balostav
-
బాలోత్సవ్ దరఖాస్తులకు 30 ఆఖరు
సాక్షి, హైదరాబాద్: భాషా, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అవార్డీ టీచర్స్ అసోసియేషన్ (ఆట) ఆధ్వర్యంలో నవంబర్ 10, 11 తేదీల్లో రవీంద్రభారతిలో జాతీయ స్థాయి ఆట బాలోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆట అధ్యక్ష, కార్యదర్శులు బెక్కంటి శ్రీనివాసరావు, మార్గం ఎల్లయ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 5 వేల మంది విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చేలా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆసక్తి గల కేజీ టు పీజీ వరకు చదివే విద్యార్థులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు సమర్పించిన వారికి 26 అంశాలు, 47 విభాగాలు, 4 కేటగిరీల్లో వివిధ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. దరఖాస్తులను భద్రాచలంలోని ఆట క్యాంప్ ఆఫీస్, ఇంటి నం.9–1–168/15, శాంతినగర్ కాలనీ, భద్రాచలం– 507111, తెలంగాణ అడ్రస్‌కు పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపాలని సూచించారు. మరిన్ని వివరాలకు ataindia.ga వెబ్‌పేజీని లేదా 9848421589 (రమేశ్), 7981935477, 9396982375 (ఉమ) నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. -
ఏపీలో తొలిసారిగా బాలోత్సవ్
నంబూరు (తెనాలి): ప్రపంచ బాలల పండుగ–2017 పేరుతో గుంటూరు జిల్లా నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీవీఐటీ)లో ఆదివారం వేలాది పిల్లల కోలాహలం మధ్య బాలోత్సవ్ ప్రారంభమైంది. తెలంగాణలోని భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఏటా బాలోత్సవ్ జరుగుతుంది. తొలిసారిగా ఇప్పుడు నవ్యాంధ్రలో మొదలైంది. 610 పాఠశాలల నుంచి 10 వేల మంది విద్యార్థులు, వారి తలిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్న వేడుకను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎ.రాజేంద్రప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ఆరంభించారు. చిన్నారులు, అతిథులు బెలూన్లు ఎగుర వేశారు. అనంతరం వీసీ మాట్లాడుతూ బాలోత్సవ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. -
కన్నుల పండువగా బాలోత్సవ్..
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జాతీయ స్థాయి బాలోత్సవ్-14 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. వేడుకలను రేలారే రేలా ఫేం సయ్యద్ రషీద్ జెండా ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో డి.అమయ్‌కుమార్, క్లబ్ కన్వీనర్ వాసిరెడ్డి రమేష్‌బాబు, ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్, కార్టూనిస్ట్ శంకర్, ప్రజా వాగ్గేయకారుడు అంద్శై, ఢిల్లీకి చెందిన కథా రచయిత దాసరి అమరేంద్ర మాట్లాడుతూ.. మూడురోజులపాటు జరిగే వేడుకల వల్ల చిన్నారుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవచ్చని అన్నారు. 23 ఏళ్లుగా నిర్వహిస్తున్న బాలోత్సవ్‌ను మండల స్థాయి నుంచి జాతీయ స్థాయికి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కొత్తగూడెం పట్టణానికి చెందిన దుర్గసాయి నృత్య నికేతన్ విద్యార్థులు ప్రదర్శించిన వినాయక నృత్యం ఆహుతులను ఆకట్టుకుంది. రేలారే రేలా ఫేం సయ్యద్ రషీద్ ‘అమ్మ’పై పాడిన పాట అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. తొలిరోజు 5 వేల మంది...: జాతీయ స్థాయి బాలోత్సవ్ మొదటిరోజు పోటీలకు ఆరు రాష్ట్రాలకు చెందిన సుమారు 5 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. గురువారం రాత్రి నుంచే విద్యార్థులు కొత్తగూడెం క్లబ్ ప్రాంగణానికి చేరుకోవడంతో బాలోత్సవ్ ప్రాంగణం సందడిగా మారింది. తొలిరోజు 15 అంశాల్లో పోటీలు జరిగాయి. ఉదయం జరిగిన స్పాట్ డ్రాయింగ్ పోటీకి అత్యధికంగా 2400 మంది విద్యార్థులు హాజరుకావడం విశేషం. వీటితోపాటు తెలుగు మాట్లాడుదాం, కవితా రచన, కథా విశ్లేషణ, భరతనాట్యం సబ్‌జూనియర్స్, కూచిపూడి సబ్ జూనియర్స్, జానపద నృత్యం జూనియర్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బాలోత్సవ్‌లో చిన్నారులు చేసిన జానపద నృత్యాలు ఆహుతులను అలరించాయి.