
పుంగనూరులోని కనకదుర్గా ఫైనాన్స్ కంపెనీ
సన్నిహితుల ద్వారా నకిలీ బంగారు నగలు తాకట్టు పెట్టించిన సిబ్బంది
ఆడిట్‌లో గుర్తించిన అధికారులు
సిబ్బంది సహా 26 మందిపై కేసు నమోదు
చిత్తూరు జిల్లా పుంగనూరు, పలమనేరుల్లో ఘటన
పుంగనూరు: ఓ గోల్డ్‌లోన్ కంపెనీలో సిబ్బందే తమ సన్నిహితులు, బంధువులతో నకిలీ బంగారు తాకట్టు పెట్టించి రూ.8 కోట్లు కొల్లగొట్టారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు, పలమనేరులో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘కనకదుర్గ గోల్డ్‌లోన్స్ కంపెనీ’ పుంగనూరు, పలమనేరుల్లో బ్రాంచ్ నిర్వహిస్తోంది. బంగారు తాకట్టు పెట్టుకొని.. గ్రాముకు మార్కెట్ ధరకు అనుగుణంగా 70 నుంచి 80 శాతం వరకు రుణం ఇస్తోంది. సంస్థలోని ఆరుగురు ఉద్యోగులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు పక్కదారి పట్టారు.
తమ సన్నిహితులు, బంధువుల్లో 20 మందిని ఎంపిక చేసుకున్నారు. వారి ద్వారా నకిలీ బంగారు నగలు తాకట్టు పెట్టించి.. డబ్బులు ఇస్తుండేవారు. కంపెనీ యాజమాన్యం డిసెంబర్‌లో నిర్వహించిన ఆడిట్‌లో నకిలీ బంగారు నగలుతో రూ.కోట్లు స్వాహా చేసినట్లు గుర్తించింది. దీనిపై వెంటనే అంతర్గత విచారణ చేపట్టింది.
తమ కంపెనీకే చెందిన ఆరుగురు ఉద్యోగులు.. మరో 20 మందితో కలసి సుమారు 6 కిలోలకు పైగా నకిలీ బంగారు నగలతో రూ.8 కోట్లు (పుంగనూరులో రూ.5 కోట్లు, పలమనేరులో రూ.3 కోట్లు) స్వాహా చేసినట్లు తేల్చింది. వారందరిపైనా యాజమాన్యం గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం బయటపడటంతో బంగారం తాకట్టు పెట్టిన పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment