ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (పీడీసీసీ బ్యాంకు)లో బంగారం రుణాల మంజూరులో గోల్‌మాల్ జరిగింది. తాకట్టు పెట్టే బంగారం నాణ్యతను పరిశీలించి.. తూకం వేసే అప్రైజర్ చేతివాటం ప్రదర్శించి తన అనుయాయులకు లక్షల రూపాయల సొమ్మును అప్పనంగా దోచిపెట్టాడు. ఈ అక్రమం 2011 నుంచి జరుగుతుండగా తాజాగా వెలుగులోకి వచ్చింది. తక్కువ తూకం ఉన్న బంగారు నగలను ఎక్కువ తూకం ఉన్నట్లు చూపి ఖాతాదారులకు లక్షలాది రూపాయలు అదనంగా చెల్లించారు. నకిలీ బంగారంతో కూడా రుణాలు మంజూరు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అప్రైజర్‌ను గుడ్డిగా నమ్మి బ్యాంకు అధికారులు నిండా మునిగారు. బంగారం తాకట్టు రుణాల్లో జరిగిన అవకతవకలు బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్‌బాబు చొరవతో వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఓ బ్యాంకు మేనేజర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మూడేళ్లలో బంగారం తాకట్టు రుణాల మంజూరుకు సంతకాలు చేసిన బ్యాంకు మేనేజర్లందరినీ పిలిపించి వారి సమక్షంలోనే మరో అప్రైజర్ సాయంతో బంగారం నాణ్యత, తూకం వివరాలు పరిశీలిస్తున్నారు.
బంగారం తాకట్టుపై వ్యవసాయ రుణాలు ఇస్తారు. తాకట్టు పెట్టే బంగారం నాణ్యతను పరిశీలించి తూకం వేసి ఆ వ్యక్తికి ఎంత రుణం మంజూరు చేయాలో అప్రైజర్ నిర్ణయిస్తాడు. అప్రైజర్ నిర్ణయించిన మొత్తాన్ని సంబంధిత బ్యాంకు మేనేజర్ మంజూరు చేస్తారు. ఈలోపు ఆ వ్యక్తి ఎన్ని బంగారు వస్తువులు తాకట్టు పెడుతున్నాడు.. వాటి బరువు ఎంత ఉందో మేనేజర్ స్వయంగా పరిశీలించాలి. అప్రైజర్ మీద నమ్మకంతో మేనేజర్లు ఇదేమీ చూడకుండానే సంతకాలు చేసి రుణాలు మంజూరు చేసి నగదు చెల్లించారు. తక్కువ బంగారం పెట్టి ఎక్కువ బంగారం పెట్టినట్లు లెక్కలు రాసి లక్షలాది రూపాయలు అదనంగా అప్రైజర్ తన అనుయాయులకు చెల్లించాడు.
ఏడాదికోసారి జరిగే రుణాలు పరిశీలనలో కూడా రుణాల గోల్‌మాల్ వ్యవహారం వెలుగు చూడలేదు. మేనేజర్లు బదిలీ అయ్యి కొత్త మేనేజర్లు బాధ్యతలు స్వీకరించే సమయంలో కూడా గట్టురట్టు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త మేనేజర్లు అన్నీ స్వయంగా పరిశీలించుకున్న తర్వాతే బాధ్యతలు స్వీకరించాలి. కొత్త మేనేజర్లు వచ్చినప్పుడు బంగారం పరిశీలనలో కూడా సదరు అప్రైజరే వారికి సహాయకునిగా మెలిగి ఈ మోసం వెలుగు చూడకుండా ఇప్పటివరకు నెట్టుకొచ్చాడు.
రంగంలోకి దిగిన చైర్మన్
పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు చొరవతో రుణాల గోల్‌మాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బంగారం తాకట్టు రుణాలను వెరిఫికేషన్ చేయమని తాజాగా నాబార్డు ఆదేశాలు జారీ చేసింది. గతంలో రుణాలు వెరిఫికేషన్ జరిగినప్పుడు రుణాలు మంజూరుకు సిఫార్సు చేసిన అప్రైజర్‌నే పక్కన పెట్టుకుని చేసేవారు. ఆయన అన్ని బాగా ఉన్నాయని ధ్రువీకరించగానే కథ ముగిసేది. ఈసారి ఈదర మోహన్ ఆ పాత పద్ధతికి స్వస్తి చెప్పి రుణాలు పునః పరిశీలన బాధ్యతలను మేనేజర్లు, బ్యాంకు అప్రైజర్‌కు కాకుండా వేరే అప్రైజర్‌కు అప్పగించారు. వీరి పరిశీలనలో రుణాలు భాగోతం వెలుగు చూసింది. వీరు బంగారం రుణాల మంజూరులో కర్నూలురోడ్డు శాఖలో అవకతవకలున్నట్లు గుర్తించి బ్యాంకు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ బ్యాంకు మేనేజర్‌ను ఆయన శనివారం సస్పెండ్ చేశారు.
సొమ్మంతా రాబడతాం
బంగారం రుణాలకు బ్యాంకు చెల్లించిన మొత్తం సంబంధిత వ్యక్తుల నుంచి రాబడతామని బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు తెలిపారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాంకు సొమ్ము ఒక్క పైసా కూడా నష్టపోకుండా మొత్తం సొమ్ము రాబడతామని మోహన్‌బాబు స్పష్టం చేశారు.
పీడీసీసీ బ్యాంకులో చేతివాటం
Published Sun, May 11 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM
Advertisement