Fake Gold Jewellery
-
ఇనుపగాజులకు పసిడిపూసి..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇనుప గాజులకు బంగారుపూత పూసి వాటిని అసలైనవిగా నమ్మించి పలు గోల్డ్‌ఫైనాన్స్ కంపెనీల్లో డబ్బులు రుణంగా తీసుకున్న ఘటన కరీంనగర్లో వెలుగుచూసింది. మొత్తం ఐదుగురు సభ్యులు ఉన్న ఈ ముఠా రుణం కోసం ఇనుపగాజులపై ఏడు బంగారుపూతలు పూసి వాటిని గతనెల 11న రుణం కోసం ముత్తూట్ గోల్డ్ ఫైనాన్స్‌కంపెనీకి తీసుకెళ్లారు. అక్కడ మొలుగూరి కిరణ్ పేరుతో పరిచయం చేసుకుని ఈ గాజుల్ని ఇచ్చి రుణం కావాలని అడిగారు. కరీంనగర్ లోని అంబేద్కర్‌నగర్‌లో ఉంటున్నట్లు ఆధార్ కార్డు కూడా వారికి చూపించారు. అక్కడ తనిఖీలు చేసే ఓ వ్యక్తి ఆ గాజులను పరీక్షించగా తొలుత బంగారంగానే అనుకున్నారు. దీంతో పలు దఫాల్లో దాదాపు రూ.5.09 లక్షలు రుణంగా తీసుకున్నారు. అయితే.. అన్ని గాజులు ఒకే బరువు, ఒకే ఆకృతిలో ఉండటంతో అక్కడ పనిచేసేవారికి అనుమానం వచ్చింది. వాటిని లోతుగా పరీక్షించగా, ఏడు బంగారుపూతల తరువాత లోపల వారికి ఇనుపగాజు కనిపించడంతో అవాక్కయ్యారు. ఇదేతరహాలో ఐఐఎఫ్ఎల్ బ్రాంచిలో ఆరు బంగారుగాజులు కుదవబెట్టి రూ.2.14 లక్షలు రుణం తీసుకున్నారు. కోర్టు సమీపంలోని ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ కంపెనీలోనూ ఇదే తరహాలో 10 గాజులు కుదవపెట్టి రూ.3.50 లక్షలు రుణంగా పొందారు. వీరు కూడా అసలు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో కంపెనీలోనూ ఈ మోసం జరిగిందని కానీ, ఫిర్యాదు చేసేందుకు ముందుకురావడం లేదని సమాచారం. నగరంలో ఇప్పటివరకూ ఇలా దాదాపు రూ.17 లక్షలు రుణం తీసుకున్నట్లు వెల్లడైంది. పలు ప్రాంతాల్లో కూడా...! గోదావరిఖని, సిద్దిపేట, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న పలు బ్రాంచీల్లో ఇనుపగాజులతో లక్షలాది రూపాయలు టోకరా వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి గోల్డ్‌ఫైనాన్స్ కంపెనీల్లో బంగారం పరీక్షల విధానంపై పూర్తి అవగాహన ఉందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే.. సులువుగా ఆయా కంపెనీలను మోసం చేయగలిగారన్న నిర్ధారణకు వచ్చారు. బాధితులు సమర్పించిన ఆధార్ కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాల ఆధారంగా పోలీసులు నిందితుల వేట ప్రారంభించారు. -
ప్రముఖ బ్యాంకులో భారీ కుంభకోణం
కోనేరుసెంటర్ (మచిలీపట్నం): కృష్ణా జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ బ్యాంకులో అతనో అప్రయిజర్... ఆ బ్యాంకులో బంగారంపై రుణం కావాలంటే ఆ అప్రయిజర్ ఖాతాదారుడు తెచ్చింది అసలైన బంగారమే అంటూ రాజముద్ర వేయాలి. అప్రయిజర్ అలా వేయకుంటే అది అసలైన బంగారం అయినా ఆ బ్యాంకు ఖాతాదారుడికి రుణం ప్రాణం పోయినా ఇవ్వదు. బ్యాంకుకు అంతటి నమ్మకస్తుడుగా ఉండాల్సిన ఆ అప్రయిజర్ బ్యాంకు అధికారులు నమ్మకాన్ని సొమ్ము చేసుకోవాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవు తన మెదడుకు పని చెప్పాడు. అధికారులను డుమ్మి కొట్టించేందుకు పదునైన పథకం రచించాడు. అందుకోసం నమ్మకమైన పరిచయస్తులతో పాటు దూరం బంధువులను కలుపుకున్నాడు. వారికి తెలియకుండా దొంగ సంతకాలు చేయించుకుని అదే బ్యాంకులో వారి పేరు మీద నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి కోట్లలో రుణాలు తీసుకున్నాడు. ఆలస్యంగానైనా విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ బ్యాంకు వద్దకు పరుగులు పెట్టి అధికారుల ఎదుట గొల్లుమన్నారు. అనంతరం పోలీసులను కలసి జరిగిన మోసంపై మూకుమ్మడిగా ఫిర్యాదులు చేశారు. ఈ సంఘటన జిల్లాకేంద్రమైన మచిలీపట్నంలోని సెంట్రల్ బ్యాంకులో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాంచ్ మేనేజర్‌తో మాట్లాడుతున్న పోలీసులు మచిలీపట్నంకు చెందిన ప్రసాద్ సెంట్రల్ బ్యాంకులో అప్రయిజర్‌గా పని చేస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్న ప్రసాద్ కొంత కాలంగా తన బంధువులు, పరిచయస్తులతో నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టించి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవటం మొదలుపెట్టాడు. బంగారం ఒరిజనలా డూప్లికేటా అనేది తేల్చే బాధ్యత ప్రసాద్‌దే కావడంతో బ్యాంకు అధికారుల నమ్మకాన్ని ఆసరాగా తీసుకున్న ప్రసాద్ కొంతకాలంగా ఇదే తరహాలో బ్యాంకులో నకలీ బంగారాన్ని తాకట్టు పెట్టి కోట్లలో రుణాలు తీసుకుంటూ వచ్చాడు. సంతకాలు పెట్టిన బంధువులు, పరిచయస్తులకు బ్యాంకు నుంచి నోటీసులు వస్తుండగా ప్రసాద్ వారికి మీ రుణాలు తీరిపోయాయి అంటూ చెప్పుకుంటూ రావడంతో పాటు వారి అవసరాలకు అడ్డుపడుతూ నోరు మెదపకుండా చేసుకుంటూ వస్తున్నాడు. బ్యాంకు నోటీసులు అధికం కావడంతో అనుమానం వచ్చిన కొంత మంది బ్యాంకు అధికారులతో వాదనకు దిగారు. దీంతో అసలు విషయం బయటికి పొక్కడంతో జరిగిన మోసం తెలుసుకున్న బాధితుల్లోని కొందరు చిలకలపూడి పోలీసులను ఆశ్రయించి జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న బందరు డీయస్పీ మహబూబ్‌బాషా, సీఐ వెంకటనారాయణలు బ్యాంకుకు వెళ్ళి మేనేజర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బ్యాంకు మేనేజర్ పై అధికారులతో మాట్లాడిన అనంతరం ఆడిట్ వ్యవహారం ముగిశాక ఫిర్యాదు చేస్తామని చెప్పటంతో పోలీసులు బ్యాంకు నుంచి వెనుదిరిగారు. ఇదిలా ఉండగా బాధితుల ఫిర్యాదు మేరకు కోట్లలో కుంభకోణం జరిగివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపి వాస్తవ అవాస్తవాలు నిర్ధారించటం జరుగుతుందని చిలకలపూడి సీఐ వెంకటనారాయణ తెలిపారు. -
చిత్తూరు బ్యాంకుపై టీడీపీ నేత భస్మాసుర హస్తం
నిగనిగలాడే ఖద్దరు షర్టు. నలుగురిలో నిలబడితే ‘ఏం బ్రదర్’ అంటూ గంభీరమైన గొంతుసమావేశాల్లో ఊకదంపుడు ప్రసంగాలు.కారు రోడ్డుపైకి వస్తే హంగామావీటన్నింటికంటే మించితెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి.అతనే చిత్తూరు టౌన్‌బ్యాంకు చైర్మన్ షణ్ముగం. సీన్ కట్‌చేస్తే..బ్యాంకును బురిడీకొట్టించి గిల్టు నగలతో రుణాలు తీసుకున్నాడంటూ కేసు. చిత్తూరు అర్బన్: చిత్తూరు సహకార టౌన్ బ్యాంకులో భారీ మోసం వెలుగుచూసింది. గిల్టు నగలను బ్యాంకులో తాకట్టుపెట్టి ఏళ్ల తరబడి ఖాతాదారుల సొమ్ముతో జల్సా చేశారు. అధికారులను బెదిరించి.. మభ్యపెట్టి లోబరుచుకున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీ విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న పి.షణ్ముగం ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడంటూ బ్యాంకు మేనేజరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం షణ్ముగంపై 420 కేçసు నమోదైంది. చిత్తూరు నగరంలోని సహకార టౌన్ బ్యాంకుకు మూడు శాఖలున్నాయి. వీటిలో దర్గా బ్రాంచ్ మేనేజరు పిఆర్.సుబ్రమణ్యం పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఫిర్యాదులో.. ‘‘2014 నుంచి టౌన్ బ్యాంకు చైర్మన్‌గా షణ్ముగం కొనసాగుతున్నాడు. 2016–17వసంవత్సరంలో షణ్ముగం తనకు సంబంధించిన 12 మంది వ్యక్తులతో గిల్టు నగలు కుదువపెట్టాడు. అప్రైజర్ జీఎం.ధరణీసాగర్‌ను బెదిరించి 39 ఖాతాల్లో రుణాలు తీసుకున్నాడు. నన్ను గత ఏడాది 18వ తేదీ బదిలీ చేయించాడు. కొత్త మేనేజరుకు లెక్కలు చెప్పడానికి కుదువలో ఉన్న ఆభరణాలు పరిశీలిస్తే అవి నకిలీవని తేలింది. అప్రైజర్‌ను నిలదీయగా షణ్ముగం తనను బెదిరించి, ఉద్యోగం నుంచి తీసేస్తాని చెప్పి రుణాలు తీసుకున్నాడని చెప్పాడు. దీంతో నేను, అప్రైజర్ కలిసి షణ్ముగంను సంప్రదించాం. చైర్మన్‌గా నేనుండా మీకెందుకు భయం..? ఏదైనా సమస్య వస్తే నా ఆస్తులు అమ్మైనా డబ్బులు కట్టేస్తా అని మమ్మల్ని మభ్యపెట్టాడు. మాకు భయంవేసి పలు మార్లు షణ్ముగంను నిలదీస్తే ఇందులో నాకు సంబంధం లేదని, ఏంచేస్తారో చేసుకోండి అంటూ అడ్డం తిరిగి బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఇతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.’’ అంటూ మేనేజరు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇతర శాఖలపై అనుమానం దర్గా బ్రాంచ్‌లో వెలుగుచూసిన ఈ కుంభకోణంలో నకిలీ నగలతో దాదాపు రూ.80 లక్షలు రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి వడ్డీ కలిపి రూ.1.20 కోట్లు పేరుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇతర శాఖల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగి ఉండొచ్చని అధికారులు సందేహిస్తు్తన్నారు. ఈ వ్యవహారంలో జిల్లా టీడీపీలో ఇద్దరు నాయకుల ప్రమేయం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. వీళ్లకు రెండేళ్ల క్రితమే విషయం తెలిసినా షణ్ముగంను కాపాడుతూ వచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్యాప్తు చేస్తున్నాం టౌన్‌బ్యాంకు చైర్మన్ షణ్ముగంపై ఆ బ్యాంకు మేనేజరు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేశాం. ఐపీసీ సెక్షన్ 409, 417, 420 ఇతర సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాం. ఆయన ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నాడు. త్వరలోనే అన్ని విషయాలు బయటపెడుతాం. – ఈశ్వర్‌రెడ్డి, డీఎస్పీ, చిత్తూరు -
నకిలీ బంగారంతో బ్యాంకు రుణం
సాక్షి. కరీంనగర్ రూరల్: నకిలీ బంగారాన్ని సహకార సంఘంలో తాకట్టు పెట్టి రుణం తీసుకున్న అఫ్రైజర్ నాలుగేళ్ల నుంచి తిరిగి చెల్లించలేదు. మొండిబకాయిల వసూళ్ల కోసం వచ్చిన అధికారులు రుణాల జాబితాను పరిశీలించగా అఫ్రైజర్‌కు రుణం ఇవ్వరాదని పేర్కొంటూ, బంగారాన్ని తనిఖీ చేసి నకిలీదిగా గుర్తించారు. చివరకు అఫ్రైజర్ రుణం చెల్లించడంతో బ్యాంకు సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఈ వ్యవహారం బయటకు తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో సంఘం పాలకవర్గం, సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ మండలం దుర్శేడ్ సహకార సంఘంలో శ్రీరామోజు కృష్ణమాచారి కొన్నేళ్లనుంచి అఫ్రైజర్‌గా పనిచేస్తున్నాడు. సంఘంలో బంగారు నగలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేటప్పుడు బంగారం నాణ్యతను పరిశీలించి కృష్ణమాచారి నివేదిక ప్రకారం రుణం మంజూరు చేస్తారు. ఈ క్రమంలో కృష్ణమాచారి 2015లో సంఘంలో బంగారు నగలను తాకట్టు పెట్టి రూ.44వేలు, 2016లో రూ.95 వేలు రుణం తీసుకున్నాడు. తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకునుంచి పలుమార్లు నోటీస్‌లు జారీ చేశారు. మార్చి నెలాఖరులోపు మొండి బకాయిలను వసూలు చేయాలనే ఉద్దేశ్యంతో సోమవారం ఖార్ఖనగడ్డ కేడీసీసీ బ్రాంచ్ మేనేజరు లావణ్య సంఘాన్ని సందర్శించి రుణాల జాబితాను పరిశీలించారు. అఫ్రైజర్‌కు నిబంధనల ప్రకారం రుణం ఇవ్వరాదని, కృష్ణమాచారికి రుణం ఎలా ఇచ్చారంటూ బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించారు. అఫ్రైజర్ తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను పరిశీలించగా నకిలీగా తేలడంతో కృష్ణమచారిని కార్యాలయంలోకి పిలిపించి విచారణ చేశారు. అఫ్రైజర్‌గా ఉండి నకిలీ బంగారాన్ని తాకట్టుపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రుణం చెల్లించకపోతే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చివరకు రుణం చెల్లిస్తానంటూ ఒప్పుకోవడంతో విడిచిపెట్టారు. మంగళవారం బ్యాంకు సిబ్బంది కృష్ణమాచారికి సంబంధించిన అసలు బంగారాన్ని కరీంనగర్‌లోని ఖార్ఖనగడ్డ బ్రాంచ్‌లో తాకట్టుపెట్టి రుణం ఇప్పించారు. అనంతరం సంఘానికి బకాయిపడిన రుణం అసలు, వడ్డీ మొత్తం రూ. 2.40లక్షలను వసూలు చేయడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. బంగారం తాకట్టు పెట్టుకుని అఫ్రైజర్‌కు రుణం ఇవ్వరాదనే విషయం తెలియక కృష్ణమచారికి ఇచ్చామని, నకిలీ బంగారం కాదని, నగల్లో నాణ్యత లేదని సంఘం సీఈవో ఆంజనేయులు తెలిపారు. -
నకిలీ నగలు తాకట్టు అక్కాచెల్లెలు అరెస్టు
తిరువళ్లూరు: కుదువ దుకాణంలో నకిలీ నగలను తాకట్టుపెట్టి 50 వేల రూపాయలతో ఉడాయించిన అక్కాచెల్లిని అరంబాక్కం పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా ఆరంబాక్కం సమీపంలోని ఎలావూర్ బజారువీధిలో బాలాజీ జ్యువెలరీ షాపు వుంది. ఇక్కడ నగలను కుదువ పెట్టుకునే వ్యాపారం సైతం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 6వ తేదీన ఇద్దరు మహిళలు వచ్చి వారి వద్ద వున్న నగలను రూ.50 వేలకు కుదువ పెట్టి నగదు తీసుకున్నట్టు తెలిసింది. అయితే మహిళలు కుదువు పెట్టిన నగలపై అనుమానం రావడంతో దుకాణ యజమాని సంబంధిత నగలను పరిశీలించగా అవి నకిలీవని తేలాయి. దీంతో షాపు యజమాని బాబులాల్ ఆరంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల్లో వున్న నిందితుల ఫొటోను సమీపంలోని అన్ని నగల దుకాణంలో వుంచి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ నేపథ్యంలో గురువారం అదే ప్రాంతంలో జగదాంబ నగల దుకాణానికి వెళ్లిన ఇద్దరు మహిళలు నకిలీ నగలను కుదువు పెట్టుకుని నగదును ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన కుదువ వ్యాపారి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో ఇద్దరు మహిళలు కొత్తగుమ్మిడిపూండికి చెందిన అక్క ప్రియదర్శిని, చెల్లి జననీగా గుర్తించారు. వీరు గతంలో ఇదే విధంగా నకిలీ నగలను కుదువ పెట్టి పలు మోసాలకు పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఇంటి దొంగ...
అనంతపురం, హిందూపురం అర్బన్: ఇంటిదొంగను ఈశ్వరుడైన పట్టలేడు అన్న చందంగా..బ్యాంకులో నమ్మకంగా ఉండే అప్రైజర్ (బంగారు నాణ్యత పరిశీకుడు) నకిలీబంగారు నగలు తాకట్టు పెట్టించి అధికారులను బురిడీ కొట్టించిన సంఘటన వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి...హిందూపురంలోని సిండికేట్బ్యాంకు టీచర్స్‌కాలనీ బ్రాంచ్‌లో బంగారు రుణాలు ఇవ్వడానికి రవిచంద్ర అనే వ్యక్తి నగల అప్రైజర్‌గా ఉన్నాడు. నాలుగేళ్లుగా తనకు తెలిసిన వారి పేరిట బంగారు నగలను తాకట్టు పెట్టించి బంగారు రుణాలు ఇప్పించాడు. బంగారు పూత పూసిన గిల్టు నగలను బంగారు నగలుగా చూపిస్తూ ఇలా సుమారు రూ.45 లక్షలకు పైగా దాదాపు 16 మంది పేరిట రుణాలు తీసుకున్నారు. ఈ డబ్బుతో ఆయన రియల్ ఎస్టేట్‌వ్యాపారం సాగిçస్తూ వచ్చాడు. వ్యాపారం అనుకున్న రీతిలో సాగలేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. గుట్టు రట్టయ్యిందిలా.. టీచర్స్‌కాలనీ బ్రాంచ్‌కు ఎక్కువగా బంగారు నగలు తాకట్టుగా వస్తుండటంతో మెయిన్బ్రాంచ్ అధికారులు ర్యాండమ్ చెకింగ్ చేయడానికి వారంరోజుల కిందట మడకశిర నుంచి మరో అప్రైజర్‌ను పంపించారు. తాకట్టులో ఉన్న మొత్తం బంగారు నగలు, వాటివిలువ, ఎన్నాళ్లుగా తాకట్టులో ఉన్నాయన్న విషయాలను పరిశీలించగా నకిలీ బంగారు బయటపడింది. తాను బాధ్యతలు చేపట్టకమునుపే ఈ వ్యవహారం జరిగినట్లు ప్రస్తుత మేనేజర్ చిన్నబాబు ఉన్నతాధికారులకు తెలిపారు. ఉన్నతాధికారుల విచారణ నకిలీ బంగారం తాకట్టు వ్యవహారంపై రీజినల్ మేనేజర్ కోదండరామిరెడ్డి, చీఫ్‌మేనేజర్ రమేష్‌తో పాటు మరో లాయర్ సిండికేట్‌నగర్ టీచర్స్ కాలనీ బ్రాంచ్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం విచారణ చేపట్టారు. పలు రికార్డులు పరిశీలించారు. వ్యవహారం బయటకు రావడంతో సంబంధిత అప్రైజర్‌పై కేసు నమోదు కాకుండా నియోజకవర్గస్థాయి రాజకీయ నేత నుంచి బ్యాంకు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. తీసుకున్న రుణాల మొత్తాన్ని తిరిగి కట్టేసేటట్టు ఒప్పించినట్లు సమాచారం. కాగా బ్యాంకు మేనేజర్ చిన్నబాబును విలేరులు అడుగగా బంగారు నగలు తాకట్టు పెట్టి రూ.29 లక్షల వరకు రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని చెప్పారు. రీజినల్ అధికారులు మాత్రం సాధారణ తనిఖీలలో భాగంగా ఇలా వచ్చామని మాత్రమే చెప్పారు. సాయంత్రం బ్యాంకు అధికారులు నిబంధన మేరకు టూటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సైబర్ మోసాలు తమ పరిధిలోకి రావన్నారు. అస్మదీయుల మోసం రెండోసారి.. సిండికేట్ బ్యాంకులో పనిచేసే వారే మోసానికి పాల్పడటం ఇది రెండవసారి. మూడేళ్లక్రితం హిందూపురం మెయిన్‌బ్రాంచ్‌లో పనిచేసే సహాయ మేనేజర్ బాబా అక్బర్ తోటి ఉద్యోగుల కంప్యూటర్లో నుంచి ఇతరుల ఖాతాలకు రుణాలు మంజూరు చేసినట్లు రికార్డు చేసి సుమారు రూ.కోటి పైగా స్వాహా చేశాడు. దీనిన్ని కనుగొన్న ఉన్నతాధికారులు విచారణ చేసి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముంబయి, ఇతర ప్రాంతాల్లో గాలించి చివరకు సైబర్ మోసంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు టీచర్స్ కాలనీ బ్రాంచ్‌లో నకిలీ బంగారు నగల తాకట్టు రుణాల వ్యవహారం బయటపడింది. దీంతో ఖాతాదారులు భయాందోళన చెందుతున్నారు. -
నకిలీ బంగారం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
నెల్లూరు: నకిలీ బంగారాన్ని నిజమైన బంగారం అంటూ జనాన్ని మోసం చేస్తున్న ఓ వ్యక్తిని నెల్లూరు జిల్లా కోవూరులో స్థానిక పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.19 లక్షల నగదను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజమైన బంగారం అంటూ నకిలీ బంగారం అమ్మినట్లు తమకు జిల్లావ్యాప్తంగా ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిందితుడి కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అందులోభాగంగా ఈ రోజు ఉదయం కోవూరులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.