బూడిదకు భారీగా వసూళ్లు   | KTPS Released Yash Illegal Transport In Kothagudem District | Sakshi
Sakshi News home page

బూడిదకు భారీగా వసూళ్లు  

Published Thu, Sep 5 2019 12:07 PM | Last Updated on Thu, Sep 5 2019 2:55 PM

KTPS Released Yash Illegal Transport In Kothagudem District - Sakshi

కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎంలోని సైలో

సాక్షి, పాల్వంచ: కేటీపీఎస్‌ నుంచి వెలువడే బూడిద (యాష్‌) తరలింపులో వసూళ్ల దందా సాగుతోంది. అధికారుల అండదండలతో కొందరు ప్రైవేటు వ్యక్తులు భారీగా డబ్బు దండుకుంటున్నారు. బూడిదను తరలించాలంటే చేయి తడపనిదే బండి కదలని పరిస్థితి నెలకొంది. ఈ బూడిదను ఉచితంగా అందించాల్సి ఉండగా.. పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బు ముట్టజెపితే వెంటనే లోడ్‌ చేయడం, లేదంటే వెయిటింగ్‌ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. అధికారులు తమ చేతికి మట్టి అంటకుండా ప్రైవేట్‌ వ్యక్తులతో ఈ దందాను ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అన్న చందంగా విస్తరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.      

కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌) ఓఅండ్‌ఎం, 5, 6, 7 దశల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేసే క్రమంలో బొగ్గును మండించడం ద్వారా నిత్యం బూడిద విడుదల అవుతుంది. దీన్ని పుల్లాయిగూడెం, సురారం తదితర ప్రాంతాల్లో ఉన్న యాష్‌ పాండ్‌లకు పంపిస్తుంటారు. సిమెంట్‌ ఫ్యాక్టరీలకు, ఇతర అవసరాలకు మెట్రిక్‌ టన్నుకు రూ.50 చొప్పున ముందే డీడీ  రూపంలో చెల్లిస్తే బూడిదను అందిస్తారు. అయితే సిమెంట్‌ ఫ్యాక్టరీల నుంచి వచ్చే ట్యాంకర్లకు బూడిద అందించే క్రమంలో చేతివాటం ప్రదర్శిస్తుండడం ఇక్కడ ‘మూమూలు’గా మారింది. ఇక ఉచితంగా అందించే వారినుంచి అయితే వేల రూపాయలు దండుకుంటున్నారు. డబ్బు ఇవ్వని వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి రోజూ  వందల సంఖ్యలో ట్యాంకర్లు, టిప్పర్లు, లారీలు వస్తుంటాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో స్థానికంగా కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు జోక్యం చేసుకుని భారీ ఎత్తున అక్రమాలకు తెరలేపుతున్నారు. రవాణా చేసే క్రమంలో లారీలపై కనీసం పట్టాలు కూడా కట్టుకోకుండా వెళుతున్నారని పలువురు వాపోతున్నారు.

లబోదిబోమంటున్న బ్రిక్‌ వ్యాపారులు... 
యాష్‌ పాండ్ల నుంచి బూడిదను తీసుకెళ్లేందుకు కొందరు జెన్‌కో యాజమాన్యం నుంచి అనుమతి తీసుకుని లారీల ద్వారా తరలిస్తుంటారు. అంతేగాక సైలోల నుంచి కూడా తీసుకెళుతుంటారు. ఈ క్రమంలో ఒక్కో లారీకి కనీసం రూ.1000 నుంచి  రూ.2000 వరకు వసూలు చేస్తుంటారు. ఇలా అక్రమంగా వేలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నత స్థాయి అధికారికి బండికి రూ.500 ఇవ్వాలని, కింది స్థాయిలో మామూళ్లు యథావిధిగా ఉంటాయని చెపుతూ వేల రూపాయలు వసూలు చేస్తున్నారని పలువురు బ్రిక్స్‌ ఇండస్ట్రీ నిర్వాహకులు వాపోతున్నారు.

ఈ వ్యాపారులే కాకుండా భద్రాద్రి కొత్తగూడెంతో పాటు  ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, వరంగల్, గుడివాడ తదితర ప్రాంతాల నుంచి రోజుకు 400 పైగా వాహనాల్లో బూడిద తరలిస్తున్నారంటే ఈ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్‌ వ్యక్తులకు గాకుండా నేరుగా బ్రిక్స్‌ కంపెనీలు, సిమెంట్‌ ఫ్యాక్టరీల వారికే బూడిద చేరేలా చర్యలు తీసుకోవాలని, పైవేట్‌ దందాపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

మా దృష్టికి తీసుకొస్తే  చర్య తీసుకుంటాం 
డబ్బులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. డబ్బు తీసుకుని బూడిదను అందించకూడదు. అలా ఇబ్బంది పడిన వ్యక్తులు ఎవరైనా నేరుగా మాకు ఫిర్యాదు చేస్తే తప్పక చర్య తీసుకుంటాం. 
– రవీందర్, ఇన్‌చార్జ్‌ సీఈ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement