సాక్షి ప్రతినిధి,ఏలూరు: సహకార చట్టంలోని బ్యాంకుల నిబంధనలను పాటించలేదు.. రుణపరిమితిని అడ్డగోలుగా ఇష్టానుసారంగా పెంచేశారు.. సరైన షూరిటీలు లేకుండా కోట్లాది రూపాయల రుణాలు మంజూరు చేశారు. అర్హులైన రైతులకు ఇవ్వాల్సిన రుణాలను పక్కదారి పట్టించి మద్యం వ్యాపారులతో సహా పలువురికి కట్టబెట్టారు. ఇదంతా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పరిధిలోని బ్రాంచీల్లో జరిగిన అవినీతి పర్వం.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని డీసీసీబీ పరిధిలోని ఆరు శాఖల్లో జరిగిన భారీ అవకతవకలపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. సమగ్ర విచారణ నివేదిక ఆధారంగా గతంలో పనిచేసిన ఉన్నతాధికారులందరిపై శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గతంలో పనిచేసిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌తో పాటు మేనేజర్ కేడర్‌లోని 17 మందిపై చర్యలు తీసుకోనున్నారు.
రుణాల మంజూరు విషయంలో..
జిల్లాలోని DCCB పరిధిలోని పలు బ్రాంచీల్లో ఏళ్ల తరబడి రుణాల మంజూరు విషయంలో భారీగా అవకతవకలు జరిగాయి. వివాదాల్లో ఉన్న భూము లను బ్యాంకుల్లో షూరిటీగా చూపించి కోట్ల రూపాయల రుణాలు పొంది తిరిగి రూపాయి కూడా చెల్లించని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలోని యలమంచిలి, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, ఏలూరుతో పాటు మరికొన్ని బ్రాంచీల్లో జరిగిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం గుంటూరు కో–ఆపరేటివ్ రిజిస్ట్రార్‌ను ప్రత్యేకాధికారిగా నియమించింది. సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనిపై కో–ఆపరేటివ్ శాఖ క మిషనర్ ఎ.బాబు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.
అక్రమాల్లో కొన్ని..
● యలమంచిలి బ్రాంచీలో వివాదాలతో ఉన్న ఆ స్తులను షూరిటీలుగా చూపించి రూ.33.22 కోట్ల రుణం మంజూరు చేశారు. దీనిలో రూ.13.86 కోట్లు ఇప్పటికీ రికవరీ కాలేదు. అలాగే 2015–16, 2017–18 నాబార్డు వార్షిక తనిఖీల్లో నిర్దేశించిన నిబంధనలను అతిక్రమించి రుణాలు మంజూరు చేసినట్లుగా నిర్ధారించారు. ఎలాంటి షూరిటీలు లేకుండా రుణాలు మంజూరు చేసి బ్యాంకుకు ఆర్థిక నష్టం చేకూర్చారు.
● తాడేపల్లిగూడెం బ్రాంచీలో 104 మంది సభ్యుల పేరుతో రూ.2.80 కోట్లను ఓ రియల్టర్‌కు రుణంగా ఇచ్చారు. తాడేపల్లిగూడెంలోని డీసీసీబీ బ్రాంచీలో మొత్తం బకాయిల విలువ రూ.11.69 కోట్లు కాగా 559 రుణాలు విలువ రూ.4.30 కోట్లు. వీటి గడువు దాటినా కొన్నింటి వసూళ్లకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
● 2012–13 నుంచి 2018–19 వరకు డీసీసీబీ పలు శాఖల ద్వారా రూ.867.19 కోట్ల విలువైన 2,445 బ్యాంకు గ్యారంటీలు జారీ చేసింది. దీనిలో రూ.295.35 కోట్ల విలువైన 23 బ్యాంకు గ్యారంటీలను మద్యం వ్యాపారులు, రైస్‌మిల్లులు, ఇతరులకు ఇచ్చినట్టు గుర్తించారు.
● వ్యవసాయ భూమి విలువ భారీగా పెంచి షూరిటీగా చూపి రుణాలు కూడా మంజూరు చేశారు.
క్రిమినల్ కేసులు
అక్రమాలు జరిగిన క్రమంలో ఆయా కాలంలో పనిచేసిన బ్యాంకు అధికారులపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేశారు. మేనేజర్లు మన్నె మోహనరావు, ఐవీ నాగేశ్వరరావు, డి.ఆంజనేయులు, టీవీ సుబ్బారావు, కేఏ అజయ్‌కుమార్, జి.పిచ్చయ్యచౌదరి, కె.సురేంద్రప్రసాద్, ఎం.శ్రీనివాసరావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్.రాధాకృష్ణ, జేఎస్‌వీ సత్యనారాయణరావు, సీహెచ్ రత్నకుమారి, కె.కిరణ్మయి, వి.శ్రీదేవి, డి.రమణ, జనరల్ మేనేజర్లు ఎ.మాధవీమూర్తి, వైవీ రాఘవేంద్రరెడ్డి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీవీఎం ఫణి తదితరులపై క్రిమినల్ చర్యలతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సిఫార్సు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment