edara Mohan Babu
-
ఈదర అస్త్ర సన్యాసం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్‌బాబు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో చైర్మన్‌తో పాటు డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం రాజీనామా లేఖను సహకారశాఖ రిజిస్ట్రార్‌కు పంపారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఇక రాజీనామాకు ఆమోదముద్ర లభించటమే తరువాయి. పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్‌పై 15 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఆ శాఖ రిజిస్ట్రార్‌కు లేఖ ఇచ్చారు. నిబంధనల మేరకు మెజార్టీ సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై నెల రోజుల్లోపు అవిశ్వాస తీర్మానం సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఇందులో భాగంగా ఈ నెల 27న సమావేశం నిర్వహించాలని సహకార శాఖ రిజిస్ట్రార్ డీసీఓను ఆదేశించారు. ఈ మేరకు సభ్యులకు నోటీసులు సైతం జారీ చేశారు. మెజార్టీ సభ్యులు తనకు వ్యతిరేకంగా ఉండటంతో విశ్వాసపరీక్షలో ఓటమిపాలు కావడం కంటే రాజీనామా చేయడమే ఉత్తమమని ఈదర భావించారు. ఈ మేరకు బుధవారం తన రాజీనామా లేఖను రిజిస్ట్రార్‌కు పంపారు. ఇదే విషయాన్ని ఈదర విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈదర రాజీనామాను ఆమోదిస్తే అవిశ్వాస సమావేశం అవసరం లేదు. నెల రోజులుగా వివాదం.. బ్యాంకు చైర్మన్ ఈదర, డైరెక్టర్ల మధ్య గత నెల రోజులుగా వివాదం చెలరేగింది. చైర్మన్ తమను వంచించి అక్రమాలకు పాల్పడ్డారని డైరెక్టర్లు ఆరోపణలకు దిగారు. ముఖ్యమంత్రి, మంత్రి, సహకార శాఖ రిజిస్ట్రార్, ఎస్పీలకు సైతం ఫిర్యాదు చేశారు. మరోవైపు చైర్మన్ ఈదర సైతం కొందరు డైరెక్టర్లు, అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు చేయడమే కాక ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి చెందిన వారైనా ఇరువర్గాల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరాయి. దీంతో చైర్మన్‌ను పదవి నుంచి దించాలని మెజార్టీ డైరెక్టర్లు పట్టుపట్టారు. కుర్చీ దించేందుకు యత్నాలు.. ఈ వ్యవహారంలో అధికార పార్టీలో వర్గవిభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. చైర్మన్ ఈదరకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లకు మధ్య విభేదాలున్నాయి. దామచర్ల మద్ధతుదారులంతా మోహన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన్ను పదవి నుంచి దించేందుకు సకల ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఈదరకు మద్ధతు పలికినా అధిష్టానం సైతం జనార్దన్‌కే మద్ధతుగా నిలవడంతో ఈదరకు పదవీ గండం తప్పలేదు. మెజార్టీ డైరెక్టర్లు తనకు వ్యతిరేకంగా ఉండటంతో అవిశ్వాస తీర్మానంలో నెగ్గే పరిస్థితి లేదని ఈదరకు స్పష్టంగా తెలుసు. ఈ పరిస్థితుల్లో ముందే పదవి నుంచి తప్పుకుంటే మేలని ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని పలు సందర్భాల్లో ఈదర మోహన్ విమర్శలు చేశారు. బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలోనూ తన రాజీనామాకు కారణం జనార్దనే అంటూ విమర్శలు చేయడం గమనార్హం. డీసీసీబీకి సంబంధించిన అన్ని కీలక మూలాలన్నీ ఆయనకు తెలుసునని, టీడీపీ వర్గ రాజకీయాలతోనే తనకు ఈ పరిస్థితి వచ్చిందని ఈదర వాపోయారు. మెజార్టీ డైరెక్టర్లు ఎమ్మెల్యేకు అనుకూలురుగా ఉండటంతో చివరకు ఈదరకు పదవి గండం తప్పలేదు. ఎట్టకేలకు ఈదరను చైర్మన్‌గిరి నుంచి దింపడంతో దామచర్ల విజయం సాధించారు. డీసీసీబీ వ్యవహారం అధికార పార్టీ వర్గరాజకీయాలకు మరింత ఆజ్యం పోసింది. చైర్మన్, డైరెక్టర్ల పదవులకు మాత్రమే రాజీనామాలు చేసినా ఈదర మోహన్ టీడీపీకి మాత్రం రాజీనామా చేయలేదని చెప్పారు. చైర్మన్ పదవి కోల్పోవటానికి అధికార పార్టీనే కారణం కావడం ఈదరను మరింత ఆవేదనకు, ఆగ్రహానికి గురి చేస్తోంది. ఆయన పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఈదర ఏ నిర్ణయం తీసుకుంటారో దానిపై వేచి చూడాలి. సీఎంను కలిసి న్యాయ విచారణ కోరతా – పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్‌బాబు ఒంగోలు: ‘పార్టీ ముఖ్యమే కాదనను...కానీ నా మనోభావాలు నాకు ముఖ్యమే’ అని ప్రకాశం జిల్లా సహకార కేంద్రబ్యాంకు (పీడీసీసీబీ) చైర్మన్ ఈదర మోహన్‌బాబు పేర్కొన్నారు. అందుకే అవిశ్వాసం నోటీసులు జారీ అవుతున్నాయని తెలిసినందున బ్యాంకు చైర్మన్ పదవికి, డైరెక్టర్ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. బుధవారం సాయంత్రం స్థానిక రాంనగర్‌లోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ జె.మురళికి మెయిల్ ద్వారా పంపామని, రిజిస్టర్డ్ స్పీడు పోస్టు కూడా పంపానన్నారు. నెలరోజుల క్రితం తాను సహకార వ్యవస్థపై జరుగుతున్న దాడిని నిరసిస్తూ రాజీనామా చేస్తే మంత్రి శిద్దా రాఘవరావు చేసిన విజ్ఞప్తి మేరకు రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తిరిగి పదవిలో కొనసాగడం జరిగిందన్నారు. కేవలం నెలరోజుల్లోనే డైరెక్టర్లు పెద్ద ఎత్తున తనపై ఆరోపణలు చేస్తూ ఎదురుదాడికి దిగుతున్నారంటే దానికిగల కారణాలు టిడిపి జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్థన్రావుకే తెలుసన్నారు. పక్షంరోజులుగా డైరెక్టర్లతో ఒంగోలులో క్యాంపు కూడా జరుగుతుందంటే దానికి వెనుక రాజకీయ కారణాలు బహిరంగ రహస్యం అన్నారు. తాను పదవి చేపట్టేనాటికి పీడీసీసీ బ్యాంకు పాతిక కోట్ల నష్టాల్లో ఉంటే ప్రస్తుతం రూ.18.50 లక్షల లాభంలో ఉందన్నారు. అంతే కాకుండా డిపాజిట్లను రూ.276 కోట్ల నుంచి రూ.660కోట్లకు పెంచగలిగానన్నారు. జిల్లాలో రైతాంగం బలపడే క్రమంలో భాగంగానే బ్యాంకు కూడా ఆర్థికంగా పుంజుకుంటుందని, ఈ దశలో ఆర్థిక దోపిడీలకు పాల్పడి బ్యాంకు నుంచి బయటకు వెళ్లిన ఉద్యోగులు, బ్యాంకును ఏదో ఒక విధంగా తమ కబంధ హస్తాల్లోకి తీసుకోవాలనే మరికొంతమంది కుట్ర వెరసి తనపై ఆరోపణలు జరిగాయన్నారు. రాజకీయ అండదండలు ఉండడం వల్లే ఈ పరిస్థితి చోటుచేసుకుందని, తాము ముందుగా నిర్ణయించుకున్న వారిని ఒకరిని చైర్మన్ చేయాలనే భావనతోనే ఈ కార్యక్రమం కొనసాగుతుందని తాను విశ్వసిస్తున్నానన్నారు. ఆమోదిస్తారని ఆశిస్తున్నా.. తనపట్ల విశ్వాసం ఉన్నన్నాళ్లు తాను చైర్మన్‌గా కొనసాగానని, తన పట్ల విశ్వాసం లేదని చెబుతున్నందున వారి మనోభావాలను గౌరవించి తాను రాజీనామా చేసి సహకార శాఖ కమిషనర్‌కు పంపానని ఈదర స్పష్టం చేశారు. తన రాజీనామా గురువారం ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నానన్నాని, ఒక వేళ ఆమోదంలో తాత్సారం జరిగితే తాను బాధ్యత వహిస్తున్న సహకార సంఘ అధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేయడం ద్వారా తన రాజీనామా ఆమోదం పొందేటట్లు చేసుకుంటానన్నారు. భవిష్యత్తులో కూడా తాను సహకార సంఘం ఎన్నికలలో పోటీపడాలని భావించడం లేదని చెప్పారు. టీడీపీలోకి రావాలనే కాంక్షతో నాడు కాంగ్రెస్‌కు రాజీనామా చేశానన్నారు. జరిగిన అన్యాయాన్ని స్వయంగా సీఎంకు వివరించి న్యాయ విచారణ కోరాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. పదవిలో ఉన్నంతకాలం తనకు సహకరించిన పీఏసీఎస్ అ«ధ్యక్షులకు, పాలకవర్గసభ్యులకు, బ్యాంకు ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
రచ్చ.. రచ్చే!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పీడీసీసీబీ గొడవ ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించటం లేదు. చైర్మన్ ఈదర మోహన్ అవినీతికి పాల్పడ్డాడంటూ ఆరోపణలకు దిగి ఏకంగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేసిన మెజార్టీ డైరెక్టర్లు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. శుక్రవారం సైతం టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన డైరెక్టర్లు చైర్మన్ ఈదర మోహన్ ముందు పదవి నుంచి తప్పుకోవాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. తాము కూడా ఏ విచారణకైనా సిద్ధమని అయితే మెజార్టీ సభ్యులు వ్యతిరేకిస్తున్నందున చైర్మన్ ముందు పదవి నుంచి దిగిపోవాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు చైర్మన్ ఈదర మోహన్ తనపై ఆరోపణలు చేస్తున్నది కొందరు ఆర్థిక నేరగాళ్లేనంటూ ఎదురుదాడికి దిగారు. మాటలతో సరిపెట్టకుండా ఆరు మంది డైరెక్టర్లు మరికొంత మంది బ్యాంకు ఉద్యోగులు, మాజీ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆ వివరాలను సైతం ముఖ్యమంత్రికి లేఖ ద్వారా పంపి గొడవను పతాకస్థాయికి చేర్చారు. డైరెక్టర్లు, చైర్మన్ పరస్పర ఆరోపణలతో డీసీసీబీ రచ్చ మరింత తీవ్ర స్థాయికి చేరింది. గొడవను సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినా ఫలితం కనిపించలేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఈ నెల 4న ఇరువర్గాలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సమావేశానికి డైరెక్టర్లు మాత్రమే హాజరయ్యారు. చైర్మన్ ఈదర మోహన్ హాజరుకాలేదు. తాను అక్కడకు వెళ్లి చెప్పుకోవాల్సిందేమీ లేదంటూ ఆయన సెల్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. దీంతో చేసేదేం లేక జనార్దన్ సమావేశాన్ని వాయిదా వేశారు. శనివారం జిల్లా మంత్రి శిద్దా రాఘవరావుతో కలిసి డైరెక్టర్లు, ఇటు చైర్మన్‌తో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇరువర్గాలను ఒప్పించి రాజీ ప్రయత్నాలు కుదర్చాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి శిద్దా సమక్షంలో దామచర్లతో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తదితరులు సమావేశంలో పాల్గొని ఇరువర్గాలను ఒప్పించే ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి కూడా ఈదర మోహన్ రావటం ప్రశ్నార్థకంగా మారింది. కానీ నేడు సమావేశం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. మంత్రి శిద్దా కూడా జిల్లాలో ఉండే అవకాశం లేకపోవడంతో సమావేశం మరోమారు వాయిదా పడేలా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో డీసీసీబీ గొడవ పెరగడం తప్ప ఇప్పట్లో సర్దుమణిగేలా లేదు. మరోవైపు డైరెక్టర్లు సైతం అమీతుమీకి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చైర్మన్ ఈదర మోహన్‌పై అవిశ్వాసం నోటీస్ ఇచ్చినందున ఆ మేరకు చర్యలు చేపట్టాలని వారు సహకార శాఖ రిజిస్ట్రార్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. -
అంతా ఆయనే చేశారు!
ఒంగోలు : పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబుపై బ్యాంక్ డైరెక్టర్లు తాజాగా 27 అంశాలకు సంబంధించి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఈ మేరకు గురువారం మీడియా కార్యాలయాలకు ఓ ప్రకటన విడుదల చేశారు. వైస్ చైర్మన్ కండే శ్రీనివాసరావు, డైరెక్టర్లు ఆర్.వెంకట్రావు, చిడిపోతు మస్తానయ్య, గండికోట చినవీరయ్య, జాగర్లమూడి యలమందరావు, కె.మురహరి, మేణావత్ హనుమాన్‌నాయక్ సంతకాలతో ఈ ప్రకటన జారీ అయింది. ఆరోపణల్లో ముఖ్యమైనవి.. ⇔ తన ఇష్టానికి అనుకూలంగా వ్యవహరించడం లేదంటూ 8 మంది బ్యాంకు సీఈఓలను మార్చారు. ⇔ బ్యాంకులో లాకర్లు, సేఫ్ డోర్లు నాణ్యమైనవి కొనుగోలు చేయాల్సి ఉండగా నాసిరకంవి కొని నాణ్యమైన వాటి ధరకన్నా అధిక మొత్తం చెల్లించారు. ⇔ బ్యాంకు స్టాండింగ్ కౌన్సిల్లో సొంత మనిషిని నియమించుకుని వారి ద్వారా.. సిరి ఇన్ఫ్రా అనే డొల్ల కంపెనీ స్థాపించి బ్యాంకులో అన్ని రకాల కొనుగోళ్లు, లోన్లకు సంబంధించి లీగల్ ఒపీనియన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ⇔ బ్యాంకు స్టాండింగ్ లాయర్ లీగల్ ఒపీనియన్‌కు నిర్ణయించిన ధర కంటే అధిక మొత్తం చార్జీల కింద వసూలు చేశారు. ⇔ సంఘంలో అవుట్ స్టాండింగ్‌కు తగ్గ షేరు ధనం మాత్రమే బ్యాంకు వారు వసూలు చేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా సంఘ పరిస్థి«తులను బట్టి 2017 మార్చిలో రూ.5 నుంచి రూ.10 లక్షల షేరు ధనం వసూలు చేశారు. ⇔ బంగారు వేలం నోటీసులు ఓ పత్రికకు ఎక్కువ మొత్తంలో ఇచ్చి, అదే పత్రికకు సంవత్సర చందాలు కట్టాలని సొసైటీలపై ఒత్తిడి చేశారు. ⇔ బ్యాంకు ఉద్యోగులకు అరియర్స్, జీతాలు ఇచ్చే విషయంలోనూ, స్వల్పకాలిక రుణాల మంజూరు విషయంలో, బ్యాంకు ఉద్యోగులకు వయోపరిమితి సడలించే విషయంలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంది. ⇔ నగదు కౌంటింగ్ మెషీన్లను రిపేరు చేయించకుండా కొత్తవి కొనుగోలు చేయడంలోనూ రూ.60 లక్షలు చేతులు మారింది. ⇔ బ్యాంకులో సిబ్బంది ఉన్నప్పటికీ వారిని కాదని రిటైరైన ఉద్యోగులను నియమించడం ద్వారా లక్షలాది రూపాయలు దుర్వినియోగమయ్యాయి. ⇔ 2016 ఏప్రిల్‌లో సంఘాల ద్వారా బ్యాంకులో చేర్చుకున్న సిబ్బంది నియమ నిబంధనలు లేకున్నా వారికి తప్పుడు ధ్రువీకరణలతో అవకాశం