ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏఈ విజయ్
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ కోల్ ప్లాంట్‌లో బ్రేకర్లు అమరుస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగి ముగ్గురికి గాయాలయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కేటీపీఎస్‌లోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడో దశ కోల్ ప్లాంట్‌లో ఎంటీసీ కంట్రోల్ బోర్డ్ వద్ద ఏఈ విజయ్ ఆధ్వర్యాన ఆర్టిజన్లు మల్లికార్జున్, వరదరాజు బ్రేకర్లు అమరుస్తున్నారు.
అయితే బ్రేకర్ల కండక్టర్ సరిగా అతుక్కోకుండానే విద్యుత్ ఆన్ చేయడంతో మంటలు చెలరేగాయి. మంటలు బయటకు ఎగిసిపడటం(బాయిలర్ ఫ్లాష్ ఓవర్)తో ఏఈతోపాటు మరో ఇద్దరు కార్మికులకు ముఖం, ఛాతీ, చేతులు కాలి పోయాయి. అప్రమత్తమైన తోటి సిబ్బంది వెంటనే కేటీపీఎస్ ఆస్పత్రికి తీసు కెళ్లగా...ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఈ పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...బ్రేకర్ అమరుస్తుండగా కనెక్టర్ల నుంచి మంటలు రావడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపడతామన్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎంపీ నామా నాగేశ్వరరావు జెన్‌కో డైరెక్టర్లతో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment