
‘నకిలీ’ ముఠా అరెస్ట్
చుంచుపల్లి (కొత్తగూడెం రూరల్) : నకిలీ నోట్లు, నకిలీ బంగారం చెలామణి చేస్తున్న ఆరుగురు సభ్యులున్న ముఠాను సోమవారం చుంచుపల్లి పంచాయతీలోని హౌజింగ్ బోర్డులో పట్టుకున్నట్టు కొత్తగూడెం డీఎస్సీ సురేందర్‌రావు, సీఐ మడత రమేష్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారు సోమవారం కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లతో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
కొత్తగూడెం మండలంలోని హౌజింగ్ బోర్డ్ ప్రాంతానికి చెందిన మేదర మొయినుద్దీన్, అశ్వారావుపేటకు చెందిన పాకాల కోటేశ్వరరావు, సత్తుపల్లికి చెందిన గుమ్‌షావలి, సత్తుపల్లికి చెందిన ఓడ్లపెల్లి నాగేశ్వరరావు, వేంసూరుకు చెందిన చక్రాల రామకృష్ణ, కొత్తగూడేనికి చెందిన విద్యాసాయి ప్రకాష్ కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
పదివేల రూపాయలు అసలు నోట్లు ఇస్తే, లక్ష రూపాయల నకిలీ నోట్లు ఇస్తామంటూ కొందరిని వీరు నమ్మించి మోసగిస్తున్నారు. ఎవరైనా వచ్చి పదివేల రూపాయల అసలు నోట్లు ఇవ్వగానే.. వీరు నకిలీ లక్ష రూపాయల నోట్లు ఇవ్వరు. ఇంతలో ఈ ముఠాలోని సభ్యులే బయటి నుంచి విజిల్ వేస్తారు. ఆ వెంటనే వీరంతా.. ‘పోలీసులు వస్తున్నారు’ అంటూ, ఆ పదివేల రూపాయలతో అక్కడి నుంచి పారిపోతారు.
బంగారం అమ్ముతామని..
బంగారం అమ్ముతామంటూ ఈ ముఠా సభ్యులు పాల్వంచకు చెందిన సుభాష్‌రెడ్డిని కలిశారు. అతని నుంచి ఐదువేల రూపాయలు తీసుకుని ‘బంగారం’ ఇచ్చి వెళ్లిపోయూరు. ఆ తరువాత, అది అసలు బంగారం కాదని, నకిలీదని సుభాష్‌రెడ్డి తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. చుంచుపల్లి పంచాయతీలోని హౌజింగ్ బోర్డులో ఈ ముఠా ఉందన్న సమాచారంతో పోలీసులు సోమవారం అక్కడకు వెళ్లి పట్టుకున్నారు.
కిలో నకిలీ బంగారం, పది లక్షల రూపాయల దొంగ నోట్లు స్వాధీనపర్చుకున్నారు. ఈ ముఠాలోని పాకాల కోటేశ్వరరావు, గుమ్‌షావలిపై భద్రాచలం, తాడిపల్లిగూడెం, నందిగామ, కొత్తగూడెం టూటౌన్, దమ్మపేట, అశ్వారావుపేట తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నారుు. సమావేశంలో ఎస్‌ఐ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.