⇒ రూ. 2 లక్షలకే కిలో బంగారం!
⇒ ఢిల్లీ నుంచి ఆగంతుకుడి ఫోన్
⇒ ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్లిన 30 మంది
⇒ నకిలీ బంగారం ఇచ్చి
⇒ మోసం చేసిన వైనం
⇒ ఆలస్యంగా సంఘటన వెలుగులోకి
⇒ పోలీసులకు అందని ఫిర్యాదు
ఉప్లూర్ (కమ్మర్‌పల్లి): మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు రూ. రెండు లక్షలకు కిలో చొప్పున బంగారం కొనుగోలు చేసి మోసపోయిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఒక ఆగంతకుడు గ్రామంలోని చాలామందికి ఫోన్ చేసి తమ వద్ద బంగారం ఉందని, కావాలంటే రూ. రెండు లక్షలకు కిలో ఇస్తామని నమ్మించాడు. దీంతో కొందరు గ్రూపులు గ్రూపులుగా కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ లాడ్జి తీసుకొని అందులో ఉండి, ఫోన్ చేసిన వ్యక్తిని కలిశారు.
దేవాలయాల్లోని బంగారమని, దీన్ని తక్కువ ధరకు విక్రయించి తొందరగా నగదు చేసుకోవాలనుకుంటున్నామని ఆగంతకుడు వారిని నమ్మించాడు. తన వద్ద ఉన్న బంగారం బిస్కెట్ నుంచి ఓ ముక్క కత్తిరించి ఇచ్చి అసలుదా, నకిలీదా చెక్ చేసుకోవాలని సూచించాడు. దీంతో వారు జ్యూయలరీ షాపులకు వెళ్లి చెక్ చేసుకొని అసలుదని నిర్ధారణ చేసుకున్నారు. అనంతరం బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారాన్ని రూ. రెండు లక్షలకు కిలో కొనుగోలు చేసుకొని స్వగ్రామానికి తిరిగి వచ్చారు.
కొంతమంది కిలో, రెండు కిలోలు చొప్పున 30 మందికి పైగా కొనుగోలు చేసినట్లు సమాచారం. స్వగ్రామానికి వచ్చాక స్థానిక కంసాలి వద్దకు వెళ్లి చూపగా, బిస్కెట్లు రాగివని తేలింది. దీంతో మోసపోయామని గ్రహించి గొల్లుమన్నారు. వారం రోజుల పాటు గోప్యత పాటించినప్పటికీ బయటకు పొక్కింది. ఆనోట, ఈనోట పడి ఊరంతా దావానలంలా వ్యాపించింది. బాధితులు బయటకు చెప్పుకోలేక, మింగలేక కక్కలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు సమాచారం. పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణ పేరిట ఎటు పోతుందో తెలియక భయపడి ఊరుకుంటున్నారు.
ఫోన్‌నంబర్లు ఎలా తెలుసంటే..
గ్రామంలోని కొంతమందికి బంగారం కొనుగోలు గురించి ఫోన్ చేసినవారికి బాధితుల ఫోన్ నంబర్లు ఎలా తెలుసనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలోని హార్వెస్టర్, ట్రాక్టర్ డ్రైవర్ల ద్వారా ఢిల్లీలోని మోసగాళ్లకు తెలిసినట్లు గ్రామంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వారే తమ యజమానుల ఫోన్ నంబర్లు సదరు వ్యక్తులకు అందించినట్లు తెలుస్తోంది.
బంగారం ‘బిస్కెట్’ వేశాడు..
Published Thu, Dec 4 2014 2:50 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement