గ్యాస్ లీకైన ప్రాంతంలో మరమ్మతులు చేస్తున్న సిబ్బంది
సాక్షి, పాల్వంచ: కేటీపీఎస్ 5వ దశ కర్మాగారం 9వ యూనిట్‌లోని టర్బో జనరేటర్‌లో సోమవారం హైడ్రోజన్ గ్యాస్ లీకైంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. హైడ్రోజన్‌కు గాల్లో కలిసి బాంబులా పేలే సామర్థ్యం ఉండటంతో ఉద్యోగులు, కార్మికులు పని ప్రదేశం నుంచి పరుగులు పెట్టారు. అయితే కొందరు ఉద్యోగులు అప్రమత్తమై ప్రమాదాన్ని నివారించారు. 250 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన 9వ యూనిట్‌లో రూ. 100 కోట్లతో రెన్నోవేషన్ అండ్ మోడర్నైజేషన్(ఆర్‌అండ్‌ఎం) పనులు చేపట్టారు. గత జూన్ మొదటి వారంలో పనులు ప్రారంభంకాగా, ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. సోమవారం ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చేందుకు సింక్రనైజేషన్ చేస్తున్నారు. స్టీమ్ జనరేట్ అయ్యేటప్పుడు ఏర్పడే ఉష్ణోగ్రతను తగ్గించేందుకు జనరేటర్‌కు హైడ్రోజన్ (హెచ్2) పంపిస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్ పైపులైన్ దగ్గర హైడ్రోజన్ లీక్ కావడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు.
పని ప్రదేశం నుంచి వందలాది మంది దూరంగా పరుగులు తీశారు. అయితే కొందరు ఇంజనీర్లు, ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించి ఫైర్ ఇంజన్‌లను అందుబాటులోకి తెప్పించారు. ధైర్యసాహసాలతో హైడ్రోజన్ లీకైన చోట నుంచి కార్బన్‌డై ఆక్సైడ్‌ను పంపి ప్రమాదాన్ని అరికట్టారు. ఆ సమయంలో అక్కడ ఉన్నవారంతా ఊపిరి బిగపట్టి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తించారు. లీకేజీ ఉన్న ప్రదేశంలో సీల్ వేయడంతో ప్రమాదం తొలగిపోయింది. ఈ క్రమంలో కర్మాగారంలోని అన్ని ఫైర్ ఇంజన్‌లను, ఇతర ఫైర్ సేఫ్టీ పరికరాలను తెప్పించుకున్నారు. హైడ్రోజన్ ఎక్కువ మోతాదులో గాలిలో కలిస్తే బాంబులా పేలి కర్మాగారం ధ్వంసమయ్యే పరిస్థితి ఉండేదని, ఆస్తి నష్టంతో పాటు, ప్రాణ నష్టం భారీగా ఉండేదని అధికారులు చెబుతున్నారు.
ఒక రోజు ఆలస్యంగా సింక్రనైజేషన్..
ఓ వైపు కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో జెన్‌కో యాజమాన్యం ఆదేశాల మేరకు 9వ యూనిట్‌లో ఆధునీకరణ పనులు చేపట్టారు. బీహెచ్‌ఈఎల్ కంపెనీ పనులు నిర్వహిస్తోంది. పనులకు వందలాది మంది టెక్నీషియన్లు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. కరోనా వైరస్ ఉధృతిలోనూ ఉద్యోగులు విధులు నిర్వహించారు. ఈ క్రమంలో 50 రోజుల్లోపు పూర్తి కావాలి్సన పనులకు 60 రోజులు పట్టింది. చివరి క్షణంలో హైడ్రోజన్ గ్యాస్ లీక్ కలవరానికి గురిచేసింది. దీంతో సోమవారం సింక్రనైజేషన్ చే యాల్సి ఉండగా మంగళవారానికి వాయిదా వేశారు. సకా లంలో స్పందించి ప్రమాదాన్ని అరికట్టడంతో జెన్‌కో ఉన్నతాధికారులు సైతం ఇక్కడి ఉద్యోగులను అభినందించారు.
ముప్పు తప్పింది
హైడ్రోజన్ లీకేజీని సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి నష్టం లేకుండా బయటపడగలిగాం. పనిచేసిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. కోవిడ్ సమయంలోనూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో కలిసి పనిచేశాం. కరోనా వల్లే పనుల్లో కొంత జాప్యం జరిగింది. మంగళవారం సాయంత్రానికి విద్యుదుత్పత్తిని అందుబాటులోకి తెస్తాం.
–కె.రవీంద్ర కుమార్, సీఈ
Comments
Please login to add a commentAdd a comment