ఒంగోలు వన్‌టౌన్, న్యూస్‌లైన్ : ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (పీడీసీసీ బ్యాంకు)లో బంగారం రుణాల మంజూరులో అక్రమాల పుట్టబద్దలైంది. బ్యాంకు ఉద్యోగి బయట వ్యక్తులతో కుమ్మక్కై రూ. 256.99 లక్షల బ్యాంకు సొమ్ము పరాయి వ్యక్తుల పాల్జేశారు. నకిలీ బంగారాన్ని హామీగా ఉంచడంతో పాటు తూకాల్లో కూడా భారీగా మోసం చేశారు. 2011 నుంచి 16 మంది వ్యక్తులతో కుమ్మక్కై బ్యాంకు అప్రైజర్ నరసింహారావు ఈ అక్రమాలకు పాల్పడ్డారు. పీడీసీసీ బ్యాంకులో బంగారు రుణాల మంజూరులో అప్రైజర్ అక్రమాలపై ఈ నెల 11న ‘సాక్షి’లో ‘పీడీసీసీ బ్యాంకులో చేతివాటం’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు అప్రమత్తమై జిల్లాలోని ఆ బ్యాంకు శాఖలన్నింటిలో బంగారు రుణాల పరిశీలనకు ఆదేశించారు.
రూ. 256.99 లక్షలు స్వాహా
పీడీసీసీ బ్యాంకులో బంగారం రుణాల మంజూరులో రూ. 256.99 లక్షలు స్వాహా చేసినట్లు విచారణలో తేలినట్టు చైర్మన్ ఈదర మోహన్‌బాబు శనివారం విలేకరులకు తెలిపారు. బ్యాంకు అప్రైజర్ నరసింహారావు 16 మందితో కలిసి ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలిందన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలులోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో కర్నూలురోడ్డు శాఖల్లోనే ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయి. ప్రధాన కార్యాలయంలో అత్యధికంగా రూ. 211.95 లక్షలు స్వాహా చేశారు. కర్నూలురోడ్డు బ్యాంకు శాఖలో ఆరుగురు వ్యక్తులు 11 ఖాతాలకు నకిలీ బంగారం పెట్టి 26.67 లక్షల రూపాయలు స్వాహా చేశారు. 8 మంది వ్యక్తులు 19 ఖాతాల్లో బంగారం తూకంలో మోసం చేసి 18.37 లక్షలు దిగమింగారు. ఈ రెండు శాఖలకు నరసింహారావు అప్రైజర్‌గా పని చేస్తున్నారు. బంగారు రుణాల మంజూరులో అక్రమాలు జరగకుండా చూడాల్సిన బ్యాంకు మేనేజర్లు అప్రైజర్‌ను నమ్మి గుడ్డిగా సంతకాలు పెట్టడంతో పీకల దాకా ఇరుక్కుపోయారు.
16 మంది కీలక వ్యక్తులు
ఈ బంగారు రుణాల అక్రమాలో 16 మంది వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. వీరిలో ఎం.యోగేంద్ర కీలక వ్యక్తి. యోగేంద్ర రెండు చిరునామాలతో నకిలీ బంగారం పెట్టి రూ.62.23 లక్షలు కాజేసినట్లు విచారణలో తేలిందని ఈదర మోహన్‌బాబు తెలిపారు. ఒంగోలు నగర పరిధిలోని పెళ్లూరుకు చెందిన ఎం. ఏడుకొండలు రూ.19.53 లక్షలు స్వాహా చేశారు. చీమకుర్తి మండలం గుండువారి లక్ష్మీపురం (జిఎల్‌పురం)కు చెందిన అన్నదమ్ములు కూడా ఈ స్వాహాలో పాత్రధారులే. ఈ గ్రామానికి చెందిన ఎం.నారాయణ రూ. 43.09 లక్షలు, ఎం. సురేంద్రబాబు రూ. 11.82 లక్షలు స్వాహా చేశారు. ఎం.యోగేంద్ర మరో ఖాతాలో రూ. 16.60 లక్షలు కాజేశారు. పి.ఇంతియాజ్‌ఖాన్ రూ. 1.89 లక్షలు, కె.సుధాకర్ రూ. 2.48 లక్షలు, షేక్ అక్బర్‌బాషా రూ. 2.70 లక్షలు, టి. వెంకటేశ్వర్లు రూ. 80 వేలు, ఐ.వాసుదేవరావు రూ.1.29 లక్షలు, కె.వెంకటరమణ రూ. 38,499లు స్వాహా చేశారు.
అందరిపై క్రిమినల్ కేసులు
బ్యాంకులో బంగారు రుణాలు మంజూరు చెల్లింపులో అవకతవకలకు పాల్పడిన వారందరిపై క్రిమినల్ కేసులు పెట్టనున్నట్లు బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 42 లక్షలు రికవరీ చేసినట్లు చెప్పారు. ఈ అక్రమాలపై సోమవారం బ్యాంకు అధికారులు ఆప్కాబ్‌కు ఓ నివేదికను అందించనున్నారు.
పీడీసీసీబీలో గోల్డ్‌మాల్
Published Sun, May 25 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM
Advertisement
Advertisement