Prakasam District Cooperative Central Bank
-
పీడీసీసీబీ పీఠంపై ‘దేశం’ కన్ను
ఒంగోలు వన్‌టౌన్: ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (పీడీసీసీబీ) పీఠంపై తెలుగుదేశం పార్టీ కన్ను పడింది. ఎలాగైనా బ్యాంకు చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. వాస్తవానికి బ్యాంకు పాలకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ లేకపోయినా అడ్డదారుల్లోనైనా కైవసం చేసుకుని బ్యాంకుపై పచ్చ జెండా ఎగురవేసేందుకు దేశం నాయకులు తహతహలాడుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం ఇతర పార్టీల జెడ్పీటీసీ సభ్యులను లోబరుచుకున్న విధంగానే బ్యాంకు డెరైక్టర్లను కూడా తమ వైపునకు తిప్పుకునేందుకు గట్టి ప్రయత్నమే జరుగుతోంది. బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబుపై అవిశ్వాసం పెట్టి దించేసి ఆ పదవిని లాక్కునేందుకు తెరచాటున ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీడీపీకి చెందిన ఇద్దరు బ్యాంకు డెరైక్టర్లు, బ్యాంకు చైర్మన్ పదవి తమకేనంటూ బ్యాంకు డెరైక్టర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పీడీసీసీ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు గతేడాది మేలో జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈదర మోహన్‌బాబు బ్యాంకు చైర్మన్‌గా, వైస్‌చైర్మన్ కండే శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఈదర మోహన్‌బాబు రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని విభేదిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికి వారి గెలుపు కోసం కృషి చేశారు. అధికారికంగా టీడీపీలో చేరనప్పటికీ ఆ పార్టీ సానుభూతిపరునిగానే వ్యవహరిస్తున్నారు. సొసైటీలకు నిధుల కేటాయింపు విషయంలో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అధ్యక్షులు అడిగిన మేరకు ప్రాధాన్యతా క్రమంలో నిధులు విడుదల చేస్తూ వస్తున్నారు. అవిశ్వాసానికి పావులు కదుపుతున్న నేతలు: ఈదర మోహన్‌బాబుపై అవిశ్వాసం ప్రకటించి ఆయనను పీడీసీసీబీ చైర్మన్ పదవి నుంచి దించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం సొసైటీ ఎన్నికలు జరిగినప్పుడే టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం జరిగిన ఒక డెరైక్టర్, అద్దంకి ప్రాంతానికి చెందిన మరో డెరైక్టరు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు అవసరమైన మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నులై ఉన్నారు. గతంలో చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం జరిగిన ఒక డెరైక్టర్ సుదీర్ఘకాలంగా సొసైటీ అధ్యక్షునిగా పనిచేస్తుండడంతో తనకున్న పరిచయాలను కూడా వినియోగించుకుని డెరైక్టర్లను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు పాలకవర్గంలో మొత్తం 21 మంది డెరైక్టర్లుంటారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు బ్యాంకు డెరైక్టర్లలో 50 శాతం మందికి పైగా మద్దతు అవసరం. అంటే కనీసం 11 మంది డెరైక్టర్లు అవిశ్వాసానికి అనుకూలంగా సంతకాలు పెట్టాలి. బ్యాంకు చైర్మన్‌పై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ (ఆర్సీఎస్)కు వీరు వినతిపత్రం ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం నలుగురు డెరైక్టర్లు ఆర్ సీఎస్ సమక్షంలో సంతకం చేసి అవిశ్వాస ప్రతిని ఆయనకు అందజేయాల్సి ఉంటుంది. అవిశ్వాసం నెగ్గేందుకు మొత్తం డెరైక్టర్లలో మూడింట రెండు వంతుల మంది మద్దతు తెలపాలి. అంటే కనీసం 14 మంది డెరైక్టర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినప్పుడే అవిశ్వాసం నెగ్గుతుంది. బ్యాంకు పాలకవర్గంలో ప్రస్తుతమున్న సంఖ్యాబలం ప్రకారం చైర్మన్ ఈదర మోహన్‌బాబుకు 14 మంది డెరైక్టర్ల మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు వీరిలో కనీసం నలుగురు డెరైక్టర్లు ఆ ప్రతిపాదనపై సంతకం చేయాలి. ఏడుగురు డెరైక్టర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు డెరైక్టర్లను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అద్దంకి ప్రాంతానికి చెందిన బ్యాంకు డెరైక్టర్ తనకు మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తి ఆశీస్సులున్నాయని చెప్పుకుంటూ డెరైక్టర్ల మద్దతును కూడగట్టే పనిలో ఉన్నారు. బ్యాంకు పాలకవర్గంలో చైర్మన్ తరువాత ముఖ్యస్థానంలో ఉన్న ఒక నేత కూడా సొసైటీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ బ్యాంకు చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం జరిగిన డెరైక్టర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ డెరైక్టర్లను కూడగట్టేపనిలో ఉన్నారు. కొందరు డెరైక్టర్లతో ఇటీవల ఆయన సమావేశం కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సహకారం బ్యాంకు చైర్మన్‌పై అవిశ్వాసం ప్రకటించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న నేతలకు కొందరు బ్యాంకు మేనేజర్లు, ఉద్యోగులు కూడా తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు. కొందరు విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు కూడా డెరైక్టర్ల మద్దతును కూడగట్టే విషయంలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యాంకులో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు తటస్థంగా ఉండగా మిగిలిన వారు మాత్రం బ్యాంకు చైర్మన్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయారు. దీంతో బ్యాంకు పరిపాలనలో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న విషయాన్ని ఉద్యోగులే బహిరంగంగా చెబుతున్నారు. అవిశ్వాస ప్రయత్నాలు నిజమే.. తనపై అవిశ్వాసం ప్రతిపాదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న మాట వాస్తవమేనని, ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు ధ్రువీకరించారు. -
పీడీసీసీబీలో గోల్డ్‌మాల్
ఒంగోలు వన్‌టౌన్, న్యూస్‌లైన్ : ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (పీడీసీసీ బ్యాంకు)లో బంగారం రుణాల మంజూరులో అక్రమాల పుట్టబద్దలైంది. బ్యాంకు ఉద్యోగి బయట వ్యక్తులతో కుమ్మక్కై రూ. 256.99 లక్షల బ్యాంకు సొమ్ము పరాయి వ్యక్తుల పాల్జేశారు. నకిలీ బంగారాన్ని హామీగా ఉంచడంతో పాటు తూకాల్లో కూడా భారీగా మోసం చేశారు. 2011 నుంచి 16 మంది వ్యక్తులతో కుమ్మక్కై బ్యాంకు అప్రైజర్ నరసింహారావు ఈ అక్రమాలకు పాల్పడ్డారు. పీడీసీసీ బ్యాంకులో బంగారు రుణాల మంజూరులో అప్రైజర్ అక్రమాలపై ఈ నెల 11న ‘సాక్షి’లో ‘పీడీసీసీ బ్యాంకులో చేతివాటం’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు అప్రమత్తమై జిల్లాలోని ఆ బ్యాంకు శాఖలన్నింటిలో బంగారు రుణాల పరిశీలనకు ఆదేశించారు. రూ. 256.99 లక్షలు స్వాహా పీడీసీసీ బ్యాంకులో బంగారం రుణాల మంజూరులో రూ. 256.99 లక్షలు స్వాహా చేసినట్లు విచారణలో తేలినట్టు చైర్మన్ ఈదర మోహన్‌బాబు శనివారం విలేకరులకు తెలిపారు. బ్యాంకు అప్రైజర్ నరసింహారావు 16 మందితో కలిసి ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలిందన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలులోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో కర్నూలురోడ్డు శాఖల్లోనే ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయి. ప్రధాన కార్యాలయంలో అత్యధికంగా రూ. 211.95 లక్షలు స్వాహా చేశారు. కర్నూలురోడ్డు బ్యాంకు శాఖలో ఆరుగురు వ్యక్తులు 11 ఖాతాలకు నకిలీ బంగారం పెట్టి 26.67 లక్షల రూపాయలు స్వాహా చేశారు. 8 మంది వ్యక్తులు 19 ఖాతాల్లో బంగారం తూకంలో మోసం చేసి 18.37 లక్షలు దిగమింగారు. ఈ రెండు శాఖలకు నరసింహారావు అప్రైజర్‌గా పని చేస్తున్నారు. బంగారు రుణాల మంజూరులో అక్రమాలు జరగకుండా చూడాల్సిన బ్యాంకు మేనేజర్లు అప్రైజర్‌ను నమ్మి గుడ్డిగా సంతకాలు పెట్టడంతో పీకల దాకా ఇరుక్కుపోయారు. 16 మంది కీలక వ్యక్తులు ఈ బంగారు రుణాల అక్రమాలో 16 మంది వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. వీరిలో ఎం.యోగేంద్ర కీలక వ్యక్తి. యోగేంద్ర రెండు చిరునామాలతో నకిలీ బంగారం పెట్టి రూ.62.23 లక్షలు కాజేసినట్లు విచారణలో తేలిందని ఈదర మోహన్‌బాబు తెలిపారు. ఒంగోలు నగర పరిధిలోని పెళ్లూరుకు చెందిన ఎం. ఏడుకొండలు రూ.19.53 లక్షలు స్వాహా చేశారు. చీమకుర్తి మండలం గుండువారి లక్ష్మీపురం (జిఎల్‌పురం)కు చెందిన అన్నదమ్ములు కూడా ఈ స్వాహాలో పాత్రధారులే. ఈ గ్రామానికి చెందిన ఎం.నారాయణ రూ. 43.09 లక్షలు, ఎం. సురేంద్రబాబు రూ. 11.82 లక్షలు స్వాహా చేశారు. ఎం.యోగేంద్ర మరో ఖాతాలో రూ. 16.60 లక్షలు కాజేశారు. పి.ఇంతియాజ్‌ఖాన్ రూ. 1.89 లక్షలు, కె.సుధాకర్ రూ. 2.48 లక్షలు, షేక్ అక్బర్‌బాషా రూ. 2.70 లక్షలు, టి. వెంకటేశ్వర్లు రూ. 80 వేలు, ఐ.వాసుదేవరావు రూ.1.29 లక్షలు, కె.వెంకటరమణ రూ. 38,499లు స్వాహా చేశారు. అందరిపై క్రిమినల్ కేసులు బ్యాంకులో బంగారు రుణాలు మంజూరు చెల్లింపులో అవకతవకలకు పాల్పడిన వారందరిపై క్రిమినల్ కేసులు పెట్టనున్నట్లు బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 42 లక్షలు రికవరీ చేసినట్లు చెప్పారు. ఈ అక్రమాలపై సోమవారం బ్యాంకు అధికారులు ఆప్కాబ్‌కు ఓ నివేదికను అందించనున్నారు. -
పీడీసీసీ బ్యాంకులో చేతివాటం
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (పీడీసీసీ బ్యాంకు)లో బంగారం రుణాల మంజూరులో గోల్మాల్ జరిగింది. తాకట్టు పెట్టే బంగారం నాణ్యతను పరిశీలించి.. తూకం వేసే అప్రైజర్ చేతివాటం ప్రదర్శించి తన అనుయాయులకు లక్షల రూపాయల సొమ్మును అప్పనంగా దోచిపెట్టాడు. ఈ అక్రమం 2011 నుంచి జరుగుతుండగా తాజాగా వెలుగులోకి వచ్చింది. తక్కువ తూకం ఉన్న బంగారు నగలను ఎక్కువ తూకం ఉన్నట్లు చూపి ఖాతాదారులకు లక్షలాది రూపాయలు అదనంగా చెల్లించారు. నకిలీ బంగారంతో కూడా రుణాలు మంజూరు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అప్రైజర్‌ను గుడ్డిగా నమ్మి బ్యాంకు అధికారులు నిండా మునిగారు. బంగారం తాకట్టు రుణాల్లో జరిగిన అవకతవకలు బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్‌బాబు చొరవతో వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఓ బ్యాంకు మేనేజర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మూడేళ్లలో బంగారం తాకట్టు రుణాల మంజూరుకు సంతకాలు చేసిన బ్యాంకు మేనేజర్లందరినీ పిలిపించి వారి సమక్షంలోనే మరో అప్రైజర్ సాయంతో బంగారం నాణ్యత, తూకం వివరాలు పరిశీలిస్తున్నారు. బంగారం తాకట్టుపై వ్యవసాయ రుణాలు ఇస్తారు. తాకట్టు పెట్టే బంగారం నాణ్యతను పరిశీలించి తూకం వేసి ఆ వ్యక్తికి ఎంత రుణం మంజూరు చేయాలో అప్రైజర్ నిర్ణయిస్తాడు. అప్రైజర్ నిర్ణయించిన మొత్తాన్ని సంబంధిత బ్యాంకు మేనేజర్ మంజూరు చేస్తారు. ఈలోపు ఆ వ్యక్తి ఎన్ని బంగారు వస్తువులు తాకట్టు పెడుతున్నాడు.. వాటి బరువు ఎంత ఉందో మేనేజర్ స్వయంగా పరిశీలించాలి. అప్రైజర్ మీద నమ్మకంతో మేనేజర్లు ఇదేమీ చూడకుండానే సంతకాలు చేసి రుణాలు మంజూరు చేసి నగదు చెల్లించారు. తక్కువ బంగారం పెట్టి ఎక్కువ బంగారం పెట్టినట్లు లెక్కలు రాసి లక్షలాది రూపాయలు అదనంగా అప్రైజర్ తన అనుయాయులకు చెల్లించాడు. ఏడాదికోసారి జరిగే రుణాలు పరిశీలనలో కూడా రుణాల గోల్మాల్ వ్యవహారం వెలుగు చూడలేదు. మేనేజర్లు బదిలీ అయ్యి కొత్త మేనేజర్లు బాధ్యతలు స్వీకరించే సమయంలో కూడా గట్టురట్టు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త మేనేజర్లు అన్నీ స్వయంగా పరిశీలించుకున్న తర్వాతే బాధ్యతలు స్వీకరించాలి. కొత్త మేనేజర్లు వచ్చినప్పుడు బంగారం పరిశీలనలో కూడా సదరు అప్రైజరే వారికి సహాయకునిగా మెలిగి ఈ మోసం వెలుగు చూడకుండా ఇప్పటివరకు నెట్టుకొచ్చాడు. రంగంలోకి దిగిన చైర్మన్ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు చొరవతో రుణాల గోల్మాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బంగారం తాకట్టు రుణాలను వెరిఫికేషన్ చేయమని తాజాగా నాబార్డు ఆదేశాలు జారీ చేసింది. గతంలో రుణాలు వెరిఫికేషన్ జరిగినప్పుడు రుణాలు మంజూరుకు సిఫార్సు చేసిన అప్రైజర్నే పక్కన పెట్టుకుని చేసేవారు. ఆయన అన్ని బాగా ఉన్నాయని ధ్రువీకరించగానే కథ ముగిసేది. ఈసారి ఈదర మోహన్ ఆ పాత పద్ధతికి స్వస్తి చెప్పి రుణాలు పునః పరిశీలన బాధ్యతలను మేనేజర్లు, బ్యాంకు అప్రైజర్‌కు కాకుండా వేరే అప్రైజర్‌కు అప్పగించారు. వీరి పరిశీలనలో రుణాలు భాగోతం వెలుగు చూసింది. వీరు బంగారం రుణాల మంజూరులో కర్నూలురోడ్డు శాఖలో అవకతవకలున్నట్లు గుర్తించి బ్యాంకు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ బ్యాంకు మేనేజర్‌ను ఆయన శనివారం సస్పెండ్ చేశారు. సొమ్మంతా రాబడతాం బంగారం రుణాలకు బ్యాంకు చెల్లించిన మొత్తం సంబంధిత వ్యక్తుల నుంచి రాబడతామని బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు తెలిపారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాంకు సొమ్ము ఒక్క పైసా కూడా నష్టపోకుండా మొత్తం సొమ్ము రాబడతామని మోహన్‌బాబు స్పష్టం చేశారు.