* మొదటి దశలో కొత్తగూడెం ప్రాజెక్టు మూడేళ్లలో విద్యుత్ ఉత్పత్తి: సీఎండీ
సాక్షి, హైదరాబాద్: కొత్తవిద్యుత్ కేంద్రాల నిర్మాణంపై తెలంగాణ జెన్‌కో, కేంద్రప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌తో సంప్రతింపులు ప్రారంభించింది. ఇప్పటికే కుదిరిన ఒప్పందం ప్రకారం జెన్‌కో కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు, మణుగూరులో 1,080 మెగావాట్ల (270 మెగావాట్ల చొప్పున మూడు యూనిట్లు) విద్యుత్‌ప్లాంట్ల నిర్మాణాన్ని బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించింది. ఈపీసీ విధానంలో చేపట్టే ఈ పనులకు సంబంధించి రేట్లు, కాంట్రాక్టు షరతులు, నిబంధనలపై చర్చలు జరిపేందుకు టీ-జెన్‌కో ఒక కమిటీని నియమించింది.
జెన్‌కో డెరైక్టర్ (థర్మల్) ఎం.సచ్చిదానందం సారథ్యంలో చీఫ్ ఇంజనీర్ (థర్మల్), ఫైనాన్షియల్, కంపెనీ లా అడ్వయిజర్లు, ప్లాంట్ చీఫ్ ఇంజనీర్, సీఎండీ విభాగపు డివిజనల్ ఇంజనీర్ ఈ కమిటీలో ఉన్నారు. బీహెచ్‌ఈఎల్ కంపెనీ ప్రతినిధులు టీఎస్ జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు, థర్మల్ డెరైక్టర్‌లను సోమవారం కలిశారు. తొలిదశలో కొత్తగూడెం 800 మెగావాట్ల ప్రాజెక్టు చేపట్టే అంశంపైనే చర్చలు జరిగినట్టు తెలిసింది.
మరో రెండు,మూడు సమావేశాల అనంతరం రేట్లు, నిబంధనలు ఖరారవుతాయని అధికారవర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు బీహెచ్‌ఈఎల్ అంగీకారం తెలిపిందని.. ప్రారంభించిన నాటి నుంచి మూడేళ్ల వ్యవధిలో విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుందని టీఎస్ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు.
కొత్త విద్యుత్ ప్లాంట్లపై బీహెచ్‌ఈఎల్, టీజెన్‌కో చర్చలు
Published Tue, Nov 25 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM
Advertisement
Advertisement