కార్మికుల ఓట్లే ‘కీ’లకం
కొత్తగూడెం(ఖమ్మం), న్యూస్‌లైన్ : సింగరేణి బొగ్గు గనులతో దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని కార్మికులు.. రాజకీయ నేతల తలరాతలు మార్చుతున్నారు.
సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని పోటీ చేస్తున్న అభ్యర్థులు కార్మికుల ఓట్లపైనే ఎక్కువగా ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనకు పూర్వం.. కొత్తగూడెం నియోజకవర్గం లో చండ్రుగొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతుల ఓట్లు ఉండేవి.
అయితే పునర్విభజన అనంతరం కొత్తగూడెం, పాల్వంచ మండలాలతో కలిపి కొత్తగూడెం నియోజకవర్గంగా ఏర్పడింది. దీంతో ఈ ప్రాంతంలోని సింగరేణి కార్మికులు, పాల్వంచలోని కేటీపీఎస్, నవభారత్, స్పాంజ్‌ఐరన్ పరిశ్రమల కార్మికులు ఎన్నికల్లో కీలకంగా మారారు. కొత్తగూడెం నియోజకవర్గంలో మొత్తం 2,18,146 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కొత్తగూడెంలో 1,37,859 మంది, పాల్వంచలో 80,287 మంది ఓటర్లు ఉన్నారు. అయితే సింగరేణి సంస్థ పరిధిలో ప్రస్తుతం 5వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.
వీరితోపాటు సింగరేణి ప్రధాన కార్యాలయంలో రెండు వేల మంది వరకు ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి కుటుంబాల్లో ఉన్న ఓట్లు మొత్తం కలిపి సుమారు 30వేల వరకు ఉంటాయి. కాగా, సింగరేణి సంస్థలో అవుట్‌సోర్సింగ్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత సుమారు మూడువేల మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో కొత్తగూడెంలో భూగర్భ కార్మికులకు సంబంధించి సుమారు 40వేల మంది ఉన్నారు.
పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్)లో ఐదువేల మంది ఉద్యోగులుండగా, ఇందులో 1,500 మంది వరకు కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. వీరి కుటుంబాల తో కలిపి సుమారు 20వేల వరకు కేటీపీఎస్ కార్మికుల ఓట్లు ఉన్నాయి. అలాగే నవభారత్ పరిశ్రమలో సుమారు 1,500 మంది, స్పాంజ్ ఐరన్ పరిశ్రమలో 350 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు.
వీరి కుటుంబాలతో కలిపి సుమారు ఐదువేల వరకు ఓట్లు ఉంటాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు, వారి కుటుంబాల ఓట్లు 65 నుంచి 70 వేల వరకు ఉండడంతో ఇక్కడి నుంచి బరిలోకి దిగే నేతల రాతలు మార్చడంలో కార్మికులు కీలకంగా మారారు.