చౌకగా బంగారమంటూ దోచేస్తారు... | inter state robbers gang arrested | Sakshi
Sakshi News home page

చౌకగా బంగారమంటూ దోచేస్తారు...

Jan 9 2016 10:48 AM | Updated on Sep 3 2017 3:23 PM

చౌకగా బంగారమంటూ దోచేస్తారు...

చౌకగా బంగారమంటూ దోచేస్తారు...

చౌకగా బంగారం విక్రయిస్తామని చెప్పి నకిలీ బంగారం అంటగట్టి డబ్బు తో ఉడాయిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఈస్ట్‌జోన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

హైదరాబాద్:  చౌకగా బంగారం విక్రయిస్తామని చెప్పి నకిలీ బంగారం అంటగట్టి డబ్బు తో ఉడాయిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఈస్ట్‌జోన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నింది తుల నుంచి రూ. 3.90 లక్షలు, 11 ఫోన్లు, 7 బంగారు రంగు పోలి ఉన్న ఇత్తడి పూసలదండలు, 5 బంగారు గుండ్లను స్వాధీనం చేసుకున్నారు.
 
  సైదాబాద్ ఠాణాలో శుక్రవారం ఈస్ట్‌జోన్ డీసీపీ విశ్వనాథ్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రధాన నిందితుడు గుజరాత్‌కు చెందిన దాబి నారాయణ  ప్రకాశంజిల్లా వేట్లపాలెంలో పూల వ్యాపారం చేస్తున్నాడు. ఇతను అదే ప్రాంతంలో ఉండే దాబి జీవన్, దాబి దయా, దాబి నిమియా, బికిలి దాబి, దాబి రాజు, దాబి శంకర్, దాబి సూరజ్, సోలంకి లక్డి, దల్లుబాయ్ (అందరిదీ ఒకే కుటుంబం)లతో ముఠా ఏర్పాటు చేశాడు. ముఠా సభ్యులు బస్తీలు, కాలనీల్లో తిరుగుతూ అక్కడి ఒక దుకాణంలోకి వినియోగదారుడి మాదిరిగా వెళ్తారు. షాపు యజమానితో లేదా షాపునకు వచ్చిన వారితో మాట కలిపి తమ వద్ద బంగారం ఉందని తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్తారు.  తమ పొలంలో దొరికిందని, ఇంట్లో పెళ్లి ఉండటంతో అత్యవసరంగా డబ్బు అవసరమై బంగారాన్ని అమ్మేస్తున్నామని నమ్మబలుకుతారు. తమ వద్ద ఉన్న అసలు బంగారాన్ని వారికి ఇచ్చి పరీక్షించుకోమని చెప్తారు. పరీక్షల్లో అది నిజమైన బంగారం అని తేలడంతో టార్గెట్ చేసిన వ్యక్తి వీరి బుట్టలోపడిపోతాడు. తర్వాత బేరం కుదుర్చుకొని డబ్బు తీసుకొని, బంగారం రంగుపూసిన ఇత్తడి కడ్డీలను అంటగట్టి జారుకుంటారు.  వీరు ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో 21 నేరాలకు పాల్పడి ప్రజల నుంచి రూ. 25 లక్షలు కాజేశారు. కాగా, వీరంతా గురువారం  సైదాబాద్‌లో తచ్చాడుతుండగా పోలీసులకు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించగా.. బంగారం పేరుతో మోసాలు చేస్తున్నట్టు వెల్లడించారు.  విచారణ అనంతరం  శుక్రవారం పది మంది నిందితులనూ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.  నిందితులను చాకచక్యంగా అరెస్టు చేసిన డీఐ నాగేశ్వర్‌రావుతో పాటు నేర విభాగం సిబ్బందిని డీసీపీ అభినందించారు.  విలేకరుల సమావేశంలో ఏసీపీ సుధాకర్, అడిషనల్ డీసీపీ చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రావు, డీఐ కోరుట్ల నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 
 పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు..
 
 వీరు నగరంలోని సైదాబాద్, అంబర్‌పేట, హబీబ్‌నగర్, మార్కెట్, కుషాయిగూడ, మీర్‌పేట,లింగంపల్లి, కూకట్‌పల్లి, ఠాణాల పరిధిలో మోసాలకు పాల్పడ్డారు. అలాగే, మెదక్ జిల్లా సదాశివపేట, నెల్లూరుజిల్లా నాయుడుపేట, వెస్ట్‌గోదావరి పాలకొల్లు, విశాఖపట్నం భీమిలి, అనకాపల్లి, గాజువాక, చెన్నై అన్నానగర్, విల్లి విక్కమ్ చెన్నై, కేరళలోనూ మోసాలకు పాల్పడ్డారని డీసీపీ చెప్పారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల పోలీసుల సహకారంతో విచారణ జరుపుతున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement