పీకల దాకా తాగడం.. ఆ కిక్కు దిగే వరకు భార్యతో గొడవపడటం ఆయన దినచర్య. పిల్లలు పెరుగుతున్నారు.. మంచీ చెడు తెలుసుకునే స్థితికి చేరుకున్నారనే ఆలోచన ఆ బుర్రకు తట్టలేదు. పెద్ద కూతురు ఎంతో నచ్చజెప్పింది. మార్పు కోసం ఎదురుచూసింది. చుట్టుపక్కల వారి దృష్టిలో తన కుటుంబం చులకన అవుతుంటే తట్టుకోలేకపోయింది. కనీసం తన చావుతోనైనా అమ్మానాన్న కలిసుంటారనే భావన ఆ యువతిని నిలువునా కాల్చేసింది.
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన గుర్రాల శ్రీనివాసులు రిక్షా కార్మికుడు. ఈయన భార్య రత్నమ్మ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. ఇరువురు కుమారులు సంతానం. పెద్ద కూతురు బాబి కర్నూలులో పదో తరగతి పూర్తి చేసింది. ప్రస్తుతం స్థానిక ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. మొదటి సంవత్సరం పరీక్షలు మంగళవారం నాటికి పూర్తి కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. తండ్రి రోజూ మద్యం తాగి వచ్చి తల్లితో గొడవ పడుతుండటంతో తట్టుకోలేకపోయింది. ఇద్దరికీ సర్దిచెప్పడం.. మరుసటి రోజు యథావిధిగా వారిరువురూ గొడవ పడటం పరిపాటిగా మారింది. సమాజంలో గౌరవప్రదంగా బతకాలని తపించే ఆ యువతి తల్లిదండ్రుల తీరుతో విసిగిపోయింది.
చుట్టుపక్కల వారు ఎగతాళి చేయడం.. చులకన చేస్తుండటంతో ఆ సున్నిత మనసు తట్టుకోలేకపోయింది. అలా ఎన్నో రోజులు తనలో తనే కుమిలిపోయింది. ఎప్పటికైనా మారుతారనే ఆశతోనే కొన్నేళ్లు గడిచిపోయాయి. బుధవారం ఉదయం కూడా శ్రీనివాసులు, రత్నమ్మ ఘర్షణపడ్డారు. ఆ తర్వాత ఎవరి దారిని వారు వెళ్లిపోయారు. ఈ ఘటనతో ఆ యువతి మనసు గాయపడింది. కనీసం తన చావుతోనైనా వారు గొడవకు దూరంగా ఉంటారని భావించింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన స్థానికులు.. ఇంతలో అక్కడికి చేరుకున్న యువతి తండ్రి మంటలను ఆర్పేశారు. ఎందుకిలా చేశావంటూ స్థానికులు ప్రశ్నించగా.. ‘‘నాన్నా క్షమించు.. అమ్మతో గొడవ పడటం చూడలేకపోయాను.
ఇప్పటికైనా మీరిద్దరూ బాగుండాలి’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే ఆ యువతిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల్లో మార్పు కోసమే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ రాముకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కలీముల్లా ఆమె మరణవాంగ్మూలాన్ని నమోదు చేశారు. దాదాపు ఆరు గంటల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె సాయంత్రం మృత్యువొడి చేరింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది.
అమ్మానాన్న.. మారండి!
Published Thu, Mar 27 2014 3:27 AM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM
Advertisement
Advertisement