గోల గోల | referendum of ktps between protests | Sakshi
Sakshi News home page

గోల గోల

Published Sat, Jul 26 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM

referendum of ktps between protests

కొత్తగూడెం/ పాల్వంచ రూరల్ : తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో పాల్వంచలో నిర్మించనున్న కేటీపీఎస్ ఏడో దశ నిర్మాణానికి పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళంగా సాగింది. కేటీపీఎస్ విద్యుత్ కళాభారతి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు వచ్చిన వారిని అడుగడుగునా తనిఖీ చేయడంతో ప్రారంభంలోనే పోలీసులకు - ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

వారి వైఖరి పట్ల సీపీఐ, సీపీఎం, టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి - పోలీసులకు మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఇక సభ ప్రారంభం కాగానే స్థానిక జెడ్పీటీసీ, సర్పంచ్‌లను వేదికపైకి పిలవకపోవడంతో వారు సభా ప్రాంగణం ఎదుటే బైఠాయించారు. అయితే వేదికపై స్థలం తక్కువగా ఉండడం వల్లే పిలువలేదని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ సముదాయించినా వారు శాంతించలేదు. దీంతో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకొని జెడ్పీటీసీ, సొసైటీ అధ్యక్షులను వేదికపైకి పిలవాలని కలెక్టర్‌కు సూచించారు. కాగా, తమను అవమానించారంటూ అప్పటికే వారు  అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం.. 6వ దశలో క్యాజువల్ లేబర్‌గా తీసుకుని ఇటీవల తొలగించడాన్ని నిరసిస్తూ గిరిజన సంఘాలు ప్లకార్డులతో నిరసన తెలిపాయి. ఇలా గందరగోళం మధ్యనే సభ కొనసాగింది.

 మూడేళ్లలో 10 వేల మెగావాట్ల  విద్యుత్ అవసరం : సీఎండీ
 విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడిందని, వచ్చే మూడేళ్లలో 10,793 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని తెలంగాణ జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 4,365.26 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, అందులో 2,282 మెగావాట్ల థర్మల్ పవర్, 2,081 మెగావాట్ల జల విద్యుత్, ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ వస్తోందని చెప్పారు.

విద్యుత్ లోటు పూడ్చుకునేందుకు కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని సీఎం కేసీఆర్ సూచించారని, వచ్చే మూడేళ్లలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు. దీంతోపాటు ఛత్తీస్‌గఢ్ నుంచి 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. విద్యుత్ కొరతతో ప్రస్తుతం గృహావసరాలతోపాటు చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో నిర్వాసితులయ్యే వారికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. దీంతోపాటు సీఎస్‌ఆర్ పాలసీ కింద రూ.21 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు జెన్కో కట్టుబడి ఉందన్నారు.

 విద్యుత్ కొరతను అధిగమిస్తేనే బంగారు తెలంగాణ : పొంగులేటి
 ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రాజెక్టుల నిర్మాణం ఎంతో అవసరమని, వాటిని తమ పార్టీ ఎప్పటికీ వ్యతిరేకించదని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ సాధించుకోవాలంటే విద్యుత్ కొరతను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ప్రాజెక్టుల నిర్మాణం ఎంత ముఖ్యమో, దానివల్ల నిర్వాసితులయ్యే వారికి, కాలుష్యం బారిన పడుతున్న వారికి న్యాయం చేయడం కూడా అంతే ముఖ్యమని సూచించారు.

భూ నిర్వాసితుల కుటుంబాలకు కేటీపీఎస్‌లో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలుష్య ప్రభావిత ప్రాంతాలలో సంస్థ ఆధ్వర్యంలో విద్య, వైద్య, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా సీఎస్‌ఆర్ పాలసీని సక్రమంగా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. కొత్త టెక్నాలజీని వినియోగించి కాలుష్యం ఎక్కువగా రాకుండా చూడాలని కోరారు. దీంతోపాటు యాష్‌పాండ్‌లు ఎక్కువగా నిర్మించి జల కాలుష్యం పెరగకుండా చూడాలన్నారు.  6 దశల ద్వారా కేవలం 1720 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేశారని, 7వ దశ ద్వారా 800 మెగావాట్ల ప్లాంటును నిర్మించడం అభినందనీయమన్నారు.

కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అనంతరం విద్యుత్ ఇంజనీర్లకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చే వీటీసీ విజయవాడకు వెళ్లిందని, దాన్ని కేటీపీఎస్‌లో ఏర్పాటు చేయాలని కోరారు. కొత్త ప్రాజెక్టులు రావడం వల్ల స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. కేటీపీఎస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు దళారులు అమాయకులను మోసం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేటీపీఎస్‌లోని 1 నుంచి మూడు యూనిట్ల కాలపరిమితి ముగిసిందని, వాటి స్థానంలో కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని కోరారు. 6వ దశ నిర్మాణంలో తీసుకున్న 409 మంది క్యాజువల్ కార్మికులను పది నెలల తర్వాత తొలగించారని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం  ఉందన్నారు. కేటీపీఎస్ కాలుష్యంతో కిన్నెరసాని నది కలుషితం అవుతోందన్నారు.

 మరిన్ని గ్రామాలను కేటీపీఎస్ దత్తత తీసుకొని అక్కడ సీఎస్‌ఆర్ పాలసీని అమలు చేయాలని కోరారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతంలో ప్రాజెక్టులను నిర్మిస్తునప్పటికీ ఆ వర్గాల వారికి మాత్రం ఉద్యోగాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోస్టర్ పద్ధతిని పటిష్టంగా అమలు చేసి గిరిజనులకు, దళితులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో కేటీపీఎస్ నిర్మాణ సమయంలో ప్రమాదవశాత్తు కొందరు మృతి చెందారని, వారి కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం చేయలేదని అన్నారు.

వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు పర్యావరణ సమతుల్యత పాటించాలని కోరారు.  కేటీపీఎస్ కాలుష్యంతో అనేక గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాల్సిన కేటీపీఎస్ అధికారులు.. ప్రస్తుతం లక్ష మొక్కలను మాత్రమే నాటుతామని చెప్పడం దారుణమని విమర్శించారు. సంస్థ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement