సాక్షి, కొత్తగూడెం: పట్టణ పరిశుభ్రత కోసం పాటుపడతారు...రెక్కలుముక్కలు చేసుకొని ఊడ్చుతారు. పేరుకుపోయిన చెత్తనంతా తొలగిస్తారు. ఎండనక వాననక, పగలనక రేయనక కష్టపడుతూనే ఉంటారు. కానీ వారిబతుకుల్లో మాత్రం వెలుగులేదు. చాలీచాలని జీతంతో, ఇల్లు గడిచీగడవక వెతలు అనుభవిస్తున్నారు. సమస్యలపై సమరం కోసం ఒక రోజు వారు పనులు మానేస్తే తెల్లవారేసరికి రోడ్లన్నీ మురికికూపాలే..మట్టిదిబ్బలే.. ఇదీ మున్సిపాలిటీలోని మహిళా పారిశుధ్య కార్మికుల దీనస్థితి. చేస్తున్న ఉద్యోగం ఏదో ఒక రోజు పర్మినెంట్ అవుతుందని ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ వీళ్లు వెట్టి చాకిరి చేస్తున్నారు.
జిల్లాలోని ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లో 80 శాతం వరకు కాంట్రాక్టు కార్మికులున్నారు. ఇందులో 45 శాతం వరకు మహిళా కార్మికులే. ఖమ్మం కార్పొరేషన్, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, మధిర మున్సిపాలిటీలు, సత్తుపల్లి నగర పంచాయతీల్లో ఈ మహిళా పారిశుధ్య కార్మికులు నిత్యం పట్టణాలను పరిశుభ్రం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు వారికి అన్నీ సమకూరుస్తామని ఒప్పందం కుదుర్చుకొని ఆ తర్వాత చేతులెత్తేస్తున్నారు.
తమ సమస్యల సాధన కోసం వారు పోరుబాట పట్టినా.. ఇంకా అవి అపరిష్కృతంగానే ఉన్నాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా.. కాంట్రా క్టు కార్మికులుగానే ఉండిపోయారు. చాలీచాలని జీతాలతో కుటుంబాలు గడవక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. వేతనం పెంచుతామన్న ప్రభుత్వ మాట కూడా నీటిమూటే అయింది.
చాలీచాలని వేతనం..
కాంట్రాక్టు కార్మికులకు నెలకు రూ.6,700 వేతనంగా ఇస్తున్నారు. ఇందులో పీఎఫ్, ఈఎస్‌ఐ ఇతర కటింగ్స్‌పోను రూ. 5,627 కార్మికుల చేతికి అందుతోంది. ఇంటి అద్దె, పిల్లల చదువులు, పాల ఖర్చు, కరెంటు, గ్యాస్ బిల్లు, నిత్యావసర సరుకులు, కూరగాయలు.. ఇలా అన్ని ఖర్చులు లెక్కిస్తే పదివేల రూపాయాల పై మాటే.. భర్తలు ఇతర పనులు చేస్తూ ఇంత సంపాదిస్తుండటంతో అతికష్టం మీద సంసారాన్ని నెట్టుకొస్తున్నారు.
కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యానికి గురైనా, ఏదైనా పం డుగ వచ్చినా.. అప్పులు చేయక తప్పని పరి స్థితి. కాంట్రాక్టు కార్మికులకు రూ.8,750 వేత నం ఇవ్వాలని జీఓ ఉన్నా ప్రభుత్వం అమలు చేయడం లేదు. వీరికి ఏడాదికి పదిహేను రోజుల పాటు సెలవులు ఇస్తారు. అవి మినహా విధి నిర్వాహణలో గాయాలైనా, అనారోగ్యానికి గురైనా విశ్రాంతి ఉండదు. తప్పని పరిస్థితుల్లో సెలవు పెడితే వేతన కోత తప్పదు.
జీవితమంతా ‘చెత్త’మయం..
పారిశుధ్య కార్మికులకు తప్పని సరిగా ఏడాదికి రెండు జతల యూనిఫాం, కొబ్బరినూనె, సబ్బులు, రెండు జతల చెప్పులు ఇవ్వాలి. చివరకు చేతులకు వేసుకునే గ్లౌజులు కూడా పంపిణీ చేయకపోవడం గమనార్హం. ఖమ్మం, పాల్వంచ, కొత్తగూడెంలో రాత్రిళ్లు కూడా కార్మికలు విధులు నిర్వహిస్తుంటారు. తక్కిన చోట్ల వేకువజామున విధుల్లోకి వెళ్తారు. పర్మినెంట్ కార్మికుల మాదిరిగానే వీరికి రేడియం జాకెట్లు ఇవ్వాలి.
మొన్నటి వరకు కాంట్రాక్టు కార్మికుల టెండర్ ఒప్పందంలో వేతనంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ మొత్తాన్ని చేర్చేవారు. ఇప్పుడు పొరకలు, కొబ్బరినూనె, యూనిఫాం, చెప్పులు, గ్లౌజులు, మాస్కులు అన్నీ చేరుస్తున్నారు. కానీ వారికి మాత్రం ఇవ్వడం లేదు. కాంట్రాక్టర్లు ఒప్పంద నిబంధనలను బేఖాతర్ చేస్తున్నా మున్సిపల్ కమిషనర్లు పట్టనట్లే వ్యవహరిస్తున్నారు.
బతుకు దుర్భరం
Published Mon, Feb 10 2014 2:37 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement