దడ పుట్టిస్తున్న నకిలీ బంగారం కుంభకోణం
- డీసీసీబీ ఉద్యోగుల్లో కలకలం
- పూర్తి స్థాయిలో దర్యాప్తు: చైర్మన్
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : తీగ లాగితే డొంక కదిలినట్టు నకిలీ బంగారం కుంభకోణం బ్యాంకు ఉద్యోగుల్లో దడ పుట్టిస్తోంది. నకిలీ బంగారం తాకట్టుతో ఉద్యోగులు బ్యాంకు సొమ్మును కాజేసిన సంఘటన బ్యాంకు వర్గాల్లో కలకలం రేపుతోంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ విశాఖ మె యిన్‌రోడ్డు బ్రాంచిలో నకిలీ బంగారం కుంభకోణం బయటపడిన సంగతి తెలిసిందే. శనివారం ‘సాక్షి’ దినపత్రికలో ‘నకిలీల’ వార్తా కథనంతో నకిలీ బంగారం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే బ్యాంకు అధికారులు ప్రాథమిక వివరాలు సేకరించి మోసం జరిగినట్టు గ్రహించారు.
కుంభకోణంలో ఎంత మంది పాత్ర ఉందన్న దిశగా దర్యాప్తు జరుగుతోంది. బ్యాంక్‌లో రుణం పొందిన లబ్ధిదారులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. వీరంతా నిజమైన లబ్ధిదారులా! లేక బ్యాంక్ ఉద్యోగులు ఆధారాలు సష్టించి సొమ్ము స్వాహా జేశారా! అనే కోణంలో విచారణ జరిపేందుకు సిద్ధపడ్డారు. మోసానికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు రంగం సిద్ధమవుతోంది. ఇదే తరహా మోసం ఇతర బ్రాంచి బ్యాంకుల్లో జరిగిందా! అనే సందేహం పలువురిలో వ్యక్తమవుతోంది. సమగ్ర విచారణ జరిపితే మరికొన్ని కుంభ కోణాలు వెలుగులోకి రావచ్చన్న అభిప్రాయాలు లేకపోలేదు.
బ్యాంక్ సొమ్ము కాజేసిన సంఘటనలో బాధ్యులై వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీసీబీ చైర్మన్ ఉప్పలపాటి సుకుమార వర్మ తెలియజేశారు. బ్యాంక్ సొమ్ము కాజేసిన సంఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు. 35 రుణాల మంజూరు విషయంలో రూ33.89 లక్షలు మోసం జరిగినట్టు నిర్థారించామని స్పష్టం చేశారు. విచారణాధికారిని నియమించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులను ఉపేక్షించే ప్రసక్తి లేదని చైర్మన్ హెచ్చరించారు.