సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇనుప గాజులకు బంగారుపూత పూసి వాటిని అసలైనవిగా నమ్మించి పలు గోల్డ్‌ఫైనాన్స్ కంపెనీల్లో డబ్బులు రుణంగా తీసుకున్న ఘటన కరీంనగర్‌లో వెలుగుచూసింది. మొత్తం ఐదుగురు సభ్యులు ఉన్న ఈ ముఠా రుణం కోసం ఇనుపగాజులపై ఏడు బంగారుపూతలు పూసి వాటిని గతనెల 11న రుణం కోసం ముత్తూట్ గోల్డ్ ఫైనాన్స్‌కంపెనీకి తీసుకెళ్లారు. అక్కడ మొలుగూరి కిరణ్ పేరుతో పరిచయం చేసుకుని ఈ గాజుల్ని ఇచ్చి రుణం కావాలని అడిగారు.
కరీంనగర్ లోని అంబేద్కర్‌నగర్‌లో ఉంటున్నట్లు ఆధార్ కార్డు కూడా వారికి చూపించారు. అక్కడ తనిఖీలు చేసే ఓ వ్యక్తి ఆ గాజులను పరీక్షించగా తొలుత బంగారంగానే అనుకున్నారు. దీంతో పలు దఫాల్లో దాదాపు రూ.5.09 లక్షలు రుణంగా తీసుకున్నారు. అయితే.. అన్ని గాజులు ఒకే బరువు, ఒకే ఆకృతిలో ఉండటంతో అక్కడ పనిచేసేవారికి అనుమానం వచ్చింది. వాటిని లోతుగా పరీక్షించగా, ఏడు బంగారుపూతల తరువాత లోపల వారికి ఇనుపగాజు కనిపించడంతో అవాక్కయ్యారు.
ఇదేతరహాలో ఐఐఎఫ్‌ఎల్ బ్రాంచిలో ఆరు బంగారుగాజులు కుదవబెట్టి రూ.2.14 లక్షలు రుణం తీసుకున్నారు. కోర్టు సమీపంలోని ఎస్‌బీఎఫ్‌సీ ఫైనాన్స్ కంపెనీలోనూ ఇదే తరహాలో 10 గాజులు కుదవపెట్టి రూ.3.50 లక్షలు రుణంగా పొందారు. వీరు కూడా అసలు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో కంపెనీలోనూ ఈ మోసం జరిగిందని కానీ, ఫిర్యాదు చేసేందుకు ముందుకురావడం లేదని సమాచారం. నగరంలో ఇప్పటివరకూ ఇలా దాదాపు రూ.17 లక్షలు రుణం తీసుకున్నట్లు వెల్లడైంది.
పలు ప్రాంతాల్లో కూడా...!
గోదావరిఖని, సిద్దిపేట, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న పలు బ్రాంచీల్లో ఇనుపగాజులతో లక్షలాది రూపాయలు టోకరా వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి గోల్డ్‌ఫైనాన్స్ కంపెనీల్లో బంగారం పరీక్షల విధానంపై పూర్తి అవగాహన ఉందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే.. సులువుగా ఆయా కంపెనీలను మోసం చేయగలిగారన్న నిర్ధారణకు వచ్చారు. బాధితులు సమర్పించిన ఆధార్ కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాల ఆధారంగా పోలీసులు నిందితుల వేట ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment