సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పుడు ప్రభుత్వం కేటీపీఎస్‌లో ఆర్మీ బలగాలను పెట్టి బలవంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసింది. అదే సీమాంధ్ర ఉద్యోగులు సబ్‌స్టే„షన్లలో సరఫరా నిలిపేసి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంటే వారి చర్యలను అరికట్టాల్సిందిపోయి వారికి రాచమర్యాదలు చేస్తోంది. సీఎం కిరణ్ బాధ్యత వహిస్తున్న శాఖలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాయలసీమ జిల్లాల్లోని సబ్‌స్టే„షన్లపై దాడులు జరుగుతుండటం చూస్తుంటే పలు అనుమానాలు తలెత్తుతున్నాయ’ని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత రఘు ఆరోపించారు.
ఆదివారం మింట్ కాంపౌండ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, 7,500 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతోందని, సీమాంధ్రుల సమ్మె వల్ల వీటిపీఎస్, ఆర్టీపీఎస్, శ్రీశైలం, ఇతర ప్రాజెక్టుల్లో 2,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే నిలిచిందని చెప్పారు. 2,500 మెగావాట్ల విద్యుత్ కొరత ఉన్నంత మాత్రాన సదరన్ పవర్‌గ్రిడ్ కుప్పకూలదని, ఉద్దేశపూర్వకంగానే కొంతమంది డిస్ట్రిబ్యూషన్ సబ్‌స్టేషన్లలో చొరబడి, సరఫరాను నిలిపివేసి గ్రిడ్‌ను కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పరోక్షంగా వీటికి సీఎం సహకరిస్తున్నట్లు అనుమానం కలుగుతోందని చెప్పారు. ఇప్పటికే కర్నూలు 400 కేవీ సబ్‌స్టే„షన్‌లోకి కొన్ని అసాంఘిక శక్తులు చొరబడి బలవంతంగా సరఫరా నిలిపివేయించాయని, ఇదే తీరు కొనసాగితే ఆదివారం అర్ధరాత్రి నుంచి దక్షిణాది రాష్ట్రాలన్నీ అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కరెంట్ లేక ఆస్పత్రుల్లో చిన్నారులు, ఇతర రోగులు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. మంచినీరు అందక ప్రజలు దాహంతో అల్లాడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు, సీఎం వైఖరికి నిరసనగా సోమవారం ఉదయం నుంచి మింట్ కాంపౌండ్‌లో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.