kotta gudem
-
జలగం కారు దిగుతాడా ..?
-
రాష్ట్రం వైపు వందలాదిగా మావోయిస్టులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టుల కదలికలను కనిపెట్టేందుకు పోలీసులు వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సత్ఫలితాలనిస్తోంది. ఆదివారం పోలీసులు డ్రోన్ వీడియో కెమెరా ద్వారా మావోలకు సంబంధించి కచ్చితమైన వివరాలు కనుగొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీసుస్టేషన్ పరిధిలో పాలోడి అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు వాగు దాటుతున్నట్లు డ్రోన్ కెమెరా ద్వారా వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. వీరంతా తెలంగాణ వైపు వస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య నిరంతరం పోరు నడుస్తోంది. గత కొన్ని నెలలుగా తెలంగాణలోనూ మావోయిస్టులు తమ కార్యకలాపాలను పెంచుతున్నారు. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత రెండు నెలల్లో పలుసార్లు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 3న భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు, 7వ తేదీన చర్ల మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో వాగు దాటుతూ తెలంగాణ వైపు వస్తున్నట్లు డ్రోన్ కెమెరాలు కనిపెట్టాయి. దీంతో రాష్ట్రంలోని ములుగు, భద్రాచలం, పినపాక, మంథని నియోజకవర్గాల్లో పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు. -
కాంగ్రెస్‌కు ‘హ్యాండ్’ ఇచ్చిన వనమా
సాక్షి, కొత్తగూడెం : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి ‘హ్యాండ్’ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారు ఎక్కేందుకు రెడీగా ఉన్నారు. తాజాగా ఆ జాబితాలోకి కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చేరారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌తో భేటీ అనంతరం వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. త్వరలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ హామీ ఇచ్చారని, త్వరలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరనున్నట్లు వెల్లడించారు. ప్రజలు, పార్టీ శ్రేణుల అభీష్టం మేరకు నడుచుకోవడమే తన విధి అని వనమా వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల నరేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటన చేసిన విషయం విదితమే. త్వరలో జరగనున్న తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లు కైవసం చేసుకోవడానికి టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అనుకున్న మేర స్థానాలు గెలుచుకోలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా 16 లోక్‌సభ సీట్లు గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ... ఆపరేషన్ ఆకర్ష్‌ను అమలు చేస్తోంది. దీంతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో వనమా నాగేశ్వరరావు కూడా టీఆర్ఎస్లో చేరడం ఆ పార్టీకి లబ్ది చేకూరనుంది. -
ఈ గట్టునుండాలా.. ఆగట్టుకెళ్లాలా...!
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఎన్నికలంటే నోట్ల పండగగా మారిన పరిస్థితి.. ఓటు అంగట్లో సరుకుగా మారిన దుస్థితి. ఒకప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటును వినియోగించుకునే ఓటరును స్వార్థ ప్రయోజనాలతో కొంతమంది రాజకీయ నాయకులు ప్రలోభాలకు గురిచేయడంతో ఓటుకు నోట్ల బేరం పెరుగుతోంది. ప్రస్తుతం రాజకీయాలలో నైతిక విలువలు దిగజారుతున్న తరుణంలో ప్రధాన నేతలు అవకాశాన్ని బట్టి టికెట్లను సంపాదించుకుంటున్నా ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం డోలాయమానంలో పడే పరిస్థితులు నెలకొన్నాయి. అధిష్టానవర్గాల నిర్ణయాల మేరకు ప్రధాన నేతలు కలుస్తున్నా ద్వితీయశ్రేణి నాయకత్వంలో మాత్రం విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు ద్వితీయశ్రేణి నాయకత్వం పరిస్థితి ఇలా ఉంటే.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి స్వార్థ రాజకీయాలకు తెరతీసే కొంతమంది చోటామోటా నాయకులు ఏ గట్టునుంటే మంచిది... ఎంత గిట్టుబాటవుతుంది, ఉన్న నాయకుడిని నమ్ముకుంటే భవిష్యత్తు ఉంటుందా.. లేదా ప్రత్యర్థి నాయకుని పంచన చేరితే ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయా అని లెక్కలు వేసుకునే పరిస్థితి ఉంది. అంతర్గతంగా మదనపడుతూనే ఎన్నికల సమయం తప్పితే ప్రధాన నాయకులు తమ మాట వినే పరిస్థితి ఉండదనే ఆలోచనతో బేరసారాలకు కూడా తెరతీస్తున్నారు. పరోక్షంగా ప్రత్యర్థి ప్రధాన నాయకుడికి ఆ వర్గంలో ఉన్న ద్వితీయశ్రేణి నాయకత్వంతో సంకేతాలు కూడా పంపుతున్నారు. ఎన్నికలకు కేవలం 10 రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఈ ఎన్నికల్లో తాము ఏమేరకు ఆర్థిక వనరులను సమకూర్చుకుంటామోననే ఆలోచనతో ప్రతి ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా తర్జనబర్జన పడుతున్నారు. స్థాయిని బట్టి రేటును ఫిక్స్ చేసుకునే పరిస్థితి ఉంది. ఈసారి కొత్తగూడెం నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం విదితమే. తాము తప్పనిసరిగా పోటీ చేస్తామని నాయకులు కూడా అనివార్యంగా దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో ఒక్కటికాక తప్పదని రాజీపడి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు అధికారపక్షం కూడా తమదైన శైలిలో ప్రచారపర్వాన్ని ప్రారంభించింది. ఇంకోవైపు ప్రతిసారి టికెట్ కోసం ఆశించి భంగపడిన నేత సైతం మరోసారి ప్రజాబలాన్ని నమ్ముకునే ఎన్నికల బరిలో దిగారు. బరితో ఉన్న ముగ్గురు బలమైన అభ్యర్థులే అయినప్పటికీ కిందిస్థాయి కేడర్ కదలికలు మాత్రం ఎవరికీ అర్థంకాని పరిస్థితి ఉంది. వీళ్లు కాకుండా మరికొంతమంది ద్వితీయశ్రేణి నాయకత్వం ఇంకా తమ మద్దతు ఎవరికీ ప్రకటించకుండా తటస్థంగా ఉన్నారు. నలుగురు గుమిగూడే ప్రతి ప్రాంతంలోనూ డబ్బుల చర్చ, అభ్యర్థులు ఎవరు గెలుస్తారనే చర్చ తప్ప మరొకటి కన్పించడంలేదు. ఇదంతా చూస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం ఎన్నికలంటే ఇలా కూడా ఉంటాయా అంటూ ముక్కున వేలు వేసుకునే పరిస్థితి ఉంది. -
కన్నుల పండువగా బాలోత్సవ్..
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జాతీయ స్థాయి బాలోత్సవ్-14 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. వేడుకలను రేలారే రేలా ఫేం సయ్యద్ రషీద్ జెండా ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో డి.అమయ్‌కుమార్, క్లబ్ కన్వీనర్ వాసిరెడ్డి రమేష్‌బాబు, ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్, కార్టూనిస్ట్ శంకర్, ప్రజా వాగ్గేయకారుడు అంద్శై, ఢిల్లీకి చెందిన కథా రచయిత దాసరి అమరేంద్ర మాట్లాడుతూ.. మూడురోజులపాటు జరిగే వేడుకల వల్ల చిన్నారుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవచ్చని అన్నారు. 23 ఏళ్లుగా నిర్వహిస్తున్న బాలోత్సవ్‌ను మండల స్థాయి నుంచి జాతీయ స్థాయికి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కొత్తగూడెం పట్టణానికి చెందిన దుర్గసాయి నృత్య నికేతన్ విద్యార్థులు ప్రదర్శించిన వినాయక నృత్యం ఆహుతులను ఆకట్టుకుంది. రేలారే రేలా ఫేం సయ్యద్ రషీద్ ‘అమ్మ’పై పాడిన పాట అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. తొలిరోజు 5 వేల మంది...: జాతీయ స్థాయి బాలోత్సవ్ మొదటిరోజు పోటీలకు ఆరు రాష్ట్రాలకు చెందిన సుమారు 5 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. గురువారం రాత్రి నుంచే విద్యార్థులు కొత్తగూడెం క్లబ్ ప్రాంగణానికి చేరుకోవడంతో బాలోత్సవ్ ప్రాంగణం సందడిగా మారింది. తొలిరోజు 15 అంశాల్లో పోటీలు జరిగాయి. ఉదయం జరిగిన స్పాట్ డ్రాయింగ్ పోటీకి అత్యధికంగా 2400 మంది విద్యార్థులు హాజరుకావడం విశేషం. వీటితోపాటు తెలుగు మాట్లాడుదాం, కవితా రచన, కథా విశ్లేషణ, భరతనాట్యం సబ్‌జూనియర్స్, కూచిపూడి సబ్ జూనియర్స్, జానపద నృత్యం జూనియర్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బాలోత్సవ్‌లో చిన్నారులు చేసిన జానపద నృత్యాలు ఆహుతులను అలరించాయి. -
కార్మికుల ఓట్లే ‘కీ’లకం
కొత్తగూడెం(ఖమ్మం), న్యూస్‌లైన్ : సింగరేణి బొగ్గు గనులతో దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని కార్మికులు.. రాజకీయ నేతల తలరాతలు మార్చుతున్నారు. సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని పోటీ చేస్తున్న అభ్యర్థులు కార్మికుల ఓట్లపైనే ఎక్కువగా ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనకు పూర్వం.. కొత్తగూడెం నియోజకవర్గం లో చండ్రుగొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతుల ఓట్లు ఉండేవి. అయితే పునర్విభజన అనంతరం కొత్తగూడెం, పాల్వంచ మండలాలతో కలిపి కొత్తగూడెం నియోజకవర్గంగా ఏర్పడింది. దీంతో ఈ ప్రాంతంలోని సింగరేణి కార్మికులు, పాల్వంచలోని కేటీపీఎస్, నవభారత్, స్పాంజ్ఐరన్ పరిశ్రమల కార్మికులు ఎన్నికల్లో కీలకంగా మారారు. కొత్తగూడెం నియోజకవర్గంలో మొత్తం 2,18,146 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కొత్తగూడెంలో 1,37,859 మంది, పాల్వంచలో 80,287 మంది ఓటర్లు ఉన్నారు. అయితే సింగరేణి సంస్థ పరిధిలో ప్రస్తుతం 5వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరితోపాటు సింగరేణి ప్రధాన కార్యాలయంలో రెండు వేల మంది వరకు ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి కుటుంబాల్లో ఉన్న ఓట్లు మొత్తం కలిపి సుమారు 30వేల వరకు ఉంటాయి. కాగా, సింగరేణి సంస్థలో అవుట్సోర్సింగ్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత సుమారు మూడువేల మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో కొత్తగూడెంలో భూగర్భ కార్మికులకు సంబంధించి సుమారు 40వేల మంది ఉన్నారు. పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్)లో ఐదువేల మంది ఉద్యోగులుండగా, ఇందులో 1,500 మంది వరకు కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. వీరి కుటుంబాల తో కలిపి సుమారు 20వేల వరకు కేటీపీఎస్ కార్మికుల ఓట్లు ఉన్నాయి. అలాగే నవభారత్ పరిశ్రమలో సుమారు 1,500 మంది, స్పాంజ్ ఐరన్ పరిశ్రమలో 350 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. వీరి కుటుంబాలతో కలిపి సుమారు ఐదువేల వరకు ఓట్లు ఉంటాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు, వారి కుటుంబాల ఓట్లు 65 నుంచి 70 వేల వరకు ఉండడంతో ఇక్కడి నుంచి బరిలోకి దిగే నేతల రాతలు మార్చడంలో కార్మికులు కీలకంగా మారారు. -
‘గూడెం’ సీపీఐలో అసంతృప్తి సెగలు
కొత్తగూడెం, న్యూస్‌లైన్: కామ్రేడ్ల కంచుకోటలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. జిల్లాలో సీపీఐకి బలమైన కేంద్రంగా ఉన్న కొత్తగూడెం పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ఆపార్టీలో చిచ్చుపెడుతున్నాయి. ఇప్పటికే సీనియర్ నాయకులు కొందరు వేరే పార్టీలకు వలసబాటపడుతుండగా మరికొందరు అదే యత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఈ దఫా టీఆర్ఎస్, జేఏసీతో పొత్తు పెట్టుకుని సీపీఐ బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో సీపీఐకి 18 వార్డులు కేటాయించగా, టీఆర్ఎస్, జేఏసీలకు 15 వార్డులు కేటాయింపు జరిపారు. 2005 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్న సీపీఐ మున్సిపాలిటీలో 12 వార్డుల్లో పోటీ చేసి 5 వార్డుల్లో విజయం సాధించింది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీతో విభేదించి టీఆర్ఎస్, పొలిటికల్జేఏసీతో ఒప్పందం కుదుర్చుకుని బరిలోకి దిగుతోంది. సీపీఐలో గతంలో కౌన్సిలర్లుగా పనిచేసిన వారికి, సీనియర్ నాయకులకు ఈసారి వార్డులు కేటాయించకపోవడంతో వారిలో అసంతృప్తి చోటుచేసుకుంది. రామవరం ప్రాంతానికి చెందిన సీనియర్‌నాయకులు మాటేటి గోపాల్‌కు సీటు కేటాయింపు విషయంలో స్పష్టత రాకపోవడంతో వారం రోజుల క్రితం ఆయన తెలుగుదేశం గూటికి చేరారు. గతంలో సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసిన కనుకుంట్ల కుమార్ సైతం ప్రస్తుతం అసంతృప్తి నేపథ్యంలో పార్టీకి రాజీనామా లేఖ పంపినట్లు సమాచారం. కొత్తగూడెం పట్టణానికి చెందిన కనుకుంట్ల కుమార్ 2005 ఎన్నికల్లో 3వ వార్డు నుంచి విజయం సాధించగా, ఆయన సతీమణి కనుకుంట్ల వెంకటరమణ 4వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం వెంకటరమణ సీపీఐలో చేరారు. కుమార్ కౌన్సిల్లో పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించారు. పార్టీకి కుమార్ అందించిన సేవలకు గాను అతనికి ఈ దఫా చైర్మన్ పదవిని ఇచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గతంలో హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో కుమార్ సతీమణికి కాకుండా పట్టణానికి చెందిన ఓ వైద్యురాలికి చైర్మన్ పదవిని ఇచ్చేందుకు నిర్ణయించడంతో కుమార్ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి ఎస్.కె.సాబీర్‌పాష...కుమార్‌ను బుజ్జగించినట్లు తెలుస్తోంది. కాగా, గతంలో 25వ వార్డుకు ప్రాతినిధ్యం వహించిన మాచర్ల శ్రీనివాస్‌కు ఈ దఫా సీటు దక్కకపోవడంతో ఆయనకూడా అసంతృప్తితోనే ఉన్నారు. ఎలాగైన బరిలో నిలవాలనే ఉద్దేశంతో మాచర్ల శ్రీనివాస్ 22వ వార్డులో సీపీఐ తరఫున నామినేషన్‌తోపాటు ఇండిపెండెంట్‌గా కూడా నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా తాము చైర్పర్సన్ అభ్యర్థిని ప్రకటించలేదని, ఎవ్వరూ అసంతృప్తి చెందవద్దని నాయకులు చెబుతున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం ఈ విషయంపై పార్టీలో చిచ్చు రగులుతూనే ఉంది. ఇది ఏపరిస్థితికి దారితీస్తుందో వేచిచూడాల్సిందే. -
బతుకు దుర్భరం
సాక్షి, కొత్తగూడెం: పట్టణ పరిశుభ్రత కోసం పాటుపడతారు...రెక్కలుముక్కలు చేసుకొని ఊడ్చుతారు. పేరుకుపోయిన చెత్తనంతా తొలగిస్తారు. ఎండనక వాననక, పగలనక రేయనక కష్టపడుతూనే ఉంటారు. కానీ వారిబతుకుల్లో మాత్రం వెలుగులేదు. చాలీచాలని జీతంతో, ఇల్లు గడిచీగడవక వెతలు అనుభవిస్తున్నారు. సమస్యలపై సమరం కోసం ఒక రోజు వారు పనులు మానేస్తే తెల్లవారేసరికి రోడ్లన్నీ మురికికూపాలే..మట్టిదిబ్బలే.. ఇదీ మున్సిపాలిటీలోని మహిళా పారిశుధ్య కార్మికుల దీనస్థితి. చేస్తున్న ఉద్యోగం ఏదో ఒక రోజు పర్మినెంట్ అవుతుందని ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ వీళ్లు వెట్టి చాకిరి చేస్తున్నారు. జిల్లాలోని ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లో 80 శాతం వరకు కాంట్రాక్టు కార్మికులున్నారు. ఇందులో 45 శాతం వరకు మహిళా కార్మికులే. ఖమ్మం కార్పొరేషన్, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, మధిర మున్సిపాలిటీలు, సత్తుపల్లి నగర పంచాయతీల్లో ఈ మహిళా పారిశుధ్య కార్మికులు నిత్యం పట్టణాలను పరిశుభ్రం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు వారికి అన్నీ సమకూరుస్తామని ఒప్పందం కుదుర్చుకొని ఆ తర్వాత చేతులెత్తేస్తున్నారు. తమ సమస్యల సాధన కోసం వారు పోరుబాట పట్టినా.. ఇంకా అవి అపరిష్కృతంగానే ఉన్నాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా.. కాంట్రా క్టు కార్మికులుగానే ఉండిపోయారు. చాలీచాలని జీతాలతో కుటుంబాలు గడవక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. వేతనం పెంచుతామన్న ప్రభుత్వ మాట కూడా నీటిమూటే అయింది. చాలీచాలని వేతనం.. కాంట్రాక్టు కార్మికులకు నెలకు రూ.6,700 వేతనంగా ఇస్తున్నారు. ఇందులో పీఎఫ్, ఈఎస్ఐ ఇతర కటింగ్స్‌పోను రూ. 5,627 కార్మికుల చేతికి అందుతోంది. ఇంటి అద్దె, పిల్లల చదువులు, పాల ఖర్చు, కరెంటు, గ్యాస్ బిల్లు, నిత్యావసర సరుకులు, కూరగాయలు.. ఇలా అన్ని ఖర్చులు లెక్కిస్తే పదివేల రూపాయాల పై మాటే.. భర్తలు ఇతర పనులు చేస్తూ ఇంత సంపాదిస్తుండటంతో అతికష్టం మీద సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యానికి గురైనా, ఏదైనా పం డుగ వచ్చినా.. అప్పులు చేయక తప్పని పరి స్థితి. కాంట్రాక్టు కార్మికులకు రూ.8,750 వేత నం ఇవ్వాలని జీఓ ఉన్నా ప్రభుత్వం అమలు చేయడం లేదు. వీరికి ఏడాదికి పదిహేను రోజుల పాటు సెలవులు ఇస్తారు. అవి మినహా విధి నిర్వాహణలో గాయాలైనా, అనారోగ్యానికి గురైనా విశ్రాంతి ఉండదు. తప్పని పరిస్థితుల్లో సెలవు పెడితే వేతన కోత తప్పదు. జీవితమంతా ‘చెత్త’మయం.. పారిశుధ్య కార్మికులకు తప్పని సరిగా ఏడాదికి రెండు జతల యూనిఫాం, కొబ్బరినూనె, సబ్బులు, రెండు జతల చెప్పులు ఇవ్వాలి. చివరకు చేతులకు వేసుకునే గ్లౌజులు కూడా పంపిణీ చేయకపోవడం గమనార్హం. ఖమ్మం, పాల్వంచ, కొత్తగూడెంలో రాత్రిళ్లు కూడా కార్మికలు విధులు నిర్వహిస్తుంటారు. తక్కిన చోట్ల వేకువజామున విధుల్లోకి వెళ్తారు. పర్మినెంట్ కార్మికుల మాదిరిగానే వీరికి రేడియం జాకెట్లు ఇవ్వాలి. మొన్నటి వరకు కాంట్రాక్టు కార్మికుల టెండర్ ఒప్పందంలో వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ మొత్తాన్ని చేర్చేవారు. ఇప్పుడు పొరకలు, కొబ్బరినూనె, యూనిఫాం, చెప్పులు, గ్లౌజులు, మాస్కులు అన్నీ చేరుస్తున్నారు. కానీ వారికి మాత్రం ఇవ్వడం లేదు. కాంట్రాక్టర్లు ఒప్పంద నిబంధనలను బేఖాతర్ చేస్తున్నా మున్సిపల్ కమిషనర్లు పట్టనట్లే వ్యవహరిస్తున్నారు.