బ్యాంకులో మేనేజర్‌తో చర్చిస్తున్న ఉన్నతాధికారులు
అనంతపురం, హిందూపురం అర్బన్: ఇంటిదొంగను ఈశ్వరుడైన పట్టలేడు అన్న చందంగా..బ్యాంకులో నమ్మకంగా ఉండే అప్రైజర్ (బంగారు నాణ్యత పరిశీకుడు) నకిలీబంగారు నగలు తాకట్టు పెట్టించి అధికారులను బురిడీ కొట్టించిన సంఘటన వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి...హిందూపురంలోని సిండికేట్‌బ్యాంకు టీచర్స్‌కాలనీ బ్రాంచ్‌లో బంగారు రుణాలు ఇవ్వడానికి రవిచంద్ర అనే వ్యక్తి నగల అప్రైజర్‌గా ఉన్నాడు. నాలుగేళ్లుగా తనకు తెలిసిన వారి పేరిట బంగారు నగలను తాకట్టు పెట్టించి బంగారు రుణాలు ఇప్పించాడు. బంగారు పూత పూసిన గిల్టు నగలను బంగారు నగలుగా చూపిస్తూ ఇలా సుమారు రూ.45 లక్షలకు పైగా దాదాపు 16 మంది పేరిట రుణాలు తీసుకున్నారు. ఈ డబ్బుతో ఆయన రియల్ ఎస్టేట్‌వ్యాపారం సాగిçస్తూ వచ్చాడు. వ్యాపారం అనుకున్న రీతిలో సాగలేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి.
గుట్టు రట్టయ్యిందిలా..
టీచర్స్‌కాలనీ బ్రాంచ్‌కు ఎక్కువగా బంగారు నగలు తాకట్టుగా వస్తుండటంతో మెయిన్‌బ్రాంచ్ అధికారులు ర్యాండమ్ చెకింగ్ చేయడానికి వారంరోజుల కిందట మడకశిర నుంచి మరో అప్రైజర్‌ను పంపించారు. తాకట్టులో ఉన్న మొత్తం బంగారు నగలు, వాటివిలువ, ఎన్నాళ్లుగా తాకట్టులో ఉన్నాయన్న విషయాలను పరిశీలించగా నకిలీ బంగారు బయటపడింది. తాను బాధ్యతలు చేపట్టకమునుపే ఈ వ్యవహారం జరిగినట్లు ప్రస్తుత మేనేజర్ చిన్నబాబు ఉన్నతాధికారులకు తెలిపారు.
ఉన్నతాధికారుల విచారణ
నకిలీ బంగారం తాకట్టు వ్యవహారంపై రీజినల్ మేనేజర్ కోదండరామిరెడ్డి, చీఫ్‌మేనేజర్ రమేష్‌తో పాటు మరో లాయర్ సిండికేట్‌నగర్ టీచర్స్ కాలనీ బ్రాంచ్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం విచారణ చేపట్టారు. పలు రికార్డులు పరిశీలించారు. వ్యవహారం బయటకు రావడంతో సంబంధిత అప్రైజర్‌పై కేసు నమోదు కాకుండా నియోజకవర్గస్థాయి రాజకీయ నేత నుంచి బ్యాంకు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. తీసుకున్న రుణాల మొత్తాన్ని తిరిగి కట్టేసేటట్టు ఒప్పించినట్లు సమాచారం.
కాగా బ్యాంకు మేనేజర్ చిన్నబాబును విలేరులు అడుగగా బంగారు నగలు తాకట్టు పెట్టి రూ.29 లక్షల వరకు రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని చెప్పారు. రీజినల్ అధికారులు మాత్రం సాధారణ తనిఖీలలో భాగంగా ఇలా వచ్చామని మాత్రమే చెప్పారు. సాయంత్రం బ్యాంకు అధికారులు నిబంధన మేరకు టూటౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సైబర్ మోసాలు తమ పరిధిలోకి రావన్నారు.
అస్మదీయుల మోసం రెండోసారి..
సిండికేట్ బ్యాంకులో పనిచేసే వారే మోసానికి పాల్పడటం ఇది రెండవసారి. మూడేళ్లక్రితం హిందూపురం మెయిన్‌బ్రాంచ్‌లో పనిచేసే సహాయ మేనేజర్ బాబా అక్బర్ తోటి ఉద్యోగుల కంప్యూటర్‌లో నుంచి ఇతరుల ఖాతాలకు రుణాలు మంజూరు చేసినట్లు రికార్డు చేసి సుమారు రూ.కోటి పైగా స్వాహా చేశాడు. దీనిన్ని కనుగొన్న ఉన్నతాధికారులు విచారణ చేసి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముంబయి, ఇతర ప్రాంతాల్లో గాలించి చివరకు సైబర్ మోసంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు టీచర్స్ కాలనీ బ్రాంచ్‌లో నకిలీ బంగారు నగల తాకట్టు రుణాల వ్యవహారం బయటపడింది. దీంతో ఖాతాదారులు భయాందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment