చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా విద్యుత్ కోతలు లేని సరఫరా ఒక సవాలుగా మారుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ కోతల సమస్యను అధిగమించామని ముఖ్యమంత్రి జయలలిత ఇటీవల అనేకసార్లు ప్రకటించారు. అయితే వారం రోజులుగా చెన్నై నగరంలో కరెంట్ కష్టాలు ప్రారంభం అయ్యాయి. విద్యుత్ కోతలా లేక సాంకేతిక లోపాలా అనేది అర్థం కాకుండా అడపాదడపా సరఫరా నిలిచిపోతోంది. చెన్నైలోని విద్యుత్ సేవా కేంద్రానికి రోజుకు వెయ్యి నుంచి 1500 ఫిర్యాదులు అందుతున్నాయి. అలాగే విద్యుత్ సబ్‌స్టేషన్లకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. మూడు రోజులుగా తిరువొత్తియూరు, ఏర్నావూరు, ఎన్నూరు ప్రాంతాల్లో అర్ధరాత్రి 11.30 నుంచి తెల్లవారుజాము 3 గంటల మధ్య ఏదో ఒక సమయంలో విద్యుత్ సరఫరా ఆగిపోతోంది. మొదటి రోజున పది నిమిషాలు క్రమేణా 35 నిమిషాల కోతగా పెరిగింది.
తిరువొత్తియూర్, అంబేద్కర్ నగర్, సరస్వతీ నగర్, రాజాషణ్ముగం నగర్, షణ్ముగాపురం ఎక్స్‌టెన్షన్, తిరువొత్తియూరు పశ్చిమ ప్రాంతాల్లో రాత్రివేళ తరచూ విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. అలాగే వలసరవాక్కం రామకృష్ణానగర్, కామరాజర్ రోడ్డు, రాధాకృష్ణన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో గత నెల 27వ తేదీ నుంచి అప్రకటిత విద్యుత్ కోత అమలవుతోంది. పులియంతోపు, వవూసీనగర్ తదితర ప్రాంతాల్లో సోమవారం రాత్రి 11 నుంచి మంగళవారం ఉదయం 11 గంటల వరకు తరచూ విద్యుత్ సరఫరాకు విఘాతం ఏర్పడింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బహిరంగ ప్రదేశాల్లో నిద్రపోయారు. నగరంలోని ఇంకా మరెన్నో ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం పరిపాటిగా మారింది.
కరెంటు కష్టాలకు కారణాలెన్నో
మంచినీటి సరఫరా, రహదారులు, విద్యుత్ శాఖలతోపాటూ, ప్రైవేటు సంస్థల వారు తమ అవసరాల నిమిత్తం రోడ్లను తవ్వుతున్న సందర్భంలో భూమిలో ఉన్న విద్యుత్ కేబుళ్లను ధ్వంసం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా రోడ్లను తవ్వరాదని చెన్నై కార్పొరేషన్ పెట్టిన నిబంధన లను ఎవ్వరూ పాటించడం లేదు. విద్యుత్‌శాఖ సిబ్బందికి తెలిసేటట్లుగానే కొందరు కరెంటు వైర్లకు కొక్కీలు పెట్టి విద్యుత్ వాడుకుంటున్నారు. అక్రమ విద్యుత్‌ను అరికట్టేందుకు శాఖాపరంగా సరైన చర్యలు లేవు. నగరంలో ఎన్నికల ప్రచారాలు సాగుతుండగా బహిరంగ సభలకు కొక్కీల ద్వారా కరెంటును వాడుకుంటున్నా అడిగేవారు లేకుండా పోయారు.
ఇబ్బందులు ఇక తలెత్తవు
వేసవి కాలంలో ఓవర్‌లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖాధికారి ఒకరు చెప్పారు. ప్లస్ టూ, పదోతరగతి పరీక్షలు ప్రారంభం అయ్యేలోగా విద్యుత్ సబ్‌స్టేషన్ల మరమ్మతులు పూర్తి చేస్తున్నామని అన్నారు. పరీక్షల ప్రారంభానికి మరో మూడురోజులే ఉన్నందున మరమ్మతు పనుల వేగం పెంచడం కోసం తరచూ విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వస్తోందని చెప్పారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఇటువంటి సమస్యలు తలెత్తవని హామీ ఇచ్చారు.
కరెంట్ కట్
Published Thu, Mar 3 2016 3:14 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM
Advertisement