ambedkar nagar
-
ఇనుపగాజులకు పసిడిపూసి..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇనుప గాజులకు బంగారుపూత పూసి వాటిని అసలైనవిగా నమ్మించి పలు గోల్డ్‌ఫైనాన్స్ కంపెనీల్లో డబ్బులు రుణంగా తీసుకున్న ఘటన కరీంనగర్లో వెలుగుచూసింది. మొత్తం ఐదుగురు సభ్యులు ఉన్న ఈ ముఠా రుణం కోసం ఇనుపగాజులపై ఏడు బంగారుపూతలు పూసి వాటిని గతనెల 11న రుణం కోసం ముత్తూట్ గోల్డ్ ఫైనాన్స్‌కంపెనీకి తీసుకెళ్లారు. అక్కడ మొలుగూరి కిరణ్ పేరుతో పరిచయం చేసుకుని ఈ గాజుల్ని ఇచ్చి రుణం కావాలని అడిగారు. కరీంనగర్ లోని అంబేద్కర్‌నగర్‌లో ఉంటున్నట్లు ఆధార్ కార్డు కూడా వారికి చూపించారు. అక్కడ తనిఖీలు చేసే ఓ వ్యక్తి ఆ గాజులను పరీక్షించగా తొలుత బంగారంగానే అనుకున్నారు. దీంతో పలు దఫాల్లో దాదాపు రూ.5.09 లక్షలు రుణంగా తీసుకున్నారు. అయితే.. అన్ని గాజులు ఒకే బరువు, ఒకే ఆకృతిలో ఉండటంతో అక్కడ పనిచేసేవారికి అనుమానం వచ్చింది. వాటిని లోతుగా పరీక్షించగా, ఏడు బంగారుపూతల తరువాత లోపల వారికి ఇనుపగాజు కనిపించడంతో అవాక్కయ్యారు. ఇదేతరహాలో ఐఐఎఫ్ఎల్ బ్రాంచిలో ఆరు బంగారుగాజులు కుదవబెట్టి రూ.2.14 లక్షలు రుణం తీసుకున్నారు. కోర్టు సమీపంలోని ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ కంపెనీలోనూ ఇదే తరహాలో 10 గాజులు కుదవపెట్టి రూ.3.50 లక్షలు రుణంగా పొందారు. వీరు కూడా అసలు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో కంపెనీలోనూ ఈ మోసం జరిగిందని కానీ, ఫిర్యాదు చేసేందుకు ముందుకురావడం లేదని సమాచారం. నగరంలో ఇప్పటివరకూ ఇలా దాదాపు రూ.17 లక్షలు రుణం తీసుకున్నట్లు వెల్లడైంది. పలు ప్రాంతాల్లో కూడా...! గోదావరిఖని, సిద్దిపేట, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న పలు బ్రాంచీల్లో ఇనుపగాజులతో లక్షలాది రూపాయలు టోకరా వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి గోల్డ్‌ఫైనాన్స్ కంపెనీల్లో బంగారం పరీక్షల విధానంపై పూర్తి అవగాహన ఉందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే.. సులువుగా ఆయా కంపెనీలను మోసం చేయగలిగారన్న నిర్ధారణకు వచ్చారు. బాధితులు సమర్పించిన ఆధార్ కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాల ఆధారంగా పోలీసులు నిందితుల వేట ప్రారంభించారు. -
అంబేద్కర్ నగర్లో 330 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
ఇక్కడ ఒక్కో డబుల్ బెడ్రూం విలువ కోటిన్నర: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అంబేద్కర్ నగర్లో 330 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టిన్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో దశలవారీగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. పీవీ మార్గ్‌లోని అంబేద్కర్ నగర్లో డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమ్మద్ అలీ , జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఇళ్ల పరిసరాల్లో పరిశుభ్రత, పచ్చదనంపై దృష్టి పెట్టాలని సూచించారు. వర్షపు చుక్కలకు అంబేద్కర్ నగర్ వనికి పోయేదని, కోటిన్నర విలువ చేసే డబుల్ బెడ్రూం ఇల్లు పేదలకు ఉచితంగా అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఇళ్లు, పేదలకు పెళ్లి ఖర్చు కూడా ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. పేదలకు ఇంత పెద్దగా ఇళ్లు కట్టిస్తున్ననగరం ఏదీ లేదన్నారు. ఇక్కడే ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5 శాతం గ్రీనరీ పెరిగిందని, ఈ శాతాన్ని ఇంకా పెంచాలన్నారు. హుస్సేన్ సాగర్‌లో వ్యర్థాలు వేయకుండా చూసుకోవాలని అధికారును ఆదేశించారు. ‘హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం. పరిశుభ్రత, పచ్చదనంపై దృష్టి పెట్టాలి. 10 లిఫ్టులు ఉన్నాయి. ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 560 చదరపు అడుగులు. ఒక్కో యూనిట్‌కు 8 లక్షల 50 రూపాయల ఖర్చు చేసింది. జీహెచ్ఎంసీ అద్వర్యంలో 9 వేల కోట్ల పై చిలుకు రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తుంది. హుస్సేన్ సాగర్ తీరాన , లేక్ వ్యూ దగ్గర ఒక్క డబుల్ బెడ్రూం విలువ కోటిన్నర రూపాయలు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఫ్రీ గా ఇస్తుంది. హుస్సేన్ సాగర్ కు పూర్వ వైభవం తెస్తున్నాం’. అని అన్నారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంబేద్కర్ నగర్లో ఇరుకు గదుల్లో ఉంటున్న వారి ఇబ్బందులను చూసి చలించిపోయి హుస్సేన్ సాగర్ తీరాన మంచి డబుల్ బెడ్రూం ఇళ్ళు కేసీఆర్ కట్టించారన్నారు. ఇక్కడ డబుల్ బెడ్రూం ఇల్లు విలువు కోటి 50 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. -
కరెంట్ కట్
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా విద్యుత్ కోతలు లేని సరఫరా ఒక సవాలుగా మారుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ కోతల సమస్యను అధిగమించామని ముఖ్యమంత్రి జయలలిత ఇటీవల అనేకసార్లు ప్రకటించారు. అయితే వారం రోజులుగా చెన్నై నగరంలో కరెంట్ కష్టాలు ప్రారంభం అయ్యాయి. విద్యుత్ కోతలా లేక సాంకేతిక లోపాలా అనేది అర్థం కాకుండా అడపాదడపా సరఫరా నిలిచిపోతోంది. చెన్నైలోని విద్యుత్ సేవా కేంద్రానికి రోజుకు వెయ్యి నుంచి 1500 ఫిర్యాదులు అందుతున్నాయి. అలాగే విద్యుత్ సబ్స్టేషన్లకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. మూడు రోజులుగా తిరువొత్తియూరు, ఏర్నావూరు, ఎన్నూరు ప్రాంతాల్లో అర్ధరాత్రి 11.30 నుంచి తెల్లవారుజాము 3 గంటల మధ్య ఏదో ఒక సమయంలో విద్యుత్ సరఫరా ఆగిపోతోంది. మొదటి రోజున పది నిమిషాలు క్రమేణా 35 నిమిషాల కోతగా పెరిగింది. తిరువొత్తియూర్, అంబేద్కర్ నగర్, సరస్వతీ నగర్, రాజాషణ్ముగం నగర్, షణ్ముగాపురం ఎక్స్టెన్షన్, తిరువొత్తియూరు పశ్చిమ ప్రాంతాల్లో రాత్రివేళ తరచూ విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. అలాగే వలసరవాక్కం రామకృష్ణానగర్, కామరాజర్ రోడ్డు, రాధాకృష్ణన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో గత నెల 27వ తేదీ నుంచి అప్రకటిత విద్యుత్ కోత అమలవుతోంది. పులియంతోపు, వవూసీనగర్ తదితర ప్రాంతాల్లో సోమవారం రాత్రి 11 నుంచి మంగళవారం ఉదయం 11 గంటల వరకు తరచూ విద్యుత్ సరఫరాకు విఘాతం ఏర్పడింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బహిరంగ ప్రదేశాల్లో నిద్రపోయారు. నగరంలోని ఇంకా మరెన్నో ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం పరిపాటిగా మారింది. కరెంటు కష్టాలకు కారణాలెన్నో మంచినీటి సరఫరా, రహదారులు, విద్యుత్ శాఖలతోపాటూ, ప్రైవేటు సంస్థల వారు తమ అవసరాల నిమిత్తం రోడ్లను తవ్వుతున్న సందర్భంలో భూమిలో ఉన్న విద్యుత్ కేబుళ్లను ధ్వంసం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా రోడ్లను తవ్వరాదని చెన్నై కార్పొరేషన్ పెట్టిన నిబంధన లను ఎవ్వరూ పాటించడం లేదు. విద్యుత్‌శాఖ సిబ్బందికి తెలిసేటట్లుగానే కొందరు కరెంటు వైర్లకు కొక్కీలు పెట్టి విద్యుత్ వాడుకుంటున్నారు. అక్రమ విద్యుత్‌ను అరికట్టేందుకు శాఖాపరంగా సరైన చర్యలు లేవు. నగరంలో ఎన్నికల ప్రచారాలు సాగుతుండగా బహిరంగ సభలకు కొక్కీల ద్వారా కరెంటును వాడుకుంటున్నా అడిగేవారు లేకుండా పోయారు. ఇబ్బందులు ఇక తలెత్తవు వేసవి కాలంలో ఓవర్‌లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖాధికారి ఒకరు చెప్పారు. ప్లస్ టూ, పదోతరగతి పరీక్షలు ప్రారంభం అయ్యేలోగా విద్యుత్ సబ్స్టేషన్ల మరమ్మతులు పూర్తి చేస్తున్నామని అన్నారు. పరీక్షల ప్రారంభానికి మరో మూడురోజులే ఉన్నందున మరమ్మతు పనుల వేగం పెంచడం కోసం తరచూ విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వస్తోందని చెప్పారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఇటువంటి సమస్యలు తలెత్తవని హామీ ఇచ్చారు. -
అమ్మానాన్న.. మారండి!
