పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్ బాబు ,సహకార శాఖ రిజిస్ట్రార్‌కు పంపిన రాజీనామా లేఖ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్‌బాబు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో చైర్మన్‌తో పాటు డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం రాజీనామా లేఖను సహకారశాఖ రిజిస్ట్రార్‌కు పంపారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఇక రాజీనామాకు ఆమోదముద్ర లభించటమే తరువాయి. పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్‌పై 15 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఆ శాఖ రిజిస్ట్రార్‌కు లేఖ ఇచ్చారు. నిబంధనల మేరకు మెజార్టీ సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై నెల రోజుల్లోపు అవిశ్వాస తీర్మానం సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఇందులో భాగంగా ఈ నెల 27న సమావేశం నిర్వహించాలని సహకార శాఖ రిజిస్ట్రార్ డీసీఓను ఆదేశించారు.
ఈ మేరకు సభ్యులకు నోటీసులు సైతం జారీ చేశారు. మెజార్టీ సభ్యులు తనకు వ్యతిరేకంగా ఉండటంతో విశ్వాసపరీక్షలో ఓటమిపాలు కావడం కంటే రాజీనామా చేయడమే ఉత్తమమని ఈదర భావించారు. ఈ మేరకు బుధవారం తన రాజీనామా లేఖను రిజిస్ట్రార్‌కు పంపారు. ఇదే విషయాన్ని ఈదర విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈదర రాజీనామాను ఆమోదిస్తే అవిశ్వాస సమావేశం అవసరం లేదు.
నెల రోజులుగా వివాదం..
బ్యాంకు చైర్మన్ ఈదర, డైరెక్టర్ల మధ్య గత నెల రోజులుగా వివాదం చెలరేగింది. చైర్మన్ తమను వంచించి అక్రమాలకు పాల్పడ్డారని డైరెక్టర్లు ఆరోపణలకు దిగారు. ముఖ్యమంత్రి, మంత్రి, సహకార శాఖ రిజిస్ట్రార్, ఎస్పీలకు సైతం ఫిర్యాదు చేశారు. మరోవైపు చైర్మన్ ఈదర సైతం కొందరు డైరెక్టర్లు, అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు చేయడమే కాక ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి చెందిన వారైనా ఇరువర్గాల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరాయి. దీంతో చైర్మన్‌ను పదవి నుంచి దించాలని మెజార్టీ డైరెక్టర్లు పట్టుపట్టారు.
కుర్చీ దించేందుకు యత్నాలు..
ఈ వ్యవహారంలో అధికార పార్టీలో వర్గవిభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. చైర్మన్ ఈదరకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లకు మధ్య విభేదాలున్నాయి. దామచర్ల మద్ధతుదారులంతా మోహన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన్ను పదవి నుంచి దించేందుకు సకల ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఈదరకు మద్ధతు పలికినా అధిష్టానం సైతం జనార్దన్‌కే మద్ధతుగా నిలవడంతో ఈదరకు పదవీ గండం తప్పలేదు. మెజార్టీ డైరెక్టర్లు తనకు వ్యతిరేకంగా ఉండటంతో అవిశ్వాస తీర్మానంలో నెగ్గే పరిస్థితి లేదని ఈదరకు స్పష్టంగా తెలుసు. ఈ పరిస్థితుల్లో ముందే పదవి నుంచి తప్పుకుంటే మేలని ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని పలు సందర్భాల్లో ఈదర మోహన్ విమర్శలు చేశారు. బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలోనూ తన రాజీనామాకు కారణం జనార్దనే అంటూ విమర్శలు చేయడం గమనార్హం.
డీసీసీబీకి సంబంధించిన అన్ని కీలక మూలాలన్నీ ఆయనకు తెలుసునని, టీడీపీ వర్గ రాజకీయాలతోనే తనకు ఈ పరిస్థితి వచ్చిందని ఈదర వాపోయారు. మెజార్టీ డైరెక్టర్లు ఎమ్మెల్యేకు అనుకూలురుగా ఉండటంతో చివరకు ఈదరకు పదవి గండం తప్పలేదు. ఎట్టకేలకు ఈదరను చైర్మన్‌గిరి నుంచి దింపడంతో దామచర్ల విజయం సాధించారు. డీసీసీబీ వ్యవహారం అధికార పార్టీ వర్గరాజకీయాలకు మరింత ఆజ్యం పోసింది. చైర్మన్, డైరెక్టర్ల పదవులకు మాత్రమే రాజీనామాలు చేసినా ఈదర మోహన్ టీడీపీకి మాత్రం రాజీనామా చేయలేదని చెప్పారు. చైర్మన్ పదవి కోల్పోవటానికి అధికార పార్టీనే కారణం కావడం ఈదరను మరింత ఆవేదనకు, ఆగ్రహానికి గురి చేస్తోంది. ఆయన పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఈదర ఏ నిర్ణయం తీసుకుంటారో దానిపై వేచి చూడాలి.
సీఎంను కలిసి న్యాయ విచారణ కోరతా – పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్‌బాబు
ఒంగోలు: ‘పార్టీ ముఖ్యమే కాదనను...కానీ నా మనోభావాలు నాకు ముఖ్యమే’ అని ప్రకాశం జిల్లా సహకార కేంద్రబ్యాంకు (పీడీసీసీబీ) చైర్మన్ ఈదర మోహన్‌బాబు పేర్కొన్నారు. అందుకే అవిశ్వాసం నోటీసులు జారీ అవుతున్నాయని తెలిసినందున బ్యాంకు చైర్మన్ పదవికి, డైరెక్టర్ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. బుధవారం సాయంత్రం స్థానిక రాంనగర్‌లోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ జె.మురళికి మెయిల్ ద్వారా పంపామని, రిజిస్టర్డ్ స్పీడు పోస్టు కూడా పంపానన్నారు. నెలరోజుల క్రితం తాను సహకార వ్యవస్థపై జరుగుతున్న దాడిని నిరసిస్తూ రాజీనామా చేస్తే మంత్రి శిద్దా రాఘవరావు చేసిన విజ్ఞప్తి మేరకు రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తిరిగి పదవిలో కొనసాగడం జరిగిందన్నారు. కేవలం నెలరోజుల్లోనే డైరెక్టర్లు పెద్ద ఎత్తున తనపై ఆరోపణలు చేస్తూ ఎదురుదాడికి దిగుతున్నారంటే దానికిగల కారణాలు టిడిపి జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్థన్‌రావుకే తెలుసన్నారు.
పక్షంరోజులుగా డైరెక్టర్లతో ఒంగోలులో క్యాంపు కూడా జరుగుతుందంటే దానికి వెనుక రాజకీయ కారణాలు బహిరంగ రహస్యం అన్నారు. తాను పదవి చేపట్టేనాటికి పీడీసీసీ బ్యాంకు పాతిక కోట్ల నష్టాల్లో ఉంటే ప్రస్తుతం రూ.18.50 లక్షల లాభంలో ఉందన్నారు. అంతే కాకుండా డిపాజిట్లను రూ.276 కోట్ల నుంచి రూ.660కోట్లకు పెంచగలిగానన్నారు. జిల్లాలో రైతాంగం బలపడే క్రమంలో భాగంగానే బ్యాంకు కూడా ఆర్థికంగా పుంజుకుంటుందని, ఈ దశలో ఆర్థిక దోపిడీలకు పాల్పడి బ్యాంకు నుంచి బయటకు వెళ్లిన ఉద్యోగులు, బ్యాంకును ఏదో ఒక విధంగా తమ కబంధ హస్తాల్లోకి తీసుకోవాలనే మరికొంతమంది కుట్ర వెరసి తనపై ఆరోపణలు జరిగాయన్నారు. రాజకీయ అండదండలు ఉండడం వల్లే ఈ పరిస్థితి చోటుచేసుకుందని, తాము ముందుగా నిర్ణయించుకున్న వారిని ఒకరిని చైర్మన్ చేయాలనే భావనతోనే ఈ కార్యక్రమం కొనసాగుతుందని తాను విశ్వసిస్తున్నానన్నారు.
ఆమోదిస్తారని ఆశిస్తున్నా..
తనపట్ల విశ్వాసం ఉన్నన్నాళ్లు తాను చైర్మన్‌గా కొనసాగానని, తన పట్ల విశ్వాసం లేదని చెబుతున్నందున వారి మనోభావాలను గౌరవించి తాను రాజీనామా చేసి సహకార శాఖ కమిషనర్‌కు పంపానని ఈదర స్పష్టం చేశారు. తన రాజీనామా గురువారం ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నానన్నాని, ఒక వేళ ఆమోదంలో తాత్సారం జరిగితే తాను బాధ్యత వహిస్తున్న సహకార సంఘ అధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేయడం ద్వారా తన రాజీనామా ఆమోదం పొందేటట్లు చేసుకుంటానన్నారు. భవిష్యత్తులో కూడా తాను సహకార సంఘం ఎన్నికలలో పోటీపడాలని భావించడం లేదని చెప్పారు. టీడీపీలోకి రావాలనే కాంక్షతో నాడు కాంగ్రెస్‌కు రాజీనామా చేశానన్నారు. జరిగిన అన్యాయాన్ని స్వయంగా సీఎంకు వివరించి న్యాయ విచారణ కోరాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. పదవిలో ఉన్నంతకాలం తనకు సహకరించిన పీఏసీఎస్ అ«ధ్యక్షులకు, పాలకవర్గసభ్యులకు, బ్యాంకు ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment