gold finance company
-
ముత్తూట్ ఫైనాన్స్ ‘మిల్లీగ్రామ్ గోల్డ్ ప్రోగ్రామ్’
కొచ్చి: గోల్డ్ ఫైనాన్సింగ్ దిగ్గజం ముత్తూట్ ఫైనాన్స్ ‘మిల్లీగ్రామ్ గోల్డ్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ముత్తూట్ గ్రూప్ వద్ద లావాదేవీలను నిర్వహించే కస్టమర్లకు కనీసం మిల్లీగ్రామ్ బంగారం బహుమతిగా అందజేస్తుంది. రిఫరల్ లావాదేవీపై 20 మిల్లీగ్రాముల బంగారం పొందవచ్చు. ఈ ప్రోగ్రామ్ ఏప్రిల్ 2022 నుంచి నిర్వహించిన అన్ని లావాదేవీలపై వర్తిస్తుంది. ఏటా రూ.50 కోట్ల విలువైన(100 కేజీలు) బంగారాన్ని కస్టమర్లకు అందించాలని కంపెనీ భావిస్తోంది. ‘రెండేళ్ల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా కస్టమర్లతో మా అనుబంధం మరింత బలోపేతం అవుతుందని విశ్వసిస్తున్నాము. ఎన్నో ఏళ్లుగా వారు మాపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞత ఇది’ అని కంపెనీ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ తెలిపారు. -
ముత్తూట్ ఫైనాన్స్ లాభం అప్
న్యూఢిల్లీ: గోల్డ్ ఫైనాన్సింగ్ దిగ్గజం ముత్తూట్ ఫైనాన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 1,044 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,007 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 5 శాతం వృద్ధితో రూ. 3,168 కోట్లను అధిగమించింది. గత క్యూ3లో రూ. 3,016 కోట్ల టర్నోవర్ నమోదైంది. వడ్డీ ఆదాయం 5 శాతం బలపడి రూ. 3,087 కోట్లకు చేరింది. నిర్వహణలోని స్థూల గోల్డ్ లోన్ ఆస్తులు రూ. 54,688 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఫలితాలలో ముత్తూట్ హోమ్‌ఫిన్(ఇండియా), బెల్‌స్టార్ మైక్రోఫైనాన్స్, ముత్తూట్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ తదితర అనుబంధల సంస్థల పనితీరు కలసి ఉన్నట్లు పేర్కొంది. -
ఇనుపగాజులకు పసిడిపూసి..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇనుప గాజులకు బంగారుపూత పూసి వాటిని అసలైనవిగా నమ్మించి పలు గోల్డ్‌ఫైనాన్స్ కంపెనీల్లో డబ్బులు రుణంగా తీసుకున్న ఘటన కరీంనగర్లో వెలుగుచూసింది. మొత్తం ఐదుగురు సభ్యులు ఉన్న ఈ ముఠా రుణం కోసం ఇనుపగాజులపై ఏడు బంగారుపూతలు పూసి వాటిని గతనెల 11న రుణం కోసం ముత్తూట్ గోల్డ్ ఫైనాన్స్‌కంపెనీకి తీసుకెళ్లారు. అక్కడ మొలుగూరి కిరణ్ పేరుతో పరిచయం చేసుకుని ఈ గాజుల్ని ఇచ్చి రుణం కావాలని అడిగారు. కరీంనగర్ లోని అంబేద్కర్‌నగర్‌లో ఉంటున్నట్లు ఆధార్ కార్డు కూడా వారికి చూపించారు. అక్కడ తనిఖీలు చేసే ఓ వ్యక్తి ఆ గాజులను పరీక్షించగా తొలుత బంగారంగానే అనుకున్నారు. దీంతో పలు దఫాల్లో దాదాపు రూ.5.09 లక్షలు రుణంగా తీసుకున్నారు. అయితే.. అన్ని గాజులు ఒకే బరువు, ఒకే ఆకృతిలో ఉండటంతో అక్కడ పనిచేసేవారికి అనుమానం వచ్చింది. వాటిని లోతుగా పరీక్షించగా, ఏడు బంగారుపూతల తరువాత లోపల వారికి ఇనుపగాజు కనిపించడంతో అవాక్కయ్యారు. ఇదేతరహాలో ఐఐఎఫ్ఎల్ బ్రాంచిలో ఆరు బంగారుగాజులు కుదవబెట్టి రూ.2.14 లక్షలు రుణం తీసుకున్నారు. కోర్టు సమీపంలోని ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ కంపెనీలోనూ ఇదే తరహాలో 10 గాజులు కుదవపెట్టి రూ.3.50 లక్షలు రుణంగా పొందారు. వీరు కూడా అసలు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో కంపెనీలోనూ ఈ మోసం జరిగిందని కానీ, ఫిర్యాదు చేసేందుకు ముందుకురావడం లేదని సమాచారం. నగరంలో ఇప్పటివరకూ ఇలా దాదాపు రూ.17 లక్షలు రుణం తీసుకున్నట్లు వెల్లడైంది. పలు ప్రాంతాల్లో కూడా...! గోదావరిఖని, సిద్దిపేట, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న పలు బ్రాంచీల్లో ఇనుపగాజులతో లక్షలాది రూపాయలు టోకరా వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి గోల్డ్‌ఫైనాన్స్ కంపెనీల్లో బంగారం పరీక్షల విధానంపై పూర్తి అవగాహన ఉందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే.. సులువుగా ఆయా కంపెనీలను మోసం చేయగలిగారన్న నిర్ధారణకు వచ్చారు. బాధితులు సమర్పించిన ఆధార్ కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాల ఆధారంగా పోలీసులు నిందితుల వేట ప్రారంభించారు. -
తక్కువ కస్టమర్లు ఉన్నవే.. వీరి టార్గెట్
విశాఖపట్నం : తొమ్మిది మంది సభ్యులు గల ఓ బిహార్ దోపిడీ ముఠాను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐదు పిస్టళ్లు, ఒక తపంచా, 85 బుల్లెట్లు, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. వీరంతా నాగ్‌పూర్, బర్రాక్పూర్ ప్రాంతాలలో మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో ఇదివరకే దోపిడీకి పాల్పడ్డారు. విశాఖపట్నంలో బంగారం ఫైనాన్సు కంపెనీలను టార్గెట్‌గా చేసుకుని దోపిడీ చేయడానికి స్కెచ్ వేస్తున్న క్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దోపిడీ ముఠా మొదట దోపిడీ చేయాలనుకున్న ప్రాంతంలో ఓ రూం అద్దెకు తీసుకుంటారు. మోటారు సైకిల్ కొనుక్కుని గోల్ట్ ఫైనాన్స్ కంపెనీల వద్ద రెక్కీ నిర్వహిస్తారు. కస్టమర్లు లేని, తక్కువగా ఉన్న వాటిని ఎంచుకుని తుపాకులు చూపించి దోపిడీ చేస్తారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.