కల్పించారు. ⇔ బ్యాంకు పాలన నాబార్డు, ఆర్బీఐ, ఆర్సీఎస్ వారి సూచనలకు లోబడి, బ్యాంకు బైలాలకు లోబడి నడపాల్సి ఉండగా ఇష్టానుసారంగా వ్యవహరించారు. అందువల్ల బ్యాంకులో జరిగిన చట్టవ్యతిరేక పనులను పాలకవర్గం ఆమోదించలేదు. ఆ విషయాలకు తాము బాధ్యులం కాదు. ⇔ ఇందిరాదేవి సెక్షన్ 52 కింద జరిపిన గోల్డ్‌లోన్ విచారణ నివేదిక లోపభూయిష్టంగా ఉంది. ఇంతవరకు గోల్డు లోన్ ద్వారా జరిగిన నష్టం వసూలు చేయలేదు. ⇔ ఒంగోలు డీసీఎంఎస్ వారు బ్యాంకుకు చెల్లించాల్సిన రుణం వేలానికి వచ్చి పెండింగ్‌లో ఉండగా ఐసీడీపీ ద్వారా రూ.25 లక్షలు మంజూరు చేయించారు. ⇔ తారకరామ డెయిరీ నుంచి ఎన్పీఏ మొత్తం వసూలు చేయకుండా ఒన్‌టైమ్ సెటిల్మెంట్కు అవకాశం కల్పించి వాయిదా వేశారు. ⇔ స్టడీ టూర్ల పేర్లతో లక్షలాది రూపాయల దుర్వినియోగం జరిగింది. ఒక్క స్టడీ టూరు కూడా బ్యాంకుకు మేలు చేయలేదు. అన్ని విహార యాత్రలుగానే మిగిలాయి. ⇔ గుంటూరు పాలకవర్గ సమావేశంలో పాలకవర్గ ధన దుర్వినియోగాలపై జరిగిన విచారణ నివేదిక ద్వారా పాలకవర్గ సభ్యులను బాధ్యులను చేయడం వల్ల.. తాము కూడా అలా బాధ్యులం కాగలమని భావించి మోసపూరిత అంశాలను కనుగొన్నాం. బ్యాంక్ చైర్మన్‌పై తమ నమ్మకం వమ్ము అయింది. -
పీడీసీసీబీలో గోల్డ్‌మాల్
ఒంగోలు వన్‌టౌన్, న్యూస్‌లైన్ : ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (పీడీసీసీ బ్యాంకు)లో బంగారం రుణాల మంజూరులో అక్రమాల పుట్టబద్దలైంది. బ్యాంకు ఉద్యోగి బయట వ్యక్తులతో కుమ్మక్కై రూ. 256.99 లక్షల బ్యాంకు సొమ్ము పరాయి వ్యక్తుల పాల్జేశారు. నకిలీ బంగారాన్ని హామీగా ఉంచడంతో పాటు తూకాల్లో కూడా భారీగా మోసం చేశారు. 2011 నుంచి 16 మంది వ్యక్తులతో కుమ్మక్కై బ్యాంకు అప్రైజర్ నరసింహారావు ఈ అక్రమాలకు పాల్పడ్డారు. పీడీసీసీ బ్యాంకులో బంగారు రుణాల మంజూరులో అప్రైజర్ అక్రమాలపై ఈ నెల 11న ‘సాక్షి’లో ‘పీడీసీసీ బ్యాంకులో చేతివాటం’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు అప్రమత్తమై జిల్లాలోని ఆ బ్యాంకు శాఖలన్నింటిలో బంగారు రుణాల పరిశీలనకు ఆదేశించారు. రూ. 256.99 లక్షలు స్వాహా పీడీసీసీ బ్యాంకులో బంగారం రుణాల మంజూరులో రూ. 256.99 లక్షలు స్వాహా చేసినట్లు విచారణలో తేలినట్టు చైర్మన్ ఈదర మోహన్‌బాబు శనివారం విలేకరులకు తెలిపారు. బ్యాంకు అప్రైజర్ నరసింహారావు 16 మందితో కలిసి ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలిందన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలులోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో కర్నూలురోడ్డు శాఖల్లోనే ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయి. ప్రధాన కార్యాలయంలో అత్యధికంగా రూ. 211.95 లక్షలు స్వాహా చేశారు. కర్నూలురోడ్డు బ్యాంకు శాఖలో ఆరుగురు వ్యక్తులు 11 ఖాతాలకు నకిలీ బంగారం పెట్టి 26.67 లక్షల రూపాయలు స్వాహా చేశారు. 8 మంది వ్యక్తులు 19 ఖాతాల్లో బంగారం తూకంలో మోసం చేసి 18.37 లక్షలు దిగమింగారు. ఈ రెండు శాఖలకు నరసింహారావు అప్రైజర్‌గా పని చేస్తున్నారు. బంగారు రుణాల మంజూరులో అక్రమాలు జరగకుండా చూడాల్సిన బ్యాంకు మేనేజర్లు అప్రైజర్‌ను నమ్మి గుడ్డిగా సంతకాలు పెట్టడంతో పీకల దాకా ఇరుక్కుపోయారు. 16 మంది కీలక వ్యక్తులు ఈ బంగారు రుణాల అక్రమాలో 16 మంది వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. వీరిలో ఎం.యోగేంద్ర కీలక వ్యక్తి. యోగేంద్ర రెండు చిరునామాలతో నకిలీ బంగారం పెట్టి రూ.62.23 లక్షలు కాజేసినట్లు విచారణలో తేలిందని ఈదర మోహన్‌బాబు తెలిపారు. ఒంగోలు నగర పరిధిలోని పెళ్లూరుకు చెందిన ఎం. ఏడుకొండలు రూ.19.53 లక్షలు స్వాహా చేశారు. చీమకుర్తి మండలం గుండువారి లక్ష్మీపురం (జిఎల్‌పురం)కు చెందిన అన్నదమ్ములు కూడా ఈ స్వాహాలో పాత్రధారులే. ఈ గ్రామానికి చెందిన ఎం.నారాయణ రూ. 43.09 లక్షలు, ఎం. సురేంద్రబాబు రూ. 11.82 లక్షలు స్వాహా చేశారు. ఎం.యోగేంద్ర మరో ఖాతాలో రూ. 16.60 లక్షలు కాజేశారు. పి.ఇంతియాజ్‌ఖాన్ రూ. 1.89 లక్షలు, కె.సుధాకర్ రూ. 2.48 లక్షలు, షేక్ అక్బర్‌బాషా రూ. 2.70 లక్షలు, టి. వెంకటేశ్వర్లు రూ. 80 వేలు, ఐ.వాసుదేవరావు రూ.1.29 లక్షలు, కె.వెంకటరమణ రూ. 38,499లు స్వాహా చేశారు. అందరిపై క్రిమినల్ కేసులు బ్యాంకులో బంగారు రుణాలు మంజూరు చెల్లింపులో అవకతవకలకు పాల్పడిన వారందరిపై క్రిమినల్ కేసులు పెట్టనున్నట్లు బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 42 లక్షలు రికవరీ చేసినట్లు చెప్పారు. ఈ అక్రమాలపై సోమవారం బ్యాంకు అధికారులు ఆప్కాబ్‌కు ఓ నివేదికను అందించనున్నారు.