నకిలీ బంగారం విక్రయం కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు
ప్రకాశం, పామూరు: స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారాన్ని తక్కువధరకే ఇస్తామని నమ్మబలికి నకిలీ బంగారం విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 3 లక్షల నగదు, నకిలీ బంగారు కాసులు స్వాధీనం చేసుకున్నట్లు కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం నకిలీ బంగారం విక్రయాలకు సంబంధించిన కేసు వివరాలను విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరించారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం కలగల్లు గ్రామానికి చెందిన సాకే నవీన్‌కుమార్, కర్నాటక రాష్ట్రం బళ్లారి జిల్లా కూడ్లి తాలూకా బట్టనహళ్లి గ్రామానికి చెందిన సాతుపుడి అజ్జప్ప ఇరువురు బంధువులు. నవీన్ కుమార్ అనంతపురంలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతూ క్రమేణా చెడు అలవాట్లకు, జల్సాలకు బానిసై తనకు బంధువైన సాతుపుడి అజ్జప్పతో కలిసి అమాయకులను ఎంచుకుని వారిని మాయమాటలతో మోసంచేసి నగుదు కాజేయసాగాడు. నగదుతీసుకుని నకిలీ బంగారం అమ్ముతూ వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామానికి చెందిన కురుమై పెంచలరావు బాడుగ నిమిత్తం ఒక నెలరోజుల కిందట కర్నాటక వెళ్లాడు.
ఈ సందర్భంలో పెంచలరావుకు నవీన్‌కుమార్‌తో పరిచయమయింది. పెంచలరావు సెల్‌నంబర్ తీసుకున్న నవీన్‌కుమార్ తరచూ ఫోన్‌చేసేవాడు. ఇటీవల నవీన్‌కుమార్ పెంచలరావుకు ఫోన్‌చేసి తాము పునాదులు తవ్వుతుంటే 5 కేజీల మేలిమి బంగారం దొరికిందని తక్కువధరకే ఇస్తామని కావాలంటే చెప్పమని నమ్మబలికారు. ఈ సందర్భంలో ఒక కేజీ బంగారం రూ. 3 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. 20 రోజుల కిందట నిందితులు నాకే నవీన్‌కుమార్, సాతుపుడి అజ్జప్ప ఇరువురు పామూరుకు వచ్చి పెంచలరావుకు నిజమైన బంగారం 2 కాసులు ఇచ్చి నీకు ఇష్టం వచ్చిన నగల దుకాణంలో పరీక్షచేయించుకోవాలని చెప్పారు. రెండు కాసులను పరీక్షించగా అవి నిజమైన బంగారం కావడంతో పెంచలరావు రూ. 3 లక్షల నగదు ఇచ్చి కేజీ తూకం గల బంగారు వర్ణంలో ఉన్న కాసులను తీసుకోగా వారు వెళ్లిపోయారు. అనంతరం పెంచలరావు మిగతా కాసులను నగల దుకాణంలో పరీక్షింపగా నకిలీవి కావడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు సీఐ ఎ.వి.రమణ అధ్యక్షతన ఎస్సై టి.రాజ్‌కుమార్, సిబ్బంది ముమ్మర గాలింపు చేస్తున్నారు. ఈ సందర్భంలో సోమవారం ఇరువురు నిందితులు నకిలీ బంగారం కాసులతో మరొకరిని మోసంచే సేందుకు సిద్ధమవుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు వారిని అరెస్ట్‌చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 3 లక్షల నగదు, నకిలీ బంగారు కాసులు స్వాధీనం చేసుకుని వారిని కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ కండె శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం కేసులో నిందితులను పట్టుకోవడానికి కృషిచేసిన పోలీస్‌సిబ్బంది రమణయ్య, ఇతర సిబ్బందిని అభినందించి ప్రోత్సాహకాలు అందజేశారు.
మోసపూరిత మాటలు నమ్మొద్దు
ఎవరైనా మోసపూరిత మాటలతో తక్కువధరకే బంగారు నగలు ఇస్తామని, దేవతా మూర్తుల విగ్రహాలు ఇస్తామని, మెరుగుపెడతామని చెప్పే మాటలు నమ్మవద్దన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment