కొండపాక, న్యూస్‌లైన్ : నకిలీ బంగారాన్ని అసలైన బంగారంగా చూపుతూ నమ్మించి మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఒకే కుటుంబానికి చెందిన మహిళతో సహా ముగ్గురిని కుకునూర్‌పల్లి పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం విలేకరులకు వివరించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ దగ్గరున్న బెహరాగడ్ గ్రామానికి చెందిన శాంతాబాయి, తమ్ముడు జీవన్, కుమారుడు ప్రజల్ని బురుడీ కొట్టించి నకిలీ బంగారాన్ని అంటగట్టేవారు. అంతేగాకుండా గంజాయిని కూడా విక్రయించేవారు. ఇదే క్రమంలో ఆదివారం సాయంత్రం కుకునూర్‌పల్లిలో నకిలీ బంగారాన్ని అసలైందిగా చూపుతూ మోసం చేసే యత్నంలో ఉండగా.. తమకు సమాచారం అందిందన్నారు.
దీంతో గ్రామానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించామన్నారు. వారి నుంచి 1.650 కి లోల నకిలీ బంగారంతో తయారైన ఆభరణాలు, కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఇద్దరు ట్రైనీ ఎస్‌ఐలు అశోక్, జయశంకర్, ఏఎస్‌ఐ మొగిలయ్య, కానిస్టేబుళ్లు సుభాష్, గణేష్, కనకారెడ్డిలు ఉన్నారు.