంది. నీటిద్వారా యాష్‌పాండ్‌కు తరలిస్తున్నారు. సమీపంలోని కాల్వలు, కిన్నెరసాని ప్రాంతం బూడిదతో నిండి కాలుష్యభరితంగా మారుతున్నాయి. పీల్చుతున్న కార్మికులు, ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. జెన్కో టన్ను రూ.10చొప్పున విక్రయిస్తుండగా.. ప్లైయాష్ను సిమెంట్, ఇటుకల కంపెనీలు ప్రతిరోజూ వెయ్యి టన్నుల బూడిదను తీసుకెళ్తుంటాయి. మిలిగిన నిల్వలు అలా పేరుకుపోతుంటాయి. నిత్యం వందలాది లారీల లోడ్లను హైదరాబాద్, మిర్యాలయగూడెం, జగ్గయ్యపేట, కట్టగూడెం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధిక లోడ్‌తో ఊరి రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయి. గాలికి బూడిద రోడ్లపై, నివాసాలపైకి చేరి ఇబ్బంది పడుతున్నారు. బూడిదతో కూడిన గాలి పీల్చడం వల్ల స్థానికులు ఆయాసం, ఇతర శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్నారుల ఒంటిపై దురదలు వస్తున్నాయి. ఇటీవల కేటీపీఏస్ యాజమాన్యం కిన్నెరసాని ప్రధాన రహదారినుంచి యాష్‌పాండ్ వరకు తారురోడ్డు నిర్మించగా..25టన్నుల లోడుకు బదులు 30 నుంచి 40 టన్నుల బూడిద లోడు ఒక్కో లారీలో తరలిస్తుండడంతో అది కూడా అధ్వానంగా మారింది. యాష్‌పాండ్ చుట్టూ రక్షణ కంచె లేకపోవడంతో మేతకు వెళ్లి పశువులు, మేకలు, గొర్రెలు బూడిద గుంతల్లో ఇరుక్కుపోయి మరణిస్తున్నాయి. అనేకమార్లు నోటీసులు.. యాష్‌పాండ్‌లో పడి మృతి చెందిన పశువులు కేటీపీఎస్ కర్మాగారం ద్వారా బూడిద చెరువులోకి పంపిస్తున్న బూడిద సమీపంలోని కిన్నెరసాని వాగులో కలవడం ద్వారా పశువులు, పంటల దెబ్బతింటున్నాయి. బూడిద కాలుష్యాన్ని కిన్నెరసానివాగులో కలవకుండా చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అనేక సార్లు నోటీసులు జారీ చేసింది. కర్మగారంలో సెడ్మెంటేషన్ ట్యాంక్‌ను నిర్మించాలని, బూడిద నియంత్రణ యంత్రాలను ఏర్పాటు చేయాలని సూచించినా ఆచరణకు నోచట్లేదు. పొలం, జలం.. బూడిదమయం యాష్‌పాండ్ పరిసరాలన్నీ బూడిదతో నిండి కనిపిస్తుంటాయి. సమీపంలోని కిన్నెరసాని వాగు జలం రంగు మారి ప్రవహిస్తుంటుంది. పొలాలన్నీ సారం కోల్పోతున్నాయి. ఈ నీళ్లను తాగిన పశువులు చనిపోతున్నాయి. జీవాల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. -
కేటీపీఎస్‌లో ఇనుము దొంగలు..
సాక్షి, కొత్తగూడెం: కేటీపీఎస్ కర్మాగారంలో ఇంజనీర్ స్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇతర ప్రభుత్వ శాఖలతో పోలిస్తే భారీగా జీతభత్యాలు అందుకుంటున్నా అక్రమ ఆదాయానికి కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కేటీపీఎస్ గతంలో అనేక స్క్రాప్, ఆయిల్ చోరీలు జరిగినా సరైన చర్యలు తీసుకోకపోవడంతో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక ఏడీఈ స్థాయి అధికారే ఇనుమును అక్రమంగా స్టోర్స్ నుంచి తరలించి, సస్పెన్షన్‌కు గురవడం చర్చనీయాంశంగా మారింది. యాష్ పాండ్‌లో పైపులైన్లకు సపోర్టింగ్ కోసం వినియోగించే స్టెయిన్ లెస్ స్టీల్ ప్లేట్లను(రూ. 3.50 లక్షల విలువ) అక్రమంగా తరలిస్తూ పట్టుబడడం, ఇందుకు బాధ్యుడైన ఓఅండ్ఎం ప్లాంట్‌లోని ‘బి ’స్టేషన్లో యాష్ పాండ్, వాటర్ ట్రీట్మెంట్ విభాగంలో పనిచేస్తున్న ఏడీఈ బి.ఎర్నా సస్పెన్షన్‌కు గురికావడం తెలిసిందే. ఈ వ్యవహారంలో డీఈ స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఎందరి పాత్ర ఉందనే విషయంపై విచారణ సాగుతోంది. ఇనుప ప్లేట్లను గతంలోనూ అనేక మార్లు బయటకు తరలించి అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. స్టోర్స్‌లో ఇప్పటి వరకు ఇలా 40 ప్లేట్లు మాయమైనట్లు సమాచారం. సుమారు రూ.30 నుంచి రూ.40లక్షల వరకు పక్కదోవ పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ విశేషమేమిటంటే తాజాగా బయటకు తరలిస్తూ పట్టుబడిన ప్లేట్లు కొత్తవి. కొత్త ఇనుప పరికరాల విషయంలోనే ఇంతలా అక్రమాలకు పాల్పడుతుండడంతో పాత ఇనుము విషయం లో గతంలో ఎన్ని అక్రమాలు జరిగాయోననే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం పట్టుబడిన ఒక్కో ప్లేట్ విలువ సుమారు రూ.1.80లక్షలు. ఈ నేపథ్యంలో పాత ఇనుము రూ. వందల కోట్లలో ఉంటుంది. దీన్ని గుట్టుగా బయటకు అక్రమ మార్గంలో తరలించేందుకు మూసివేతకు సిద్ధంగా ఉన్న ఓ అండ్ ఎం ప్లాంట్‌లో పోస్టింగ్‌ల కోసం పలువురు ఇంజినీర్లు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చర్యలు అంతంతే.. కేటీపీఎస్‌లో అక్రమాలపై గతంలో అనేకసార్లు విజిలెన్స్ తనిఖీలు, విచారణలు చేసినా చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. గతంలో అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ విచారణ లో తేలితే థర్మల్ ప్లాంట్ల నుంచి హైడల్ విద్యుత్ ప్లాంట్లకు సైతం బదిలీ చేసిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం అలా చేస్తుండకపోతుండడంతో ఇష్టారాజ్యంగా కొందరు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గతం లో కేటీపీఎస్ ఓ అండ్ ఎం, 5, 6 దశల ప్లాంట్లలో అనేక సార్లు స్క్రాప్, ఫ్యూయల్ ఆయిల్ చోరీ చేస్తు పట్టుబడిన కేసుల్లో ఎవరిపైనా తగిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఆర్టిజన్ కార్మికుల నియామకాల్లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. సంస్థకు సంబంధం లేని వ్యక్తులు ఉద్యోగాలు పొందారు. కేటీపీఎస్ 5వ దశ కర్మాగారంలో నాణ్యత లేకుండా రోడ్డు నిర్మించడంతో మూడు నెలలకే దెబ్బతింది. కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారం నుంచి టెండర్లు పిలవకుండా కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారనే ఆరోపణలు వెల్లు వెత్తాయి. యాష్‌ను ఉచితంగా అందించాల్సి ఉండగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు విమర్శ లు వచ్చాయి. 7వ దశ నిర్మాణంలోనూ భారీ ఎత్తున నిర్మాణ సామగ్రి బయటకు తరలిపోయినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనల్లో విజిలెన్స్ తనిఖీలు చేసి కూడా సరైన చర్య లు తీసుకున్న దాఖలాలు లేవు. కాగా తాజాగా ఇనుము పక్కదోవ పట్టిన విషయంపై టీఎస్ జెన్ కో విజిలెన్స్ ఎస్పీ వినోద్ కుమార్ విచారణకు పూనుకున్నారు. శుక్రవారం కర్మాగారాన్ని సందర్శించి సీఈ జె.సమ్మయ్య ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అక్రమాలపై ఏడీఈ ఎర్నాను సైతం విచారించారు. స్టోర్స్‌ను పరిశీలించారు. ఏడీఈ ఎర్నా, మరో నలుగురు ఆర్టిజన్ కార్మికులతో కలసి ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఈ విషయమై సీఈ జె.సమ్మయ్యను వివరణ కోరగా.. విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. విజిలెన్స్ ఎస్పీ వినోద్ కుమార్‌ను వివరణ కోరగా.. విచారణలో ఉన్న కేసుల వివరాలు బయటకు వెల్లడించలేమన్నారు. సంబంధిత ఉన్నత స్థాయి అధికారుల నుంచి వివరాలు తెలుసుకోవాలన్నారు. ప్రజా ధనం దుర్వినియోగం కొందరు స్వప్రయోజనాల కారణంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. విజిలెన్స్ నివేదికలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. కార్మికులకు న్యాయం చేయాలి. –ఎస్కె.సాబీర్‌పాషా, సీపీఐ జిల్లా కార్యదర్శి చర్యలు తీసుకోవాలి కేటీపీఎస్ అవకతవకలపై విజిలెన్స్ తనిఖీల్లో పారదర్శకత ఉండాలి. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. గతంలోను అనేక సంఘటనలు ఉన్నాయి. వాటిపై విచారణ చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. –బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు -
బూడిదకు భారీగా వసూళ్లు
సాక్షి, పాల్వంచ: కేటీపీఎస్ నుంచి వెలువడే బూడిద (యాష్) తరలింపులో వసూళ్ల దందా సాగుతోంది. అధికారుల అండదండలతో కొందరు ప్రైవేటు వ్యక్తులు భారీగా డబ్బు దండుకుంటున్నారు. బూడిదను తరలించాలంటే చేయి తడపనిదే బండి కదలని పరిస్థితి నెలకొంది. ఈ బూడిదను ఉచితంగా అందించాల్సి ఉండగా.. పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బు ముట్టజెపితే వెంటనే లోడ్ చేయడం, లేదంటే వెయిటింగ్ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. అధికారులు తమ చేతికి మట్టి అంటకుండా ప్రైవేట్ వ్యక్తులతో ఈ దందాను ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అన్న చందంగా విస్తరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) ఓఅండ్ఎం, 5, 6, 7 దశల్లో విద్యుత్ ఉత్పత్తి చేసే క్రమంలో బొగ్గును మండించడం ద్వారా నిత్యం బూడిద విడుదల అవుతుంది. దీన్ని పుల్లాయిగూడెం, సురారం తదితర ప్రాంతాల్లో ఉన్న యాష్ పాండ్లకు పంపిస్తుంటారు. సిమెంట్ ఫ్యాక్టరీలకు, ఇతర అవసరాలకు మెట్రిక్ టన్నుకు రూ.50 చొప్పున ముందే డీడీ రూపంలో చెల్లిస్తే బూడిదను అందిస్తారు. అయితే సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే ట్యాంకర్లకు బూడిద అందించే క్రమంలో చేతివాటం ప్రదర్శిస్తుండడం ఇక్కడ ‘మూమూలు’గా మారింది. ఇక ఉచితంగా అందించే వారినుంచి అయితే వేల రూపాయలు దండుకుంటున్నారు. డబ్బు ఇవ్వని వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి రోజూ వందల సంఖ్యలో ట్యాంకర్లు, టిప్పర్లు, లారీలు వస్తుంటాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో స్థానికంగా కొందరు ప్రైవేట్ వ్యక్తులు జోక్యం చేసుకుని భారీ ఎత్తున అక్రమాలకు తెరలేపుతున్నారు. రవాణా చేసే క్రమంలో లారీలపై కనీసం పట్టాలు కూడా కట్టుకోకుండా వెళుతున్నారని పలువురు వాపోతున్నారు. లబోదిబోమంటున్న బ్రిక్ వ్యాపారులు... యాష్ పాండ్ల నుంచి బూడిదను తీసుకెళ్లేందుకు కొందరు జెన్కో యాజమాన్యం నుంచి అనుమతి తీసుకుని లారీల ద్వారా తరలిస్తుంటారు. అంతేగాక సైలోల నుంచి కూడా తీసుకెళుతుంటారు. ఈ క్రమంలో ఒక్కో లారీకి కనీసం రూ.1000 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తుంటారు. ఇలా అక్రమంగా వేలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నత స్థాయి అధికారికి బండికి రూ.500 ఇవ్వాలని, కింది స్థాయిలో మామూళ్లు యథావిధిగా ఉంటాయని చెపుతూ వేల రూపాయలు వసూలు చేస్తున్నారని పలువురు బ్రిక్స్ ఇండస్ట్రీ నిర్వాహకులు వాపోతున్నారు. ఈ వ్యాపారులే కాకుండా భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, వరంగల్, గుడివాడ తదితర ప్రాంతాల నుంచి రోజుకు 400 పైగా వాహనాల్లో బూడిద తరలిస్తున్నారంటే ఈ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ వ్యక్తులకు గాకుండా నేరుగా బ్రిక్స్ కంపెనీలు, సిమెంట్ ఫ్యాక్టరీల వారికే బూడిద చేరేలా చర్యలు తీసుకోవాలని, పైవేట్ దందాపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. మా దృష్టికి తీసుకొస్తే చర్య తీసుకుంటాం డబ్బులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. డబ్బు తీసుకుని బూడిదను అందించకూడదు. అలా ఇబ్బంది పడిన వ్యక్తులు ఎవరైనా నేరుగా మాకు ఫిర్యాదు చేస్తే తప్పక చర్య తీసుకుంటాం. – రవీందర్, ఇన్చార్జ్ సీఈ -
కన్న తండ్రినే చంపాడు
సాక్షి, పాల్వంచరూరల్: కేటీపీఎస్‌లోని ఐఎం కాలనీలో ఈ నెల 9న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతడిని తనయుడే కిరాతకంగా చంపాడు. పాల్వంచ సీఐ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో పాల్వంచ డీఎస్పీ మధుసూదన్‌రావు తెలిపిన వివరాలు... కేటీపీఎస్ ఐఎం కాలనీలో నివాసముంటున్న గుగ్గిళ్ల వీరభద్రానికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరభద్రాన్ని అన్‌ఫిట్ చేసి, అన్నదమ్ముల్లో ఒకరికి ఉద్యోగం, మరొకరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 9న వీరభద్రం డ్యూటీకి వెళ్లాడు. అతడు అప్పటికే మద్యం మత్తులో ఉండడంతో సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి పంపించేశారు. ఆ రోజు రాత్రి 9.00 గంటలకు ఇంటికి వచ్చిన వీరభద్రం, వెనుక గదిలో పడుకున్నాడు. అతడి భార్య, చిన్న కుమారుడు సంతోష్... ముందు గదిలో నిద్రిస్తున్నారు. తండ్రిని చంపాలని అప్పటికే సంతోష్ పథకం వేశాడు. కత్తి పీటతో తండ్రి వీరభద్రాన్ని మెడపై రెండువైపులా నరికి చంపాడు. ఆ తరువాత, ఇంటి వెనుక గోడను దూకి పారిపోయాడు. తన ప్రేమ వ్యవహారంలో పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్న బంధువుపై నేరం మోపేందుకు ప్రయత్నించాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, నిందితుడిని పట్టుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ మడత రమేష్, ఎస్సై ముత్యంరమేష్‌లు పాల్గొన్నారు. -
కేటీపీఎస్ ఉద్యోగి హత్య
సాక్షి, పాల్వంచ: పాల్వంచలో కేటీపీఎస్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి వేళ మెడపై కత్తితో దాడి చేయడంతో రక్తమడుగులో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. కేటీపీఎస్ ఒఅండ్‌ఎం కర్మాగారంలోని ఐసీహెచ్‌పీలో పీఎగా విధులు నిర్వహిస్తున్న గుగ్గిళ్ళ వీరభద్రం(55) ఇంటర్మీడియట్ కాలనీలో క్వార్టర్ నంబర్ 60లో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి షిఫ్ట్ విధులకు వెళ్లగా.. మద్యం సేవించి ఉన్నాడనే కారణంతో సెక్యూరిటీ అధికారులు అతడిని కేటీపీఎస్‌లోకి అనుమతించలేదు. దీంతో ఇంటికి వచ్చి పడుకున్నాడు. రాత్రి 3గంటల సమయంలో మూత్ర విసర్జన కోసం బాత్రూమ్కు వెళ్లిన వీరభద్రం ఒక్కసారిగా అరిచాడు. ఇంట్లో ఉన్న భార్య రమాదేవి, ఇద్దరు కొడుకులు రవితేజ, సంతోష్ వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. మెడపై కత్తితో నరికిన గాయం ఉంది. కుటుంబ సభ్యులు ఇంటి పక్కవారి సాయంతో మోటార్ సైకిల్‌పై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరభద్రం మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ మధుసూదన్‌రావు, సీఐ మడత రమేష్, ఎస్ఐ ముత్యం రమేష్‌లు సందర్శించారు. జాగిలాలను రప్పించి క్షుణ్ణంగా పరిశీలించారు. తన భర్తను ఎవరో నరికి చంపారని భార్య రమాదేవి తెలిపింది. ఈ విషయమై సీఐ మడత రమేష్‌ను వివరణ కోరగా.. రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. తన చిన్న కొడుకు సంతోష్ ప్రేమ వివాహం విషయంలో గొడవలు జరిగాయని, అమ్మాయి తరుపు బంధువుపై అనుమానం ఉందని ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఒకటి రెండు రోజుల్లో కేసును చేధిస్తామని అన్నారు. ఇటీవల మృతుడు వీరభద్రం మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకుంటే కేటీపీఎస్ అధికారులు రిజక్ట్ చేసినట్లు తెలిసింది. కాగా హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరభద్రం మృతదేహం -
యాభై ఏళ్ల వెలుగులకు తెర!
సాక్షి, హైదరాబాద్: తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లుతుండటంతోపాటు ఆర్థికంగా భారంగా మారిన కొత్తగూడెం థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం (కేటీపీఎస్)లోని పాత విద్యుదుత్పత్తి యూనిట్లను మూసివేసేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) చర్యలు ప్రారంభించింది. 1,750 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్న 11 యూనిట్లు కేటీపీఎస్‌లో ఉండగా.. అందులో మొత్తం 720 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 8 యూనిట్లను దశల వారీగా మూసివేసేందుకు లాంఛనాలు మొదలుపెట్టింది. అర్ధ శతాబ్దపు వెలుగులు.. కేటీపీఎస్ తొలి దశ కింద 1966లో రెండు 60 మెగావాట్ల (2్ఠ60) యూనిట్లు, రెండో దశ కింద 1967లో రెండు 60 మెగావాట్ల (2్ఠ60) యూనిట్లు, మూడో దశ కింద 1974, 1975ల్లో రెండు 120 మెగావాట్ల్ల (2్ఠ120) యూనిట్లు, నాలుగో దశ కింద 1977, 1978లలో రెండు 120 మెగావాట్ల (2్ఠ120) యూనిట్లను నిర్మించారు. అర్ధ శతాబ్ద కాలం పాటు ఉమ్మడి ఏపీ, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు అందించిన ఈ కేంద్రాలకు ప్రస్తుతం కాలం చెల్లింది. వీటి నుంచి విద్యుదుత్పత్తి జరపడానికి అధిక మొత్తంలో బొగ్గు మండించాల్సి వస్తుండటంతో వ్యయం తడిసి మోపెడవుతోంది. మరోవైపు తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యాన్ని వెదజల్లుతుండటంతో పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడో యూనిట్ నుంచి ఏడాది కిందే జెన్కో విద్యుదుత్పత్తిని నిలిపివేసింది. ఈ నేపథ్యంలో 720 మెగావాట్ల కేటీపీఎస్ తొలి నాలుగు దశల్లో నిర్మించిన మొత్తం యూనిట్లను అధికారికంగా మూసివేసేందుకు జెన్కో ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ విద్యుత్ కేంద్రాలు వెలువరుస్తున్న కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)తో అధ్యయనం జరిపించి నివేదిక రూపొందించాలని జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు విద్యుత్ సౌధలో నిర్వహించిన ఓ సమీక్షలో అధికారులను ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా దశలవారీగా ప్లాంట్ల మూసివేతకు చర్యలు తీసుకోనున్నారు. కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ)కు గతంలో ఇచ్చిన హామీ మేరకు 2019 మార్చిలోగా ఈ విద్యుత్ ప్లాంట్లను జెన్కో మూసివేయాల్సి ఉంది. నెలాఖరులో 7వ దశ ప్రారంభం ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న 800 మెగావాట్ల (1్ఠ800) కేటీపీఎస్ 7వ దశ విద్యుత్ ప్లాంట్ నుంచి నెలాఖరులోగా విద్యుదుత్పత్తిని ప్రారంభించేందుకు జెన్కో సన్నాహాలు చేస్తోంది. సూపర్ క్రిటికల్ బాయిలర్ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ కొత్త విద్యుత్ కేంద్రం అందుబాటులోకి వస్తున్నందున గతంలో సీఈఏకి ఇచ్చిన హామీ మేరకు 720 మెగావాట్ల పాత విద్యుత్ కేంద్రాల్ని మూసేస్తామని ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. తొలుత 60 మెగావాట్ల యూనిట్‌ను మూసేస్తామన్నారు. కేటీపీఎస్ తొలి 4 దశలకు సంబంధించిన 720 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను మూసేస్తే, 5వ దశ కింద 1997–98 లో నిర్మించిన రెండు 250 మెగావాట్ల యూనిట్లు (2్ఠ250), 6వ దశ కింద 2011లో నిర్మించిన 500 మెగావాట్ల యూనిట్ (1్ఠ500) మిగలనుంది. ఏడో దశలోని 800 (1్ఠ800) మెగావాట్ల యూనిట్ జతకానుంది. పాత యూనిట్ల మూత, కొత్త యూనిట్ నిర్మాణం తర్వాత కేటీపీఎస్ సామర్థ్యం 1,800 మెగావాట్లకు చేరనుంది. -
ఇచ్చుకో..తోలుకో
పాల్వంచ: కొత్తగూడెం థర్మల్ పవర్‌ప్లాంట్ (కేటీపీఎస్)లో విద్యుత్ ఉత్పత్తి చేసే క్రమంలో బొగ్గును మండించడం ద్వారా నిత్యం విడుదలయ్యే బూడిద(యాష్)ను ఉచితంగా అందజేయాల్సి ఉండగా..కొందరు ప్రైవేట్ వ్యక్తులు దందా చేస్తున్నారు. లారీ లోడుకింత అని బేరాలు పెట్టి దండుకుంటున్నారు. పాల్వంచ సమీపంలోని పుల్లాయిగూడెం, సూరారం తదితర ప్రాంతాల్లోరెండు యాష్పాండ్లు(బూడిద చెరువులు) ఉండగా..కాలుష్య ఉద్ఘారకం కాబట్టి దీని సాంద్రతను తగ్గించుకునేందుకు జెన్కో యాజమాన్యం ఉచితంగా తీసుకెళ్లే అవకాశం కల్పించింది. సిమెంట్ బ్రిక్స్ తయారీకి, సిమెంట్ కంపెనీలకు, ఫిల్లింగ్ చేసేందుకు, మరే ఇతర అవసరాలకైనా దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా అందజేస్తారు. దీంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చి బూడిదను యాష్ లారీల ద్వారా నిత్యం తీసుకెళుతుంటారు. స్థానికంగా కొందరు ప్రైవేట్ వ్యక్తుల జోక్యంతో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక..లారీల ద్వారా నిత్యం తరలించే బూడిదకు రూ.వేలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. రవాణా చేసే క్రమంలో చాలామంది లోడుపై పట్టాలను పూర్తిగా కప్పకపోవడంతో..టార్బల్ కట్టకపోవడంతో రహదారిపై బూడిద కారుతూ, వెనకాల వచ్చే వాహనదారులు అవస్థ పడుతున్నారు. ఇలాంటి వాహనాలను ఆపి స్థానికులు ఘర్షణలు పడిన సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. వారికి ఇది వ్యాపారం.. యాష్ పాండ్ల నుంచి బూడిదను తీసుకెళ్లేందుకు కొందరు వ్యక్తులు జెన్కో యాజమాన్యం నుంచి అనుమతి తీసుకుని, లారీల ద్వారా కొంతకా>లంగా తీసుకెళుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, వరంగల్ తదితర జిల్లాలకు అధికంగా ఈ బూడిదను తరలిస్తున్నారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఒక్కోలారీ బుడిదకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా అక్రమంగా వేలాది రుపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. అనుమతి తీసుకున్న వారు కర్మాగారంపై అవగాహన లేని వ్యక్తులకు అమ్ముకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. నిఘా పెడతాం.. బూడిదను తీసుకెళ్లేందుకు కొందరు దరఖాస్తు చేసుకుంటే యాజమాన్యం అనుమతినిచ్చింది. ఈ విషయంలో మా ప్రమేయం ఏమీ లేదు. అనుమతి తీసుకున్న వారు అమ్ముకుంటున్నట్లు ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. దీనిపై పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. బూడిదను ఎవరు అడిగినా ఉచితంగా అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.– టీఎస్ఎన్.మూర్తి, సీఈ, కేటీపీఎస్ 5,6 దశలు -
ఏడో దశ కేటీపీ‘ఎస్’!
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీఎస్) ఏడో దశ ప్లాంట్ ట్రయల్ రన్ విజయవంతమైంది. విద్యుత్ ఉత్పత్తికి అత్యంత కీలకమైన బాయిలర్‌ను తెలంగాణ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు బుధవారం ఉదయం 8.46 గంటలకు వెలిగించారు. ఉత్తరాంచల్ రాష్ట్రం హరిద్వార్‌లో బీహెచ్ఈఎల్ తయారు చేసిన భారీ జనరేటర్‌తో బాయిలర్‌ను అనుసంధానం చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రారంభించి, పూర్తి చేసిన తొలి విద్యుత్ ప్లాంట్‌గా కేటీపీఎస్ ఏడో దశ ప్రాజెక్టు నిలవనుంది. రూ.5,700 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంటు నిర్మాణ పనులను 2015 జనవరి 1న ప్రారంభించారు. దేశంలో కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణం ప్రారంభించిన 48 నెలల్లో పూర్తి చేయాలని కేంద్రీయ విద్యుత్ మండలి (సీఈఏ) నిబంధనలున్నాయి. అయితే కొత్తగూడెం ప్లాంటు నిర్మాణం అంతకన్నా తక్కువ వ్యవధిలోనే నిర్మాణం పూర్తి చేసుకుని కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. దేశంలో మరెక్కడా ఇంత తక్కువ సమయంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు నిర్మాణం జరగలేదు. కేటీపీఎస్ ఏడో దశ ఉత్పత్రి ప్రారంభించిన తర్వాత తెలంగాణకు అందుబాటులో ఉండే విద్యుత్ 15 వేల మెగావాట్లు దాటుతుంది. కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్లు రాధాకృష్ణ, సచ్చిదానందం తదితరులు పాల్గొన్నారు. 17 వేల మెగావాట్లు: ప్రభాకర్ రావు 28 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉండేలా ప్రణాళిక రచించి, తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యం మేరకు విద్యుత్ ఉత్పత్తిని పెంచుతున్నట్లు జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు వెల్లడించారు. కేటీపీఎస్ ఏడో దశ, భద్రాద్రి ప్లాంట్లను సందర్శించి.. పనుల పురోగతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రానికి 17 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి 6,573 మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉండేదని, ఇప్పుడు దాన్ని 14,972 మెగావాట్లకు చేర్చగలిగామని, ఇందులో 3 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా ఉందన్నారు. మార్చి 31 నాటికి కేటీపీఎస్ నుంచి 800 మెగావాట్లు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. డిసెంబర్ 31 నాటికి 1,080 మెగావాట్ల సామర్థ్యం ఉన్న భద్రాద్రి ప్లాంటు నిర్మాణం కూడా పూర్తవుతుందని చెప్పారు. డిసెంబర్ నాటికి మరింత సోలార్ విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ కేటీపీఎస్ ఏడో దశ నిర్మాణం లో భాగంగా బాయిలర్‌ను వెలిగించి, ట్రయల్ రన్ ప్రారంభించడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభాకర్‌రావుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. -
కేటీపీఎస్‌లో అగ్నిప్రమాదం: నిలిచిన ఉత్పత్తి
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్ 11వ యూనిట్లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. 11వ యూనిట్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు ఎగిసిపడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. -
పాల్వంచలో కేటీఆర్ పర్యటన
పాల్వంచ: సహజవనరులను సద్వినియోగం చేసుకుంటే భద్రాద్రి జిల్లా అగ్రస్థానంలో ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఉదయం ఆయన పాల్వంచలో మున్సిపల్ పంప్‌హౌస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కేటీపీఎస్‌లో ఉద్యోగాలను ఇకపై స్థానికులతోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. -
‘కేటీపీఎస్’ నిర్మాణ పనులు ఆగొద్దు
మరింత వేగవంతం చేయాలి కాంట్రాక్ట్ కంపెనీలను ఆదేశించిన జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు పాల్వంచ : కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగొద్దని, ముందస్తు ప్రణాళికలతో చకచకా సాగేలా చూడాలని టీఎస్ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు ఆదేశించారు. ఆయన మంగళవారం స్థానిక కేటీపీఎస్ ఓ అండ్ ఎం కర్మాగారంలో కాంట్రాక్ట్ కో–ఆర్డినేష¯ŒS మీటింగ్(సీసీఎం) నిర్వహించారు. నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్తోపాటు అనుబంధ కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులు, జె¯ŒSకో డైరెక్టర్లు, కేటీపీఎస్ అధికారులతో మాట్లాడారు. విభాగాలవారీగా పనుల పురోగతిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా పనులు మందగిస్తున్నాయనే సాకు చెప్పొద్దని, అనుకున్న సమయానికి పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. ‘‘ప్రభుత్వం నుంచి మాపై ఒత్తిడి ఉంది. సీఎం కేసీఆర్‌కు ఇచ్చిన మాట ప్రకారం 2017 చివరి నాటికి పనులు పూర్తిచేయాలి’’ అని చెప్పారు. పనులను జెన్కో, కేటీపీఎస్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి, ప్రతి వారం ప్రొగ్రెస్ రిపోర్ట్ తయారు చేయాలని ఆదేశించారు. అనంతరం, 7వ దశ నిర్మాణ పనులను పరిశీలించారు. కూలింగ్ టవర్ నిర్మాణ పనులు కొంత ఆలస్యంగా ప్రారంభమవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్ రాధాకృష్ణ, సచ్చిదానందం, సివిల్ సీఈ అజయ్, ఓ అండ్ ఎం సీఈ వి.మంగేష్ కుమార్; 5, 6 దశల సీఈ పి.రత్నాకర్, ఎస్ఈలు నరిసింహ, ఎల్లయ్య, యుగపతి, బీహెచ్ఈఎల్, పవర్‌మెక్, పుంజులాయిడ్, ఎస్‌అండ్‌సీ, సంతోష్ పాల్గొన్నారు. నవంబర్‌లో ‘భద్రాద్రి’ పనులు ప్రారంభం కిన్నెరసాని (పాల్వంచ రూరల్): భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు వచ్చే నెలలో (నవంబర్‌లో) ప్రారంభమవుతాయని జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. ఆయన మంగâýæవారం రాత్రి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. భద్రాద్రి ప్లాంట్‌తో పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదని కోర్టు స్పష్టం చేసిందన్నారు. వచ్చే నెలలో పనులను పునరుద్ధరించనున్నట్టు చెప్పారు. కేటీపీఎస్ 7వ దశ, పులిచింతలలోని విద్యుత్ కర్మాగారాన్ని 2017 నాటికి పూర్తి చేస్తామన్నారు. స్థానిక ఇంజనీర్లతో కూడా ఆయన మాట్లాడారు. కిన్నెరసాని నీటి మట్టాన్ని గరిష్ట స్థాయిలో ఉంచుతున్నామని, దీని వలన డ్యామ్‌కు ప్రమాదం లేదని చెప్పారు. -
కేటీపీఎస్ 7వ దశను వేగవంతం చేయాలి
జెన్కో డైరెక్టర్ రాధాకృష్ణ పాల్వంచ: కేటీపీఎస్ 7వ దశ (800 మెగావాట్లు) నిర్మాణ పనులను ముమ్మరం చేయాలని, పని ప్రదేశాల్లో మ్యాన్ పవర్ పెంచాలని టీఎస్ జెన్కో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) సి.రా«ధాకృష్ణ ఆదేశించారు. కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. అన్ని విభాగాలకు వెళ్లి పనుల నిర్వహణ వివరాలు తెలుసుకున్నారు. నిర్మాణ ప్రదేశంలో అనేకచోట్ల గుంతల్లో వర్షపు నీళ్లు నిల్వ ఉండడాన్ని గమనించి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వర్షం వెలిసిన వెంటనే పని ప్రదేశంలో నీళ్లు లేకుండా చూడాలని ఆదేశించారు. పనులు కొన్నిచోట్ల నత్తనడకన నడుస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముమ్మరం చేయాలని ఆదేశించారు. అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా పనులు సాగించాలని, ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించవదద్ని, అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. ఆయన వెంట ఓ అంyŠ lఎం; 5, 6 దశల సీఈలు వి.మంగేష్‌కుమార్, పి.రత్నాకర్, ఎస్ఈలు యుగపతి, బాలరాజు తదితరులు ఉన్నారు. -
బాయిలర్ పైనుంచి పడి టెక్నీషియన్ మృతి
కేటీపీఎస్‌లో ప్రమాదం పాల్వంచ: కేటీపీఎస్ 5వ దశ కర్మాగారంలో మంగళవారం ప్రమాదశాత్తు బాయిలర్‌పై నుంచి పడి ఓ టెక్నీషియన్ మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. కేటీపీఎస్ 5వ దశలో 250 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్లో పదిరోజులుగా ఓవరాల్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ పనుల నిర్వహణ కోసం తమిళనాడు రాష్ట్రం తిరుచునాపల్లికి చెందిన బీహెచ్ఈఎల్ రిటైర్డ్ ఇంజనీర్, బాయిలర్ టెక్నీషియన్ జి.మాస్కో వారం క్రితం ఇక్కడికి వచ్చాడు. ఓవరాల్ పనులను బాయిలర్ వద్ద నిర్వహిస్తున్న సమయంలో పది మీటర్ల ఎత్తు నుంచి ప్రమాదశాత్తు జారి పడ్డాడు. అతని తల, ఛాతి, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే పనిచేస్తున్న సిబ్బంది హుటాహుటిన కేటీపీఎస్ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్త్రావమై మృతి చెందాడు. మృతదేహాన్ని సీఈ పి. రత్నాకర్, ఎస్పీఎఫ్ డీఎస్పీ రంగరాజు భాస్కర్, పట్టణ ఎస్సై పి. సత్యనారాయణరెడ్డి సందర్శించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. -
కేటీపీఎస్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి
పాల్వంచ : కేటీపీఎస్ 5,6 దశల కర్మాగారంలో విద్యుదుత్పత్తి స్తంభించింది. వివిధ మరమ్మతుల కారణంగా కర్మాగారంలోని వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. శుక్రవారం రాత్రి 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 9వ యూనిట్, 500 మెగావాట్ల 11వ యూనిట్లో బాయిలర్ ట్యూబ్ లీకేజీల వల్ల అధికారులు ఉత్పత్తిని నిలిపివేశారు. సీఈ పి.రత్నాకర్ నేతృత్వంలో యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి.. 9వ యూనిట్‌ను శనివారం ఉదయానికి పునరుద్ధరించగా, సాయంత్రానికి 11వ యూనిట్ మరమ్మతు పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం 250 మెగావాట్ల 9వ యూనిట్‌ను రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. 11వ యూనిట్ బ్యాక్ డౌన్ కారణంగా ఉత్పత్తి నిలిపివేసినట్లు సీఈ తెలిపారు. గత నెల 26 నుంచి 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 10వ యూనిట్‌ను వార్షిక మరమ్మతుల నేపథ్యంలో నిలిపివేసిన విషయం విదితమే. యూనిట్‌ను 30 రోజులపాటు మరమ్మతు చేసి.. ఈనెల 26 వరకు పునరుద్ధరించే అవకాశం ఉంది. -
మహిళా ఏఈపై నీళ్ల సీసాతో దాడి
తోటి మహిళా ఏఈపై ఓ ఏఈ నీళ్ల సీసాతో దాడి చేశాడు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని కేటీపీఎస్ కర్మాగారంలో శనివారం ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కేటీపీఎస్ ఐదో దశలో రవి అనే ఏఈ అపరేషన్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఓ సమస్య ఎదురవగా.. దాన్ని ఆయన పరిష్కరించలేకపోయారు. అయితే, జనరల్ షిఫ్ట్‌లో పనిచేస్తున్న నాగలక్ష్మి అనే ఏఈ సమస్యను సరిచేశారు. ఈ క్రమంలో రవి మహిళా ఏఈని కించపరిచేలా మాట్లాడాడు. దీనిపై వారి మధ్య మాట మాట పెరిగింది. ఆగ్రహంతో రవి నీళ్ల సీసాను నాగలక్ష్మిపై విసిరేశాడు. దీంతో ఆమెకు స్వల్ప గాయమైంది. దీనిపై ఆమె చీఫ్ ఇంజనీర్‌కు ఫిర్యాదు చేశారు. దళిత ఉద్యోగినిపై దాడి చేసిన ఏఈ రవిపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. -
కేటీపీఎస్‌లో ఉత్పత్తికి అంతరాయం
పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మంగళవారం మధ్యాహ్నం పదో యూనిట్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో 250 మెగావాట్ల యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తి ఉత్పత్తి నిలిచి పోయింది. వెంటనే స్పందించిన అధికారులు మరమ్మతులకు ఉపక్రమించారు. -
బోగస్ సర్టిఫికెట్లు సమర్పించిన 12 మంది సస్పెన్షన్
పాల్వంచ (ఖమ్మం): తప్పుడు ధ్రువపత్రాలతో ఖమ్మం జిల్లాలోని కేటీపీఎస్ (కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్) 5,6 దశల కర్మాగారంలో ఉద్యోగాలు పొందిన 12 మంది జేపీఏ (జూనియర్ ప్లాంట్ అటెండెంట్)లు సస్పెన్షన్‌కు గురయ్యారు. 2013 జూలైలో జెన్కో సంస్థలో 1295 మంది జేపీఏలుగా ఉద్యోగాలు పొందారు. అందులో 446 మంది కేటీపీఎస్ కర్మాగారానికి నియమితులయ్యారు. అయితే రిక్రూట్మెంట్ సమయంలో తప్పుడు ఏజెన్సీ సర్టిఫికెట్లతో కొందరు ఉద్యోగాలు పొందారని గిరిజన సంఘాలు జిల్లా కలెక్టర్‌కు, జెన్కో యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారి వివరాలు, సర్టిఫికెట్లను తిరిగి రెవెన్యూ అధికారులు పరిశీలించారు. దీంతో 12 మంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలింది. దీంతో వారిని సస్పెండ్ చేయాలని ఇటీవల బదిలీ అయిన కలెక్టర్ ఇలంబరితి జెన్కో యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆ మేరకు కేటీపీఎస్ 5,6 అధికారులు వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. 25 నెలల పాటు విధుల నిర్వహించిన అనంతరం వీరు సస్పెన్షన్‌కు గురికావడం చర్చనీయంశంగా మారింది. తప్పుడు ఆధారాలతో రెవెన్యూ అధికారులను పక్కదోవ పట్టించిన 12 మందిపై పోలీసు కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. -
కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం
ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లో మంగళవారం విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కర్మాగారంలోని 1 నుంచి 10 యూనిట్లు ట్రిప్ అవడంతో దీని వల్ల 1220 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకం ఏర్పడింది. గ్రిడ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగానే ఒకే సారి యూనిట్లన్నీ ట్రిప్ అయినట్లు సీఈ లక్ష్మయ్య తెలిపారు. సాంకేతిక లోపం ఏర్పడటంతో అధికారులు మరమ్మత్తులు చేపట్టారు. -
కేటీపీఎస్ 5వ దశలో 150 మెగావాట్ల విద్యుత్ ఉత్త్పత్తి
పాల్వంచ: కేటీపీఎస్ 5వ దశలో 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని మంగళవారం సాయంత్రం నుంచి బ్యాక్‌డౌన్ చేసినట్లు సీఈ సిద్దయ్య తెలిపారు. వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల 9, 10, 11 యూనిట్లలో 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లోడ్ డిస్పాజ్ కేంద్రం ఆదేశాల మేరకు తగ్గించినట్లు తెలిపారు. తడి బొగ్గు కారణంగా మూడు యూనిట్లలో మరో 50 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుందన్నారు. కేటీపీఎస్ ఓఅండ్‌ఎంలో వార్షీక మరమ్మతుల్లో ఉన్న 1, 6 యూనిట్లు మినహా మిగిలిన 2, 3, 4, 5, 7 , 8 యూనిట్లలో ప్రతిరోజూ 450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాల్సిఉండగా తడిబొగ్గు కారణంగా 50 నుంచి 60 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుందని సీఈ బి.లక్ష్మయ్య తెలిపారు. తీశారు. రాజమండ్రిలో తొక్కిసలాటలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు.