సాక్షి, కొత్తగూడెం : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి ‘హ్యాండ్’ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారు ఎక్కేందుకు రెడీగా ఉన్నారు. తాజాగా ఆ జాబితాలోకి కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చేరారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌తో భేటీ అనంతరం వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ హామీ ఇచ్చారని, త్వరలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు వెల్లడించారు. ప్రజలు, పార్టీ శ్రేణుల అభీష్టం మేరకు నడుచుకోవడమే తన విధి అని వనమా వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల నరేందర్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటన చేసిన విషయం విదితమే. త్వరలో జరగనున్న తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లు కైవసం చేసుకోవడానికి టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ అనుకున్న మేర స్థానాలు గెలుచుకోలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా 16 లోక్‌సభ సీట్లు గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ... ఆపరేషన్ ఆకర్ష్‌ను అమలు చేస్తోంది. దీంతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో వనమా నాగేశ్వరరావు కూడా టీఆర్‌ఎస్‌లో చేరడం ఆ పార్టీకి లబ్ది చేకూరనుంది.
Comments
Please login to add a commentAdd a comment