
నకిలీ బంగారంతో మోసం
- నిందితుడు అరెస్ట్
- మరో ఇద్దరు కోసం పోలీసుల గాలింపు
- రూ. 5.23 లక్షల నగదు, నకిలీ బంగారం స్వాధీనం
క్రైం (కడప అర్బన్): కడపలోని ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తికి నకిలీ బంగారాన్ని అంటగట్టి, రూ. 10 లక్షలు కాజేసిన బృందంలోని ఓ నిందితుడిని క్రైం డీఎస్పీ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అరెస్ట్ చేశారు. నగర శివారులోని రాజంపేట రోడ్డులో పద్మావతీ నగర్‌కు వెళ్లే క్రాస్ రోడ్డులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ. 5.23 లక్షల నగదుతోపాటు, కిలో పైగా బరువున్న నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఈ సంఘటనపై కడప సీసీఎస్ పోలీసులు తమ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కడపలోని ఎర్రముక్కపల్లెకు చెందిన సురేంద్రారెడ్డి అనే రిటైర్డ్ ఉద్యోగికి గుజరాత్ రాష్ట్రానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు 2014 జూలైలో వాకింగ్‌లో పరిచయమయ్యారన్నారు.
వీరిలో ముగ్గురు బాధితుని వద్దకు వెళ్లి తమ దగ్గర బంగారు ‘వినాయకుని ’ డాలర్లు వున్నాయని, వాటి బరువు సుమారు కిలోన్నర వుంటాయని తెలిపారు. తమ వెంట తీసుకొచ్చిన నకిలీ డాలర్లలో ఏదో ఒకటి బాధితుడు ఎంపిక చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టి, మాయ చేసి తమ వెంట తెచ్చుకున్న నకిలీని పోలిన అసలైన బంగారు వినాయకుని డాలర్‌ను ఇచ్చి కావాలంటే చెక్ చేయించకుని రమ్మని పేర్కొన్నారు. వారిచ్చిన డాలర్ అసలైనదని తెలియగానే, మిగతా నకిలీ డాలర్లను తక్కువ ధర పడుతాయని రూ. 10 లక్షలకు ఇచ్చేశారని చెప్పారు. వారు వెళ్లిన తర్వాత గమనిస్తే నకిలీవని తెలిసిందన్నారు.
నిందితులది గుజరాత్ రాష్ట్రం: బాధితుడు ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అదే రోజున ఫిర్యాదు చేయగా కేసును నమోదు చేసి, తమకు బదిలీ చేశారన్నారు. దర్యాప్తులో భాగంగా విచారణ చేస్తుండగా, నిందితుల ఆచూకీ లభించిందన్నారు. అరెస్టయిన స్థలంలో నిఘా వుంచగా నిందితుల బృందంలో ఒకరు పట్టు బడ్డారన్నారు. పట్టుబడిన నిందితుడు గుజరాత్ రాష్ట్రం బనాస్ కాటి జిల్లా పాలన్‌పూర్ గ్రామం హర్యాపూర కాలనీలో నివసిస్తున్న సలాట్ శంకర్ భాయ్ అన్నారు. అతని వద్ద నుంచి రూ. 5.23 లక్షల నగదు, కిలోకు పైగా నకిలీ బంగారం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
మిగిలిన ఇద్దరు నిందితులు అదే ప్రాంతానికి చెందిన జీవన్‌లాల్, ధనీభాయ్‌లుగా తెలిసిందన్నారు. వారి కోసం ప్రత్యేక పోలీసు బృందంతో గాలిస్తున్నామన్నారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా వచ్చి మభ్యపెడితే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన వివరించారు. ఈ కేసులో కృషి చేసిన సీసీఎస్ సీఐ బి.కృష్ణయ్య, ఎస్‌ఐలు ఎర్రన్న, షఫీవుల్లా, హెడ్‌కానిస్టేబుళ్లు జయశంకర్, ఆర్.శ్రీనివాసులు, ప్రసాద్, శివాజీ, కానిస్టేబుళ్లు శ్యామ్, బాషా తదితరులను డీఎస్పీ అభినందించారు.