సీతమ్మధార (విశాఖ ఉత్తర): సీతంపేట ఇండియన్ బ్యాంక్‌లో బంగారు రుణాల పేరిట వెలుగు చూసిన మోసంపై ఆ బ్యాంకు అధికారులు స్పందించారు. తీవ్ర చర్చల తర్వాత శనివారం రాత్రి బ్యాంకు బ్రాంచి మేనేజర్ సంతోష్‌కుమార్, అధికారులు ద్వారకనగర్ సీఐ వై.మురళీరావుకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ నిర్వహించారు. పోలీసులు, బ్యాంకు అధికారులు చెప్పిన వివరాలు.. తీసుకున్న రుణం కన్నా అదనపు సొమ్ము చెల్లించాలని ఇండియన్ బ్యాంక్ సీతంపేట శాఖ నోటీసులు పంపడంతో వ్యవహారం బయటపడింది. బ్యాంకు అధికారులు నలుగురు ఖాతాదారులకు బ్యాంకు నుంచి తీసుకున్న బంగారు రుణాలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఖాతాదారులు లబోదిబో మంటూ శుక్రవారం రాత్రి ద్వారకజోన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి వివరాలు రాబట్టారు. నోటీసులు అందుకున్న రమణ, పైడిరాజు, ఫణికుమార్‌లను పోలీసులు పలు ప్రశ్నలు వేశారు. తాము ఎలాంటి రుణాలు తీసుకోలేదని, కొంత సొమ్ము చెల్లించామని, నోటీసు ఇచ్చిన ప్రకారం అంతసొమ్ము చెల్లించలేమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాంచి అప్రైజర్ శ్రీనుబాబు గత నెల 29న చనిపోయారు. దీంతో కథ అడ్డం తిరిగింది. ఈ ఖాతాదారుల రుణాలను పెంచి, నకిలీ బంగారం సృష్టించి రూ.60 లక్షలు అప్రైజర్ శ్రీను బాబు స్వాహా చేసినట్టు సీఐ వై.మురళీరావు తెలిపారు. మొత్తం 90 అకౌంట్లు గుర్తించినట్టు ఆయన వివరించారు.
నోటీసు పంపడంతో బయటకు..
ఈ నోటీసు పట్టుకొని బ్యాంకుకు వెళ్లగా పెద్దగా స్పందన లేకపోవడంతో బాధితులు ద్వారకనగర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో బ్యాంకులో రుణాలు సంగతి బయట పడింది. బ్యాంకు లావాదేవీలు చిన్న విషయం కాదని, ఎలాంటి సంతకాలు చేయలేదని, కాని రూ. పది లక్షలు చెల్లించాలని నోటీసులు ఇవ్వడం అన్యాయమని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
గోల్‌మాల్‌పై కేసు నమోదు..
ఇండియన్ బ్యాంకు సీతంపేట శాఖలో బంగారు ఆభరణాల రుణాలపై జరిగిన గోల్‌మాల్‌పై ద్వారకాజోన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. శనివారం రాత్రి బ్యాంకు అధికారులు మోసం జరిగిందని బ్యాంకు అధికారులు వచ్చి సీఐ వై.మురళీరావుకు ఫిర్యాదు చేశారు. అసలు బంగారం ముసుగులో నకిలీ బంగారాన్ని ఖాతాదారుల ప్రమేయం లేకుండా జత చేయడంతో సుమారు 90 మందికి పైగా సుమారు రూ.60 లక్షలు వరకు కుచ్చుటోపీ వేసిన సంగతి విషయం విదితమే. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ దాలిబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment