న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపధ్యంలో రాజధానిలో వివిధ రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ఇటువంటి సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది.
కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ పార్టీలో అసంతృప్తి నెలకొంది. టికెట్లు దక్కకపోవడంతో ఆగ్రహించిన ఎనిమిదిమంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో జనక్‌పురి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేష్ రిషి, కస్తూర్బా నగర్ ఎమ్మెల్యే మదన్ లాల్, మెహ్రౌలి ఎమ్మెల్యే నరేష్ యాదవ్, త్రిలోక్‌పురి ఎమ్మెల్యే, దళిత నేత రోహిత్ కుమార్, పాలం ఎమ్మెల్యే భావన గౌర్, బిజ్వాసన్ ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్ జూన్ ఉన్నారు.
వీరంతా తమ రాజీనామా పత్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)తో పాటు అరవింద్ కేజ్రీవాల్‌పై పలు ఆరోపణలు చేశారు. ఈ ఎమ్మెల్యేలకు పార్టీ తిరిగి టిక్కెట్లు ఇవ్వలేదు. ఇంతవరకూ మౌనం వహించినవారంతా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంతో రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసిన వారిలో ఒకరైన రోహిత్ కుమార్ మెహ్రోలియా తన రాజీనామా పత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ‘వారికి బాబా సాహెబ్ ఫొటో మాత్రమే కావాలి. ఆయన ఆలోచనలు కాదు. అలాంటి అవకాశవాద, కృత్రిమ వ్యక్తులతో నా సంబంధాన్ని ముగించుకుంటున్నాను’ అని రాశారు.
ఇదేవిధంగా ‘పార్టీ ప్రాథమిక సభ్యత్వం(Membership)తో సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను.ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిలో చిక్కుకుంది’ అని పేర్కొంటూ మెహ్రౌలి ఎమ్మెల్యే నరేష్ యాదవ్ రాజీనామా చేశారు. అవినీతికి వ్యతిరేకంగా సాగిన అన్నా ఉద్యమం కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్భవించిందని, కానీ నేడు ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ఊబిలో కూరుకుపోవడం బాధాకరంగా ఉందని నరేష్ యాదవ్ పేర్కొన్నారు.
పాలం ఎమ్మెల్యే భావన గౌర్ తన రాజీనామాలో అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీపై తనకు ఇకపై నమ్మకం లేదని స్పష్టంగా రాశారు. అందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తూ ‘ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీ సిద్ధాంతం నుండి వైదొలిగిందని’పేర్కొన్నారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా తమ రాజీనామా పత్రాలలో ఇటువంటి ఆరోపణలు చేశారు.
ఇది కూడా చదవండి: మరొకరిని బలిగొన్న పూణె వైరస్
Comments
Please login to add a commentAdd a comment