పీకల దాకా తాగడం.. ఆ కిక్కు దిగే వరకు భార్యతో గొడవపడటం ఆయన దినచర్య. పిల్లలు పెరుగుతున్నారు.. మంచీ చెడు తెలుసుకునే స్థితికి చేరుకున్నారనే ఆలోచన ఆ బుర్రకు తట్టలేదు. పెద్ద కూతురు ఎంతో నచ్చజెప్పింది. మార్పు కోసం ఎదురుచూసింది. చుట్టుపక్కల వారి దృష్టిలో తన కుటుంబం చులకన అవుతుంటే తట్టుకోలేకపోయింది. కనీసం తన చావుతోనైనా అమ్మానాన్న కలిసుంటారనే భావన ఆ యువతిని నిలువునా కాల్చేసింది. నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన గుర్రాల శ్రీనివాసులు రిక్షా కార్మికుడు. ఈయన భార్య రత్నమ్మ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. ఇరువురు కుమారులు సంతానం. పెద్ద కూతురు బాబి కర్నూలులో పదో తరగతి పూర్తి చేసింది. ప్రస్తుతం స్థానిక ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. మొదటి సంవత్సరం పరీక్షలు మంగళవారం నాటికి పూర్తి కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. తండ్రి రోజూ మద్యం తాగి వచ్చి తల్లితో గొడవ పడుతుండటంతో తట్టుకోలేకపోయింది. ఇద్దరికీ సర్దిచెప్పడం.. మరుసటి రోజు యథావిధిగా వారిరువురూ గొడవ పడటం పరిపాటిగా మారింది. సమాజంలో గౌరవప్రదంగా బతకాలని తపించే ఆ యువతి తల్లిదండ్రుల తీరుతో విసిగిపోయింది. చుట్టుపక్కల వారు ఎగతాళి చేయడం.. చులకన చేస్తుండటంతో ఆ సున్నిత మనసు తట్టుకోలేకపోయింది. అలా ఎన్నో రోజులు తనలో తనే కుమిలిపోయింది. ఎప్పటికైనా మారుతారనే ఆశతోనే కొన్నేళ్లు గడిచిపోయాయి. బుధవారం ఉదయం కూడా శ్రీనివాసులు, రత్నమ్మ ఘర్షణపడ్డారు. ఆ తర్వాత ఎవరి దారిని వారు వెళ్లిపోయారు. ఈ ఘటనతో ఆ యువతి మనసు గాయపడింది. కనీసం తన చావుతోనైనా వారు గొడవకు దూరంగా ఉంటారని భావించింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన స్థానికులు.. ఇంతలో అక్కడికి చేరుకున్న యువతి తండ్రి మంటలను ఆర్పేశారు. ఎందుకిలా చేశావంటూ స్థానికులు ప్రశ్నించగా.. ‘‘నాన్నా క్షమించు.. అమ్మతో గొడవ పడటం చూడలేకపోయాను. ఇప్పటికైనా మీరిద్దరూ బాగుండాలి’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే ఆ యువతిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల్లో మార్పు కోసమే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ రాముకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కలీముల్లా ఆమె మరణవాంగ్మూలాన్ని నమోదు చేశారు. దాదాపు ఆరు గంటల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె సాయంత్రం మృత్యువొడి చేరింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది. -
న్యూఢిల్లీలో ఆఫ్ఘాన్ చిన్నారిపై అత్యాచారం!
దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. ఆఫ్ఘానిస్థాన్ నుంచి వలస వచ్చి ఢిల్లీలోని అంబేద్కర్ నగర్లో స్థిరపడిన కుటుంబానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైంది. దాంతో ఆ చిన్నారి తల్లి పోలీసులకు ఆశ్రయించింది. నిన్న సాయంత్రం తన కుమార్తెను నిద్రపుచ్చి....అనంతరం పని మీద బయటకు వెళ్లి అరగంటలో ఇంటికి తిరిగి వచ్చానని, అప్పటికే తన కుమార్తె శరీర భాగాల నుంచి తీవ్ర రక్తస్రావం అవుతూ ఏడుస్తు కనిపించిందని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. దాంతో పోలీసులు ఆ చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ చిన్నారికి మెరుగైన వైద్య చికిత్స కోసం సర్థార్జంగ్ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో చిన్నారిని సర్థార్జంగ్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. కాగా చిన్నారిపై అత్యాచారం జరిగిందా లేక అనుకోకుండా ఏదైన ప్రమాదం జరిగిందా అనేది వైద్య పరీక్షల ద్వారా వెల్లడి కావలసి ఉందని పోలీసులు వెల్లడించారు. వైద్య నివేదిక అందితే కానీ ... అసలు విషయం వెలుగులోకి వస్తుందని పోలీసులు శుక్రవారం వెల్లడించారు.