fake gold
-
నకిలీ బంగారంతో రూ 2.71 కోట్లకు టోకరా
గుంటూరు రూరల్: గుంటూరు నగర శివారులోని ఒక బ్యాంకు బ్రాంచిలో భారీ మోసం బయటపడింది. కొందరు వ్యక్తులు నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందినట్టు వెల్లడైంది. ఇందులో బ్యాంకు అప్రైజర్ ప్రమేయం కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారం బయటపడకుండా కొందరు అధికారులు నిజమైన బంగారం తాకట్టు పెట్టిన వారికి వారు వడ్డీతో కలిపి చెల్లించాల్సిన మొత్తం కంటే ఎక్కువ కట్టాలని నోటీసులు పంపడం, ఆడిట్లో అసలు విషయాలు వెలుగుచూడటంతో మొత్తం గుట్టంతా రట్టయింది. మొత్తం 107 మంది నకిలీ బంగారంతో రుణాలు పొందినట్లు వెల్లడైంది. నిజమైన బంగారంతో రుణాలు పొందిన ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి ఎక్కువ మొత్తానికి ఎందుకు నోటీసులు ఇచ్చారని ప్రశి్నంచినందుకు వారిని కూడా ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై ఆడిట్ ధికారులు, బ్యాంక్ అధికారులు గుంటూరు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం నల్లపాడు సీఐ రాంబాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరు – అమరావతి రోడ్డు గోరంట్ల గ్రామంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఆడిట్ నిర్వహిస్తుండగా వెండి వస్తువులకు బంగారు పూత పూసి బంగారు వస్తువులుగా చూపి పలువురు కోట్ల రూపాయలు రుణాలు పొందారని బ్యాంక్ ఇంటర్నల్ అధికారి అనిల్ డెకాబె, బ్యాంక్ రీజినల్ మేనేజర్ ధనరాజ్ ఫిర్యాదు చేశారు. 2021 జనవరి 29 నుంచి 2023 నవంబరు 16 వరకు ఆడిట్ నిర్వహించగా 107 ఖాతాలలో నకిలీ బంగారంతో రుణాలు పొందినట్లు గుర్తించారు. వీటిలో దాదాపు 100 ఖాతాలలో నకిలీ బంగారం పెట్టి రుణం పొందే సమయంలో రీ అప్రైజల్ కూడా నిర్వహించలేదని గుర్తించారు. ఈ విధంగా నకిలీ బంగారంతో రూ.2.71 కోట్లు బ్యాంకుకు టోకరా వేసినట్లు తేలిందన్నారు. లోన్ అప్లికేషన్స్, అప్రైజల్ తదితర పరిశీలనలు చేయకుండా రుణాలు ఇ చ్చి నట్లు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. నిజమైన బంగారంతో రుణాలు పొందిన పలువురు ఖాతాదారులకు వారు తీసుకున్న రుణం కంటే రెండు రెట్లకు నోటీసులు రావడంతో వారంతా కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. -
Original Gold vs Fake Gold: తెలుసుకోవడం ఎలా?
-
ఎస్బీఐ క్యాషియర్ నిర్వాకం.. నకిలీ బంగారంతో రూ.60 లక్షలు స్వాహా
రామాపురం: నకిలీ బంగారం పెట్టి కుటుంబ సభ్యుల ఖాతాలతో రూ.60 లక్షలు స్వాహా చేశాడు ఎస్బీఐలో పని చేసే ఓ క్యాషియర్. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలోని మండల కేంద్రమైన రామాపురంలో సోమవారం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. ఎస్బీఐ రామాపురం బ్రాంచ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు రవికుమార్. డబ్బు కాజేయాలనే దుర్బుద్ధితో ఓ ఎత్తుగడ వేశాడు. తనకు అనుకూలురైన సిబ్బందితో కథ నడిపాడు. నకిలీ బంగారాన్ని కుదువపెట్టి తన కుటుంబసభ్యుల ఖాతాల ద్వారా లోన్ల పేరిట దాదాపు రూ.60 లక్షలు స్వాహా చేసినట్లు ప్రాథమిక అంచనా. కొందరు ఖాతాదారుల పేర్లతో కూడా డబ్బు స్వాహా చేసినట్లు తెలుస్తుండటంతో ఈ మొత్తం కోటి రూపాయలు దాటుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం అధికారులు ఈ విషయాన్ని గుర్తించి క్యాషియర్ రవికుమార్‌ను సస్పెండ్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ విషయంపై ఎస్ఐబీఐ ఆర్ఎమ్ రామకృష్ణ, రామాపురం శాఖ మేనేజర్ నాగసుబ్రహ్మణ్యంలను వివరణ కోరగా నకిలీ బంగారంతో క్యాషియర్ రవికుమార్ డబ్బు తీసుకున్నమాట వాస్తవమేనని, అతడిని సస్పెండ్ చేసి విచారణ జరుపుతున్నామన్నారు. పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. ఖాతాదారుల్లో ఆందోళన నకిలీ బంగారంతో రుణాల పేరిట క్యాషియర్ రవికుమార్ భారీ మొత్తం స్వాహా చేసిన విషయం తెలిసిన ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులో నగదు డిపాజిట్ చేసేందుకు, బంగారం దాచుకునేందుకు జంకుతున్నారు. ఇప్పటికే బ్యాంకులో దాచుకున్న బంగారం విడిపించుకోవాలని ఖాతాదారులు బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులో బంగారు తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవాలనుకున్నవారిని బ్యాంక్ అధికారులు వారిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బంగారంపై పొందిన రుణాన్ని తిరిగి చెల్లించడానికి వెళ్లినా వారు స్పందించడం లేదు. చదవండి: ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు! -
పొలంలో లంకెబిందెలు దొరికాయని, పక్క జిల్లాలు తిరుగుతూ..
సాక్షి,మదనపల్లె టౌన్(అన్నమయ్య) : బంగారమని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్న నిందితులను మంగళవారం మదనపల్లె టూటౌన్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ మురళీక్రిష్ణ, ఎస్ఐ చంద్రమోహన్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. వాల్మీకిపురం మండలం నకిరి మడుగు పంచాయతీ ముడోరపల్లె షికాపాళెంకు చెందిన బి.గోవిందు కుమారుడు బుక్కియార్ గిరి అలియాస్ గోవిందబాబు, అలియాస్ కోటేశ్వరరావు(23), పుంగనూరు మండలం పాళెంపల్లె శికారుపాళ్యంకు చెందిన షానోజి కుమారుడు ముడియార్ ముత్యాలప్ప(31), వైఎస్సార్ జిల్లా వీరబల్లి మండలం తాటిమాకులపల్లె షికారిపాళ్యంకు చెందిన విజయ్‌కుమార్ కుమారుడు రాణా విజయక్రిష్ణ(25) ఒక బృందంగా ఏర్పడ్డారు. వారు కొన్నేళ్లుగా వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలతోపాటు ఇంకా పలు చోట్ల తాము వ్యవసాయం చేస్తుండగా పొలంలో బంగారు పెద్ద ఎత్తున దొరికిందని, లంకబిందెలు ఇంట్లో దాచి ప్రభుత్వానికి తెలియకుండా పన్ను ఎగ్గొట్టి అమ్ముకోవాల్సి వస్తోందని అమాయకులను నమ్మించారు. పూసలను మొదట శాంపుల్‌గా బంగారును ఇచ్చి అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకుంటారు. మొదటగా కొద్దిపాటి బంగారాన్ని చూపి తరువాత వారికే నకిలీ బంగారాన్ని అప్పచెప్పి వారి వద్ద నుంచి నగదును తీసుకుని పరారు అవుతారు. ఈ క్రమంలో వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చెందిన ఓ వ్యక్తిని మదనపల్లెకి రప్పించి ఇక్కడ అతన్ని మోసగించి రూ.5.70 లక్షలు తీసుకుని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలించి పథకం ప్రకారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5.70 లక్షల నగదు, నకిలీ బంగారం పూసల దండలు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ వీరి పైన పలు చోట్ల పూసలు చూపి బంగారం అని నమ్మించి మోసాలకు పాల్పడిన కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు. చదవండి: మాజీ ప్రేయసి ఇంకొకరితో చనువుగా ఉందని.. -
నిండా ముంచిన అత్యాశ.. రూ. 20 లక్షలు హాంఫట్
చందుర్తి(వేములవాడ): అత్యాశకు పోయి నిండా మునిగారు. నకిలీ బంగారాన్ని రూ.20లక్షలకు అంటగట్టారు. విషయాన్ని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటకు చెందిన సుధీర్‌కు ఇదే గ్రా మంలో బెల్టుషాపు వద్ద అనంతపురం జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన నవీన్ రెండునెలల క్రితం పరిచయమయ్యాడు. కొద్దిరోజుల క్రితం సొంతూరుకు వెళ్లిన నవీన్ సుధీర్‌కు తరుచూ ఫోన్ చేస్తుండేవాడు. ఎప్పటిలాగే ఈనెల 16న సుధీర్‌కు ఫోన్‌చేసిన నవీన్ తన స్నేహితుల వద్ద కిలో బంగారు పూసలు ఉన్నాయని, వాటిని తక్కువ ధరకే విక్రయిస్తామని న మ్మబలికాడు. 18న అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి క్రాస్‌రోడ్డుకు రావాలని సూచించాడు. దీంతో సుధీర్ తన స్నేహితులైన ఆ నందం, చంద్రశేఖర్‌ను తీసుకుని వెళ్లారు. నవీన్ వ ద్దనున్న నాలుగు బంగారు పూసలిచ్చి పరీక్షించుకోవాలని సూచించగా.. మెలిమి బంగారమేనని నిర్ధారించుకున్నారు. మొత్తం బంగారం రూ.20లక్షలు అని రూ.15 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ నెల 21న గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద రూ.15లక్షలు ఇచ్చి పూసలు తీసుకున్నారు. కొంతదూరం వచ్చాక వాటిని క్షుణ్ణంగా పరీక్షించగా.. నకిలీవిగా గుర్తించారు. వెంటనే గోరంట్లకు చేరుకుని స్థానిక సీఐ జయనాయక్‌కు ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అతాశ్యకు పోయి మోసపోయామని భావించిన లింగంపేటకు చెందిన సదరు ముగ్గురు ఊరిలోకి రాలేక హైదరాబాద్‌లోనే ఉన్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
నకిలీ బంగారంతో లక్షల్లో బ్యాంకు రుణం తీసుకున్న మహిళ!
కంబాలచెరువు(తూర్పు గోదావరి): నకిలీ బంగారంతో బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న మహిళ, ఇద్దరు ఎప్రెంజర్లపై స్థానిక వన్ టౌన్, టు టౌన్ పోలీస్ స్టేషన్లలో శుక్రవారం కేసులు నమోదయ్యాయి. ఆయా బ్యాంకు శాఖల మేనేజర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. కొంతమూరుకు చెందిన శనివారపు అనుపమ స్థానిక సాయికృష్ణ థియేటర్ సమీపంలోని ఆర్యాపురం అర్బన్ బ్యాంకు తాడితోట శాఖలో దపధపాలుగా వన్‌గ్రామ్ గోల్డ్ తాకట్టు పెట్టి రూ.7.57 లక్షలు అప్పు తీసుకుంది. అలాగే అదే బ్యాంకుకు చెందిన దానవాయిపేట శాఖలోనూ ఈ ఏడాది ఆగష్టు 8న వన్ గ్రామ్ గోల్డ్ పెట్టి రూ.1.59 లక్షలు రుణం తీసుకుంది. కాగా.. బ్యాంకు ఎంప్రెజర్లతో కలసి అనుపమ నకిలీ బంగారం పెట్టి రుణం తీసుకుందంటూ ఆ బ్యాంకు శాఖల మేనేజర్లకు వాట్సాప్ సందేశాలు వచ్చాయి. దీంతో వారు వెంటనే అనుపమ తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసి పరీక్షించగా నకిలీదిగా తేలింది. దీంతో ఆ మేనేజర్లు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో మహిళ, ఎంప్రెజర్లతో పాటు బ్యాంకు సిబ్బంది చేతివాటం ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదిలా ఉండగా.. ఆ బ్యాంకులో సొమ్ములు లేవంటూ మాజీ చైర్మన్‌గా వ్యవహరించిన వ్యక్తి ఇటీవల ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి బాహాటంగా చెప్పిన విషయం విదితమే. -
రాజుల కాలంనాటి బంగారు పూసలని రూ.15 లక్షలు తీసుకున్నాడు.. తీరా చూస్తే
సాక్షి,పుట్టపర్తి: తక్కువ ధరకు మేలిమి బంగారం ఇస్తామంటూ నమ్మబలికి రూ.15 లక్షలతో ఉడాయించిన ఘటన బుక్కపట్నంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన మంగలి కుమార్‌కు కొంత కాలం క్రితం ఫోన్ ద్వారా కర్ణాటకకు చెందిన గణేష్ పరిచయమయ్యాడు. తాను జేసీబీ డ్రైవర్‌నని ఇటీవల కర్ణాటకలో పైప్‌లైన్ పనులు చేస్తుంటే లభ్యమైన రాజుల కాలం నాటి 3 కిలోల బంగారు పూసలను రూ.15 లక్షలకు ఇచ్చేస్తానని నమ్మబలికాడు. తక్కువ ధరకు మేలిమి బంగారం వస్తుందని కుమార్ ఆశపడ్డాడు. రూ.15 లక్షలు తీసుకుని పుట్టపర్తికి వస్తే తాను అక్కడకు వచ్చి బంగారు పూసలు ఇస్తానని చెప్పడంతో అలాగేనని సోమవారం సాయంత్రం కుమార్ పుట్టపర్తికి చేరుకున్నాడు. తర్వాత కొత్తచెరువులో తానున్నట్లు గణేష్ తెలపడంతో అక్కడకెళ్లాడు. అనంతరం బుక్కపట్నం ఆస్పత్రి వద్ద ఇద్దరూ కలిశారు. తన వద్ద ఉన్న కొన్ని బంగారు పూసలు చూపించడంతో వాటిని పరిశీలించి, మేలిమి బంగారంగా కుమార్ ధ్రువీకరించుకుని రూ.15 లక్షలు అప్పగించడంతో పూసల గుచ్ఛను చేతికి ఇచ్చి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత వాటిని మరోసారి పరిశీలించుకోగా నకిలివిగా తేలింది. బాధితుడి ఫిర్యాదు మేరకు బుక్కపట్నం, కొత్తచెరువు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: తుప్పల్లో యువతి చెయ్యి.. మిస్టరీని ఛేదించిన పోలీసులు -
నకిలీ బంగారంతో బ్యాంకుకు రూ.కోటి టోకరా..
సాక్షి, నస్పూర్(మంచిర్యాల): నస్పూర్ పట్టణంలోని ఎస్బీఐలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.కోటి టోకరా వేసిన ముఠా గుట్టును సీసీసీ పోలీసులు రట్టు చేశారు. గురువారం సీసీసీ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. సీసీసీ నస్పూర్‌కు చెందిన రంగు అరుణ్‌కుమార్ బ్యాంకులో 2014 నుంచి బంగారం లోన్ అప్రైజర్‌గా పని చేస్తున్నాడు. అప్పుల పాలు కావడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని తన స్నేహితుడు బ్రహ్మనందచారి సలహా తీసుకున్నాడు. ఇతడు గతంలో మంచిర్యాలలోని ఇండియన్ బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న కేసులో ఉన్నాడు. బ్రహ్మనందచారి సలహా మేరకు అరుణ్‌కుమార్ తన స్నేహితులైన బొమ్మ అన్వేష్, మంకెన లక్ష్మారెడ్డి, కొంగల లింగారెడ్డి, అమ్మ సంతోష్‌కుమార్, కాడే జీవన్‌కుమార్ పేరిట నకిలీ బంగారంతో రూ.1,01,36,551 రుణం తీసుకున్నాడు. బ్యాంకు మేనేజర్ నేహశర్మ ఫిర్యాదు మేరకు మంచిర్యాల రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో ఆరుగురిపై కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు అరుణ్‌కుమార్‌తోపాటు బొమ్మ అన్వేష్, కొంగల లింగారెడ్డి, కాడే జీవన్‌కుమార్‌లను అరెస్ట్ చేశారు. మరో అమ్మ సంతోష్‌కుమార్, మంకెన లక్ష్మారెడ్డిలు పరారీలో ఉన్నారు. సీఐ కుమార్‌స్వామి, ఎస్సై శ్రీనివాస్‌లను ఏసీపీ అభినందించారు. చదవండి: పెళ్లై మూడువారాలు.. బాయ్‌ఫ్రెండ్ మెసెజేస్.. కట్ చేస్తే.. -
మహిళలే టార్గెట్ : కొత్త డిజైన్స్ అంటూ టోకరా
సాక్షి, గచ్చిబౌలి: చిరు వ్యాపారాలు చేసే మహిళలకు ఫైనాన్స్ ఇస్తానని... కొత్త డిజైన్లలో నగలు చేయిస్తానని మాయమాటలు చెప్పి బంగారు ఆభరణాలతో ఉడాయిస్తున్న ఓ ఘరానా మోసగాడిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో గురువారం డీసీపీ వెంటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... • విశాఖపట్నం జిల్లా కేశవరం గ్రామానికి చెందిన మేడిశెట్టి చిట్టిబాబు అలియాస్ చిట్టి అలియాస్ అప్పారావు పదో తరగతి చదివి కెమికల్ ఫ్యాక్టరీలో కొద్ది రోజులు పని చేశాడు. • గ్రామాల్లోని మధ్య వయసు గల మహిళలకు మాయమాటలు చెప్పి బంగారు నగలతో ఉడాయించడంతో అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపగా, 21 ఆగస్టు 2020న బెయిల్‌పై బయటకు వచ్చాడు. • తర్వాత బాధితులు తన ఇంటికి వచ్చి గొడవ చేయడంతో హైదరాబాద్‌కు వచ్చి రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో ఉంటున్నాడు. • నార్సింగి పీఎస్ పరిధిలోని కాళీ మందిర్ సమీపంలో కల్లు విక్రయించే ఓ మహిళ ఒంటిపై ఉన్న నగలపై కన్నేసిన ఇతగాడు ఫైనాన్స్ ఇస్తానని చెప్పాడు. తన ఒంటిపై ఉన్న రోల్డ్ గోల్డ్ నగలను చూపించి ఇదే డిజైన్‌తో నగలు చేయిస్తానని నమ్మబలికాడు. • ఆమె నుంచి నాలుగు తులాల బంగారు ఆభరణాలు తీసుకొని ఉడాయించాడు. • మరుసటి రోజు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో బాధితురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. • ఇదే తరహాలో మంచిరేవులలో పూలు అమ్ముకొనే ఓ మహిళను బురిడీ కొట్టించి 2 తులాల ఆభరణాలతో ఉడాయించాడు. • రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పీఎస్‌ల పరిధిల్లోనూ ముగ్గురు మహిళలను మోసగించాడు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసుల నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 10.4 తులాల ఆభరణాలు, సెల్ ఫోన్, గ్లామర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. 14 కేసుల్లో నిందితుడు: తెలంగాణాలోని నార్సింగిలో 2, రాజేంద్రనగర్‌లో 2, లంగర్‌హౌస్‌లో ఒక కేసులో మేడిశెట్టి చిట్టిబాబు నిందితుడుగా కాగా, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పోలీసుస్టేషన్లలో 9 కేసులు ఉన్నాయి. నిందితునిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. కేసును ఛేదించిన సీసీఎస్, నార్సింగి పోలీసులలకు రివార్డు అందజేశారు. విలేకరుల సమావేశంలో ఎస్టీఎప్ ఏసీపీ శ్యాంబాబు, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, సీసీఎస్ సీఐ వాసు, నార్సిగి సీఐ గంగాధర్, డీఐ బాలరాజు పాల్గొన్నారు. -
బాధితుడే నిందితుడిగా మారిన వైనం
సాక్షి, గచ్చిబౌలి: ఇంట్లో ఉన్న బంగారు నిధిని తంత్ర పూజలతో బయటకు తీస్తామని నమ్మించి, ఇత్తడిని పుత్తడిగా చూపించి అందినకాడికి దండుకున్న ఓ ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. కాగా, ఈ ముఠా చేతిలో మోసపోయిన ఓ బాధితుడు కూడా ఇత్తడిని పుత్తడిగా నమ్మించి మరో వ్యక్తిని దగా చేసి పోలీసులకు చిక్కాడు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో గురువారం కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం... ⇔ ఓల్డ్ మల్లేపల్లి నివాసి సయ్యద్ దస్తగిరి అహ్మద్(65) ఆర్ఎంపీ డాక్టర్. తన క్లినిక్‌కు వచ్చేవారి తో తనకు బ్లాక్ మ్యాజిక్ పవర్ ఉందని నమ్మబలికి 15 ఏళ్లుగా మోసాలకు పాల్పడుతున్నాడు. ⇔ మిరాలం మండికి చెందిన మిర్జా అబ్బాస్ అలీ సాజద్ రియల్టర్. తమ ఇంట్లో నిధి ఉందని, బయటకు తీయకపోతే ఇంట్లోవారు చనిపోతారని రోజూ తన తల్లి కల కంటోందని సాజద్ ఛత్తాబజార్‌కు చెందిన తన స్నేహితుడు అలీ అక్బర్ తయాబికి చెప్పాడు. ⇔ అతను చార్మినార్ ఇరాన్‌గల్లీకి చెందిన షేక్ హఫీజ్, యాకుత్‌పురాకు చెందిన అబ్దుల్ ఫయీమ్‌ను పరిచయం చేయగా, వారు ఓల్డ్ మల్లోపల్లిలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దస్తగిరి వద్దకు తీసుకెళ్లారు. ⇔ సాజద్ ఇంటికి వెళ్లిన డాక్టర్ దస్తగిరి మీ తల్లికి వచ్చే కల నిజమేనని, శాంతిపూజలు చేస్తే నిధి బయటకు వస్తుందని, పూజకు రూ. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పాడు. ⇔ ఇంట్లో ఐదుచోట్ల గుంతలు తవ్వించాడు. ఇంటి యజమాని సాజద్ కళ్లుగప్పి బంగారు పూత పూసిన ఇత్తడి బిస్కెట్లను గంతుల్లో వేసి మట్టితో కప్పేశాడు. ⇔ ఆ తర్వాత ఒక రోజు హఫీజ్, అక్బర్ తయాబ్, అబ్దుల్ ఫయూమ్‌లతో కలిసి సయ్యద్ దస్తగిరి పూజ చేసేందుకు సాజద్ ఇంటికి వెళ్లాడు. ⇔ పూజ చేసిన అనంతరం ముగ్గురూ గుంతలో వెతికినట్టు నటించి బంగారం కనిపించిందని చెప్పారు. తాము చెప్పినప్పుడే మూట విప్పాలని, లేకపోతే బంగారం మీకు దక్కదని చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు. ⇔ కొద్ది రోజుల తర్వాత గుంతలో చూడగా బంగారు బిస్కెట్లు కనిపించాయి. వాటిని పరిశీలించగా నకిలీవి అని తేలింది. దీంతో మోసపోయానని గ్రహించిన సాజద్ ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. మోసపోయి... ⇔ రూ. 3 లక్షలు ఖర్చు చేసి మోసపోయానని గ్రహించిన సాజద్ తన స్నేహితుడు అలీ అక్బర్ తయాబితో కలిసి తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని చెప్పి ఇత్తడి బిస్కెట్లను అమ్మాలని నిర్ణయించాడు. ⇔ తమ వద్ద ఆరు కిలోల బంగారం ఉందని, రూ. 40 వేలకే తులం ఇచ్చేస్తామని ఓ వ్యక్తికి చెప్పారు. ⇔ అతడి వద్ద రూ. 50 వేలు అడ్వాన్స్‌గా తీసుకొన్న వీరు కావాలంటే పరీక్షించుకోవాలని 200 గ్రాములున్న ఇత్తడి బిస్కెట్‌ను ఇచ్చారు. అతడు దానిని పరీక్ష చేయించుకోగా, ఇత్తడిదని తేలింది. ⇔ దీంతో బాధితుడు రాజేంద్రనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. రాజేంద్రనగర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. ఈకేసులో నిందితుడు సాజద్ కూడా బాధితుడేని తేలింది. ⇔ సాజద్‌తో పాటు సయ్యద్ దస్తగిరి అహ్మద్, షేక్ హఫీజ్, అలీ అక్బర్ తయాబిలను అరెస్టు చేయగా అబ్దుల్ ఫయీమ్ పరారీలో ఉన్నాడు. ⇔ నిందితుల నుంచి 5.85 కిలోల బంగారు పూత పూసిన 11 ఇత్తడి బస్కెట్లు, 8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ⇔ తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెబితే నమ్మవద్దని ప్రజలకు ఈ సందర్భంగా కమిషనర్ సజ్జనార్ సూచించారు. సమావేశంలో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సందీప్, ఏసీపీ సంజీవరావు, సీఐ కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహా నగరంలో మాయగాళ్లు!
పీఎంపాలెం(భీమిలి): మహా నగరంలోకి మాయగాళ్లు ప్రవేశించారు. అత్యాశకు పోయేవారిని లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్నారు. చౌకగా బంగారం విక్రయిస్తామని నమ్మించి సుమారు రూ.20 లక్షలు దోచుకుపోయిన సంఘటన సోమవారం పీఎం పాలెం పరిసరాల్లో తీవ్ర అలజడి సృష్టించింది. స్థానిక నేర విభాగం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి మరో ముగ్గురుతో కలసి సోమవారం మధ్యాహ్నం పీఎంపాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలో చౌకగా బంగారం విక్రయిస్తామని చంద్రశేఖర్ అనే వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి వచ్చాడు. కోటేశ్వరరావు తన వెంట రూ. 20లక్షలు కూడా తీసుకొచ్చాడు. అప్పటికే అక్కడ ఇరానీ గ్యాంగ్ సభ్యులు మాటు వేసి ఉన్నారు. చంద్రశేఖర్ కూడా ఆ గ్యాంగ్ సభ్యుడే. పోలీసులు ఆ ప్రాంతానికి వస్తున్నట్టుగా అలజడి సృష్టించి కోటేశ్వరరావు చేతిలోని రూ.20 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను లాక్కుని అక్కడి నుంచి వారు వచ్చిన వాహనంలో పరారయ్యారు. వారి వెంట చంద్రశేఖర్ కూడా ఉడాయించాడు. అయితే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం ఈ ప్రాంతంలో స్థలం కొనడానికి నగదు తీసుకొచ్చామని, తమను రప్పించిన రియల్ ఎస్టేట్ బ్రోకర్, మరికొంత మంది బలవంతంగా డబ్బు ఉన్న బ్యాగును లాక్కుని పరారయ్యరని బాధితుడు పేర్కొన్నా డు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక సీఐ రామచంద్రరావు తెలిపారు. అయితే ఫిర్యాదులో అనేక అనుమానాలున్నాయని, వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
కర్ణాటక గ్యాంగ్ ఘరానా మోసం
-
అత్యాశకు పోతే 5 కిలోల నకిలీ బంగారం!!
సాక్షి, అనంతపురం: బంగారు నాణేలు అమ్ముతామని చెప్పి కర్ణాటకకు చెందిన ఓ గ్యాంగ్ ఘరానా మోసానికి పాల్పడింది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఓ వ్యక్తి నుంచి 25 లక్షల నగదు తీసుకుని ఉడాయించింది. బత్తలపల్లి మండలం కట్టకిందపల్లి వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన బాల చెన్నారెడ్డికి బంగారు నాణేలు ఇస్తామంటూ కర్ణాటక దుండగులు ఫోన్ చేశారు. బళ్లారిలో ఇంటి పునాదులు తీస్తుండగా భారీగా బంగారు నాణేలు దొరికాయని నమ్మించారు. అతను వారి మాటలు నమ్మి అత్యాశకు పోయాడు. దుండగులు 5 కిలోల నకిలీ బంగారు నాణేలు ఇవ్వడంతో బాల చెన్నారెడ్డి వారికి రూ. 25 లక్షల నగదు ముట్టజెప్పాడు. దుండగులు అక్కడి నుంచి జారుకున్న అనంతరం బాలచెన్నారెడ్డి తాను మోసపోయానని గ్రహించాడు. బత్తలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: నేను బతికే ఉన్నా సారూ!) -
ఆశకు పోతే.. అసలుకే మోసం..!
పలమనేరు : జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో నకిలీ బంగారు ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న పలమనేరు పోలీసు సబ్ డవిజన్‌లో ఇలాంటి ముఠాల జోరు ఎక్కువైంది. అమాయకులను టార్గెట్ చేసి అసలు బంగారు నాణేలు చూపిస్తూ నకిలీవి అంటగట్టి మోసాలకు పాల్పడుతున్నారు. వీరి కారణంగా ఎందరో అమాయకులు లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఈ ముఠా మాటలు నమ్మి ఎలాగైనా కోట్లు సంపాదించాలనే ఆశతో ఈ ప్రాంతంలో పలువురు ఇదే వృత్తిగా చేసుకుంటున్నారు. తొలుత ఈ ముఠా వద్ద మోసపోయన బాధితులు సైతం ఇదే రొచ్చులోకి దిగి పలువురిని మోసగిస్తున్నట్లు సమాచారం. గత నాలుగైదు ఏళ్లుగా ఇలాంటి పలు ముఠాలను పలమనేరు, గంగవరం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఓ ముఠా మాటలు విని సత్యవేడుకు చెందిన బాధితుడు రూ.5 లక్షలను మోసపోయి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ముఠానుపోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల వేషాల్లో దాడులు.. నకిలీ బంగారు నాణేల మోసాలకు పాల్పడే స్థానికులు కొందరు, సరిహద్దు కర్ణాటక గ్రామాలకు చెందిన వారితో కలిసి ఖరీదైన కార్లను అద్దెకు తీసుకొని మొత్తం వ్యవహారమంతా రహస్య ప్రదేశాల్లోనే నిర్వహిస్తుంటారు. రాత్రి సమయాల్లో ఓ ప్రదేశానికి డబ్బుతో రమ్మని నకిలి నాణేలను ఇవ్వడం లేదా వారి మనుషులే పోలీసుల వేషాల్లో స్పాట్‌కు వచ్చి దాడులు చేస్తారు. క్రిష్ణగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారిపై గతంలో వీకోట వద్ద దాడి జరిగింది. మోసాలు పలు రకాలు.. తమ వద్ద అద్భుత శక్తి కలిగిన రాగి చెంబు ఉందని, బంగారు నాణేలు, పాత్ర, వజ్రాలు, విగ్రహాలు ఉన్నాయంటూ పలు ముఠాలు అమాయకులకు కుచ్చుటోపీ పెడుతున్నాయి. దీనికి తోడు ఆర్పీ(రైస్ పుల్లింగ్), సీఆర్పీ(కాపర్ రైస్ పుల్లర్), సీఐపీ (కాపర్ ఇరిడియమ్ రైస్ పుల్లర్) పేరిట మరికొన్ని గ్యాంగ్‌లు మోసాలకు పాల్పడుతున్నాయి. సంజీవిపుల్ల గ్యాంగ్, అక్షయపాత్ర, పూడుపాముల ముఠా, నక్షత్ర తాబేళ్ల ముఠాలు.. ఇలా ఎన్నెన్ని మోసాలో!. ఐదేళ్లలో పదికి పైగా సంఘటనలు.. పైన చెప్పిన మోసాలకు సంబంధించి ఐదేళ్లలో పదికి పైగా ఘటనలు చోటుచేసుకున్నాయి. బా ధితులు రూ.మూడు కోట్లకు పైగా మోసపోయారు. ఈ గ్యాంగ్‌లలో బాగా చదువుకున్న వ్యక్తులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, కర్ణాటక పోలీసులు ఉండడం కొసమెరుపు. స్థా నికంగా ఇలాంటి మోసాలపై నమ్మబలికే వ్యక్తులు వందమంది దాకా ఉంటే.. వారి ఏజెంట్లు మరో వందమంది దాకా ఉన్నట్టు తెలుస్తోంది. నకిలీ బంగారునాణేల కేసులో నలుగురి అరెస్టు గంగవరం : నకిలీ బంగారు నాణేలతో మోసాలకు పాల్పడిన చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ రామకృష్ణాచారి బుధవారం తెలిపారు. ఆయన విలేకర్లకు తెలిపిన వివరాల మేరకు.. సత్యవేడు మండలం మాదనపాళెం గ్రామానికి చెందిన సుబ్రమణ్యం తన అన్నకు పక్షవాతం కారణంగా 15రోజుల క్రితం బైరెడ్డిపల్లి మండలం విరుపాక్షిపురానికి తీసుకొచ్చాడు. అక్కడ తనకు మునివెంకటప్ప అనే వ్యక్తి పరిచయమై తనకు తెలిసిన వారి వద్ద బంగారు నాణేలు ఉన్నాయని, ఇద్దరం కొనుక్కుని వాటిని అధిక సొమ్ముకు విక్రయిద్దామని చెప్పి నమ్మబలికాడు. ఈమేరకు బాధితుని నుంచి మూడు దఫాల్లో రూ.5లక్షలు తీసుకుని నకిలీ నాణేలను ఇచ్చారు. అవి నకిలీవని గ్రహించిన బాధితుడు వెంటనే బైరెడ్డిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను బైరెడ్డిపల్లి మండలం చెల్లారిగుంట క్రాస్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న రూ.4లక్షల నగదు, నకిలీ బంగారునాణేలు, ఒక ఇత్తడి చెంబు, రెండు బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిల్లో తమిళనాడు రాష్ట్రం బాగళూరు గ్రామానికి చెందిన మునివెంకటప్ప, కర్ణాటక రాష్ట్రం చిక్కనపల్లికి చెందిన నారాయణప్ప, ఇదే రాష్ట్రం కేపీ కొత్తూరుకు చెందిన చిన్నప్పయ్య, ముళబాగిల్కి చెందిన రాప్సాబ్ ఉన్నారు. బైరెడ్డిపల్లి ఎస్ఐ మునస్వామి తన సిబ్బందితో కలిసి కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. గంగవరం ఎస్ఐ సుధాకర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బంగారు నాణేల పేరిట ఘరానా మోసాలు.. పురాతన కాలం నాటి అసలు సిసలైన బంగారు నాణేలు తమకు భూమిలో లభించాయని నమ్మకంగా చెబుతారు. వీటిని బయట అమ్మితే తమకు సమస్యలుంటాయి కనుక రహస్యంగా తక్కువ ధరకే విక్రయిస్తున్నామంటూ కథలు చెబుతారు. ఆశపడిన వ్యక్తి నుంచి కొంత అడ్వాన్స్ తీసుకుని.. అసలు బంగారు కాయిన్ ఒకదాన్ని ఇస్తారు. దాన్ని చెక్ చేసుకున్నాక డీల్ కుదుర్చుకుంటారు. ఆపై మొత్తం డబ్బు తీసుకుని తాము చెప్పిన రహస్య ప్రదేశానికి ఒంటరిగా రావాలని చెప్పి, నకిలీ నాణేలను అంటగట్టి పంపుతారు. ఇదే తరహా మోసాలు ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. తాజాగా బైరెడ్డిపల్లి పోలీసులు పట్టుకున్న ముఠా సైతం ఇదే రీతిలో మోసం చేసింది. అత్యాశకు పోవద్దు.. ఎవరో చెప్పే మాయమాటలు వింటే మోసపోవడం ఖాయం. అయినా బంగారాన్ని తక్కువ ధరకే ఇస్తామంటే ఎలా నమ్ముతాం. అత్యాశకు పోయేవాళ్లకు కష్టాలు తప్పవని తెలిసినా మళ్లీ ఎలా నమ్ముతారో అర్థం కాదు. ఏమారి డబ్బులిచ్చేసి బాధపడితే ప్రయోజనం ఉండదు.– రామకృష్ణాచారి, సీఐ, గంగవరం సర్కిల్ -
బ్యాంకు అప్రయిజరే అసలు దొంగ
సాక్షి, చంద్రగిరి(చిత్తూరు) : బ్యాంకు అప్రయిజర్ నకిలీ నగలు తనఖా పెట్టి రూ.18 లక్షలు కాజేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అప్రయిజర్‌తో పాటు అతనికి సహకరించిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ రామచంద్రారెడ్డి శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. తిరుపతి రూరల్ మండలం కాలూరుకు చెందిన శివకుమార్ ఆచారి ఆరేళ్లుగా చంద్రగిరిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఏడీబీ)లో బంగారు నగల రుణాలకు సంబంధించి అప్రయిజర్‌గా పనిచేస్తున్నాడు. అతను బ్యాంకు అధికారులతో చాలా నమ్మకంగా ఉండేవాడు. దీంతో అధికారులు అతనితో అంతే చనువుగా ఉండేవారు. ఈ క్రమంలో శివకుమార్ ఆచారి చేసిన అప్పులు తీర్చలేక బ్యాంకును మోసం చేయాలని భావించాడు. బ్యాంకులో ఖాతాలు ఉన్న తన బంధుమిత్రులతో కలిసి పథకం రచించాడు. ఖాతాదారులు తనఖా పెట్టే నగలను తనే తనిఖీ చేస్తాడు కాబట్టి బంధువులతో నకిలీ నగలను ఇచ్చి బ్యాంకుకు పంపించాడు. ఒకేసారి అందరూ వస్తే అనుమానం వస్తుందని తెలుసుకుని, కొన్ని రోజులకు ఒక్కొక్కరిని పంపిస్తూ సుమారు వెయ్యి గ్రాముల నకిలీ బంగారాన్ని తనఖా పెట్టించి రూ.18 లక్షలను రుణంగా పొందాడు. కొద్ది రోజులుగా తనిఖీ చేసిన బ్యాంకు మేనేజర్ నారాయణ నకిలీ బంగారాన్ని గుర్తించాడు. నెల రోజుల క్రితం శివకుమార్ ఆచారి చేసిన మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ రామచంద్రారెడ్డి విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో శివకుమార్ ఆచారికి సహకారం అందించిన సతీష్, మంజునాథ ఆచారి, శివప్రసాద్, సరస్వతమ్మ, నాగరాజు ఆచారి, దేవరాజును శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీఐ రామచంద్రారెడ్డి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే శివకుమార్ ఆచారి ఈ మోసానికి పాల్పడినట్లు తెలిపారు. అనంతరం నిందితులను తిరుపతి కోర్టుకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చిన్నరెడ్డెప్ప పాల్గొన్నారు. -
నకిలీ బంగారం కలకలం
సాక్షి, సిరిసిల్ల: నకిలీ బంగారంతో జిల్లావాసులు మోసపోయిన సంఘటన వెలుగుచూసింది. రెండున్నరఏళ్లక్రితం ఇలాంటి ఉదాంతం ఒకటిచోటుచేసుకోగా పోలీసులు నిఘా వేసి నిందితులను పట్టుకున్నారు. తాజాగా బంగారం ఆశచూపి రూ.10 లక్షలు టోపీ పెట్టిన ఘటన జరిగింది. బాధితులందూ రాజన్న సిరిసిల్ల జిల్లావాసులుకావడం ఒకే కుటుంబానికి చెందిన వారిగా చర్చ జరుగుతోంది. కర్ణాటకు చెందిన కొందరు జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో వివిధ వస్తువుల అమ్మకానికి వచ్చి సామాన్యులను బంగారం పేరిట మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలంలో తులం బంగారం రూ.20 వేలకు ఇస్తామని నమ్మించినట్లు సమాచారం. దాదాపు రూ.40 వేలున్న బంగారం సగం రేటుకు వస్తుందనే ఆశతో జిల్లాలోని పలువురు దాదాపు రూ.6 నుంచి రూ.10 లక్షలు ఇక్కడ నుంచి కర్ణాటకు వెళ్లి బంగారాన్ని కొన్నట్లు ప్రచారం సాగుతోంది. బంగారం చేతులు మారే క్రమంలో నకిలీ బంగారం అమ్మే వారు పోలీసులు వస్తున్నారని అక్కడి నుంచి పారిపోగా, కొన్ని నాణేలు తీసుకున్న జిల్లావాసులు వెనుదిరిగినట్లు తెలిసింది. ఇక్కడికి వచ్చాక పరిక్షిస్తే నకిలీ అని తేలడంతో బంగారం కొనడానికి బాధ్యుడైన వ్యక్తిని డబ్బు చెల్లించాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదులందినట్లు తెలిసింది. అత్యాశకుపోయిన జిల్లావాసులు మోసపోయిన విషయం తెలుసుకొని లబోదిబోమంటున్నారు. బంగారం పేరిట మోసం జరిగిందని ప్రచారం తీవ్రంగా జరుగుతోంది. సూత్రధారిది ఇక్కడే.. బంగారం కోసం కొందరు కర్ణాటక వెళ్లడం వరకు వాస్తవమే. కానీ ఈ నాటకీయ విధానానికి సూత్రధారి బాధితులకు దగ్గరివాడే. కర్ణాటకలో ఒక బినామీని సృష్టించి అమాయకుల నుంచి డబ్బు దండుకోవడానికి చేసిన ప్రయత్నంగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బాధితులు న్యాయంకోసం వచ్చారు. వారికి తగిన సాయం చేసి చట్టపరిధిలో ముందుకెళ్తాం. – రాంచంద్రం, ఎస్సై, వీర్నపల్లి మండలం -
నకిలీ బంగారం ఉచ్చువేసి.. ఆపై చిత్తు
సాక్షి, నెల్లూరు: మాటలునేర్చిన మాయగాళ్లు వారు. అమాయకంగా కన్పించేలా నటిస్తారు. మాటల గారడితో దగ్గరవుతారు. అడవిలో పట్టే కముజు పిట్టలను విక్రయిస్తుంటారు. రోజుకోసారి వచ్చి మంచి అడవి కముజు పిట్ట ఉచ్చులో పడింది ఆ మాంసం తినండి సారూ అంటూ చెబుతారు. ఎదుటి మనిషి మాటలను బట్టి వారిలో అత్యాశ ఉందని గ్రహిస్తారు. వారి దగ్గరవుతున్నట్లు ప్రేమ ఒలకబోస్తూ వారి ఫోన్ నంబర్లు తీసుకుంటారు. వారం తర్వాత సారూ.. రాజుల కాలం నాటి బంగారు నగలు తవ్వకాల్లో దొరికాయని, మాకు ఎలా విక్రయించాలో తెలియదని? అవి సగం ధరకే అమ్మిపెట్టమని మొదట కొంత బంగారం నగలు ఇచ్చి నమ్మిస్తారు. వారి మాటలు నమ్మారో అంతే ఫేక్బంగారం అంటగట్టి రూ.లక్షల్లో దోచుకుంటారు. ఇలాంటి అంతర్జిల్లా కేటుగాళ్లు ప్రస్తుతం నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తిరుగుతున్నారు. వారి మాయమాటలు నమ్మి లక్షలు పోగొట్టుకున్న సంఘటనలు ఒక నెలలోనే రెండు వెలుగులోకి వచ్చాయి. మోసం చేసేది ఇలా.. అడవిలో తిరిగే కముజు పిట్టలను పట్టి విక్రయించే ముఠా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తిరుగుతోంది. కొందరు యువకులు కముజు పిట్టలను పట్టి విక్రయిస్తామంటూ ఊరూర తిరుగుతూ వ్యవసాయం చేసుకునే కొందరిని టార్గెట్ చేస్తున్నారు. రోజు వారీగా పిట్టలను పట్టి రైతులకివ్వడం వారిని మంచి చేసుకుంటారు. అలా కొందరు అమాయక వ్యక్తులతో మాటలు కలిపి వారితో స్నేహంగా ఉంటారు. స్నేహం ముసుగులో వారి ఫోన్ నంబర్లు సేకరిస్తారు. రోజువారీగా కముజుపిట్టలను పట్టి పిట్ట మాంసం మంచిదన్న తినండి అంటూ వారిపై ప్రేమ ఒలకపోస్తారు. అలా నమ్మించే ఆ ముఠా సభ్యులు వారం కన్పించకుండాపోయి ఫోన్లోనే టచ్‌లో ఉంటారు. ఆపై మెల్లిగా పక్కా ప్లాన్‌తో ఫోన్‌చేసి కర్ణాటక ప్రాంతంలోని మైసూర్ ఏరియాలో మా స్నేహితుడు జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని చెబుతారు. పురాతన భవనం తవ్వుతుంటే రాజుల కాలం నాటి బంగారు ఆభరణాలు దొరికాయని నమ్మబలుకుతారు. కానీ ఆ బంగారం విక్రయించాలంటే మాకు ఎవరూ తెలియదని? వాటిని విక్రయించిపెడితే అందులో కొంత కమిషన్ ఇస్తామంటూ చెబుతారు. ముందుగా బంగారు ఆభరణాలు ఉన్నాయని, వచ్చి పరిశీలించుకోమని నమ్మిస్తారు. వారి మాటలను నమ్మిన వెళ్లిన వారికి ఫేక్ బంగారం నగలు చూపించి అందులో నాలుగుచోట్ల స్వచ్ఛ బంగారం పూసలు పెట్టి వారి ముందే ఆ పూసలు కట్‌చేసి పరిశీలించుకోమని నమ్మబలుకుతారు. ఆ బంగారు పూసలు తీసుకెళ్లి షాపులో చూపిస్తే మేలిమి బంగారమేనని తేలుతుంది. అంతే సగం ధరకే మేలిమి బంగారు ఆభరణాలు వస్తాయని నమ్మి కేటుగాళ్లకు డబ్బు కట్టి తీసుకుంటారు. ఆపై ఆ ముఠా సభ్యుల ఫోన్ నంబర్ మూగబోతుంది. నగలు ఇంటికి తీసుకెళ్లి మళ్లీ పరిశీలించుకుంటే అది ఫేక్ బంగారం తెలిసిపోయి బాధితులు లబోదిబోమంటున్నారు. నెలలో రెండు సంఘటనలు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను టార్గెట్ చేసిన ఆ ముఠా సభ్యులు ఒక నెల వ్యవధిలోనే రెండు జిల్లాలో బురిడీ కొట్టించి రూ.లక్షలు దోచుకున్నారు. గత నెలలో సంగం మండల కేంద్రంలో ఇదే తరహాలో నకిలీ బంగారం అంటగట్టి రూ.లక్షలు కొట్టేసిన ఇద్దరు సభ్యులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. సంగంలో కేబుల్ యజమానిని ఇదే తరహాలో బురిడీ కొట్టించి మోసం చేసి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన సింగరాయకొండ వాసులకు కూడా మరో ముగ్గురు సభ్యులు బురిడీకొట్టి నకిలీ బంగారం అంటగట్టి దాదాపు రూ.18 లక్షల నగదుతో ఉడాయించారు. అయితే నకిలీ బంగారం లావాదేవీలు కావలి కేంద్రంగా జరగడంతో బాధితులు కావలి పోలీసులను ఆశ్రయించారు. రాయచోటి వాసులుగా గుర్తింపు నకిలీ బంగారం ఉచ్చువేసి సొమ్ము చేసుకునే ముఠా సభ్యులు రాయచోటి ప్రాంత వాసులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ ముఠా విడిపోయి జిల్లాలవారీగా తిరుగుతూ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. వారి నకిలీ బంగారం ఉచ్చులో చిక్కుకున్న చాలామంది బయటకు పొక్కితే పరువుపోతుందని చెప్పుకోలేక పోతున్నారు. తాజాగా ఈ రెండు సంఘటనలతో పోలీసులు ఇలాంటి వారి పట్ల జాగ్రతగా ఉండాలని సూచిస్తున్నారు. -
నకిలీ బంగారంతో బురిడీ
సాక్షి, పూసపాటిరేగ (నెల్లిమర్ల): నకిలీ బంగారు ఆభరణాలు కుదువపెట్టి బ్యాంకుకు బురిడీ కొట్టించిన సంఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. దీనికి సంబంధించి సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. పూసపాటిరేగ మండలం కోనాడ జంక్షన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో నకిలీ బంగారం కుదువపెట్టి లక్షలాది రూపాయలు కాజేసినట్లు తెలిసింది. బ్యాంకు అప్రైజర్ ప్రోత్సాహంతోనే ఈ విధంగా పలువురు బ్యాంకును మోసగించినట్లు సమాచారం. ఓ ఖాతాదారుడు కుదువపెట్టిన నగలను రెన్యువల్ చేయించుకునేందుకు రమ్మని కబురంపగా ఆయననుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు వస్తువులను పరిశీలించడంతో అవి నకిలీవిగా తేలింది. దీనిపై రెండురోజులుగా బ్యాంకులో ఏరియా మేనేజర్ సి. శ్రీనివాసరావు సమక్షంలో నలుగురు బంగారం నాణ్యత చూసే వ్యక్తులతో పాటు, పలువురు ఆ శాఖ ఉన్నతాధికారులు బ్యాంకులో తనిఖీలు చేపడుతున్నారు. మత్స్యకార గ్రామాలైన కోనాడ, తిప్పలవలసకు చెందిన వ్యక్తులు అత్యధికంగా బ్యాంకులో నకిలీ వస్తువులతో రుణాలు పొందినట్లు వెల్లడైంది. బంగారు నాణ్యత పరిశీలించిన వ్యక్తి కోనాడ వాసి కావడంతో ఆయనతో పరిచయం ఉన్న పలువురు వ్యక్తులకు నకిలీ బంగారు నగలు ఇచ్చి బ్యాంకులో రుణాలు తీసుకోవాలని ప్రోత్సహించి, వారి పేరున తానే నిధులు కాజేశాడన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బ్యాంకు నుంచి రూ. 17 కోట్ల వరకు పలువురు ఖాతాదారులు బంగారు ఆభరణాలపై రుణాలు పొందారు. అందులో ఎంతమంది నకిలీ ఆభరణాలు ఇచ్చారనేది తేలాల్సి ఉంది. బ్యాంకులో బంగారు రుణాలు తీసుకున్న ఖాతాదారులను పిలిపించి వారి సమక్షంలోనే బంగారు నాణ్యత పరీక్షలు చేస్తున్నారు. దీనిపై పూర్తిగా పరిశీలన చేసిన తర్వాతే వాస్తవాలు బయటకు రాగలవని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీనిపై బ్యాంకు ఏరియా మేనేజర్ సి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నకిలీ బంగారు నగలతో రుణాలు పొందారనే సమాచారంతో తనిఖీలు చేస్తున్నాం. కోనాడకు చెందిన వనం వెంకటప్పడు అనే వ్యక్తి గోల్డ్‌లోన్ రెన్యువల్‌కు ముఖం చాటేయడంతో అనుమానం వచ్చి కుదువపెట్టిన వస్తువులను పరిశీలించడంతో నకిలీ వస్తువుగా తేలిందని తెలిపారు. దీనిపై పూరిస్థాయిలో విచారణ చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
మా బంగారాన్ని తిరిగి ఇచ్చేయండి!
సాక్షి, విజయనగరం : జిల్లాలోని పూసపాటిరేగ మండలం కొప్పెర్ల బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గందరగోళం నెలకొంది. ఖాతాదారులు నకిలీ బంగారం పెట్టి రుణాలు తీసుకున్నారంటూ వదంతులు రావడంతో దుమారం చెలరేగింది. తాకట్టు పెట్టిన బంగారాన్ని ఒసారి తనిఖీ చేసుకోవాలంటూ ఖాతాదారులకు బ్యాంక్ అధికారులు నోటిసులు పంపించారు. దీంతో బ్యాంకు ఎదుట ఖాతాదారులు బారులు తీరారు. బంగారాన్ని మార్చేసి నకిలీ బంగారం పెట్టారేమోనని బ్యాంక్ యాజమాన్యంపై ఖాతాదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బంగారం తమకు ఇచ్చేస్తే విడుపించుకుపోతామని బ్యాంకు ఎదుట క్యూ కడుతున్నారు. -
నకిలీ బంగారంతో బ్యాంక్‌కు టోపీ
సీతమ్మధార (విశాఖ ఉత్తర): సీతంపేట ఇండియన్ బ్యాంక్‌లో బంగారు రుణాల పేరిట వెలుగు చూసిన మోసంపై ఆ బ్యాంకు అధికారులు స్పందించారు. తీవ్ర చర్చల తర్వాత శనివారం రాత్రి బ్యాంకు బ్రాంచి మేనేజర్ సంతోష్‌కుమార్, అధికారులు ద్వారకనగర్ సీఐ వై.మురళీరావుకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ నిర్వహించారు. పోలీసులు, బ్యాంకు అధికారులు చెప్పిన వివరాలు.. తీసుకున్న రుణం కన్నా అదనపు సొమ్ము చెల్లించాలని ఇండియన్ బ్యాంక్ సీతంపేట శాఖ నోటీసులు పంపడంతో వ్యవహారం బయటపడింది. బ్యాంకు అధికారులు నలుగురు ఖాతాదారులకు బ్యాంకు నుంచి తీసుకున్న బంగారు రుణాలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఖాతాదారులు లబోదిబో మంటూ శుక్రవారం రాత్రి ద్వారకజోన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి వివరాలు రాబట్టారు. నోటీసులు అందుకున్న రమణ, పైడిరాజు, ఫణికుమార్‌లను పోలీసులు పలు ప్రశ్నలు వేశారు. తాము ఎలాంటి రుణాలు తీసుకోలేదని, కొంత సొమ్ము చెల్లించామని, నోటీసు ఇచ్చిన ప్రకారం అంతసొమ్ము చెల్లించలేమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాంచి అప్రైజర్ శ్రీనుబాబు గత నెల 29న చనిపోయారు. దీంతో కథ అడ్డం తిరిగింది. ఈ ఖాతాదారుల రుణాలను పెంచి, నకిలీ బంగారం సృష్టించి రూ.60 లక్షలు అప్రైజర్ శ్రీను బాబు స్వాహా చేసినట్టు సీఐ వై.మురళీరావు తెలిపారు. మొత్తం 90 అకౌంట్లు గుర్తించినట్టు ఆయన వివరించారు. నోటీసు పంపడంతో బయటకు.. ఈ నోటీసు పట్టుకొని బ్యాంకుకు వెళ్లగా పెద్దగా స్పందన లేకపోవడంతో బాధితులు ద్వారకనగర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో బ్యాంకులో రుణాలు సంగతి బయట పడింది. బ్యాంకు లావాదేవీలు చిన్న విషయం కాదని, ఎలాంటి సంతకాలు చేయలేదని, కాని రూ. పది లక్షలు చెల్లించాలని నోటీసులు ఇవ్వడం అన్యాయమని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. గోల్‌మాల్‌పై కేసు నమోదు.. ఇండియన్ బ్యాంకు సీతంపేట శాఖలో బంగారు ఆభరణాల రుణాలపై జరిగిన గోల్‌మాల్‌పై ద్వారకాజోన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. శనివారం రాత్రి బ్యాంకు అధికారులు మోసం జరిగిందని బ్యాంకు అధికారులు వచ్చి సీఐ వై.మురళీరావుకు ఫిర్యాదు చేశారు. అసలు బంగారం ముసుగులో నకిలీ బంగారాన్ని ఖాతాదారుల ప్రమేయం లేకుండా జత చేయడంతో సుమారు 90 మందికి పైగా సుమారు రూ.60 లక్షలు వరకు కుచ్చుటోపీ వేసిన సంగతి విషయం విదితమే. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ దాలిబాబు తెలిపారు. -
నకిలీ బంగారం విక్రయిస్తున్న ఇరువురి అరెస్ట్
ప్రకాశం, పామూరు: స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారాన్ని తక్కువధరకే ఇస్తామని నమ్మబలికి నకిలీ బంగారం విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 3 లక్షల నగదు, నకిలీ బంగారు కాసులు స్వాధీనం చేసుకున్నట్లు కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం నకిలీ బంగారం విక్రయాలకు సంబంధించిన కేసు వివరాలను విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరించారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం కలగల్లు గ్రామానికి చెందిన సాకే నవీన్‌కుమార్, కర్నాటక రాష్ట్రం బళ్లారి జిల్లా కూడ్లి తాలూకా బట్టనహళ్లి గ్రామానికి చెందిన సాతుపుడి అజ్జప్ప ఇరువురు బంధువులు. నవీన్ కుమార్ అనంతపురంలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతూ క్రమేణా చెడు అలవాట్లకు, జల్సాలకు బానిసై తనకు బంధువైన సాతుపుడి అజ్జప్పతో కలిసి అమాయకులను ఎంచుకుని వారిని మాయమాటలతో మోసంచేసి నగుదు కాజేయసాగాడు. నగదుతీసుకుని నకిలీ బంగారం అమ్ముతూ వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామానికి చెందిన కురుమై పెంచలరావు బాడుగ నిమిత్తం ఒక నెలరోజుల కిందట కర్నాటక వెళ్లాడు. ఈ సందర్భంలో పెంచలరావుకు నవీన్‌కుమార్‌తో పరిచయమయింది. పెంచలరావు సెల్‌నంబర్ తీసుకున్న నవీన్‌కుమార్ తరచూ ఫోన్‌చేసేవాడు. ఇటీవల నవీన్‌కుమార్ పెంచలరావుకు ఫోన్‌చేసి తాము పునాదులు తవ్వుతుంటే 5 కేజీల మేలిమి బంగారం దొరికిందని తక్కువధరకే ఇస్తామని కావాలంటే చెప్పమని నమ్మబలికారు. ఈ సందర్భంలో ఒక కేజీ బంగారం రూ. 3 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. 20 రోజుల కిందట నిందితులు నాకే నవీన్‌కుమార్, సాతుపుడి అజ్జప్ప ఇరువురు పామూరుకు వచ్చి పెంచలరావుకు నిజమైన బంగారం 2 కాసులు ఇచ్చి నీకు ఇష్టం వచ్చిన నగల దుకాణంలో పరీక్షచేయించుకోవాలని చెప్పారు. రెండు కాసులను పరీక్షించగా అవి నిజమైన బంగారం కావడంతో పెంచలరావు రూ. 3 లక్షల నగదు ఇచ్చి కేజీ తూకం గల బంగారు వర్ణంలో ఉన్న కాసులను తీసుకోగా వారు వెళ్లిపోయారు. అనంతరం పెంచలరావు మిగతా కాసులను నగల దుకాణంలో పరీక్షింపగా నకిలీవి కావడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు సీఐ ఎ.వి.రమణ అధ్యక్షతన ఎస్సై టి.రాజ్‌కుమార్, సిబ్బంది ముమ్మర గాలింపు చేస్తున్నారు. ఈ సందర్భంలో సోమవారం ఇరువురు నిందితులు నకిలీ బంగారం కాసులతో మరొకరిని మోసంచే సేందుకు సిద్ధమవుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు వారిని అరెస్ట్‌చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 3 లక్షల నగదు, నకిలీ బంగారు కాసులు స్వాధీనం చేసుకుని వారిని కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ కండె శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం కేసులో నిందితులను పట్టుకోవడానికి కృషిచేసిన పోలీస్‌సిబ్బంది రమణయ్య, ఇతర సిబ్బందిని అభినందించి ప్రోత్సాహకాలు అందజేశారు. మోసపూరిత మాటలు నమ్మొద్దు ఎవరైనా మోసపూరిత మాటలతో తక్కువధరకే బంగారు నగలు ఇస్తామని, దేవతా మూర్తుల విగ్రహాలు ఇస్తామని, మెరుగుపెడతామని చెప్పే మాటలు నమ్మవద్దన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. -
బ్యాంక్ కుంభకోణంపై ఆన్లైన్లో ఫిర్యాదు
గుంటూరు, కాజ(మంగళగిరి): మండలంలోని కాజ ఆంధ్రాబ్యాంక్‌లో నకిలీ బంగారం కుంభకోణంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నట్లు సమాచారం. బ్యాంకు పెట్టిన నాటి నుంచి గోల్డ్ అప్రైజర్‌గా పని చేస్తున్న గుత్తికొండ ప్రసాద్‌కు ముప్పై సంవత్సరాల అనుభవం, స్వగ్రామం కావడంతో ఏ అధికారి వచ్చినా అతడు చెప్పినట్లే జరిగేదని సమాచారం. గ్రామంలో మంచి పేరున్న ప్రసాద్.. గోపి మాటల మాయలో పడి నకిలీ బంగారం బ్యాంకులో పెట్టి రుణం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, ప్రసాద్‌కు వాటాలున్న కారణంగానే ఇంత పెద్ద కుంభకోణం జరిగినట్లు అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. కుంభకోణం గురించి స్థానిక అధికారులు గోప్యం పాటిస్తుండగా, ఉన్నతాధికారులు ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే, రాతపూర్వకంగా పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలని కోరినట్లు తెలిసింది. మరో వైపు విషయం బయటకు పొక్కిననాటి నుంచి గంధం గోపి పరారవ్వడం గమనార్హం. ముందే బ్యాంకులో మాట్లాడుకున్న అతడు, ఓ యువకుడిని తీసుకుని వెళ్లి ఖాతాను ప్రారంభించాడు. తర్వాత బంగారం తనఖా పెట్టి యువకుడి ఖాతాలోకి వచ్చిన నగదును తన ఖాతాలోకి మార్చుకుని జల్సా చేసినట్లు చర్చ జరుగుతోంది. రుణం తీసుకున్న యువకులు పలువురిని గత కొద్దికాలంగా గోవా తదితర ప్రాంతాలకు తిప్పి, వారితో పాటు కలిసి జల్సా చేశాడని, దీంతో వారంతా రుణం తీసుకునేందుకు సహకరించారని సమాచారం. ఎలాగైనా బ్యాంకు నగదు జమ చేసి కేసులు లేకుండా చూసుకుని తమ భవిష్యత్తును కాపాడుకోవాలని గత మూడు నెలల నుంచి బ్యాంకు ఉద్యోగులంతా గ్రామ పెద్దలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా కొలిక్కి రాలేదు. విషయం బయటకు పొక్కడంతో బ్యాంక్ ఉన్నతాధికారులు సైతం తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. ఇక నకిలీ బంగారంతో రుణాలు తీసుకోకపోయినా, అవి తమ పేర్లతో ఉండడంతో కేసులు తమ మెడలకు ఎక్కడ చుట్టుకుంటాయోనని గోపికి సహకరించిన వారి కుటుంబాలను వేధిస్తోంది. ఇంత జరుగుతున్నా బ్యాంక్ అధికారులు మాత్రం నోరు విప్పకపోవడం గమనార్హం. -
నకిలీ బంగారం అంటగట్టి ఉడాయిస్తారు’
అమీర్‌పేట: అమాయకులను గుర్తించి నకిలీ బంగారం అంటగట్టి లక్షలు గడిస్తున్న ముగ్గురిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు.నిందితుల వద్ద నుంచి నకిలీ ఆభరణాలతో పాటు రూ.8.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పశ్చిమ మండలం డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు.మహారాష్ట్రలోని చాలీస్ గావ్‌కు చెందిన నతుల్లాల్ రాయ్(58), ఆర్జున్రాయ్(23), రవికుమార్(26) లు ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకంగా కనిపించే చిరు వ్యాపారులను ఎంచు కుని వారికి నకిలీ బంగారం అంటగడుతూ లక్షల డబ్బులు గడిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. నగరంలో సంచరిస్తూ ముందుగా రెక్కీ నిర్వహిస్తూ చిరువ్యాపారులను ఎంపిక చేస్తారు. వారితో మాటలు కలిపి తాము పొలాల్లో జేసీబీ పనులు చేస్తుంటామని,పనులు చేస్తుండగా పెద్ద మొత్తంలో బం గారం దొరికిందని భారీ స్థాయిలో నకిలీ బంగారు హారాలు చూపిస్తారు. ఆర్థిక సమస్యల కారణంగా బం గారు ఆభరణాలు విక్రయించాలని నిర్ణయించుకున్నామని నమ్మించేవారు. అనుమానం ఉంటే పరీక్షించుకోవాలని వ్యాపారులు దృష్టి మరల్చి కొంత అసలు బంగారం తీసి ఇస్తారు. దాని పరీక్షించగా అసలు బంగారం అని తేలడంతో మిగిలిన బంగారాన్ని మార్కెట్లో ఉన్న ధర కంటే చౌక ధరకు బాధితులకు అంటగట్టి ఉడాయిస్తారు. అసలు బం గారం అనుకుని హారాన్ని మరో సారి పరీక్షించి అది నకిలీదని తేలడంతో మోస పోయామని బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ ముఠా సభ్యులు ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు చోట్ల ,జీడిమెట్లలో మరో చోట చిరు వ్యాపారులకు నకిలీ బంగారం అంటగట్టి లక్షల నగదుతో ఉడాయించేవారు.తరువాత వారి ఫోన్ నెంబర్లను కూడా మార్చివేస్తారు. ఇటీవల మధురానగర్‌లోని ఓ జ్యూస్ షాపు నిర్వాహకుడిని మోసం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న క్రైం పోలీసులు డీఎస్ఐ ఎన్. సంజేయ్‌కుమార్ నేతృత్వంలో క్రైం సిబ్బంది వలపన్ని పట్టుకున్నారు.నిందితుల వద్ద నుంచి నకిలీ బంగారు ఆభరణాలతో పాటు రూ.8.5లక్షల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సిబ్బందిని డీసీపీ అభినందించారు. ఏపీసీ విజయ్‌కుమార్, ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ ఎస్.మురళీకృష్ణ,డిటెక్టీవ్ ఇన్స్పెక్టర్ వై.అజేయ్‌కుమార్,సబ్ ఇన్స్పెక్టర్ సంజేయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ బంగారం ముఠా అరెస్ట్
కరీంనగర్‌క్రైం: ప్రజలకు నకిలీ బంగారాన్ని అంటగడుతున్న రాజస్థాన్‌కు చెం దిన ఇద్దరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. వివరాలను హెడ్‌క్వార్టర్స్‌లో వెల్లడించారు. రాజస్థా న్ రాష్ట్రం సిరోహి జిల్లా నరదర గ్రామా నికి చెందిన సోళంకి రమేశ్, రాజుఆకా శ్ స్నేహితులు. మొదటగా ఒక ప్రాం తాన్ని ఎంచుకుని నివాసం ఏర్పాటుచేసుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల్లో ప్లాస్టిక్ వస్తువులు అమ్మేవారిగా తిరుగుతారు. తమవద్ద పెద్ద ఎత్తున బం గారం ఉందని, తక్కువ ధరకు ఇస్తామ ని నమ్మిస్తారు. ఓచోటు చెప్పి ప్రజలు డబ్బులతో వెళ్లగానే నకిలీ బంగారాన్ని అంటగడతారు. పరీక్షించేలోపు అక్కడి నుంచి జారుకుంటారు. ఇలా కరీంనగర్ ముకరంపురకు చెందిన ఓ వ్యక్తికి కిలో బంగారం ఇస్తామని రూ.5లక్షల తో ఉడాయించారు. ఇలా చిక్కారు.. కరీంనగర్‌కు చెందిన దయ్యాల మల్ల య్య రెండ్రోజుల క్రితం ఆర్టీసీబస్టాండ్‌కు వెళ్లగా అక్కడే ఉన్న రమేశ్, అకాశ్ పరిచయం చేసుకున్నారు. తమవద్ద 20తులాల బంగారం ఉందని, మార్కె ట్లో రూ.5లక్షలు పలుకుతుందని, రూ. 50 వేలకే ఇస్తామని చెప్పారు.మల్లయ్య ఇంటికి వెళ్లి డబ్బు తీసుకొచ్చాడు. బం గారం తీసుకుని అది నకిలీగా గుర్తించాడు. వెంటనే టాస్క్‌ఫోర్స్ పోలీసు లకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు చేరుకుని నిందితులను అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ పోలీసులకు అప్పగించి రిమాండ్ చేశారు. సీఐలు శ్రీనివా సరావు, కిరణ్, మాధవి ఉన్నారు. -
పసిడి పేరుతో బురిడీ!
- బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు - రూ.19.40 లక్షల గోల్డ్ లోన్ తీసుకున్న ఘనుడు జమ్మికుంట (హుజూరాబాద్): కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కరూర్ వైశ్యాబ్యాంక్‌లో పసిడి పేరుతో ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.19.40 లక్షల వరకు గోల్డ్‌లోన్ తీసుకున్నాడు. ఇతనికి బ్యాంకులో పనిచేసే అప్రైజర్ సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తు న్నాయి. కరూర్ వైశ్యాబ్యాంకులో కొన్నేళ్లుగా పట్టణానికి చెందిన ముక్క సునీల్ కుమార్ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. దాదాపు రూ.5 కోట్ల వరకు పలువురికి బ్యాంకు నుంచి గోల్డ్‌లోన్ ఇప్పించాడు. 2016 జూలై నుంచి ఫిబ్రవరి 2017 వరకు పట్టణానికి చెందిన వ్యాపారి చిటికేశి జయప్రకాశ్ ద్వారా కిలో బంగారం తాకట్టు పెట్టించి రూ.19.40 లక్షల వరకు రుణం ఇప్పించాడు. మొదట రూ.80 వేలు రుణంగా తీసుకున్న జయప్రకాశ్.. నకిలీ బంగారాన్ని తాకట్టుపెడుతూ.. భారీ ఎత్తున నగదు తీసుకున్నాడు. కాగా, ఫిబ్రవరిలో వైజాగ్ రీజియన్ కార్యాలయం నుంచి వచ్చిన వారు లాకర్లు తనిఖీ చేయగా, నకిలీ బంగారం బయట పడింది. విషయాన్ని బయటకు పొక్క కుండా వెంటనే అప్రైజర్‌గా పనిచేసే వ్యక్తిని ప్రశ్నించారు. రికవరీ కోసం సునీల్ సస్పెన్స్ ఖాతాలో రూ.20 లక్షల వరకు రెండు చెక్కులతో డబ్బులను డిపాజిట్ చేయించుకున్నారు. ఖాతాను ప్రస్తుతం హోల్డ్‌లో పెట్టారు. ఈ విషయాన్ని ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, బ్యాంకు మేనేజర్ సాయిబాబు బుధవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో సీఐ ప్రశాంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, తనను బలిపశువు చేశారంటూ సునీల్‌కుమార్ మనోవేదనతో అనారోగ్యం పాలై హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. రుణం తీసుకున్న జయప్రకాశ్ పరారీలో ఉన్నాడు. -
నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ...
శ్రీకాకుళం: రాజాంలోని శ్రీకాకుళం రోడ్డులో కరూర్‌వైశ్యాబ్యాంకులో అప్రజైర్ (బంగారు ఆభరణాల పరిశీలకుడు) గా విధులు నిర్వహిస్తున్న ఘరానామోసగాడు బ్యాంకుకే కన్నం పెట్టాడు. నకిలీ బంగారు ఆభరణాలను ఒరిజినల్ బంగారు ఆభరణాలుగా ధ్రువీకరించి రూ. 1,33,55,000 లను కొల్లగొట్టాడు. 40మంది ఖాతాదారులతో ఈ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. చివరికి అనూహ్యంగా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.... రాజాంలోని కరూర్ వైశ్యాబ్యాంకులో గత ఏడాదిన్నర నుంచి బంగారు ఆభరణాలపై రుణాలు ముమ్మరంగా అందించారు. ఇటీవల బ్రాంచి మేనేజర్ చంద్రమౌళిరెడ్డి బంగారు ఆభరణాలపై రుణాలు పొంది గడువు ముగిసిన లబ్దిదారులకు నోటీసులు పంపించాడు. ఎటువంటి స్పందన రాకపోవడంతో బ్రాంచి మేనేజర్ ఆరా తీయడం ప్రారంభించారు. మరోవైపు ఈ ఆభరణాలు వేలం వేసేందుకు గడువు రావడంతో బ్యాంకుకు చెందిన ఉన్నతాధికారులు రెండు రోజులు క్రితం బ్యాంకుకు చేరుకొని వేలంవేసే ఆభరణాలపై ఆరా తీశారు. వాటిని పరిశీలించగా నకిలీ ఆభరణాలుగా గుర్తించడంతో మొత్తం ఆభరణాలపై ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయపడింది. సమాచారం తెలుసుకున్న సీఐ శంకరరావు బ్యాంకుకు చేరుకొని ఆరా తీశారు. మేనేజర్ వద్ద ఫిర్యాదులు సేకరించిన అనంతరం అప్రైజర్‌ను విచారించారు. అప్రైజర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రుణాలకు సంబంధించి అప్రైజర్ పాత్రతోపాటు బ్యాంకు మేనేజర్ ఇచ్చిన వివరాలు ప్రకారం ఖాతాదారులను వివరించనున్నట్లు తెలిపారు. -
ఇత్తడిని పుత్తడి చేసి..
నకిలీ బంగారం, ఇద్దరి అరెస్టు, జగిత్యాల జగిత్యాల : ఇత్తడిపై బంగారం పూత పూసి విక్రయించిన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. వివరాలు.. జగిత్యాల పట్టణంలో నివసిస్తున్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి గత నెల 10వ తేదీన కర్ణాటకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేశారు. కిలో బంగారాన్ని రూ. 3 లక్షలకే ఇస్తామని, ఆ బంగారం తమ ఇంటిని కూల్చివేస్తున్నపుడు జరిపిన తవ్వకాల్లో దొరికిందని తెలిపారు. వెంకటేశ్వరరావును నమ్మించడానికి మొదటగా నిజమైన బంగారు కాయిన్(1 గ్రాము)ను చూయించారు. అది చూసి తెలిసిన వాళ్ల దగ్గర బంగారాన్ని టెస్ట్ చేయించాడు. అసలు బంగారమే అని నిర్ధరణ చేసుకున్నాక వాళ్లను మళ్లీ సంప్రదించాడు. వారు డిసెంబర్ 10న పావు కిలో నకిలీ బంగారాన్ని అందించి రూ. 3 లక్షల నగదు పట్టుకెళ్లారు. బంగారం షాపు వద్దకు తీసుకెళితే అది నకిలీదని తేలడంతో తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరో పావు కిలో బంగారం కావాలని బాధితుడి చేత నిందితులకు ఫోన్ చేయించారు. నిందితులు నకిలీ బంగారంతో మళ్లీ నిన్న(బుధవారం) జగిత్యాలకు రావడంతో పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వారు కర్ణాటకలోని బళ్లారి జిల్లా బత్తలపల్లికి చెందిన కావడి రవిచంద్ర, కావడి శ్రీకాంత్‌గా గుర్తించారు. వారి నుంచి రూ. 2.8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ అనంత శర్మ విలేకరుల సమావేశం పెట్టి వివరాలు వెల్లడించారు. -
నకిలీ బంగారం తాకట్టు.. 6 కోట్లు స్వాహా!
విశాఖ: నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం పరిధిలోని పలు బ్యాంకుల్లో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి ఏకంగా రూ. 6 కోట్లు రుణాలు తీసుకున్న 12 మంది సభ్యుల ముఠాను ఎంవీపీ కాలనీ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. మూడు నెలల్లోనే 18 ఖాతాల ద్వారా ఈ రుణాలను పొందినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులలో విశాఖ, ఒడిశాలకు చెందినవారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. -
నకిలీ బంగారంతో బ్యాంక్‌కు టోకరా!
పెబ్బేరు ఆంధ్రాబ్యాంక్‌లో రుణం ఇచ్చేందుకు సిద్ధమైన అధికారులు చివర్లో అనుమానం వచ్చి నగల పరిశీలన నకిలీవిగా తేలడంతో పోలీసులకు ఫిర్యాదు పెబ్బేరు: మండలకేంద్రంలోని ఆంధ్రాబ్యాంక్ (శ్రీరంగాపూర్ బ్రాంచ్)లో నకిలీ బంగారు నగలతో రుణం పొందేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా, చివరి నిమిషంలో బ్యాంక్ అధికారులు తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... పెబ్బేరు మండలం నాగసానిపల్లికి చెందిన మోహన్‌రెడ్డి మంగళవారం బంగారు నగలపై పంట రుణం పొందేందుకు స్థానిక ఆంధ్రాబ్యాంక్(శ్రీరంగాపూర్ బ్రాంచ్)కు వచ్చాడు. ఈ మేరకు బ్యాంక్ అధికారులు సంబంధిత వ్యక్తి వద్ద వివరాలతో పాటు, పట్టదారు పాసుపుస్తకాలు, బంగారు అభరణాలు తీసుకుని డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. మోహన్‌రెడ్డి తెచ్చిన బంగారు ఆభరణాలకు రూ.2 లక్షలు పంట రుణం ఇచ్చేందుకు అన్ని ప్రక్రియలు పూర్తి చేశారు. చివరి నిమిషంలో తాను తెచ్చిన బంగారు ఆభరణాలు తనవి కావని, తనకు పరిచయం ఉన్న వ్యక్తివని సంబంధం లేకుండా చెప్పడంతో బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చింది. చివరి నిమిషంలో బ్యాంక్ మేనేజర్ గోవిందు బంగారు ఆభరణాలను మరోసారి పరిశీలించాలని సిబ్బందికి చెప్పడంతో ఆభరణాలను యాసిడ్‌తో పరిశీలించగా నకిలీవని తేలడంతో వారు అవాక్కయ్యారు. దీంతో తేరుకున్న బ్యాంక్ అధికారులు వెంటనే రుణం కోసం దరఖాస్తు చేసుకున్న మోహన్‌రెడ్డిని నిలదీయగా తనకేం తెలియదని తనతో వచ్చిన మరో వ్యక్తిని చూయించాడు. వెంటనే బ్యాంక్ మేనేజర్ వారిద్దరిని పొలీసులకు అప్పజెప్పి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలానికి చెందిన సోలీపూర్ రాములు రెండు రోజుల క్రితం మద్యం దుకాణంలో మందు తాగుతూ నాగసానిపల్లికి చెందిన మోహన్‌రెడ్డితో పరిచయం పెంచుకున్నాడు. తన కూతురి వివాహం ఉందని, తనవద్ద ఉన్న బంగారు నగలతో పంట రుణం పేరుతో తక్కువ వడ్డీతో రుణాన్ని ఇప్పించాలని కోరాడు. దీనికి అంగీకరించిన మోహన్‌రెడ్డి మంగళవారం పెబ్బేరు ఆంధ్రాబ్యాంక్ వద్ద కలసుకున్నారు. సోలీపూర్ రాములు మరో మహిళ ఇద్దరు కలిసి బంగారు నగలను మోహన్‌రెడ్డికి ఇచ్చి రుణం ఇప్పించాలని కోరడంతో తన పట్టదారు పాస్‌పుస్తకాలతో రుణం కోసం దరఖాస్తు చేశాడు. చివరి నిమిషంలో బ్యాంక్ అధికారులకు అనుమానం రావడంతో సదరు మహిళలు అక్కడి నుంచి జారుకుంది. దీంతో బ్యాంక్ అధికారులు మోహన్‌రెడ్డి, సోలీపూర్ రాములును పోలీసులకు అప్పగించి, జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంక్ మేనేజర్ గోవిందు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. -
‘నకిలీ బంగారం’ కేసులో ఇద్దరి అరెస్ట్
నర్సంపేట: నకిలీ బంగారం కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ జాన్‌దివాకర్ సోమవారం తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. గత రెండు నెలల క్రితం పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న పాస్ట్‌ఫుడ్ సెంటర్ యజమాని రవిని ప్లాస్టిక్‌పూలు, ప్లాస్టిక్ దండల తయారు చేసే శివ, చిన్న, గణేష్, రవి, అంచలయ్య వచ్చి పరిచయం చేసుకున్నారు. కౌంజు పిట్టలను తీసుకొచ్చి రవికి రెండుసార్లు అమ్మారు. మరోసారి అతడి దగ్గరికి వచ్చి జేసీబీతో మట్టి తవ్వతుండగా అందులో బంగారుహారం దొరికిందని వారు అతడితో నమ్మబలికారు. హారం సుమారు 3 కేజీలు ఉంటుందని, రూ.90 లక్షల విలువ ఉంటుందని, నీౖకైతే రూ.30 లక్షలకు ఇస్తామని చెప్పారు. అవసరమైతే బంగారాన్ని పరీక్షించుకోమ్మని నమ్మబలికారు. దీంతో రవి రూ.15లక్షలు ఇచ్చి మూడు కేజీల హారాన్ని తీసుకున్నాడు. ఇలాగే గుండ్లపహాడ్లో గ్రామంలో కూడా చెరువు వద్ద సాంబయ్యను కూడా నమ్మించారు. అతడు రూ.3 లక్షల ఇచ్చిన తర్వాత విజయవాడకు తీసుకెళ్లి హారాన్ని అప్పగించారు. తీరా ఆ హారాలను బాధితులు పరీక్షించగా నకిలీవని తేలడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ నెల 28న పాకాల రోడ్డులోని శరణ్య చికెన్ సెంటర్లో మిగిలి ఉన్న నకిలీ బంగారాన్ని అమ్మ్మడానికి రాగా శరణ్య చికెన్ సెంటర్ యజమాని శ్యాంసుందర్ దానిని తీసుకునేందుకు నిరాకరించాడు. ఈ క్రమంలోనే పట్టణంలోని బస్టాండ్ సెంట ర్లో రాణా బయ్యప్ప అలియాస్ రవి, రాణా మనోహర్ అలి యాస్ గణేష్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకితీసుకొని, వారి వద్ద ఉన్న నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఇద్దరిని విచారించగా గోవిందు శ్రీనివాస్ అలియాస్ చిన్న, నాగరాజు అలియాస్ శివ, రాణా అంచలయ్య మొత్తం ఐదుగురు కలిసి ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. వారిలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ జాన్‌దివాకర్ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు హరికృష్ణ, దివాకర్, ఏఎస్సై కమలాకర్, సిబ్బంది మల్లేశం, రాజు, కుమారస్వామి, రవీం దర్, నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ బంగారం అమ్మబోయి..
నకిరేకల్: నాసిరకం బంగారాన్ని అంటగట్టేందుకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలో ఈ ఘటన జరిగింది. పట్టణ శివారులోని వాసవీనగర్‌కు చెందిన బంగారు దుకాణం యజమాని వద్దకు కొన్నాళ్ల క్రితం రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి వచ్చాడు. తన వద్ద ఉన్న కొంత బంగారాన్ని తక్కువ ధరకే విక్రయించి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం కూడా వచ్చిన ఆ వ్యక్తి తన వద్ద కిలో బంగారం ఉందని చూపాడు. దానిని పరీక్షించిన ఆ వ్యాపారి అది నాసిరకమని తేల్చాడు. ఈ విషయమై అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
నకిలీ బంగారం విక్రేత అరెస్టు
నాసిరకం బంగారం అంటగట్టేందుకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన టైర్ల దుకాణం యజమాని శ్రీకాంత్‌రెడ్డికి కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన అంజనప్ప అనే వ్యక్తి గత నెలలో పలుమార్లు ఫోన్ చేశాడు. తన వద్ద పెద్ద మొత్తంలో బంగారం ఉందని, తక్కువ ధరకే ఇస్తానని నమ్మబలికాడు. శ్రీకాంత్‌రెడ్డి కోరిక మేరకు గత నెల రూ.5 లక్షల బంగారాన్ని సూర్యాపేటకు వచ్చి అందజేశాడు. అయితే, రూ.10 లక్షల బంగారం కావాలని శ్రీకాంత్‌రెడ్డి కోరటంతో అంజనప్ప సోమవారం సూర్యాపేటకు చేరుకున్నాడు. తను తెచ్చిన 750 గ్రాముల బంగారాన్ని శ్రీకాంత్‌రెడ్డికి చూపారు. అనుమానం వచ్చిన ఆయన స్థానిక బంగారం వ్యాపారులకు చూపాడు. వారు నకిలీదని తేల్చటంతో వెంటనే శ్రీకాంత్‌రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి అంజనప్పను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. అంజనప్ప వెంట వచ్చిన మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
నకిలీ బంగారం కేసులో వ్యక్తి అరెస్ట్
సంతోష్‌నగర్ (హైదరాబాద్) : ఓ గోల్డ్ షాపు యజమానిని నకిలీ బంగారంతో బురిడీ కొట్టించి అసలు బంగారం తీసుకెళ్లిన వ్యక్తిని మంగళవారం సంతోష్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ మూడవ తేదీన సంతోష్ నగర్ బంగారు నగల దుకాణంలోకి లక్ష్మణ్ అనే వ్యక్తి వచ్చి నకిలీ బంగారం పెట్టి అసలు బంగారంతో పరారయ్యాడు. మంగళవారం లక్ష్మణ్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి పదిహేడు తులాల బంగారం, ఒక మారుతీ కారును స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా నిందితుడిపై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
దొంగ దొరికాడు!
► రూ.23.40 లక్షలు కాజేసినట్లు నిర్థారణ ► పదిమంది పేర్ల మీద నకిలీ బంగారం తనఖా ► పోలీసుల అదుపులో బ్యాంకు అప్రైజర్ సాగర్ పిడుగురాళ్ళ (గుంటూరు) : పట్టణంలోని ఓ జాతీయ బ్యాంకు (యూనియన్ బ్యాంక్)లో నకిలీ బంగారాన్ని పెట్టి బ్యాంకు అధికారులను మోసం చేసిన అప్రైజర్ సాగర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన స్నేహితులు, బంధువులు సుమారు పది మంది పేర్లపై దొంగ బంగారాన్ని బ్యాంకులో తనఖా పెట్టి మొత్తం రూ.23.40 లక్షలను నొక్కేశాడు. బంగారాన్ని తీసుకెళ్లమని బ్యాంకు అధికారులు ఖాతాదారులకు ఫోన్ చేయడంతో అసలు గుట్టు బయట పడింది. బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బ్యాంకులో తనఖా పెట్టిన బంగారాన్ని పరిశీలించి ప్రతి ఖాతాదారుడి వివరాలు, ఖాతాదారుడు ఎంత బంగారం బ్యాంకులో పెట్టాడు , ఎంత నగదు తీసుకున్నాడన్న సమాచారాన్ని పూర్తి స్థాయిలో బ్యాంకు ఆడిట్ బృందం రహస్యంగా రెండు వారాల పాటు విచారణ నిర్వహించింది. ఆ సమయంలోనే బ్యాంకులో భారీ నగదు స్వాహా అయినట్లు సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. అప్పట్లో బ్యాంకు పరువు పోతుందని బ్యాంకు మేనేజర్ సమాచారం బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బ్యాంకులో అప్రైజర్ చేసిన మోసాన్ని బ్యాంకు ఉన్నతాధికారులు నిగ్గు తేల్చారు. దీంతో బ్యాంకు మేనేజర్ నారాయణమూర్తి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు పట్టణ ఇన్చార్జి సీఐ వై. శ్రీధర్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అప్రైజర్ సాగర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ నారాయణమూర్తిని సాక్షి వివరణ కోరగా అప్రైజర్ సాగర్ దొంగ బంగారం పెట్టి బ్యాంకు సొమ్మును కాజేసిన మాట వాస్తవమేనన్నారు. అతను కాంట్రాక్టు ఉద్యోగి అని, అతన్ని ఉద్యోగం నుంచి తొలగించామని, అతని వద్ద నుంచి బ్యాంకు నగదును రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. -
దొంగ బంగారంతో బ్యాంకులకు టోకరా
నల్లగొండ క్రైమ్: బ్యాంకులకు టోకరా వేసిన ఓ వ్యక్తిని నల్లగొండ జిల్లా భువనగిరిలో పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు... భువనగిరి పట్టణానికి చెందిన తంగెళ్లపల్లి గిరిధరాచారి హెడ్‌డీఎఫ్‌సీ, కెనరా బ్యాంకులకు గోల్డ్ అప్రెయిజర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తెలిసిన వారితో నకిలీ బంగారాన్ని తాను పనిచేస్తున్న బ్యాంకు శాఖల్లో కుదువ పెట్టించి రూ. 83 లక్షల మేర రుణాలను పొందేలా చేశాడు. అలా దండుకున్న సొత్తుతో జల్సాలు చేయడం ప్రారంభించాడు. అతడిలో ఆకస్మిక మార్పును గమనించిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా చారి మోసం వెలుగు చూసింది. దీంతో అతడ్ని అరెస్ట్ చేశారు. -
చౌకగా బంగారమంటూ దోచేస్తారు...
హైదరాబాద్: చౌకగా బంగారం విక్రయిస్తామని చెప్పి నకిలీ బంగారం అంటగట్టి డబ్బు తో ఉడాయిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఈస్ట్‌జోన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నింది తుల నుంచి రూ. 3.90 లక్షలు, 11 ఫోన్లు, 7 బంగారు రంగు పోలి ఉన్న ఇత్తడి పూసలదండలు, 5 బంగారు గుండ్లను స్వాధీనం చేసుకున్నారు. సైదాబాద్ ఠాణాలో శుక్రవారం ఈస్ట్‌జోన్ డీసీపీ విశ్వనాథ్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రధాన నిందితుడు గుజరాత్‌కు చెందిన దాబి నారాయణ ప్రకాశంజిల్లా వేట్లపాలెంలో పూల వ్యాపారం చేస్తున్నాడు. ఇతను అదే ప్రాంతంలో ఉండే దాబి జీవన్, దాబి దయా, దాబి నిమియా, బికిలి దాబి, దాబి రాజు, దాబి శంకర్, దాబి సూరజ్, సోలంకి లక్డి, దల్లుబాయ్ (అందరిదీ ఒకే కుటుంబం)లతో ముఠా ఏర్పాటు చేశాడు. ముఠా సభ్యులు బస్తీలు, కాలనీల్లో తిరుగుతూ అక్కడి ఒక దుకాణంలోకి వినియోగదారుడి మాదిరిగా వెళ్తారు. షాపు యజమానితో లేదా షాపునకు వచ్చిన వారితో మాట కలిపి తమ వద్ద బంగారం ఉందని తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్తారు. తమ పొలంలో దొరికిందని, ఇంట్లో పెళ్లి ఉండటంతో అత్యవసరంగా డబ్బు అవసరమై బంగారాన్ని అమ్మేస్తున్నామని నమ్మబలుకుతారు. తమ వద్ద ఉన్న అసలు బంగారాన్ని వారికి ఇచ్చి పరీక్షించుకోమని చెప్తారు. పరీక్షల్లో అది నిజమైన బంగారం అని తేలడంతో టార్గెట్ చేసిన వ్యక్తి వీరి బుట్టలోపడిపోతాడు. తర్వాత బేరం కుదుర్చుకొని డబ్బు తీసుకొని, బంగారం రంగుపూసిన ఇత్తడి కడ్డీలను అంటగట్టి జారుకుంటారు. వీరు ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో 21 నేరాలకు పాల్పడి ప్రజల నుంచి రూ. 25 లక్షలు కాజేశారు. కాగా, వీరంతా గురువారం సైదాబాద్‌లో తచ్చాడుతుండగా పోలీసులకు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించగా.. బంగారం పేరుతో మోసాలు చేస్తున్నట్టు వెల్లడించారు. విచారణ అనంతరం శుక్రవారం పది మంది నిందితులనూ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. నిందితులను చాకచక్యంగా అరెస్టు చేసిన డీఐ నాగేశ్వర్రావుతో పాటు నేర విభాగం సిబ్బందిని డీసీపీ అభినందించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ సుధాకర్, అడిషనల్ డీసీపీ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు, డీఐ కోరుట్ల నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. పలు పోలీస్స్టేషన్లలో కేసులు.. వీరు నగరంలోని సైదాబాద్, అంబర్‌పేట, హబీబ్‌నగర్, మార్కెట్, కుషాయిగూడ, మీర్‌పేట,లింగంపల్లి, కూకట్పల్లి, ఠాణాల పరిధిలో మోసాలకు పాల్పడ్డారు. అలాగే, మెదక్ జిల్లా సదాశివపేట, నెల్లూరుజిల్లా నాయుడుపేట, వెస్ట్‌గోదావరి పాలకొల్లు, విశాఖపట్నం భీమిలి, అనకాపల్లి, గాజువాక, చెన్నై అన్నానగర్, విల్లి విక్కమ్ చెన్నై, కేరళలోనూ మోసాలకు పాల్పడ్డారని డీసీపీ చెప్పారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల పోలీసుల సహకారంతో విచారణ జరుపుతున్నామన్నారు. -
ఆశపడితే అసలుకే మోసం..
♦ నకిలీ బంగారు కడ్డీలు ఎరవేసి ♦ అసలు బంగారం దోచుకుంటున్న మహిళలు ♦ ధర్మపురిలో యథేచ్ఛగా సంచారం నకిలీ బంగారు కడ్డీలను ఎరవేసి అసలు బంగారం ఎత్తుకుపోతున్న సంఘటనలు ధర్మపురిలో తరచూ జరుగుతున్నారుు. మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు మహిళా దొంగలు. ధర్మపురి పుణ్యక్షేత్రం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ప్రతి శనివారం ఇక్కడ సంత జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారిలో ఎవరైనా మహిళలు అమాయకంగా కనిపిస్తే చాలు.. వారిని బురిడీ కొట్టించి అసలు బంగారం ఎత్తుకెళ్తున్నారు. గతంలో ఇలాంటి మోసాలకు పాల్పతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. తాజాగా నాలుగు రోజుల క్రితం ధర్మపురికి చెందిన ఓ అవ్వను మోసం చేసి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు అపహరించిన సంఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -ధర్మపురి ఇదీ మోసం చేసే విధానం.. మహిళా దొంగలు ఇద్దరు, ముగ్గురు కలిసి జట్టుగా ఏర్పడతారు. పథకం ప్రకారం ముందుగా పరిసర ప్రాంతాలను పరిశీలించి ఒంటరిగా మహిళలు దొరికే ప్రాంతాన్ని ఎంచుకుంటారు. ఒంటిపై నగలు ఉన్న అమాయకులను ఎంచుకుని అనుసరిస్తారు. వారి పక్కనుంచే వెళ్లి వెంట తెచ్చుకున్న బంగారం పూత ఉన్న కడ్డీని కింద జారవిడుస్తారు. తర్వాత వారే ఆ కడ్డీని చేతికి తీసుకుని ఇది నీదేనా.. మరెవరైనా పడేసుకున్నారా.. అంటూ మాటల్లో దింపి ఎవరైనా చూస్తే బాగుండదు.. ఈకడ్డీని నీవే తీసికో.. పది తులాల వరకు ఉంటుంది. దానికి బదులు నీమెడలో ఉన్న కొద్దిపాటి నగలు ఇస్తే సరిపోతుందని చెబుతారు. అత్యాశతో కొంత మంది ఒంటిమీదున్న నగలిచ్చి మోసపోరుున సంఘటనలు ధర్మపురిలో తరుచుగా జరుగుతున్నారుు. గతంలో దొరికిన ముఠా ఇంతకు ముందు ఇక్కడ సీఐగా పనిచేసిన మహేందర్ ఆధ్వర్యంలో బంగారు కడ్డీల పేరుతో మోసం చేస్తున్న ముఠాను పట్టుకుని మొత్తం 8 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో హైదరాబాద్‌లోని ఫత్తే నగర్‌కు చెందిన గుంజ శ్రీనివాస్‌తోపాటు అతడి భార్య ప్రమీల, మరో మహిళ కొమిరె రేణుక, మరో ఐదుగురు ఉన్నారు. జామీనుపై బయటకు వచ్చిన ఈ మూఠానే మళ్లీ మోసాలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. జరిగిన సంఘటనలు ►2012 ఫిబ్రవరి 25న జగిత్యాలకు చెం దిన అత్తె రాజవ్వ నుంచి రెండు తులా ల బంగారు పుస్తెలతాడు తీసుకెళ్లారు. ►2012 నవంబర్ 24న ఆదిలాబాద్ జిల్లాలోని దండెపెల్లికి చెందిన గాజుల రాజవ్వ రెండున్నర తులాల పుస్తెల తాడు, వెండి పట్టాగొలుసులు అపహరించారు. ►2015 అగస్టు 1న ధర్మపురికి చెందిన మాదాసు నర్సవ్వ నుంచి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. మూడున్నర తులాలు మోసపోరుున మాది ధర్మపురిలోని కాశెట్టివాడ. ఈనెల ఒకటో తారీఖున శనివారం ఇక్కడ సంతల కూరగాయలు కొనుక్కొని ఇంటికి పోతున్న. నా పక్కనుంచి వచ్చిన ఇద్దరు ఆడోళ్లు ఆగి కిందినుంచి బంగారు కడ్డీ తీసి అబ్బ దొరికిందే.. బరువు బాగనే ఉన్నది. నీదేనా.. అని మాటల్ల దింపిండ్లు. నీమీదున్న నగలు ఇచ్చి బంగారు కడ్డీ తసుకొనిపో.. ఎవలైన సూత్తరని చెప్పిండ్లు. నమ్మి అది తీసుకొని ఇంటికి పోరుు చూసుకునే సరికి నకిలీదని తెలిసింది. మూడున్నర తులాల నగలు పోరుునరుు. పోలీసులకు చెప్పిన. - మాదాసు నర్సవ్వ, ధర్మపురి బంధువుల ఇంటికి పోతే.. ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామంలో ఉంటున్న బంధువుల ఇంటికి చుట్టపుచూపుగా 2012 నవంబర్ 11న వచ్చిన. కూరగాయలు కొనుక్కుని తిరిగి వస్తుండగా ముగ్గురు మహిళలు బంగారు కడ్డీ దొరికిందని చెప్పిండ్లు. ఇది పది తులాలుంటది. ఇది తీసికొని నీ ఒంటిమీదున్న పుస్తెలతాడు ఇరుు్వమని తొందరపెట్టిండ్లు. ఏంచెయ్యూల్నో తోచక రెండున్నర తులాల పుస్తెలతాడు తీసిచ్చిన. ఆ కడ్డీ నాచేతుల పెట్టి పోరుుండ్లు. అవుసులారుున దగ్గరికి పోరుు చూపించిన. బంగారం కాదని చెప్పిండు. - గాజుల రాజవ్వ, దండెపెల్లి, ఆదిలాబాద్ జిల్లా -
నకిలీ బంగారంతో మోసం
- నిందితుడు అరెస్ట్ - మరో ఇద్దరు కోసం పోలీసుల గాలింపు - రూ. 5.23 లక్షల నగదు, నకిలీ బంగారం స్వాధీనం క్రైం (కడప అర్బన్): కడపలోని ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తికి నకిలీ బంగారాన్ని అంటగట్టి, రూ. 10 లక్షలు కాజేసిన బృందంలోని ఓ నిందితుడిని క్రైం డీఎస్పీ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అరెస్ట్ చేశారు. నగర శివారులోని రాజంపేట రోడ్డులో పద్మావతీ నగర్‌కు వెళ్లే క్రాస్ రోడ్డులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ. 5.23 లక్షల నగదుతోపాటు, కిలో పైగా బరువున్న నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఈ సంఘటనపై కడప సీసీఎస్ పోలీసులు తమ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కడపలోని ఎర్రముక్కపల్లెకు చెందిన సురేంద్రారెడ్డి అనే రిటైర్డ్ ఉద్యోగికి గుజరాత్ రాష్ట్రానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు 2014 జూలైలో వాకింగ్‌లో పరిచయమయ్యారన్నారు. వీరిలో ముగ్గురు బాధితుని వద్దకు వెళ్లి తమ దగ్గర బంగారు ‘వినాయకుని ’ డాలర్లు వున్నాయని, వాటి బరువు సుమారు కిలోన్నర వుంటాయని తెలిపారు. తమ వెంట తీసుకొచ్చిన నకిలీ డాలర్లలో ఏదో ఒకటి బాధితుడు ఎంపిక చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టి, మాయ చేసి తమ వెంట తెచ్చుకున్న నకిలీని పోలిన అసలైన బంగారు వినాయకుని డాలర్‌ను ఇచ్చి కావాలంటే చెక్ చేయించకుని రమ్మని పేర్కొన్నారు. వారిచ్చిన డాలర్ అసలైనదని తెలియగానే, మిగతా నకిలీ డాలర్లను తక్కువ ధర పడుతాయని రూ. 10 లక్షలకు ఇచ్చేశారని చెప్పారు. వారు వెళ్లిన తర్వాత గమనిస్తే నకిలీవని తెలిసిందన్నారు. నిందితులది గుజరాత్ రాష్ట్రం: బాధితుడు ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అదే రోజున ఫిర్యాదు చేయగా కేసును నమోదు చేసి, తమకు బదిలీ చేశారన్నారు. దర్యాప్తులో భాగంగా విచారణ చేస్తుండగా, నిందితుల ఆచూకీ లభించిందన్నారు. అరెస్టయిన స్థలంలో నిఘా వుంచగా నిందితుల బృందంలో ఒకరు పట్టు బడ్డారన్నారు. పట్టుబడిన నిందితుడు గుజరాత్ రాష్ట్రం బనాస్ కాటి జిల్లా పాలన్పూర్ గ్రామం హర్యాపూర కాలనీలో నివసిస్తున్న సలాట్ శంకర్ భాయ్ అన్నారు. అతని వద్ద నుంచి రూ. 5.23 లక్షల నగదు, కిలోకు పైగా నకిలీ బంగారం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. మిగిలిన ఇద్దరు నిందితులు అదే ప్రాంతానికి చెందిన జీవన్‌లాల్, ధనీభాయ్లుగా తెలిసిందన్నారు. వారి కోసం ప్రత్యేక పోలీసు బృందంతో గాలిస్తున్నామన్నారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా వచ్చి మభ్యపెడితే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన వివరించారు. ఈ కేసులో కృషి చేసిన సీసీఎస్ సీఐ బి.కృష్ణయ్య, ఎస్ఐలు ఎర్రన్న, షఫీవుల్లా, హెడ్‌కానిస్టేబుళ్లు జయశంకర్, ఆర్.శ్రీనివాసులు, ప్రసాద్, శివాజీ, కానిస్టేబుళ్లు శ్యామ్, బాషా తదితరులను డీఎస్పీ అభినందించారు. -
చౌకగా బంగారమని ఎర!
నకిలీ బంగారంతో మోసం చేస్తున్న రాజస్థానీ బృందాలు సాక్షి, సిటీబ్యూరో: కుర్తా...దోతీ ధరించి, తలపై పాగా పెట్టుకొని... రాజస్థానీ సంస్కృతిని ప్రతిబింబించేలా వస్త్రధారణ చేసుకొని కొందరు కేటుగాళ్లు... వ్యాపారులు, అమాయక ప్రజలను టార్గెట్‌గా చేసుకొని చౌకగా బంగారం అంటూ నకిలీ బంగారం అంటగట్టి పెద్ద మొత్తంలో డబ్బు కొల్లగొడుతున్నారు. ‘భారీ మొత్తంలో మా పొలాల్లో బంగారం బిస్కెట్లు దొరికాయి...వాటిని మా రాష్ట్రంలో అమ్మితే సమస్యలు ఎదురవుతాయని ఇక్కడకు వచ్చాం. మీకు అసలు ధర కంటే తక్కువగా ఇస్తాం. ఏ పన్ను చెల్లించకుండానే పసిడి మీ సొంతమవుతుంది... భారీగా లాభాలు ఆర్జించవచ్చు ’అని ఈ గ్యాంగ్ సభ్యులు నమ్మబలుకుతుంది. అనంతరం అసలు బంగారం బిస్కెట్ ముక్కలను శాంపిల్‌గా ఇచ్చి అమాయకులను తమ ఉచ్చులోకి లాగుతున్నారు. వారిచ్చిన బంగారం ముక్కలను పరీక్షించుకుంటే వంద శాతం ఫర్ఫెక్ట్ పసిడేనని తేలుతుంది. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరకు 40 శాతం తక్కువ ధరగా బంగారం ఇస్తామని చెబుతారు. ఉదహరణకు 750 గ్రాముల బంగారు బిస్కెట్కు బహిరంగ మార్కెట్లో రూ. 25 లక్షలు ఉంటే వీళ్లు రూ. 15 లక్షలకు బేరానికి పెడతారు. ఒకసారి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించని వారు కాస్త సమయం తీసుకొని డబ్బు సర్దుతారు. అప్పుడే ఈ గ్యాంగ్ అంతకు ముందు శాంపిల్ బిస్కెట్ కట్‌చేసిన మాదిరిగానే ఇప్పుడు నకిలీ బిస్కెట్లను కట్‌చేసి ఇచ్చి పరీక్ష చేయించుకోమంటుంది. అయితే, అంతకు ముందే కదా పరీక్ష చేయించుకున్నాం.. మళ్లీ ఎందుకులే అని కొందరు ఆ బంగారం ముక్కలను పరీక్షించుకోకుండా డబ్బు చెల్లించి బంగారు బిస్కెట్లను తీసుకుంటున్నారు. తర్వాత అవి నకిలీ బిస్కెట్లు అని తెలిసి లబోదిబోమంటున్నారు. మేవాడ్ వాళ్లే ఎక్కువ... ఈ దొంగల ముఠాలో రాజస్థాన్‌లోని మేవాడ్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరు ఎక్కువగా ఫలక్‌నుమా ప్యాలెస్ సమీప ప్రాంతాలు, గోల్కొండలోని ఫతే దర్వాజా వద్ద చక్కర్లు కొడుతున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ వీరు దందా కొనసాగిస్తున్నారు. హిందువులు, ముస్లింలతో కలిసిపోయినట్టుగా నటిస్తారు. వీరు చూసేందుకు అమాయకంగా కనబడుతున్నా పదుల సంఖ్యలో ముఠాలుగా ఏర్పడి ప్రజలను బంగారం బిస్కెట్ల ఆశ చూపి మోసం చేస్తున్నారు. కొందరిని మోసం చేశాక ఒక్కో గ్రూప్ నుంచి సభ్యులు మరో ముఠాలోకి మారుతుంటారు. ఇలా ఎవరికీ అనుమానం రాకుండా బంగారం పేరుతో కాసులు కొల్లగొడుతున్నారు. సీపీ చొరవతో... ఫలక్‌నుమాకు చెందిన ఓ వ్యాపారి రాజస్థానీ గ్యాంగ్ చేతిలో మోసపోయి స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేశాడు. మూడేళ్లు పూర్తయినా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సదరు వ్యక్తి ఇటీవల హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు. వెంటనే ఆ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. సదరు ముఠాలను సాధ్యమైనంత తొందరగా పట్టుకోవాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం.ఇతనొక్కడే కాదు...ఇలా మో సపోయినవారు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. -
చౌకగా బంగారమని ఎర!
నకిలీ బంగారంతో మోసం చేస్తున్న రాజస్థానీ బృందాలు సాక్షి, హైదరాబాద్ : కుర్తా...దోతీ ధరించి, తలపై పాగా పెట్టుకొని... రాజస్థానీ సంస్కృతిని ప్రతిబింబించేలా వస్త్రధారణ చేసుకొని కొందరు కేటుగాళ్లు... వ్యాపారులు, అమాయక ప్రజలను టార్గెట్‌గా చేసుకొని చౌకగా బంగారం అంటూ నకిలీ బంగారం అంటగట్టి పెద్ద మొత్తంలో డబ్బు కొల్లగొడుతున్నారు. ‘భారీ మొత్తంలో మా పొలాల్లో బంగారం బిస్కెట్లు దొరికాయి...వాటిని మా రాష్ట్రంలో అమ్మితే సమస్యలు ఎదురవుతాయని ఇక్కడకు వచ్చాం. మీకు అసలు ధర కంటే తక్కువగా ఇస్తాం. ఏ పన్ను చెల్లించకుండానే పసిడి మీ సొంతమవుతుంది... భారీగా లాభాలు ఆర్జించవచ్చు ’అని ఈ గ్యాంగ్ సభ్యులు నమ్మబలుకుతుంది. అనంతరం అసలు బంగారం బిస్కెట్ ముక్కలను శాంపిల్‌గా ఇచ్చి అమాయకులను తమ ఉచ్చులోకి లాగుతున్నారు. వారిచ్చిన బంగారం ముక్కలను పరీక్షించుకుంటే వంద శాతం ఫర్ఫెక్ట్ పసిడేనని తేలుతుంది. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరకు 40 శాతం తక్కువ ధరగా బంగారం ఇస్తామని చెబుతారు. ఉదహరణకు 750 గ్రాముల బంగారు బిస్కెట్కు బహిరంగ మార్కెట్లో రూ. 25 లక్షలు ఉంటే వీళ్లు రూ. 15 లక్షలకు బేరానికి పెడతారు. ఒకసారి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించని వారు కాస్త సమయం తీసుకొని డబ్బు సర్దుతారు. అప్పుడే ఈ గ్యాంగ్ అంతకు ముందు శాంపిల్ బిస్కెట్ కట్‌చేసిన మాదిరిగానే ఇప్పుడు నకిలీ బిస్కెట్లను కట్‌చేసి ఇచ్చి పరీక్ష చేయించుకోమంటుంది. అయితే, అంతకు ముందే కదా పరీక్ష చేయించుకున్నాం.. మళ్లీ ఎందుకులే అని కొందరు ఆ బంగారం ముక్కలను పరీక్షించుకోకుండా డబ్బు చెల్లించి బంగారు బిస్కెట్లను తీసుకుంటున్నారు. తర్వాత అవి నకిలీ బిస్కెట్లు అని తెలిసి లబోదిబోమంటున్నారు. మేవాడ్ వాళ్లే ఎక్కువ... ఈ దొంగల ముఠాలో రాజస్థాన్‌లోని మేవాడ్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరు ఎక్కువగా ఫలక్‌నుమా ప్యాలెస్ సమీప ప్రాంతాలు, గోల్కొండలోని ఫతే దర్వాజా వద్ద చక్కర్లు కొడుతున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ వీరు దందా కొనసాగిస్తున్నారు. హిందువులు, ముస్లింలతో కలిసిపోయినట్టుగా నటిస్తారు. వీరు చూసేందుకు అమాయకంగా కనబడుతున్నా పదుల సంఖ్యలో ముఠాలుగా ఏర్పడి ప్రజలను బంగారం బిస్కెట్ల ఆశ చూపి మోసం చేస్తున్నారు. కొందరిని మోసం చేశాక ఒక్కో గ్రూప్ నుంచి సభ్యులు మరో ముఠాలోకి మారుతుంటారు. ఇలా ఎవరికీ అనుమానం రాకుండా బంగారం పేరుతో కాసులు కొల్లగొడుతున్నారు. సీపీ చొరవతో... ఫలక్‌నుమాకు చెందిన ఓ వ్యాపారి రాజస్థానీ గ్యాంగ్ చేతిలో మోసపోయి స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేశాడు. మూడేళ్లు పూర్తయినా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సదరు వ్యక్తి ఇటీవల హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు. వెంటనే ఆ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. సదరు ముఠాలను సాధ్యమైనంత తొందరగా పట్టుకోవాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఇతనొక్కడే కాదు...ఇలా మోసపోయినవారు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. -
అవినీతిపరులపై చర్యలేవి?
ఏలూరు (టూటౌన్) : జిల్లా సహకార కేంద్రబ్యాంకు చాగల్లు బ్రాంచిలో నకిలీ బంగారం కుదువ పెట్టి రూ. 2 కోట్ల 35 లక్షల 62 వేలకు బ్యాంకును మోసం చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేసి ఆరునెలలు అయినప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయటం లేదని జిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం) ఆరోపించారు. ఆయన సోమవారం వివరాలు అందచేశారు. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న 27 మంది వ్యక్తులతో పాటు బ్రాంచిలో అప్రయిజర్‌గా పనిచేసిన గొర్తి శ్రీనివాసరావు, బ్రాంచి మేనేజర్లు వాడ్రేవు సుబ్బారావు, కూచిపూడి సత్యనారాయణ, అసిస్టెంట్ మేనేజర్ సీహెచ్ హరిత, క్యాషియర్ గద్దే రామారావు తదితరులపై, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మానుకొండ కృష్ణారావు 2014 సెప్టెంబర్ 24వ తేదీన చాగల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై ఆ మరుసటి రోజునే కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకూ వారిని అరెస్ట్ చేయలేదన్నారు. దీనిపై గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన ఎన్.రఘురామిరెడ్డితో పాటు ప్రస్తుత ఎస్పీ బాస్కర్‌భూషణ్‌ను స్వయంగా కలిసి చెప్పినప్పటికి ప్రయోజనం లేదన్నారు. కొవ్వూరు డీఎస్పీకి ప్రతి రోజూ ఫోన్ చేస్తున్నానన్నారు. అయినప్పటికి వారు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో అర్థం కావటం లేదని ముత్యాలరత్నం ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోకపోవటంతో బ్రాంచికి రికవరీ రావటం లేదన్నారు. విచారణ అధికారిగా నిడదవోలు సీఐ ఈ కేసులో రికవరీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. అరెస్ట్‌లు చేయటం పెద్ద విషయం కాదు. ప్రభుత్వ సొమ్మును రా బట్టాలన్నదే మా ఉద్దేశం. ఈ కేసును నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ విచారిస్తున్నా రు. నాకు ఈ రోజే ఫోన్ చేసి అడిగారు. రోజు ఫోన్ చేయటం అనేది అబద్దం. - నర్రా వెంకటేశ్వరరావు, డీఎస్పీ, కొవ్వూరు. ఒరిజనల్ రికార్డు ఇవ్వమని అడిగాం చాగల్లు బ్రాంచి కేసుకు సంబంధించి ఒరిజనల్ రికార్డు ఇవ్వమని అడిగాం. విచారణకు ఒక లైజనింగ్ అధికారిని కేటాయించమని చెప్పాం. వారు స్పందించలేదు. ఈ కేసులో రూ.16 లక్షల రికవరీ జరిగింది. ఈ నెల 28వ తేదీకి మరికొంత రికవరీ వచ్చే అవకాశం ఉంది. డీసీసీబీ అధికారులు సహకరిస్తే వారంలో కేసు దర్యాప్తు పూర్తి చేస్తాం. - ఎం.బాలకృష్ణ, సీఐ, నిడదవోలు. -
‘నకిలీ’ ముఠా అరెస్ట్
చుంచుపల్లి (కొత్తగూడెం రూరల్) : నకిలీ నోట్లు, నకిలీ బంగారం చెలామణి చేస్తున్న ఆరుగురు సభ్యులున్న ముఠాను సోమవారం చుంచుపల్లి పంచాయతీలోని హౌజింగ్ బోర్డులో పట్టుకున్నట్టు కొత్తగూడెం డీఎస్సీ సురేందర్‌రావు, సీఐ మడత రమేష్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారు సోమవారం కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లతో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కొత్తగూడెం మండలంలోని హౌజింగ్ బోర్డ్ ప్రాంతానికి చెందిన మేదర మొయినుద్దీన్, అశ్వారావుపేటకు చెందిన పాకాల కోటేశ్వరరావు, సత్తుపల్లికి చెందిన గుమ్‌షావలి, సత్తుపల్లికి చెందిన ఓడ్లపెల్లి నాగేశ్వరరావు, వేంసూరుకు చెందిన చక్రాల రామకృష్ణ, కొత్తగూడేనికి చెందిన విద్యాసాయి ప్రకాష్ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. పదివేల రూపాయలు అసలు నోట్లు ఇస్తే, లక్ష రూపాయల నకిలీ నోట్లు ఇస్తామంటూ కొందరిని వీరు నమ్మించి మోసగిస్తున్నారు. ఎవరైనా వచ్చి పదివేల రూపాయల అసలు నోట్లు ఇవ్వగానే.. వీరు నకిలీ లక్ష రూపాయల నోట్లు ఇవ్వరు. ఇంతలో ఈ ముఠాలోని సభ్యులే బయటి నుంచి విజిల్ వేస్తారు. ఆ వెంటనే వీరంతా.. ‘పోలీసులు వస్తున్నారు’ అంటూ, ఆ పదివేల రూపాయలతో అక్కడి నుంచి పారిపోతారు. బంగారం అమ్ముతామని.. బంగారం అమ్ముతామంటూ ఈ ముఠా సభ్యులు పాల్వంచకు చెందిన సుభాష్‌రెడ్డిని కలిశారు. అతని నుంచి ఐదువేల రూపాయలు తీసుకుని ‘బంగారం’ ఇచ్చి వెళ్లిపోయూరు. ఆ తరువాత, అది అసలు బంగారం కాదని, నకిలీదని సుభాష్‌రెడ్డి తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. చుంచుపల్లి పంచాయతీలోని హౌజింగ్ బోర్డులో ఈ ముఠా ఉందన్న సమాచారంతో పోలీసులు సోమవారం అక్కడకు వెళ్లి పట్టుకున్నారు. కిలో నకిలీ బంగారం, పది లక్షల రూపాయల దొంగ నోట్లు స్వాధీనపర్చుకున్నారు. ఈ ముఠాలోని పాకాల కోటేశ్వరరావు, గుమ్‌షావలిపై భద్రాచలం, తాడిపల్లిగూడెం, నందిగామ, కొత్తగూడెం టూటౌన్, దమ్మపేట, అశ్వారావుపేట తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నారుు. సమావేశంలో ఎస్ఐ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
గుడికి తీసుకెళ్లి గుండు కొట్టించారు
నిజామాబాద్ క్రైం: తమకు దొరికిన బంగారాన్ని అతి తక్కువ ధరకే ఇస్తామని ఓ బాధితుడిని ఇద్దరు మహిళలు గుడికి తీసుకువెళ్లి మోసం చేసిన వైనం ఇది. అత్యాశకు పోయిన బాధితుడు విషయం తెలుసుకుని ల బోదిబోమంటున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి బుధవారం రెండో టౌన్ రెండవ ఎస్సై నాగారాజు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రెండవ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి కసాబ్‌గల్లీకి చెందిన కొతిమిర్‌కర్ నరేష్ మాంసం వ్యాపారం చేస్తుంటాడు. ఇతని ఇంట్లో ఉతకాల్సిన బట్టలు చాలా ఉండడంతో కూలీ కోసం మంగళవారం నెహ్రూ పార్కుకు వెళ్లాడు. అక్కడ ఇద్దరు మహిళలకు చేయాల్సిన పనిచెప్పడంతో వారు నరేష్ ఇంటికి వచ్చారు. వారు బట్టలు ఉతుకుతూ నరేష్‌ను బోల్తా కొట్టించడానికి మాటా మాట కలిపారు. తమకు గుప్తా నిధి దొరికిందని, అందులో బంగారం బిళ్లలు ఉన్నాయని, వాటిని అమ్ముతామని చెప్పారు. తమ వద్ద ఉన్న అసలు బంగారం ముక్కను నరేష్‌కు ఇచ్చి దీనిని బంగారం దుకాణంలో చూపించుకోవాలంటూ సూచించారు. దీంతో నరేష్ బంగారాన్ని దుకాణంలో చూపించగా, యజమాని ఇది అసలైన బంగారమే అంటూ చెప్పడంతో ఉప్పొంగిపోయాడు. తనకు అరకిలో బంగారం కావాలని, దీనికిగాను రూ. లక్షా 50 వేలు నగదు ఇస్తానని చెప్పడంతో వారి మధ్య ఒప్పందం కుదిరింది. బట్టలన్ని ఉతకడం పూర్తయ్యాక తాము బంగారం తీసుకువస్తామని, నాందేవ్వాడలో గల మందిరం రావాలని, అక్కడ దైవ సన్నిధిలో బంగారం ఇస్తామని మహిళలు చెప్పారు. దీంతో వారి మాటలు నమ్మిన నరేష్ డబ్బులు తీసుకుని గుడికి వెళ్లాడు. అక్కడ నరేష్‌కు మహిళలు బొట్టుపెట్టి రూ. లక్షా 50 వేలు నగదు తీసుకుని, ఇత్తడి బిళ్లలపై బంగారం పూత పూసిన మూడు బిళ్లలను ఇచ్చారు. నరేష్ వాటిని తీసుకుని మరోసారి దుకాణానికి తీసుకువెళ్లి చూపించగా, అవి నకిలీ బంగారం బిళ్లలని తేలడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. తెలిసిన వారికి జరిగిన మోసం గురించి చెప్పటంతో వారి సలహాల మేరకు బుధవారం ఉదయం బాధితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. -
బంగారం ‘బిస్కెట్’ వేశాడు..
⇒ రూ. 2 లక్షలకే కిలో బంగారం! ⇒ ఢిల్లీ నుంచి ఆగంతుకుడి ఫోన్ ⇒ ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్లిన 30 మంది ⇒ నకిలీ బంగారం ఇచ్చి ⇒ మోసం చేసిన వైనం ⇒ ఆలస్యంగా సంఘటన వెలుగులోకి ⇒ పోలీసులకు అందని ఫిర్యాదు ఉప్లూర్ (కమ్మర్పల్లి): మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు రూ. రెండు లక్షలకు కిలో చొప్పున బంగారం కొనుగోలు చేసి మోసపోయిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఒక ఆగంతకుడు గ్రామంలోని చాలామందికి ఫోన్ చేసి తమ వద్ద బంగారం ఉందని, కావాలంటే రూ. రెండు లక్షలకు కిలో ఇస్తామని నమ్మించాడు. దీంతో కొందరు గ్రూపులు గ్రూపులుగా కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ లాడ్జి తీసుకొని అందులో ఉండి, ఫోన్ చేసిన వ్యక్తిని కలిశారు. దేవాలయాల్లోని బంగారమని, దీన్ని తక్కువ ధరకు విక్రయించి తొందరగా నగదు చేసుకోవాలనుకుంటున్నామని ఆగంతకుడు వారిని నమ్మించాడు. తన వద్ద ఉన్న బంగారం బిస్కెట్ నుంచి ఓ ముక్క కత్తిరించి ఇచ్చి అసలుదా, నకిలీదా చెక్ చేసుకోవాలని సూచించాడు. దీంతో వారు జ్యూయలరీ షాపులకు వెళ్లి చెక్ చేసుకొని అసలుదని నిర్ధారణ చేసుకున్నారు. అనంతరం బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారాన్ని రూ. రెండు లక్షలకు కిలో కొనుగోలు చేసుకొని స్వగ్రామానికి తిరిగి వచ్చారు. కొంతమంది కిలో, రెండు కిలోలు చొప్పున 30 మందికి పైగా కొనుగోలు చేసినట్లు సమాచారం. స్వగ్రామానికి వచ్చాక స్థానిక కంసాలి వద్దకు వెళ్లి చూపగా, బిస్కెట్లు రాగివని తేలింది. దీంతో మోసపోయామని గ్రహించి గొల్లుమన్నారు. వారం రోజుల పాటు గోప్యత పాటించినప్పటికీ బయటకు పొక్కింది. ఆనోట, ఈనోట పడి ఊరంతా దావానలంలా వ్యాపించింది. బాధితులు బయటకు చెప్పుకోలేక, మింగలేక కక్కలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు సమాచారం. పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణ పేరిట ఎటు పోతుందో తెలియక భయపడి ఊరుకుంటున్నారు. ఫోన్‌నంబర్లు ఎలా తెలుసంటే.. గ్రామంలోని కొంతమందికి బంగారం కొనుగోలు గురించి ఫోన్ చేసినవారికి బాధితుల ఫోన్ నంబర్లు ఎలా తెలుసనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలోని హార్వెస్టర్, ట్రాక్టర్ డ్రైవర్ల ద్వారా ఢిల్లీలోని మోసగాళ్లకు తెలిసినట్లు గ్రామంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వారే తమ యజమానుల ఫోన్ నంబర్లు సదరు వ్యక్తులకు అందించినట్లు తెలుస్తోంది. -
బాధితులు.. నిందితులు.. విద్యావంతులే
ఇటీవల నగరంలో జరుగుతున్న మోసాలు ఎక్కువగా విద్యావంతులే చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తోంది. మోసపోయేదీ చదువుకున్నవారే. వీరి సులువుగా డబ్బు సంపాదించి విలాస జీవితం గడిపేందుకు మోసాలను దగ్గరి మార్గంగా ఎంచుకుంటున్నారు. ఉద్యోగాల పేరిట నగరంలోని కృష్ణలంక పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసగించిన నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిందీ. వీరిలో ముగ్గురు బీటెక్ చేయగా. ఒకరు ఇంటర్‌ను మధ్యలోనే ఆపేశారు. నిందితుల్లో సాధిక్, ప్రవీణ్‌కుమార్, రాజేష్ బీటెక్ చదివారు. ప్రధాన నిందితుడైన పి.భరత్‌చంద్ర ఇంజినీరింగ్ మధ్యలోనే ఆపేశాడు. బాగా చదువుకొని ఖాళీగా ఉండే వారిని లక్ష్యంగా చేసుకొని వీరు మోసాలకు దిగారు. వీరి చేతిలో మోసపోయిన వారిలో ఎంబీఎ పట్టభద్రులు, బీటెక్ చదివిన వారూ ఉన్నారు. ఉద్యోగాలను ఆశగా చూపించగానే ఏమాత్రం ఆలోచించకుండా నిందితుల చేతుల్లో లక్షలకు లక్షల రూపాయలు పోశారు. క్లిష్టమైన ఉద్యోగాల సులువుగా ఎలా వస్తాయని ఏ ఒక్కరు ఆలోచించినా వీరి మోసాలకు ఆదిలోనే అడ్డుకట్ట పడేదని సెంట్రల్ జోన్ ఏసీపీ లావణ్యలక్ష్మి అన్నారు. నకిలీ బంగారంతో.. తక్కువ ధరకు బంగారం పేరిట మోసగించిన ముఠా సభ్యులు కూడా విద్యావంతులే. ఈ కేసులో మాచవరం పోలీసులు అరెస్టు చేసిన రుద్రపాటి డేవిడ్ ఎంబీఎ చదవగా..ఇదే ముఠా సభ్యులైన మణీంద్రకుమార్ బీఎస్సీ, గోపీనాథ్ ఎంఎ, బీఏ బీఈడీ చేసిన శ్రీకాంత్, బీఎస్సీ చదివిన శివకిషోర్ ఉన్నారు. వీరి చేతిలో మోసపోయిన వారూ.. పెద్ద చదువులు చదువుకొని వ్యాపార రంగంలో స్థిరపడిన వారే. ఇంకా ఉంటారు పోలీసులకు చిక్కిన వాళ్లే కాకుండా చిక్కని మోసగాళ్లూ ఉన్నారు. రక రకాల పద్ధతుల్లో ఇటీవల ఉన్నత విద్యావంతులే మోసాలు చేస్తున్నారు. పరువుకు భయపడి కొందరు బాధితులు ముందుకు రావడం లేదు. మోసపోతున్న వారిలో బాగా చదువుకున్న వాళ్లు ఉండటం దురదృష్టకరం. -
పీడీసీసీ బ్యాంకులో చేతివాటం
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (పీడీసీసీ బ్యాంకు)లో బంగారం రుణాల మంజూరులో గోల్మాల్ జరిగింది. తాకట్టు పెట్టే బంగారం నాణ్యతను పరిశీలించి.. తూకం వేసే అప్రైజర్ చేతివాటం ప్రదర్శించి తన అనుయాయులకు లక్షల రూపాయల సొమ్మును అప్పనంగా దోచిపెట్టాడు. ఈ అక్రమం 2011 నుంచి జరుగుతుండగా తాజాగా వెలుగులోకి వచ్చింది. తక్కువ తూకం ఉన్న బంగారు నగలను ఎక్కువ తూకం ఉన్నట్లు చూపి ఖాతాదారులకు లక్షలాది రూపాయలు అదనంగా చెల్లించారు. నకిలీ బంగారంతో కూడా రుణాలు మంజూరు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అప్రైజర్‌ను గుడ్డిగా నమ్మి బ్యాంకు అధికారులు నిండా మునిగారు. బంగారం తాకట్టు రుణాల్లో జరిగిన అవకతవకలు బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్‌బాబు చొరవతో వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఓ బ్యాంకు మేనేజర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మూడేళ్లలో బంగారం తాకట్టు రుణాల మంజూరుకు సంతకాలు చేసిన బ్యాంకు మేనేజర్లందరినీ పిలిపించి వారి సమక్షంలోనే మరో అప్రైజర్ సాయంతో బంగారం నాణ్యత, తూకం వివరాలు పరిశీలిస్తున్నారు. బంగారం తాకట్టుపై వ్యవసాయ రుణాలు ఇస్తారు. తాకట్టు పెట్టే బంగారం నాణ్యతను పరిశీలించి తూకం వేసి ఆ వ్యక్తికి ఎంత రుణం మంజూరు చేయాలో అప్రైజర్ నిర్ణయిస్తాడు. అప్రైజర్ నిర్ణయించిన మొత్తాన్ని సంబంధిత బ్యాంకు మేనేజర్ మంజూరు చేస్తారు. ఈలోపు ఆ వ్యక్తి ఎన్ని బంగారు వస్తువులు తాకట్టు పెడుతున్నాడు.. వాటి బరువు ఎంత ఉందో మేనేజర్ స్వయంగా పరిశీలించాలి. అప్రైజర్ మీద నమ్మకంతో మేనేజర్లు ఇదేమీ చూడకుండానే సంతకాలు చేసి రుణాలు మంజూరు చేసి నగదు చెల్లించారు. తక్కువ బంగారం పెట్టి ఎక్కువ బంగారం పెట్టినట్లు లెక్కలు రాసి లక్షలాది రూపాయలు అదనంగా అప్రైజర్ తన అనుయాయులకు చెల్లించాడు. ఏడాదికోసారి జరిగే రుణాలు పరిశీలనలో కూడా రుణాల గోల్మాల్ వ్యవహారం వెలుగు చూడలేదు. మేనేజర్లు బదిలీ అయ్యి కొత్త మేనేజర్లు బాధ్యతలు స్వీకరించే సమయంలో కూడా గట్టురట్టు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త మేనేజర్లు అన్నీ స్వయంగా పరిశీలించుకున్న తర్వాతే బాధ్యతలు స్వీకరించాలి. కొత్త మేనేజర్లు వచ్చినప్పుడు బంగారం పరిశీలనలో కూడా సదరు అప్రైజరే వారికి సహాయకునిగా మెలిగి ఈ మోసం వెలుగు చూడకుండా ఇప్పటివరకు నెట్టుకొచ్చాడు. రంగంలోకి దిగిన చైర్మన్ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు చొరవతో రుణాల గోల్మాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బంగారం తాకట్టు రుణాలను వెరిఫికేషన్ చేయమని తాజాగా నాబార్డు ఆదేశాలు జారీ చేసింది. గతంలో రుణాలు వెరిఫికేషన్ జరిగినప్పుడు రుణాలు మంజూరుకు సిఫార్సు చేసిన అప్రైజర్నే పక్కన పెట్టుకుని చేసేవారు. ఆయన అన్ని బాగా ఉన్నాయని ధ్రువీకరించగానే కథ ముగిసేది. ఈసారి ఈదర మోహన్ ఆ పాత పద్ధతికి స్వస్తి చెప్పి రుణాలు పునః పరిశీలన బాధ్యతలను మేనేజర్లు, బ్యాంకు అప్రైజర్‌కు కాకుండా వేరే అప్రైజర్‌కు అప్పగించారు. వీరి పరిశీలనలో రుణాలు భాగోతం వెలుగు చూసింది. వీరు బంగారం రుణాల మంజూరులో కర్నూలురోడ్డు శాఖలో అవకతవకలున్నట్లు గుర్తించి బ్యాంకు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ బ్యాంకు మేనేజర్‌ను ఆయన శనివారం సస్పెండ్ చేశారు. సొమ్మంతా రాబడతాం బంగారం రుణాలకు బ్యాంకు చెల్లించిన మొత్తం సంబంధిత వ్యక్తుల నుంచి రాబడతామని బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు తెలిపారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాంకు సొమ్ము ఒక్క పైసా కూడా నష్టపోకుండా మొత్తం సొమ్ము రాబడతామని మోహన్‌బాబు స్పష్టం చేశారు. -
రూ.లక్షతో ఉడాయింపు
నకిలీ బంగారం తాకట్టుపెట్టి.. బాదలాపురం (మిర్యాలగూడ క్రైం), న్యూస్‌లైన్ : మహిళ వద్ద నకిలీ బంగారం తాకట్టుపెట్టి లక్ష రూపాయలతో ఓ జంట ఉడాయించింది. ఈ ఘటన బాదలాపురం గ్రామపంచాయతీ పరిధి అవంతీపురంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పర్వతం ఎల్లమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ జంట తమ పేర్లు శివ, లక్ష్మి అని, తమది పుట్టపర్తి అని చెప్పుకుంటూ వారం రోజులుగా గ్రామంలో తుంగచాపల వ్యాపారం నిర్వహిస్తున్నారు. చాపలు విక్రయించిన తర్వాత రాత్రివేళ అదే గ్రామానికి చెందిన ఎల్లమ్మ ఇంటి ఆవరణలో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 28వ తేదీన తన అల్లుడికి ప్రమాదం జరిగిందని, డబ్బులు అవసరముందని లక్ష్మి, శివలు రోదిస్తూ ఎల్లమ్మతో తెలి పారు. తమవద్ద ఉన్న బంగారు బిల్లలు తాకట్టు పెట్టుకొని లక్ష రూపాయలు ఇవ్వాలని కోరారు. ఒక బిల్లను పరిశీలించుకోమని ఇచ్చారు. ఆ బిల్ల బంగారపుదే కావడంతో ఎల్లమ్మ నమ్మి తన బిడ్డ పెళ్లి కోసం దాచిన లక్ష రూపాయలను వారికి ఇచ్చింది. రెండురోజుల్లో వచ్చి తమ బంగారం తీసుకెళతామని చెప్పి శివ, లక్ష్మి వెళ్లిపోయారు. వారం రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ లేకపోవడంతో అనుమానం వచ్చి బిల్లలను పరీక్ష చేయించగా నకిలీవని తేలాయి. దీంతో ఆమె లబోదిబోమంటూ మంగళవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ప్రొబేషనరీ డీఎస్పీ విజయ్‌భాస్కర్ తెలిపారు. -
దడ పుట్టిస్తున్న నకిలీ బంగారం కుంభకోణం
డీసీసీబీ ఉద్యోగుల్లో కలకలం పూర్తి స్థాయిలో దర్యాప్తు: చైర్మన్ విశాఖపట్నం, న్యూస్‌లైన్ : తీగ లాగితే డొంక కదిలినట్టు నకిలీ బంగారం కుంభకోణం బ్యాంకు ఉద్యోగుల్లో దడ పుట్టిస్తోంది. నకిలీ బంగారం తాకట్టుతో ఉద్యోగులు బ్యాంకు సొమ్మును కాజేసిన సంఘటన బ్యాంకు వర్గాల్లో కలకలం రేపుతోంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ విశాఖ మె యిన్రోడ్డు బ్రాంచిలో నకిలీ బంగారం కుంభకోణం బయటపడిన సంగతి తెలిసిందే. శనివారం ‘సాక్షి’ దినపత్రికలో ‘నకిలీల’ వార్తా కథనంతో నకిలీ బంగారం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే బ్యాంకు అధికారులు ప్రాథమిక వివరాలు సేకరించి మోసం జరిగినట్టు గ్రహించారు. కుంభకోణంలో ఎంత మంది పాత్ర ఉందన్న దిశగా దర్యాప్తు జరుగుతోంది. బ్యాంక్‌లో రుణం పొందిన లబ్ధిదారులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. వీరంతా నిజమైన లబ్ధిదారులా! లేక బ్యాంక్ ఉద్యోగులు ఆధారాలు సష్టించి సొమ్ము స్వాహా జేశారా! అనే కోణంలో విచారణ జరిపేందుకు సిద్ధపడ్డారు. మోసానికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు రంగం సిద్ధమవుతోంది. ఇదే తరహా మోసం ఇతర బ్రాంచి బ్యాంకుల్లో జరిగిందా! అనే సందేహం పలువురిలో వ్యక్తమవుతోంది. సమగ్ర విచారణ జరిపితే మరికొన్ని కుంభ కోణాలు వెలుగులోకి రావచ్చన్న అభిప్రాయాలు లేకపోలేదు. బ్యాంక్ సొమ్ము కాజేసిన సంఘటనలో బాధ్యులై వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీసీబీ చైర్మన్ ఉప్పలపాటి సుకుమార వర్మ తెలియజేశారు. బ్యాంక్ సొమ్ము కాజేసిన సంఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు. 35 రుణాల మంజూరు విషయంలో రూ33.89 లక్షలు మోసం జరిగినట్టు నిర్థారించామని స్పష్టం చేశారు. విచారణాధికారిని నియమించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులను ఉపేక్షించే ప్రసక్తి లేదని చైర్మన్ హెచ్చరించారు. -
విశాఖ జిల్లాలో బంగారం పేరుతో మోసం
విశాఖపట్నం: రాష్ట్రంలో దుండగుల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బంగారాన్ని అపహరించడం, నకిలీ బంగారాన్ని అమ్మడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా విశాఖ జిల్లాలోని యలమంచిలిలో బంగారం పేరుతో దుండగులు మోసానికి పాల్పడ్డారు. స్వచ్చమైన బంగారమని చెప్పి, ఓ కుటుంబాన్ని నమ్మబలికిన దుండగులు నకిలీ బంగారాన్ని కట్టబెట్టి సుమారు 8.50లక్షల రూపాయల సొమ్ముతో ఉడాయించారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధిత కుటుంబం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్టు చెప్పారు. -
నకిలీ బంగారం విక్రయించే ముఠా అరెస్టు
కొండపాక, న్యూస్‌లైన్ : నకిలీ బంగారాన్ని అసలైన బంగారంగా చూపుతూ నమ్మించి మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఒకే కుటుంబానికి చెందిన మహిళతో సహా ముగ్గురిని కుకునూర్‌పల్లి పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం విలేకరులకు వివరించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ దగ్గరున్న బెహరాగడ్ గ్రామానికి చెందిన శాంతాబాయి, తమ్ముడు జీవన్, కుమారుడు ప్రజల్ని బురుడీ కొట్టించి నకిలీ బంగారాన్ని అంటగట్టేవారు. అంతేగాకుండా గంజాయిని కూడా విక్రయించేవారు. ఇదే క్రమంలో ఆదివారం సాయంత్రం కుకునూర్‌పల్లిలో నకిలీ బంగారాన్ని అసలైందిగా చూపుతూ మోసం చేసే యత్నంలో ఉండగా.. తమకు సమాచారం అందిందన్నారు. దీంతో గ్రామానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించామన్నారు. వారి నుంచి 1.650 కి లోల నకిలీ బంగారంతో తయారైన ఆభరణాలు, కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఇద్దరు ట్రైనీ ఎస్ఐలు అశోక్, జయశంకర్, ఏఎస్ఐ మొగిలయ్య, కానిస్టేబుళ్లు సుభాష్, గణేష్, కనకారెడ్డిలు ఉన్నారు.