లక్ష్మీటాకీసు సెంటరులోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్
కోనేరుసెంటర్ (మచిలీపట్నం): కృష్ణా జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ బ్యాంకులో అతనో అప్రయిజర్... ఆ బ్యాంకులో బంగారంపై రుణం కావాలంటే ఆ అప్రయిజర్ ఖాతాదారుడు తెచ్చింది అసలైన బంగారమే అంటూ రాజముద్ర వేయాలి. అప్రయిజర్ అలా వేయకుంటే అది అసలైన బంగారం అయినా ఆ బ్యాంకు ఖాతాదారుడికి రుణం ప్రాణం పోయినా ఇవ్వదు. బ్యాంకుకు అంతటి నమ్మకస్తుడుగా ఉండాల్సిన ఆ అప్రయిజర్ బ్యాంకు అధికారులు నమ్మకాన్ని సొమ్ము చేసుకోవాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవు తన మెదడుకు పని చెప్పాడు. అధికారులను డుమ్మి కొట్టించేందుకు పదునైన పథకం రచించాడు.
అందుకోసం నమ్మకమైన పరిచయస్తులతో పాటు దూరం బంధువులను కలుపుకున్నాడు. వారికి తెలియకుండా దొంగ సంతకాలు చేయించుకుని అదే బ్యాంకులో వారి పేరు మీద నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి కోట్లలో రుణాలు తీసుకున్నాడు. ఆలస్యంగానైనా విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ బ్యాంకు వద్దకు పరుగులు పెట్టి అధికారుల ఎదుట గొల్లుమన్నారు. అనంతరం పోలీసులను కలసి జరిగిన మోసంపై మూకుమ్మడిగా ఫిర్యాదులు చేశారు. ఈ సంఘటన జిల్లాకేంద్రమైన మచిలీపట్నంలోని సెంట్రల్ బ్యాంకులో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
బ్రాంచ్ మేనేజర్‌తో మాట్లాడుతున్న పోలీసులు
మచిలీపట్నంకు చెందిన ప్రసాద్ సెంట్రల్ బ్యాంకులో అప్రయిజర్‌గా పని చేస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్న ప్రసాద్ కొంత కాలంగా తన బంధువులు, పరిచయస్తులతో నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టించి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవటం మొదలుపెట్టాడు. బంగారం ఒరిజనలా డూప్లికేటా అనేది తేల్చే బాధ్యత ప్రసాద్‌దే కావడంతో బ్యాంకు అధికారుల నమ్మకాన్ని ఆసరాగా తీసుకున్న ప్రసాద్ కొంతకాలంగా ఇదే తరహాలో బ్యాంకులో నకలీ బంగారాన్ని తాకట్టు పెట్టి కోట్లలో రుణాలు తీసుకుంటూ వచ్చాడు. సంతకాలు పెట్టిన బంధువులు, పరిచయస్తులకు బ్యాంకు నుంచి నోటీసులు వస్తుండగా ప్రసాద్ వారికి మీ రుణాలు తీరిపోయాయి అంటూ చెప్పుకుంటూ రావడంతో పాటు వారి అవసరాలకు అడ్డుపడుతూ నోరు మెదపకుండా చేసుకుంటూ వస్తున్నాడు.
బ్యాంకు నోటీసులు అధికం కావడంతో అనుమానం వచ్చిన కొంత మంది బ్యాంకు అధికారులతో వాదనకు దిగారు. దీంతో అసలు విషయం బయటికి పొక్కడంతో జరిగిన మోసం తెలుసుకున్న బాధితుల్లోని కొందరు చిలకలపూడి పోలీసులను ఆశ్రయించి జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న బందరు డీయస్పీ మహబూబ్‌బాషా, సీఐ వెంకటనారాయణలు బ్యాంకుకు వెళ్ళి మేనేజర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బ్యాంకు మేనేజర్ పై అధికారులతో మాట్లాడిన అనంతరం ఆడిట్ వ్యవహారం ముగిశాక ఫిర్యాదు చేస్తామని చెప్పటంతో పోలీసులు బ్యాంకు నుంచి వెనుదిరిగారు. ఇదిలా ఉండగా బాధితుల ఫిర్యాదు మేరకు కోట్లలో కుంభకోణం జరిగివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపి వాస్తవ అవాస్తవాలు నిర్ధారించటం జరుగుతుందని చిలకలపూడి సీఐ వెంకటనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment