బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు గోల్డ్ కుదువపెట్టిన ఖాతాదారులు
సాక్షి, పూసపాటిరేగ (నెల్లిమర్ల): నకిలీ బంగారు ఆభరణాలు కుదువపెట్టి బ్యాంకుకు బురిడీ కొట్టించిన సంఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. దీనికి సంబంధించి సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. పూసపాటిరేగ మండలం కోనాడ జంక్షన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో నకిలీ బంగారం కుదువపెట్టి లక్షలాది రూపాయలు కాజేసినట్లు తెలిసింది. బ్యాంకు అప్రైజర్ ప్రోత్సాహంతోనే ఈ విధంగా పలువురు బ్యాంకును మోసగించినట్లు సమాచారం. ఓ ఖాతాదారుడు కుదువపెట్టిన నగలను రెన్యువల్ చేయించుకునేందుకు రమ్మని కబురంపగా ఆయననుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు వస్తువులను పరిశీలించడంతో అవి నకిలీవిగా తేలింది. దీనిపై రెండురోజులుగా బ్యాంకులో ఏరియా మేనేజర్ సి. శ్రీనివాసరావు సమక్షంలో నలుగురు బంగారం నాణ్యత చూసే వ్యక్తులతో పాటు, పలువురు ఆ శాఖ ఉన్నతాధికారులు బ్యాంకులో తనిఖీలు చేపడుతున్నారు. మత్స్యకార గ్రామాలైన కోనాడ, తిప్పలవలసకు చెందిన వ్యక్తులు అత్యధికంగా బ్యాంకులో నకిలీ వస్తువులతో రుణాలు పొందినట్లు వెల్లడైంది.
బంగారు నాణ్యత పరిశీలించిన వ్యక్తి కోనాడ వాసి కావడంతో ఆయనతో పరిచయం ఉన్న పలువురు వ్యక్తులకు నకిలీ బంగారు నగలు ఇచ్చి బ్యాంకులో రుణాలు తీసుకోవాలని ప్రోత్సహించి, వారి పేరున తానే నిధులు కాజేశాడన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బ్యాంకు నుంచి రూ. 17 కోట్ల వరకు పలువురు ఖాతాదారులు బంగారు ఆభరణాలపై రుణాలు పొందారు. అందులో ఎంతమంది నకిలీ ఆభరణాలు ఇచ్చారనేది తేలాల్సి ఉంది. బ్యాంకులో బంగారు రుణాలు తీసుకున్న ఖాతాదారులను పిలిపించి వారి సమక్షంలోనే బంగారు నాణ్యత పరీక్షలు చేస్తున్నారు. దీనిపై పూర్తిగా పరిశీలన చేసిన తర్వాతే వాస్తవాలు బయటకు రాగలవని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీనిపై బ్యాంకు ఏరియా మేనేజర్ సి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నకిలీ బంగారు నగలతో రుణాలు పొందారనే సమాచారంతో తనిఖీలు చేస్తున్నాం. కోనాడకు చెందిన వనం వెంకటప్పడు అనే వ్యక్తి గోల్డ్‌లోన్ రెన్యువల్‌కు ముఖం చాటేయడంతో అనుమానం వచ్చి కుదువపెట్టిన వస్తువులను పరిశీలించడంతో నకిలీ వస్తువుగా తేలిందని తెలిపారు. దీనిపై పూరిస్థాయిలో విచారణ చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment