కన్నుల పండువగా బాలోత్సవ్..
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జాతీయ స్థాయి బాలోత్సవ్-14 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. వేడుకలను రేలారే రేలా ఫేం సయ్యద్ రషీద్ జెండా ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో డి.అమయ్‌కుమార్, క్లబ్ కన్వీనర్ వాసిరెడ్డి రమేష్‌బాబు, ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్, కార్టూనిస్ట్ శంకర్, ప్రజా వాగ్గేయకారుడు అంద్శై, ఢిల్లీకి చెందిన కథా రచయిత దాసరి అమరేంద్ర మాట్లాడుతూ.. మూడురోజులపాటు జరిగే వేడుకల వల్ల చిన్నారుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవచ్చని అన్నారు. 23 ఏళ్లుగా నిర్వహిస్తున్న బాలోత్సవ్‌ను మండల స్థాయి నుంచి జాతీయ స్థాయికి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కొత్తగూడెం పట్టణానికి చెందిన దుర్గసాయి నృత్య నికేతన్ విద్యార్థులు ప్రదర్శించిన వినాయక నృత్యం ఆహుతులను ఆకట్టుకుంది. రేలారే రేలా ఫేం సయ్యద్ రషీద్ ‘అమ్మ’పై పాడిన పాట అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది.
తొలిరోజు 5 వేల మంది...: జాతీయ స్థాయి బాలోత్సవ్ మొదటిరోజు పోటీలకు ఆరు రాష్ట్రాలకు చెందిన సుమారు 5 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. గురువారం రాత్రి నుంచే విద్యార్థులు కొత్తగూడెం క్లబ్ ప్రాంగణానికి చేరుకోవడంతో బాలోత్సవ్ ప్రాంగణం సందడిగా మారింది. తొలిరోజు 15 అంశాల్లో పోటీలు జరిగాయి. ఉదయం జరిగిన స్పాట్ డ్రాయింగ్ పోటీకి అత్యధికంగా 2400 మంది విద్యార్థులు హాజరుకావడం విశేషం. వీటితోపాటు తెలుగు మాట్లాడుదాం, కవితా రచన, కథా విశ్లేషణ, భరతనాట్యం సబ్‌జూనియర్స్, కూచిపూడి సబ్ జూనియర్స్, జానపద నృత్యం జూనియర్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బాలోత్సవ్‌లో చిన్నారులు చేసిన జానపద నృత్యాలు ఆహుతులను అలరించాయి.