కొత్తగూడెం, న్యూస్‌లైన్: కామ్రేడ్ల కంచుకోటలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. జిల్లాలో సీపీఐకి బలమైన కేంద్రంగా ఉన్న కొత్తగూడెం పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ఆపార్టీలో చిచ్చుపెడుతున్నాయి. ఇప్పటికే సీనియర్ నాయకులు కొందరు వేరే పార్టీలకు వలసబాటపడుతుండగా మరికొందరు అదే యత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఈ దఫా టీఆర్‌ఎస్, జేఏసీతో పొత్తు పెట్టుకుని సీపీఐ బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో సీపీఐకి 18 వార్డులు కేటాయించగా, టీఆర్‌ఎస్, జేఏసీలకు 15 వార్డులు కేటాయింపు జరిపారు. 2005 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్న సీపీఐ మున్సిపాలిటీలో 12 వార్డుల్లో పోటీ చేసి 5 వార్డుల్లో విజయం సాధించింది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీతో విభేదించి టీఆర్‌ఎస్, పొలిటికల్‌జేఏసీతో ఒప్పందం కుదుర్చుకుని బరిలోకి దిగుతోంది.
సీపీఐలో గతంలో కౌన్సిలర్లుగా పనిచేసిన వారికి, సీనియర్ నాయకులకు ఈసారి వార్డులు కేటాయించకపోవడంతో వారిలో అసంతృప్తి చోటుచేసుకుంది. రామవరం ప్రాంతానికి చెందిన సీనియర్‌నాయకులు మాటేటి గోపాల్‌కు సీటు కేటాయింపు విషయంలో స్పష్టత రాకపోవడంతో వారం రోజుల క్రితం ఆయన తెలుగుదేశం గూటికి చేరారు. గతంలో సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసిన కనుకుంట్ల కుమార్ సైతం ప్రస్తుతం అసంతృప్తి నేపథ్యంలో పార్టీకి రాజీనామా లేఖ పంపినట్లు సమాచారం. కొత్తగూడెం పట్టణానికి చెందిన కనుకుంట్ల కుమార్ 2005 ఎన్నికల్లో 3వ వార్డు నుంచి విజయం సాధించగా, ఆయన సతీమణి కనుకుంట్ల వెంకటరమణ 4వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం వెంకటరమణ సీపీఐలో చేరారు.
కుమార్ కౌన్సిల్‌లో పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించారు. పార్టీకి కుమార్ అందించిన సేవలకు గాను అతనికి ఈ దఫా చైర్మన్ పదవిని ఇచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గతంలో హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో కుమార్ సతీమణికి కాకుండా పట్టణానికి చెందిన ఓ వైద్యురాలికి చైర్మన్ పదవిని ఇచ్చేందుకు నిర్ణయించడంతో కుమార్ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి ఎస్.కె.సాబీర్‌పాష...కుమార్‌ను బుజ్జగించినట్లు తెలుస్తోంది. కాగా, గతంలో 25వ వార్డుకు ప్రాతినిధ్యం వహించిన మాచర్ల శ్రీనివాస్‌కు ఈ దఫా సీటు దక్కకపోవడంతో ఆయనకూడా అసంతృప్తితోనే ఉన్నారు. ఎలాగైన బరిలో నిలవాలనే ఉద్దేశంతో మాచర్ల శ్రీనివాస్ 22వ వార్డులో సీపీఐ తరఫున నామినేషన్‌తోపాటు ఇండిపెండెంట్‌గా కూడా నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా తాము చైర్‌పర్సన్ అభ్యర్థిని ప్రకటించలేదని, ఎవ్వరూ అసంతృప్తి చెందవద్దని నాయకులు చెబుతున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం ఈ విషయంపై పార్టీలో చిచ్చు రగులుతూనే ఉంది. ఇది ఏపరిస్థితికి దారితీస్తుందో వేచిచూడాల్సిందే.
‘గూడెం’ సీపీఐలో అసంతృప్తి సెగలు
Published Sat, Mar 15 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM
Advertisement
Advertisement