సాక్షి, గచ్చిబౌలి: ఇంట్లో ఉన్న బంగారు నిధిని తంత్ర పూజలతో బయటకు తీస్తామని నమ్మించి, ఇత్తడిని పుత్తడిగా చూపించి అందినకాడికి దండుకున్న ఓ ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు, సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. కాగా, ఈ ముఠా చేతిలో మోసపోయిన ఓ బాధితుడు కూడా ఇత్తడిని పుత్తడిగా నమ్మించి మరో వ్యక్తిని దగా చేసి పోలీసులకు చిక్కాడు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో గురువారం కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం...
⇔ ఓల్డ్ మల్లేపల్లి నివాసి సయ్యద్ దస్తగిరి అహ్మద్(65) ఆర్‌ఎంపీ డాక్టర్. తన క్లినిక్‌కు వచ్చేవారి తో తనకు బ్లాక్ మ్యాజిక్ పవర్ ఉందని నమ్మబలికి 15 ఏళ్లుగా మోసాలకు పాల్పడుతున్నాడు.
⇔ మిరాలం మండికి చెందిన మిర్జా అబ్బాస్ అలీ సాజద్ రియల్టర్. తమ ఇంట్లో నిధి ఉందని, బయటకు తీయకపోతే ఇంట్లోవారు చనిపోతారని రోజూ తన తల్లి కల కంటోందని సాజద్ ఛత్తాబజార్‌కు చెందిన తన స్నేహితుడు అలీ అక్బర్ తయాబికి చెప్పాడు.
⇔ అతను చార్మినార్ ఇరాన్‌గల్లీకి చెందిన షేక్ హఫీజ్, యాకుత్‌పురాకు చెందిన అబ్దుల్ ఫయీమ్‌ను పరిచయం చేయగా, వారు ఓల్డ్ మల్లోపల్లిలో ఉన్న ఆర్‌ఎంపీ డాక్టర్ దస్తగిరి వద్దకు తీసుకెళ్లారు.
⇔ సాజద్ ఇంటికి వెళ్లిన డాక్టర్ దస్తగిరి మీ తల్లికి వచ్చే కల నిజమేనని, శాంతిపూజలు చేస్తే నిధి బయటకు వస్తుందని, పూజకు రూ. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పాడు.
⇔ ఇంట్లో ఐదుచోట్ల గుంతలు తవ్వించాడు. ఇంటి యజమాని సాజద్ కళ్లుగప్పి బంగారు పూత పూసిన ఇత్తడి బిస్కెట్లను గంతుల్లో వేసి మట్టితో కప్పేశాడు.
⇔ ఆ తర్వాత ఒక రోజు హఫీజ్, అక్బర్ తయాబ్, అబ్దుల్ ఫయూమ్‌లతో కలిసి సయ్యద్ దస్తగిరి పూజ చేసేందుకు సాజద్ ఇంటికి వెళ్లాడు.
⇔ పూజ చేసిన అనంతరం ముగ్గురూ గుంతలో వెతికినట్టు నటించి బంగారం కనిపించిందని చెప్పారు. తాము చెప్పినప్పుడే మూట విప్పాలని, లేకపోతే బంగారం మీకు దక్కదని చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు.
⇔ కొద్ది రోజుల తర్వాత గుంతలో చూడగా బంగారు బిస్కెట్లు కనిపించాయి. వాటిని పరిశీలించగా నకిలీవి అని తేలింది. దీంతో మోసపోయానని గ్రహించిన సాజద్ ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు.
మోసపోయి...
⇔ రూ. 3 లక్షలు ఖర్చు చేసి మోసపోయానని గ్రహించిన సాజద్ తన స్నేహితుడు అలీ అక్బర్ తయాబితో కలిసి తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని చెప్పి ఇత్తడి బిస్కెట్లను అమ్మాలని నిర్ణయించాడు.
⇔ తమ వద్ద ఆరు కిలోల బంగారం ఉందని, రూ. 40 వేలకే తులం ఇచ్చేస్తామని ఓ వ్యక్తికి చెప్పారు.
⇔ అతడి వద్ద రూ. 50 వేలు అడ్వాన్స్‌గా తీసుకొన్న వీరు కావాలంటే పరీక్షించుకోవాలని 200 గ్రాములున్న ఇత్తడి బిస్కెట్‌ను ఇచ్చారు. అతడు దానిని పరీక్ష చేయించుకోగా, ఇత్తడిదని తేలింది.
⇔ దీంతో బాధితుడు రాజేంద్రనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. రాజేంద్రనగర్ పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. ఈకేసులో నిందితుడు సాజద్ కూడా బాధితుడేని తేలింది.
⇔ సాజద్‌తో పాటు సయ్యద్ దస్తగిరి అహ్మద్, షేక్ హఫీజ్, అలీ అక్బర్ తయాబిలను అరెస్టు చేయగా అబ్దుల్ ఫయీమ్ పరారీలో ఉన్నాడు.
⇔ నిందితుల నుంచి 5.85 కిలోల బంగారు పూత పూసిన 11 ఇత్తడి బస్కెట్లు, 8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
⇔ తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెబితే నమ్మవద్దని ప్రజలకు ఈ సందర్భంగా కమిషనర్ సజ్జనార్ సూచించారు. సమావేశంలో ఎస్‌ఓటీ అడిషనల్ డీసీపీ సందీప్, ఏసీపీ సంజీవరావు, సీఐ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
బాధితుడే నిందితుడిగా మారిన వైనం
Published Fri, Mar 5 2021 8:26 AM | Last Updated on Fri, Mar 5 2021 9:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment